తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు – 12వ భాగం
ఇక ఇలా సామాజిక సంస్కరణలు ఇతివృత్తంగా వచ్చిన మరికొన్ని చిత్రాల వివరాలలోకి వెళదాం. కొందరు అభ్యుదయ భావాలున్న చిత్ర దర్శకులు తరువాతి కాలంలోని దర్శకులకు మార్గదర్శకులు, దీపధారులు అవుతారు. అలా దర్శక మార్గదర్శివంటి టి.కృష్ణ బాటలో ఆయన చిత్రాల స్ఫూర్తిగా చిత్రాలను రూపుదిద్దిన వారిలో ప్రముఖ దర్శకులు ధవళ సత్యం, వేజళ్ళ సత్యనారాయణ వంటి వారున్నారు. వీరి చిత్రాలను పరిశీలించినప్పుడు ప్రగతి అనేది నిత్యం జాజ్వల్యమానంగా వెలిగే జ్యోతి అనీ, అది పదిమందికి అక్షరాలా వెలుగుబాట చూపిస్తుందనీ అర్ధమవుతుంది.
Also read: అప్రతిహతంగా సాగిన ‘ప్రతిఘటన’
మొదటి నుంచి చిత్ర పరిభాషలో చెప్పేటువంటి వాణిజ్య చిత్రాలకు భిన్నంగా తన ధోరణిలో ప్రేక్షకులు అభినందించే చిత్రాలను తీర్చిదిద్దిన దర్శకుడు ధవళ సత్యం. ఆశయాలు, ఆదర్శాలు ఉన్నంతమాత్రాన వాటినే నమ్ముకుని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, వ్యాపారమయమైన చిత్ర పరిశ్రమలో ఒక నిబద్ధతతో నిలబడటం కొందరికే సాధ్యమవుతుంది! అలా నిలబడిన చిత్ర దర్శకులలో తన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న దర్శకుడు ధవళ సత్యం!
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే ఆయన దర్శకత్వంలో వచ్చి, విజయం సాధించిన చిత్రం యువతరం కదిలింది! అప్పట్లో అంటే వాణిజ్య చిత్రాల హోరులో డా. మాదాల రంగారావు నిర్మాతగా యువతరం కదిలింది చిత్రాన్ని దర్శకుడు ధవళ సత్యం రూపొందించారు.
Also read: పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి
యువత ఏ సమాజనికైనా నిత్యస్ఫూర్తి రగిలించే చైతన్య జ్వాల. అలాంటి యువత ఇటు సమాజాన్ని సురక్షిత మార్గంలో నడిపించే శక్తి అనీ, అటు దేశాన్ని ప్రగతిమార్గంలోకి తీసుకుని వెళ్లే దిక్సూచి అనీ తెలియచెప్పే ఇతివృత్తంతో చిత్రంగా మలచబడిన యువతరం కదిలింది ఆనాడు సంచలనం సృష్టించింది. ఈ ధోరణి చిత్రాలు కూడా ప్రేక్షకులు ఆసక్తికరంగా చూసి ఆదరిస్తారు అన్న సత్యాన్ని తెలియచేసింది! ఇది దర్శకునిగా ధవళ సత్యం ప్రజ్ఞను ప్రతిఫలింపచేసిన చిత్రం!
వామపక్ష భావాల పట్ల ఆసక్తి, అభిరుచి అంతకు మించి ఆచరణ ఉన్న దర్శకుడు ధవళ సత్యం సారథ్యంలో ఆ తరువాత వచ్చిన ఎర్రమల్లెలు, భీముడు, జాతర మొదలైన చిత్రాలు ఆయనలోని ప్రగతి కోణాన్ని తెలియచేసే చిత్రాలు కావడం విశేషం!
Also read: మాదాల రంగారావు ప్రగతిశీల చిత్రాల ప్రస్థానం
నడుస్తున్న చరిత్రలో మనం నిత్యం ఎన్నో రంగాలలో చూస్తున్న అసమానతలు, అక్రమాలు, అమాయకులు దోపిడీకి గురికావడం, సామాజిక భద్రత లేకపోవడం, ఇలా ఒకటేమిటి ఎన్నో సమస్యలను స్పృశిస్తున్న కథా కథనాలతో ధవళ సత్యం దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాదు, ఆలోచింపచేశాయి! చిత్ర మాధ్యమానికి, సమాజం పట్ల సాంఘిక బాధ్యత ఉంది, ఉండాలి అని తెలియచెప్పే దర్శకుడు ధవళ సత్యం చిత్రాలు, వర్తమాన సమాజానికి దర్పణాలు అని చెప్పడం అతిశయోక్తి కాదు.
