మానవత్వమే మనిషి ఆధ్యాత్మికత!
(ఒక మహత్తర పురోగామి పరిచయం)
“వియత్నాంలో ఉన్న నా శిష్యుడు నేను చనిపోయాక ఒక స్మారక స్థూపం కడతానని అన్నాడు. దాని మీద నా ఆత్మీయులంతా కల్సి”ఇక్కడ మా అందరకీ అత్యంత ప్రియమైన గురువుగారు విశ్రమించారు” అని రాస్తా రట. నేను వాళ్ళకి ఆరామంలోని స్థలం వృధా చెయ్యొద్దని చెప్పాను. ఐనా, పట్టుదలగా వాళ్ళు కనుక స్థూపం నిర్మించ దలిస్తే, దానిమీద “నేను ఇక్కడ లేను.” అని రాయమని చెప్పాను. అప్పటికీ చూసేవారికి అర్ధం కాదను కుంటే,”నేను ఎక్కడా కూడా లేను” అని రాయమన్నాను. ప్రజలకు ఇంకా అర్ధం కాకపోతే చివరగా మూడో వాక్యం రాయమన్నాను, “బహుశా నేను మీరు పీల్చే శ్వాసలోనూ, నడిచే దారి లోనూ ఉంటానేమో.”
థిచ్ నాథ్ హించ్. ఒక స్వాప్నికుడు. ఒక ప్రేమికుడు. ఒక బౌద్ధ భిక్షువు. ఒక యుద్ధ వ్యతిరేకి. ఒక అన్వేషి. నిరంతర గవేషి, ఒక తత్వవేత్త. ఒక శాస్త్రవేత్త. మేధావి. రచయిత. ఒక ప్రవాసి. అంతే ప్రవాహి. భారతీయ బౌద్ధ దార్శనికతకి తనదైన ఆధ్యాత్మిక మానవతా సందేశాన్ని ప్రయోగాత్మక నమూనాల ద్వారా జోడించిన అరుదైన వ్యక్తి. ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రశాంతమైన జీవన విధానాన్ని ప్రసాదించడం కోసం కాళ్ళలో చక్రాలేసుకుని తిరిగిన మహాశక్తి. ఎన్నో దేశాలు ఆయన్ని గౌరవించగా, మరెన్నో దేశాలు బహిష్కరించాయ్. కానీ, మొత్తంగా ‘భక్తి’కీ, ‘ఆధ్యా త్మికత’కీ ‘సేవా తత్పరత’నీ, ‘సామాజిక భాధ్యత’నీ కలగలిపి థిచ్ నాథ్ హెంచ్ ప్రచారం చేసిన “ఎంగేజ్డ్ బుద్ధిజం” ప్రపంచంలోని వివేకవంతుడైన ప్రతీ మనిషినీ కదిలించే మహోన్నత సిద్ధాంతం!
ప్రపంచ ప్రఖ్యాత సామాజిక మత కార్యకర్త, ఆలోచనా పరుడు మార్టిన్ లూథర్ కింగ్ నోబెల్ శాంతి బహుమతికి థిచ్ నాథ్ హించ్ పేరుని సూచిస్తూ, “విశ్వ మానవ సౌభ్రాతృత్వం కోసం శాంతి, సమైక్యతల కోసం పనిచేస్తున్న ఈ వియత్నాం భిక్షువు కంటే ఈ పురస్కా రానికి అర్హత గలవారెవరూ నాకు తెలియదు” అన్నాడట. అసంఖ్యాక విశిష్టతలను కలిగి కూడా అత్యంత సామాన్యంగా, నిరాడంబరంగా జీవించడం ద్వారా మానవ జీవన విధానం లోని సారాన్ని ఆచరణ ద్వారా మాత్రమే బోధించ డానికి ప్రయత్నించిన సన్యాసి థిచ్ నాథ్ హించ్. సరిగ్గా 60 ఏళ్ళ క్రితం 1964లో ఆయన స్థాపించిన ‘School of Youth for Social Service'(SYSS) యుద్ధం బారిన పడిన గ్రామాల్లో విద్యావైద్య సేవల్ని క్షేత్ర స్థాయిలో ప్రజల దరికి చేర్చడం కోసం అక్షరాలా 10,000 మందికి పైగా స్వచ్ఛంద సేవాదళ్ కార్యకర్తలు చేరారనంటే ఆధ్యాత్మికతని భావోద్వేగాలు రెచ్చ గొట్టడానికి కాక సామాజిక కార్యాచరణకు థిచ్ మిళితం చేసిన తీరు అబ్బురమనిపిస్తుంది!
