- ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వివాదం – సవాళ్ళు, ప్రతిసవాళ్ళు
అమరావతి : ఇటీవల సంభవించిన తుపాను చేసిన నష్టం గురించి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చర్చ జరిగిన సందర్భంలో లోగడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు తన పార్టీ సభ్యులకు ఇబ్బందికరంగా పరిణమించాయి. ‘మనసులో మాట’ అనే పుస్తకాన్ని కొన్ని సంవత్సరాల కిందట చంద్రబాబునాయుడు రాయించారు. వ్యవసాయరంగం పట్ల తనకున్న చిన్నచూపును ఈ పుస్తకంలో ప్రస్తావించారన్నది ప్రధానమైన ఆరోపణ.
Also Read: అసెంబ్లీ సమావేశాలు : చంద్రబాబు సహా టీడీపీ సభ్యుల సస్పెన్షన్
తుపాను కారణంగా నష్టపోయిన రైతులనూ, ఇతరులనూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన టీడీపీ సభ్యుడు బి.టి. నాయుడు చేసిన ఆరోపణలపైన మునిసిపల్ వ్యవహారాల మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఉచిత విద్యుచ్ఛక్తి ఇస్తే కరెంటు తీగలపైన బట్టలు ఆరవేసుకుంటారనీ, వ్యవసాయం దండగ అనీ చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను బొత్స గుర్తు చేస్తూ, ఇందుకు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వ్యవసాయం అన్నా, రైతులు అన్నా గౌరవం ఉన్నదని చెప్పారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్ళిన నారాలోకేష్ కు వ్యవసాయం అంటే అవగాహన లేదనీ మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
Also Read: జగన్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ ఎంఎల్ఏల ప్లకార్డుల ప్రదర్శన
రైతులకు ఇవ్వవలసిన సబ్సిడీ అయిదేళ్ళపాటు ఇవ్వకుండా ఎగగొట్టిన ఖ్యాతి చంద్రబాబునాయుడి ప్రభుత్వానికే దక్కిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర విమర్శించారు. ఆ బకాయిలను సైతం ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించిందని కూడా బుగ్గన గుర్తు చేశారు. సభలో లేని చంద్రబాబునాయుడు గురించి ప్రస్తావించడం అప్రస్తుతమంటూ నారా లోకేష్ అభ్యంతరం చెప్పారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబునాయుడు ఎక్కడ, ఎప్పుడు అన్నారో చూపించాలని ఆయన సవాలు చేశారు. ఈ సవాలు ను స్వీకరించాలనీ, చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అని ఎక్కడ అన్నారో మంత్రి బొత్స సత్యనారాయణ నిరూపించగలిగితే టీడీపీ ఎంఎల్ సీలు అందరం రాజీనామా చేస్తామనీ, లేకపోతే మంత్రి రాజీనామా చేస్తారా అనీ టీడీపీ ఎంఎల్ సీ టిడి జనార్ధన్ సవాలు విసిరారు.
Also Read: 4 వరకు ఏపీ అసెంబ్లీ
వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబునాయుడు తన మనసులో మాట అనే పుస్తకంలో రాసుకున్నారనీ, అప్పటి శాసనసభ రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుందని బొత్స, బుగ్గన అన్నారు. అలాగే, ఉచిత కరెంటు ఇస్తే కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకుంటారని కూడా అన్నారనీ, ఇలా అనలేదని చంద్రబాబునాయుడి చేత చెప్పించాలని బుగ్గన సవాలు చేశారు. ఈ మాట పుస్తకంలో స్పష్టంగా ఉన్నది కనుక ఆ పుస్తకం మార్కెట్ లో లేకుండా తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం చేసిందని మంత్రి చెప్పారు.