- జడేజాకు పగ్గాలు అప్పగించిన మహేంద్ర ధోనీ
- 12 సీజన్లు సీఎస్ కె జట్టుకు ధోనీ అద్భుత సారథ్యం
- 26 నుంచి ముంబయ్ మ్యాచ్ తో ఐపీఎల్ సీజన్ ఆరంభం
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కె) ఐపీఎల్ జట్టు నాయకత్వాన్ని రవీంద్ర జడేజాకు గురువారంనాడు అప్పగించాడు. ఇండియన్ ప్రీమియం లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ప్రారంభమైన సందర్భంగా సీఎస్ కె కెప్టెన్సీని జడేజా స్వీకరించాడు. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ ముంబయ్ లోని వాంఖెడే స్టేడియంలో కొల్ కతా రైడర్స్, సీఎస్ కె మధ్య రెండు రోజుల తర్వాత, అంటే శనివారంనాడు జరుగుతుంది.
మొట్టమొదటి ఐపీఎస్ సీజన్ లో 2008లో ధోనీని సీఎస్ కె జట్టు కొనుగోలు చేసింది. తన నాయకత్వంలో జరిగిన 12 సీజన్లలో ధోనీ నాలుగుసార్లు టైటిల్స్ గెలుచుకున్నాడు. రెండు విడతల టీ20 చాంపియన్ లీగ్ ట్రోఫీని గెలుచుకున్నాడు. వికెట్ కీపర్ – బ్యాటర్ అయిన ధోనీ నాయకత్వంలో చాలా స్థిరంగా రాణించే జట్టుగా సీఎస్ కె పేరు తెచ్చుకున్నది. ఒక సీజన్ లో మినహా తక్కిన అన్ని సీజన్లలో తుదిఘట్టం వరకూ జట్టు చేరుకున్నది.
రవీంద్రజడేజాకు జట్టు పగ్గాలు అప్పగించాలని మహేంద్ర సింగ్ ధోనీ నిర్ణయించుకున్నారని సీఎస్ కె ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జడేజా 2012 నుంచి ఈ జట్టులో ఆడుతున్నాడు. ధోనీ సీఎస్ కె ప్రతినిధిగా కొనసాగుతారని ప్రకటన స్పష్టం చేసింది. 2022 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వేలంపాటలో సీఎస్ కె జట్టు ధోనీ, జడెజా, మొయూన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ లను తమతోనే ఉంచేసుకున్నది. ‘‘నాకు సంతోషంగానే ఉంది. అయితే, నేను పెద్ద బూట్లలో పాదాలు పెడుతున్నా. మహీభాయ్ ఇప్పటికీ గొప్ప వారసత్వాన్ని నెలకొల్పారు. దాన్ని నేను కొనసాగించవలసి ఉంటుంది. ఆయన (ధోనీ) మాతోనే ఉంటారు కనుక నేను పెద్దగా బాధ పడనక్కరలేదు. సమస్య వచ్చినప్పుడు నేను సలహా అడిగేది మహీభాయ్ నే. ఆయన గతంలో మాతోనే ఉన్నారు, ఇప్పుడూ ఉంటారు,’’అంటూ జడేజా వ్యాఖ్యానించాడు.
ధోనీ సీఎస్ కె కెప్టెన్ గా జట్టును 204 సార్లు నడిపించాడు. 121 గేమ్ లు గెలుచుకున్నాడు. 82సార్లు ఓడిపోయారు. అంటే 59.6 శాతం విజయాలు సాధించినట్టు లెక్క. ఇది కాకుండా భారత జట్టు కెప్టెన్ గా, సమర్థుడైన వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా ధోనీ మంచి పేరు తెచ్చుకున్నారు.