అందుకే, ఒకచోట మాట్లాడుతూ, “మనుషు లెవరూ మరో మనిషికి శత్రువులు కాదు. మన నిజమైన శత్రువులు, ‘కోపం, ద్వేషం, వివక్ష, వివేకరాహిత్యం, హింస, అపార్ధాలు’ మాత్రమే.” అంటారాయన. బౌద్ధాన్ని నవ్య మానవతా విలువలకు అన్వయించి, వివక్షతకు వ్యతిరేకంగా నిలిచిన ఇద్దరు విలక్షణ వ్యక్తులుగా థిచ్ నాథ్ హించ్ నూ, డా. బి. ఆర్. అంబేద్కర్ నూ పేర్కొంటారు. భారతీయ చింతనాత్మక వైఖరికి తిరుగులేని వైజ్ఞానిక మానవీయ మాధ్యమంగా, జిజ్ఞాసాత్మక హేతుబద్ధ వివేచనకి, ఎదురులేని తాత్విక ప్రాపంచిక దృక్పథంగా బౌద్ధాన్ని ఒక అత్యున్నత అద్వితీయ నిర్మాణ సౌధంగా మల్చడానికిగానూ, ఆధునిక కాలంలో కృషి చేసిన వారిలో థిచ్ నాథ్ హించ్ పేరుని తప్పక చేర్చాలి. జన్మస్థలానికి 40 ఏళ్ళు దూరంగా ఉండి నిరంతర సంచారిగా, అవిశ్రాంత ప్రచారిగా ఉంటూ కూడా ఎన్నెన్నో పురోగామి సంఘాలు స్థాపించి, పలు భాషల్లో వందకి పైబడిన అపూర్వమైన గ్రంథాలను రచించి, ప్రాన్స్ లో plum village పేరిట ఆదర్శ గ్రామాన్ని నిర్మించీ, లక్షలాది మందిని మనుషులుగా మల్చిన థిచ్ తన 95 వ ఏట రెండేళ్ళ క్రితం 22 జనవరి 2022 న మరణించాడు!
(మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా మొదటి శాంతి పురస్కారం అందుకోడం మొదలుకొని మన దేశంతో కూడా ఎంతో అనుబంధం ఉన్న థిచ్ నాథ్ హించ్ కి తెలుగు భావోద్యమాలతో ఒక పరోక్ష సంబంధం ఉంది. వియత్నాం నుండి ఆయన బహిష్కరించబడ్డాక ప్రాన్స్ లో తాను చేసిన ప్రయోగాత్మక విధానాల కోసం పలు దేశాల్లో కార్యశాలలు (వర్క్ షాప్‌లు) నిర్వ హించాడు. అలా చెన్నైలో పెట్టిన కార్యక్రమానికి అనుకోకుండా హాజరైన వ్యక్తే తరువాతి కాలంలో తెలుగు బౌద్ధ సారస్వతానికి ఎనలేని కృషి చేసి బుద్ధ ఘోషుడి గా పేరొందిన అన్నపు రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు. సుమారు పదేళ్ళ క్రితం ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన స్వయంగా చెప్పిన ఈ విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. అప్పుడు ప్రచురించిన ‘సద్ధమ్మస్వరాలు'(కొందరు బౌద్ధోద్యమకారుల ఇంటర్వ్యూలు) లో కూడా రికార్డైంది. థిచ్ అభిప్రాయాలు అన్నిటితోనూ నాకు ఏకీభావం లేక పోవచ్చు కానీ వర్తమాన కాలంలో ఆయన ఆకాంక్షించిన సామాజిక దృష్టికోణం అత్యవ సరమని నా భావన. ఆసక్తి ఉన్న వారి కోసం ఆయన రచనలూ, వీడియోలు నెట్లో ఉన్నాయి, చూడొచ్చు. కుళ్ళు, కుతంత్రాల జడిలో కూడా చివరి వరకూ మనిషి పక్షాన నిలబడి మంచినీ, మానవత్వాన్ని ఎలుగెత్తి చాటిన మహోన్నత మానవతామూర్తికి ఆయన వర్ధంతి సందర్భంగా చిరునివాళిగా ఈ చిన్న రైటప్!)
– గౌరవ్