అభ్యుదయ భావజాల దర్శకుడు వేజళ్ళ సత్యనారాయణ
వినూత్న భావాలకు విలక్షణ చిత్ర కథా కథనాలకు తెలుగు చిత్రరంగం ప్రేక్షకులు నాటి సంచలన చిత్రం మాలపిల్ల నుంచి స్వాగతం పలుకుతున్నారు. మూస కుటుంబ కథా చిత్రాలు మరో రకమైన “మాస్“ చిత్రాలు వస్తున్నా వాటి మధ్యలో మెరుపుల వంటి అభ్యుదయ భావనలున్న చిత్రాలు వస్తుంటే వాటినీ ప్రేక్షకులు ఆదరించడం విశేషంగా చెప్పుకోవాలి!
Also read: అభ్యుదయ భావాలకు ప్రతిరూపం మాభూమి
దీనినిబట్టి ప్రేక్షకులు నూతనత్వంతో పాటు సామాజిక సందేశాత్మక చిత్రాల పట్ల కూడా ఆసక్తి ప్రకటిస్తున్నారని అర్ధమవుతోంది! అసలు మనిషి నిత్యనూతనాసక్తిపరుడు. ఇక వినోదంతో పాటు విజ్ఞాన స్పృహ కూడా ఉన్న చిత్ర కథలను అందుకే ఇష్టపడటం జరుగుతోంది.
అప్పటికి ఒక నూతన తరంగంలా సినీరంగంలోకి దర్శకుడుగా కాలుమోపిన వేజళ్ళ సత్యనారాయణకు నాటక రంగంతో మంచి పరిచయం చక్కని అనుభవం ఉంది. రంగస్థలం మీద చెప్పలేని ఎన్నో విషయాలకు చిత్ర మాధ్యమం ఎంతో అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఏకకాలంలో లక్షలాది మంది వీక్షించే గొప్ప సౌలభ్యం సినిమాకు ఉంది.
Also read: వ్యవసాయం ఇతివృత్తంగా అనేక సినిమాలు
ఈ కారణాలు రంగస్థలంలో అనుభవం సంపాదించిన వారందరికీ తెలుసు కాబట్టే వారిలో కొందరు చిత్రరంగంలోకి రావడం జరుగుతోంది. అలా వచ్చిన రచయితలు, దర్శకులలో చాలా మంది విభిన్న ఇతివృత్తాలతో, ముఖ్యంగా సామాజిక దృక్పథంతో కూడినవి, చిత్రాలుగా రూపొందించడం, అవి ప్రేక్షకుల మన్నన పొందడం జరుగుతోంది. వారి ఆదరాభిమానాలు కలిగించిన ఉత్సాహంతో మరిన్ని ప్రగతిభావ చిత్రాలు రావడానికి అవకాశం ఏర్పడటం మనందరం గమనిస్తూనే ఉన్నాము. అటువంటి వారిలో వెండితెరమీద అభ్యుదయ భావాల ఇతివృత్తాలను చిత్రాలుగా మలిచి విజయం సాధించిన దర్శకుడు వేజళ్ళ సత్యనారాయణ!
ఆయన చిత్రాల పేర్లు కూడా సాధారణంగా సంప్రదాయ బద్ధంగా పెట్టే సినిమా పేరుల్లాగ ఉండకపోవడం, ఓ ప్రత్యేకతగా చెప్పాలి. కొన్ని ఆయన చిత్రాల పేర్లు ఓటుకు విలువ ఇవ్వండి, మరోమలుపు, ఈ చరిత్ర ఏసిరాతో, ఈ చదువులు మాకొద్దు ఇలా మరికొన్ని పేర్లు గల చిత్రాలుండటం విశేషం!
