నీ స్థానం నా మదిలో చిరస్థాయి అని
నీ ఉనికి నాలో అవిభాజ్యమని
నీవే నేనని
నేనే నీవని
అంతర్లోకాల్లో అంతరాలు లేని
వాసులమని
ఎవరికి చెప్పాలి
ఏమని చెప్పాలి
అసలెందుకు చెప్పాలి
అవాచిక ఆనంద వీచికలమని
బహిర్గతం కావాల్సిన అవసరమేమిటని
నన్ను నేనే ప్రశ్నించుకుని
సమాధానాలు తెలిసిన ప్రశ్నల్లో
అనందాలు జుర్రుకుంటూ
లోకాలని చూస్తూ
అంతకు మించిన ఆనంద డోలికల్లో ఊగుతూ
అనిర్వచనీయ అపరిచిత వీచికల
డోలనాల పరిష్వంగాలతో తూగుతూ
గడచిపోతున్న ప్రస్తుతాన్ని
గడిచిపోయిన మన గతాన్ని
పులకింతలతో అనుభవిస్తూ
భవిషత్ గురించి బెంగలేని
కాలాతీత మహదానంద మరందాలతో
నా మది నిండగ
నిస్వాసానికి చోటెక్కడ
అవిరళ అమందానందానికి విరామ మెక్కడ
ఊహల ఊయ్యాలలూగుతూ
మనోసాంగత్య డోలికల్లో మైమరచిన
నా మది
అనంత అనందాంబుధి నిలయమై
ఊహలు చెలరేగ
భావాలు ముప్పిరిగొన
మోదం ముదిమిని దరిజేరనీయక
ఆనందాశ్రువులు చిందించగా
బాలార్కుని కిరణాల నే సొక్కి సోలగా
హృదినిండి సుధ పొంగిపొర్లగా
అది కవితా రూపం దాల్చెనా
ఏమో
నేను సాన్యుణ్ణి కాను
అతి సామాన్యుణ్ణి
నిన్ను తప్పు మరెవరినీ చూడలేని కబోదిని
నీ మంజుల నాదం తప్ప మరేదీ వినలేని చెవిటిని
నీతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేని మూగిని
నిన్ను తప్ప మరేదీ తలచలేని మందబుద్ధిని
నాతో ఏమేం చేయిస్తావో
అంతా నీ ఇష్టం
అదంతా నీకే అర్పితం
నీ అవిరళ అనంతప్రేమనిధి
నా స్వంతం, నా భాగ్యం, నా సర్వం
నీకిదే నా కవితాశ్రు తర్పణం
Also read: సంభవామి యుగే యుగే
Also read: తపన
Also read: ప్రేమ
Also read: స్కూలీ
Also read: వెన్నెముక లేని మనిషి