- ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 5 వరకు !!
- భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్లు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుండి ఆరంభం కానున్నాయి. దాదాపు 13 రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలు ఏప్రిల్ 5న ముగియనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్ణాటక నుండి లక్షలాది మంది భక్తులు స్వామివారి జాతర ఉత్సవాల లో పాల్గొనడానికి తరలివస్తుంటారు. ఈ ఉత్సవాలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి తో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, సైతం జాతర ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తోంది .
బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు:
భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం ముమ్మర ఏర్పాట్లు చేశారు. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి సంబంధిత అధికారులకు బాధ్యతలను అప్పగించారు. తాగునీరు, వైద్యం, వసతి కల్పన, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు, నిరంతర విద్యుత్ సరఫరా, అన్నదానంతోపాటు ఆలయ సుందరీకరణ, క్యూలైన్ల ఏర్పాటు, ప్రత్యేక ఆర్టీసీ బస్సు సౌకర్యాల పట్ల ప్రత్యేక కార్యాచరణను యంత్రాంగం సిద్ధం చేసింది.
జాతరలో ప్రధాన ఉత్సవాలు!!
24న కలశ స్థాపన పుట్ట బంగారం
25న శేషప్ప కళా వేదికపై సాయంత్రం గోధూళి సుముహూర్తాన శ్రీ స్వామివారి కళ్యాణం
28న బ్రహ్మ పుష్కరిణిలో శ్రీ యోగా నరసింహ వారి తెప్పోత్సవం డోలోత్సవం
29 న బ్రహ్మ పుష్కరిణి లో శ్రీ ఉగ్ర నరసింహ వారి తెప్పోత్సవము డోలోత్సవం
30 న బ్రహ్మ పుష్కరిణిలో శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవము డోలోత్సవం
ఏప్రిల్ 2న క్షేత్ర పురవీధులలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి రథోత్సవం. బ్రహ్మోత్సవాలలో భాగంగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు గోదావరి నది తీరంలో పోలీస్ పికెటింగ్, గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. ఏప్రిల్ 3, 4,5 తేదీలలో స్వామివార్లకు పుష్పయాగం, చక్రతీర్థం, ఉత్తర దక్షిణ దిగ్విజయ యాత్రలు జరుగనున్నాయి.