• రజనీకాంత్ సంచలన నిర్ణయం
• నిరాశలో అభిమానులు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ పెట్టటంలేదని ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా తమిళంలో రాసిన మూడు పేజీల లేఖను అభిమానులనుద్దేశించి పోస్ట్ చేశారు. ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయాల్లోకి రాకుండానే ప్రజాసేవ కొనసాగిస్తానని రజనీ లేఖలో స్పష్టం చేశారు.
మానసిక ఒత్తిడికి గురయిన రజనీ:
అధిక రక్తపోటు కారణంగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. రాజకీయాలు, పార్టీ పనులు, అన్నాత్తే సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండటంవల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని ఆరోగ్యం కుదుటపడేవరకు వీటికి దూరంగా ఉండాలని రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.
ఇది చదవండి : తమిళ రాజకీయాలను రసమయం చేస్తున్న సినీప్రముఖులు
అభిమానులకు నిరాశ:
ఏళ్ల తరబడి అభిమానుల ఎదురుచూపులకు తెరదించేందుకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని రజనీ నిర్ణయించారు. డిసెంబరు 31న పార్టీ ప్రకటన చేస్తానని ముందే తెలిపారు. ఈలోపు అన్నాత్తే సినిమా షూటింగ్ లో ఉండగా యూనిట్ సభ్యులకు కొవిడ్ సోకడంతో షూటింగ్ ను అర్థాంతరంగా నిలిపేశారు. అటు పిమ్మట రజనీ అధిక రక్తపోటు కారణంగా చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రిలో చేరారు. ఊహించని ఈ పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని రజనీ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు
ఇది చదవండి : ‘రజని’ రాజకీయంలో అదే సస్పెన్స్