- తస్మాత్ జాగ్రత!
- పురుషులకంటే మహిళలకు అధికం
- రక్తపోటు ద్వారా మధుమేహం పెరిగే ప్రమాదం
- నడక, కసరత్తు, యోగ ఉత్తమం
‘ప్రపంచ మధు మేహ దినం’ నిన్ననే (ఆదివారం) ముగిసింది. ప్రతి సంవత్సరం నవంబర్ 14 వ తేదీన దీనిని నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఇదేమీ పండుగ రోజు కాదు అనందంగా ఉత్సవం చేసుకోడానికి. మానవాళికి దానిపై అవగాహన కలిగించి, అప్రమత్తం చేయడానికి, దాని బారిన పడకుండా ఉండడానికి శాస్త్రవేత్తలు ఈ రోజును ఎంచుకున్నారు. సోకినవారిలో కొంతమందికి అదుపులో ఉంటుంది, కొంతమందికి ఉండదు. కోవిడ్ -19 చుట్టుముట్టిన వేళ సంభవించిన మరణాలలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువమంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.
Also read: చైనాలో శాశ్వత నియంత షీ జిన్ పింగ్
కోటి మందికి అవగాహన కల్పించాలని సంకల్పం
కరోనా ముప్పు నుంచి ఇంకా పూర్తిగా మనం బయటపడలేదు. ఈ తరుణంలో మధుమేహ పీడితుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మొట్టమొదటి ప్రాముఖ్యత వారికే ఇవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసిన డిమాండ్ ను ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలి. అవసరమైతే మూడో డోస్ కూడా అందించాలని చేసిన సూచనకు ఎంతో విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మధుమేహంపై అవగాహన కల్పించే లక్ష్యంతో, 10 రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రారంభించింది. 100కోట్లమందికి అవగాహన కలిగించాలని సంకల్పం చేసుకోవడం అభినందనీయం. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది మధుమేహం కారణంగా మరణించారనే మాట కలచివేస్తోంది. ప్రపంచ జనాభాలో సుమారు 53 కోట్లమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. 2030 నాటికి ఈ సంఖ్య 64 కోట్లకు, 2045 నాటికి 78కోట్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో 7.7 కోట్లమంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. పరీక్షలు చేయించుకుంటే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నివేదికలు చూసి భయపడి బెంబేలెత్తడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక నుంచైనా మేలుకుంటే మంచిది. ఒత్తిడి,ఆహార, నిద్రా సమయాలను పాటించకపోవడం, తీసుకొనే ఆహారం కూడా సరియైనది కాకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఉరుకులపరుగుల జీవితం, వ్యసనాలు, అనారోగ్యకరమైన పోటీతత్త్వం మొదలైనవాటి కారణంగా ఎక్కువమంది దీని బారిన పడుతున్నారని వైద్యశాస్త్రవేత్తలు పదేపదే చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణీకరణ పెరిగిన తర్వాత, ఆధునిక జీవనశైలికి అలవాటు పడ్డాక మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మానసిక, శారీరకపరమైన అవలక్షణాలే అనర్ధహేతువులు. పురుషులతో పోల్చుకుంటే మహిళలకు ఎక్కువగా సోకుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటోంది.
Also read: పద్యాన్ని పరుగులు పెట్టించిన కొప్పరపు సోదర కవులు
నియంత్రణే తరుణోపాయం
దీనిని నియంత్రించడమే తరుణోపాయం. 1922లో మధుమేహానికి ‘ఇన్సులిన్’ను కనిపెట్టారు. వచ్చే సంవత్సరానికి 100ఏళ్ళు పూర్తవుతుంది. అయినప్పటికీ ఇంకా సంరక్షణ మార్గాలను వెతకాల్సి వస్తోంది. రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచుకోవాలంటే ఒత్తిళ్లను తగ్గించుకోవడమే ఏకైక మార్గం. కేవలం మానసిక ఒత్తిడి వల్ల కార్టిజిల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయని శాస్త్రం చెబుతోంది. తద్వారా గ్లూకోజ్ మోతాదులు పెరుగుతుతాయి. వైద్యులు సూచించే మందులు, నియమాలను పాటిస్తూనే ఖర్చులేని కొన్ని పనులు చేపడితే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. నడక, ధ్యానం, ప్రాణాయామం మొదలైనవి పైసా ఖర్చులేని సాధనలు. కేవలం కొంత సమయాన్ని ఖర్చు పెడితే చాలు. వయసు, శరీరాకృతి, మిగిలిన ఆరోగ్యపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని వీటిని అవలంబిస్తే సరిపోతుంది. ఈ సాధన గ్లూకోజ్ ను అదుపులో ఉంచుతుందని విశ్వసించాలి. ఆధునిక మానవాళిని ఇబ్బంది పెడుతున్నవాటిలో రక్తపోటు మరొకటి. మందులు, నియమ, నిబంధనల ద్వారా బిపిని అదుపులో ఉంచుకుంటే టైప్ -2 మధుమేహం ముప్పు నుంచి కూడా తప్పించుకోవచ్చని ఆక్స్ ఫర్డ్, బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 1,45,000 మంది ఆరోగ్య వివరాలను సేకరించి, నాలుగైదు సంవత్సరాలపాటు గమనించి, విశ్లేషించి ఆ శాస్త్రవేత్తలు పైఅభిప్రాయానికి వచ్చారు. మధుమేహం విస్తృతంగా వ్యాపిస్తున్న ఆధునిక కాలంలో మరింత జాగ్రత్తగా ఉందాం, క్రమశిక్షణను పాటిద్దాం.
Also read: ఆంధ్ర, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశం హర్షణీయం