Also read: ప్రతి ప్రయత్నం ఒక వియత్నాం
మామూలుగా వాణిజ్య సూత్రాలతో నిర్మించే చిత్రాలకు హీరో పేరు లేదా కథానాయిక పేరు లేదా (ఒక్కోసారి) చిత్రకథకు సంబంధం లేకపోయినా ప్రేక్షకులను ఆకర్షించే విధంగా చిత్రాల పేర్లు పెట్టడం అందరికీ తెలిసిన విషయమే! అయితే సామాజిక స్పృహతో నిర్మించే చిత్రాలకు సామాజిక సమస్యలు తెలిపే విధంగా తన చిత్రాలకు పేర్లు పెట్టడం దర్శకుడు వేజళ్ళ సత్యనారాయణలోని విశేషం!
ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాలను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. కరెన్సీ నోట్లు పంచిపెట్టి, ఓట్లు సంపాదించి ఆ బలంతో పదవులు సంపాదించి పాలకులుగా మారుతున్న నైతిక విలువలు లేని రాజకీయ నాయకుల వల్ల సమాజానికి, దేశానికి ఎంత నష్టం జరుగుతుందో, సామాన్య ప్రేక్షకుడికి కూడా సులభంగా అర్ధమయ్యే కథా కథనాలతో నిర్మించిన చిత్రం ఓటుకు విలువ ఇవ్వండి! సామాన్య పౌరుడి చేతిలో ఉన్న గొప్ప ఆయుధం ఓటు. అయితే చాలామందికి దాని విలువ తెలియకపోవడం శోచనీయం! అందుకే ఈ చిత్రంలో ఓటుకున్న విలువ, దాని పవిత్రత, దానికున్న పరమార్ధం, పవర్, దర్శకుడు వేజళ్ళ సత్యనారాయణ ప్రదర్శించిన తీరు అభినందనీయం!
Also read: పూర్తిగా రాజకీయమే కథావస్తువుగా ‘భారత్ బంద్’
ఒక మంచి పుస్తకం ఎలా అయితే గొప్ప గొప్ప భావాలను కలగచేస్తుందో, ఒక సందేశాత్మక చిత్రం కూడా అదే పనిచేస్తుంది. మరింత శక్తి వంతంగా అని రుజువు చేసిన దర్శకుడు వేజళ్ళ సత్యనారాయణ!
అలాగే కేవలం పొట్టకూటి కోసం నాలుగు రాళ్ళు తెచ్చకుని బతకడం కోసమే ఉన్నట్టున్న ఈనాటి చదువుల మీద ఒక శరాఘాతం వంటి చిత్ర ప్రయోగం ఈ చదువులు మాకొద్దు! నిజమే! ఇవాళ చదువుల పరిస్ధితి కొన్ని ఏళ్ళుగా ఇలాగే ఉంది. ఎన్ని ప్రభుత్వాలు, అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలలో మారినా విద్య, వైద్య రంగాల గురించి అలసత్వం వహించడం, ఎవరూ కాదనలేని నిష్టుర సత్యం! ఇలాగే మరికొన్ని దశాబ్దాలపాటు విద్యారంగం పాలకుల నిర్లక్ష్యానికి బలి అయితే అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు!
వైద్యంతో ఆరోగ్యవంతమైన సమాజం, విద్యతో ఆదర్శభావాల సంఘం దేశానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. ఈ రెండు మానవజాతి ప్రగతికి, రెండు నేత్రాలవంటివి అని చెప్పడం అతిశయోక్తి కాదు!
మరి అటువంటి వాటిలో విద్యకున్న ప్రాధాన్యతను తెలియచేస్తున్న చిత్రమే వేజళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చదువులు మాకొద్దు!
నిజానికి ఈ చిత్రం గురించి మరింతగా, మరింత నిశితంగా, మరింత కూలంకషంగా చర్చించుకునే అవకాశం ఉన్న ఇతివృత్తం ఉన్నది!
Also read: రాజకీయ కుతంత్రాలపైన శరసంధానం
‘‘నా సుదీర్ఘ నట జీవితంలో మరోమలుపు చిత్రంలో నేను పోషించిన పాత్ర నాకెంతో సంతృప్తినిచ్చింది,’’దాదాపు అయిదు దశాబ్దాలపాటు విభిన్న పాత్రలలో నటించిన విలక్షణ నటుడు శ్రీ గుమ్మడి – దర్శకుడు వేజళ్ళ సత్యనారాయణ చిత్రం మరో మలుపు లోని తన పాత్ర గురించి చెప్పిన విషయం అది. చిత్రరంగంలో అంతటి అనుభవం ఉన్న నటుడు ఓ దర్శకునికి ఇచ్చిన కితాబుగా భావించాలి. తనకంటూ తన బాణి అంటూ తన ప్రత్యేకతను ప్రతి చిత్రంలోనూ ప్రదర్శిస్తూ, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను, ఆసక్తికరమైన చిత్ర కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుని, అభినందనలు అందుకున్న దర్శకుడు వేజళ్ళ సత్యనారాయణ!
పైన ఉదహరించిన చిత్రాలే కాదు, ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి చిత్రమూ సామాజిక ప్రయోజనాన్ని ఆశించిందే! ఆలోచన రేకెత్తించినవే!
‘‘సినిమా’’ అన్న మూడక్షరాలు ‘‘వినోదం’’ అన్న మరో మూడక్షరాలకే పరిమితం కాకుండా సమాజంలోని సాంఘిక, ఆర్ధిక, రాజకీయ కోణాలను స్పృశిస్తూ వాటిలోని లోటుపాట్లను, అమానతలను, అనైతికతను ప్రశ్నిస్తూ వేజళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు అందరూ మెచ్చిన చిత్రాలు! భావితరాలకు ప్రగతి సూచికలు!
Also read: రైతులకూ, సేద్యానికీ పట్టం కట్టిన ‘రోజులు మారాయి’
ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే హక్కు, బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. అయితే ఈ రెండు ఎలా పౌరుడికి సంక్రమిస్తాయి అంటే మైనారిటీ తీరిన ప్రతి వారికీ ప్రజా ప్రతినిధులను ఓటు హక్కుతో ఎన్నుకునే వారికి అని చెప్పాలి!
అయితే ఈ ఓటు విలువ, దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎంత మందికి తెలుసు అంటే సంతృప్తికరమైన సమాధానం దొరకదు! దీనికి కారణం సమాజం పట్ల, దేశం పట్ల, జాతి అభివృద్ధి గురించి, ఏమాత్రం బాధ్యత వహించని కొంత మంది రాజకీయ నాయకులు. వాళ్ళకున్న పదవీ లాలస, సంపాదన ధ్యేయం అని చెప్పడం అసత్యం కాదు! అటువంటి వారి వల్లనే ఓటుకున్న విలువ, దానికున్న ప్రాధాన్యత కోల్పోయింది. ఓటర్లను రకరకాలుగా ప్రలోభపెట్టి ఇతరత్రా అనైతిక కార్యాలకు పాల్పడి ఎన్నికలలో ఏదోవిధంగా విజయం సాధించాలి అన్న రాజకీయ నాయకుల వల్లనే ఓటు విలువకు చేటు వచ్చింది.
ఇంతకన్నా మరో ముఖ్య కారణం ఉంది. మన దేశంలో ఉన్న ఓటర్లలో అధిక శాతం వారు నిరక్షరాస్యులు కావడం! వారి చదువులేనితనం – స్వార్ధ రాజకీయ నాయకుల విజయానికి ఎంతగానో కలిసివస్తోంది అని చెప్పడం అక్షర సత్యం! చదువు లేకపోవడం వలన, నాగరికత తెలియకపోవడం వలన, స్వార్ధ రాజకీయ నాయకుల పోకడలు అర్ధం చేసుకోలేక పోవడం వలన ఇలా ఇంకా మరికొన్ని కారణాల వల్ల దేశంలో ఓటుకున్న విలువ, అవకాశవాదుల హస్తాల్లో హననం అయిపోతోంది!
ఓటు అనేది సామాన్య పౌరుడి చేతిలోని వజ్రాయుధం లాంటిదనీ, ఆ ఓటు వల్ల లభించే హక్కుతో తమకు కలగవలసిన ప్రయోజనాలను పొందవచ్చుననీ, అందువల్ల తమతోపాటు సమాజం కూడా ప్రగతి పథంలో నడుస్తుందన్న విషయాలను అవకాశవాదులనబడే రాజకీయ నాయకులు సామాన్య పౌరుడికి తెలియనివ్వకుండా, వారి పదవీకాంక్షల పబ్బం గడుపుకుంటున్నారు!
Also read: మళ్ళీపెళ్ళి, మాలపిల్ల, రైతుబిడ్డ తొలితరం అభ్యుదయ చిత్రాలు
అయితే ఓటుకు విలువనివ్వాలని, అప్పుడే ఓటర్ల సమస్యలు తీరుతాయని, వారికి దక్కవలసిన ఫలాలు, ప్రయోజనాలు దక్కుతాయని, అలా జరగాలంటే వారి చేతిలో ఉన్న ఓటుకు విలువనిచ్చినప్పుడే అదంతా సాధ్యమవుతుందనీ ఓటర్లని చైతన్యపరిచే ప్రగతివాదులు ముందుకు రావాలి! అప్పుడే సమాజంలోని సాంఘిక, ఆర్ధిక, రాజకీయ అసమానత, రుగ్మతలు నశిస్తాయని జాగృతం చేసే సాంఘిక బాధ్యత గలవారు ముందడుగు వేయాలి. అప్పుడే ఓటుకున్న విలువ తెలిసివస్తుంది. అలాంటి ఓటుకు విలువనివ్వండి అని ప్రబోధించే చిత్రమే వేజళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఓటుకు విలువ ఇవ్వండి!
ఈ చిత్ర ఇతివృత్తం ఏ ఒక్క ప్రాంతానికో, రాష్ట్రానికో పరిమితం కానిది. మొత్తం జాతికి, దేశానికీ వర్తించేది! వర్తమానాన్ని ప్రగతిపథంలోకి నడిపించేది! చైతన్యవంతమైన మార్గాన్ని నిర్దేశించేది! అభ్యుదయ దిశను సూచించేది!
అటువంటి ప్రయోజనాత్మక – ప్రయోగాత్మక, ప్రగతివాద చిత్రాల దర్శకుడు వేజళ్ళ సత్యనారాయణ సారథ్యంలో రూపొందిన చిత్రాలు ఎప్పటికీ ప్రగతి బాటను సూచించే ఉత్తమ చిత్రాలు అని పేర్కొనడం అతిశయోక్తి కాదు!
అలాగే ఆయన నిర్దేశకత్వంలో రూపుదిద్దుకున్న ఆడవాళ్ళే అలిగితే చిత్రంలో వర్తమాన సమాజంలోని మహిళల సమస్యల గురించి, వారి అణచివేత గురించి అలా జరిగితే కలిగే పర్యవసానాల గురించి, వాటి పరిష్కారం గురించి ప్రస్తావించడం జరిగింది! మహిళా వికాసానికి, వారి ప్రగతికి, బాటలు చూపించే అభ్యుదయ భావనలు కలిగిన చిత్రం!
సమాజం ప్రగతిపథం వైపు పయనించినప్పుడే సమ సమాజం, సౌభాగ్య భాగ్య సమాజం ఏర్పడుతుందని, అది కావాలని, అదే రావాలని తపన పడిన ప్రగతిశీల ఆలోచనలు కలిగిన దర్శకుడు వేజళ్ళ సత్యనారాయణ! ఆయన చిత్రాలు ఆలోచనను రేకెత్తిస్తాయి. అభ్యుదయ మార్గంవైపు నడిపిస్తాయి!
కుటుంబ కథా చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న తరుణంలోనే పైన పేర్కొన్న వారి చిత్రాలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి అంటే సమ సమాజం కోసం వారిలో ఉన్న ఆశను, ఆకాంక్షను తెలియచెప్పినట్లు అవుతుందన్నది నిస్సందేహం! బంధాలు, అనుబంధాలతో పాటు బాధ్యత, చైతన్యవంతమైన సాంఘిక పరిస్ధితిని కోరుకోవడం అన్నివిధాల ఆరోగ్యవంతమైన ముందుచూపును ప్రతిఫలిస్తుంది.
Also read: తెలుగు చలనచిత్రాలలో ప్రగతి కిరణాలు!