Tuesday, January 21, 2025

శ్రీమద్విరాటపర్వం-3

మహాభారతం

సింహాసనం మీద విరాటరాజు ఆసీనుడై వున్నాడు. అల్లంతదూరాన ఆయనకు ఒక కాంతిపుంజం కనపడసాగింది. అది మెల్లగా ఆయనను సమీపిస్తున్నది. ఏమైఉంటుదబ్బా అని తేరిపార చూశాడు విరాటరాజు. ఒక మహాపురుషుడు సన్యాసి వేషధారియై వస్తున్నాడు. ఆయన తేజస్సు ఆ ప్రాంతమంతా నిండి కొత్త వెలుగులు సంతరించుకుంది.

ఆయన శరీర అవయవాల మీద రత్నాభరణాలు ఒకప్పుడు ధరించిన ఆనవాలు కనపడుతున్నాయి. (ఉంగరం ఉన్నవారు గమనించగలరు వేలికి ఉంగరం తీసివేయగనే ఆ ప్రాంతంలో తెల్లటి గుర్తు కనపడుతుంది).

‘‘ఇంత తేజశ్శక్తిగల ఈ పురుషుడి వెంట రాజలాంఛనాలు ఎందుకో తరలి రావటంలేదు, మనవద్దకు ఏమిటికి వచ్చెనో? ఈయన ఆజ్ఞ నాకు శిరోధార్యం’’  అని ఇలా పరి పరి విధాల ఆలోచించసాగాడు విరాటరాజు.

యతిరాజుకు ఎదురేగాడు విరటుడు. వినయంగా ఆసనం మీద కూర్చుండబెట్టి `మహాత్మా మీరు ఎవరు? ఏ పని మీద ఇచటకు వచ్చారు?` అని అడిగాడు. అప్పుడు ఆయన “సమ్రాట్ నిజానాత్విహ జీవనార్ధినమ్, వినష్ట సర్వస్వ ముపాగతమ్ ద్విజమ్”…అని చెపుతాడు

`ఓ రాజా జీవిత సర్వస్వాన్ని కోల్పోయి బ్రతుకు తెరువుకై మిమ్మల్ని ఆశ్రయించటానికి వచ్చాను` అని చెప్పాడు.

Also read: శ్రీమద్విరాటపర్వం-1

“రాజా నేను కురుదేశంలో జన్మించిన వాడను. ధర్మరాజుకు స్నేహితుడను. సన్యాసాశ్రమం స్వీకరించాను. రాజులకు వినోదం కలిగించగల నేర్పు నా స్వంతం. నా పేరు కంకుడు“ అని ధర్మరాజు చెప్పాడు. (యమధర్మరాజుని కూడా కంకుడు అని అంటారు. తండ్రి పేరు పెట్టుకున్నాడన్నమాట!) అప్పుడు విరటుడు “నావలెనే నీవిచ్చట సంచరించవచ్చు. నాకు జరిగినట్లే అన్ని గౌరవాలు నీకూ జరుగుతాయి“ అని చెప్పాడు.

అందుకు ధర్మరాజు సమాధానమిస్తూ… “నా కెందుకయ్యా అవ్వన్నీ, హోమానికి అర్హమయిన పదార్ధాలే నా భోజనం, కటిక నేల, నాకు పూల సెజ్జ. అవి చాలు“ అని అన్నాడు.

గమనిక: ఇక్కడ ధర్మజుడి వ్యక్తిత్వం బయట పడుతుంది. ఏ సమయానికి ఏది అవసరమో అంతవరకే. అదీ వ్యక్తిత్వము అంటే.

స్వామి వివేకానంద ఒక చోట ఇలా అంటారు… It is the character that cleaves it’s way through adamantine walls of difficulties…….అలాంటి character ఉన్న వ్యక్తి ధర్మజుడు.

బకాసుర, కిమ్మీర, జరాసంధాది యోధుల మదమడచి యమసదనానికి సాగనంపిన చేతులవి. సమూలంగా మహావృక్షాలు పెకిలించి పగవారి దర్పమణిచిన బాహువులవి. శత్రువుల గుండెల్లో గుబులురేపి జీవితంమీద ఆశ లేకుండాచేసే గదాదండాన్ని వేగంగా విసరగలిగే భుజములవి. నేడు ఒక సామాన్య నృపతి వంట శాలలో వంటచెరుకు విరవడానికి సిద్ధపడుతున్నాయి.

గదాదండపు స్థానంలో గరిటె వచ్చి చేరింది. చురకత్తిని బిగించి దట్టీకట్టిన నల్లని వస్త్రం నిగనిగలాడుతున్నది. చేతిలో వాడిగల కఠినమైన శూలాలున్నయి. చూసేవారికి ఆయన రూపం దుస్సహంగా కనపడుతున్నది.

ధర్మరాజు వచ్చిన వైపునుండి కాకుండా వేరొక దిక్కునుండి వచ్చి మదించిన ఏనుగు నడకలాంటి నడకతో సభాభవన ప్రవేశం చేశాడు భీమసేనుడు. భీముడిని చూడగనే మహారాజు మనస్సులో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతనెవరో ఎక్కడివాడో కనుక్కోమన్నాడు.

చెప్పాడు భీమసేనుడు!. పేరు వలలుండు… “కూడుం చీరయునిడి సాకతంబు సేసిన జాలుం! గోరిన వంటకములు నా నేరిమి దగ నెరపి కొలుతు నిశ్చల భక్తిన్. కూడూగుడ్డ ఇస్తేచాలు నీవుకోరిన వంటలన్నీ చేస్తాను“ అని అన్నాడు.

అద్భుత సౌందర్యరాశి, అతిలోకసుందరైన స్త్రీని మనం చూసినప్పుడు మదిలో కలిగే భావన అనిర్వచనీయమైనది, అలాంటి స్త్రీతో సంభాషించాలని ప్రయత్నం చేస్తాం. మనిషి మధురం. మాట ఇంకెంత మధురమోగదా! అని ఊహించి మాటలు కలుపుతాం. అప్పుడు ఆమె స్వరం గార్ధభమైతే (గాడిద ఓండ్రపెట్టినట్లుంటే) మనసులో ఎలాగ ఉంటుంది? రూపము, స్వరము ఒకదానికొకటి విరోధాలు. అదుగో సరిగ్గా అలాంటి భావనే విరటుడికి కలిగింది. “నీవేమిటి, నీ రూపమేమిటి, నీవు చేయాలనుకున్న పని ఏమిటి? నా వద్ద అత్యంత చనువుతో మెలగగలిగే సకల రాజలాంఛనాలున్న పదవి నీకిస్తాను“ అని ప్రతిపాదించాడు.

మొరటువాడికి మొగలిపువ్వు ఇస్తే… వాడి హావభావాలు ఎలా ఉంటాయి? అలాంటి మొరటువాడి body language ఎలా ఉంటుంది? అద్భుత చిత్రీకరణ తిక్కనసోమయాజిగారిది ఇక్కడ!

అనుటయు మోరుకుచందంబున మోమడ్డము గదల్చి భూవిభుడు సభా

జనులు వినన్ అనిల సుతుడిట్లనియెన్!ప్రస్ఫుట నిరర్గళాలాపములన్!

మూర్ఖుడిలాగ తల అడ్డం తిప్పి ధారాళంగా చెప్పాడు భీమసేనుడు. “నా వంటలు ధర్మరాజంతటివాడే బాగామెచ్చుకొనేవాడు. అంతేగాక నాకు మల్లవిద్యలు తెలుసు. నేను బలవంతుడిని. దున్నలతో, ఏనుగులతో, సింహాలతో పోరాడతాను. జగజ్జెట్టీలయిన మల్లులతో కన్నులపండుగగా పోరాడతాను. నీ కిష్టమయితే నేనడిగిన కొలువియ్యి లేకపోతేలేదు“. “అట్లాగాదులే! నీకు గజాధ్యక్ష పదవి ఇస్తాను చెయ్యి“ అని అన్నాడు విరాటరాజు.

“నాకు వచ్చిన పని ఇదే! నీకిష్టమయితే ఇవ్వు కష్టమయితే వేరే చోటుచూసుకుంటాను“ అని అన్నాడు భీముడు. ఒక మూర్ఖుడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడాడు. అందుకు సరేనన్నాడు విరాటరాజు.

గమనిక:

ఎక్కడ తగ్గి ఉండాలో,  ఎక్కడ బలప్రదర్శన చేయాలో, తను అడిగిన పనికి తన మనోధర్మం ఎంతవరకూ suitable అని యజమాని ఎలాగైతే సంతృప్తి పడతాడో అన్నీ తెలిసి అడిగాడు భీముడు. ఇక్కడ ఆయన విజ్ఞత మనకు కనపడుతుంది.

Also read: శ్రీమద్విరాటపర్వం-2

(సశేషం)

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles