“కాబోలు నియ్యది కాకతీయు లొకప్డు
కరకు నెత్తుట కత్తి కడుగు చోటు
కాబోలు నీ ద్వార కళ్యాణ వేదిక
అలికి ముగ్గులు పెట్టె తెలుగు పడుచు
కాబోలు నీ జీర్ణ కమనీయ సౌధాన
సుకుమార శిల్పముల్ సొంపు లొలికె
కాబోలు నీ వీధి కాపురం బొనరించె
పైడి మేడల లోన భాగ్యలక్ష్మి”
“ఇచటనే నిల్చి కాబోలు నిందు ముఖులు
ఆయుధంబులు పూజించి యరుగుదెంచు
ఆంధ్ర సేనకు కపురంపు టారతులను
ఇచ్చి వారల శౌర్యంబు మెచ్చినారు”
-దేవులపల్లి రామానుజరావు
డా. దేవులపల్లి రామానుజరావు గారొక అసాధారణ వ్యక్తి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆధునికాంధ్ర సాహిత్యరంగంలో వివిధ శక్తులకు, విభిన్న ధోరణులకు, సంగమస్థానమైన వారు.
సుల్తాన్ బజార్ చారిత్రక ప్రదేశం
ఒకప్పుడు హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ ప్రాంతం కేవలం నగరంలోని ఒక ప్రధాన వ్యాపార కేంద్రమే కాదు, తెలంగాణాకొక ముఖ్యమైన రాజకీయ సాంస్కృతిక కేంద్రం కూడా. 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం ఉత్తరభారతానికే ప్రధానంగా పరిమితమైంది. యావత్ దక్షిణ భారతంలో ఒక్క కోటీ లోని రెసిడెన్సీ ప్రాంతంలోనే ఆనాడు సాయుధ విప్లవపోరాటం జరిగి, నైజాం ప్రభుత్వంచే ఉక్కుపాదంతో అణిచి వేయబడింది. కోటీ పరిసరాల్లో ఇట్టి చారిత్రక, సాంస్కృతిక చిహ్నాలు అనేకం కనిపిస్తాయి. బడీచౌడీ లోని ఆర్యసమాజం, సుల్తాన్ బజార్ సమీపంలోని శ్రీకృష్ఢదేవ రాయాంధ్ర గ్రంథాలయం, బొగ్గులకుంట వద్దగల మహారాష్ట్ర మండల్”, “ఆంధ్ర సారస్వత పరిషత్తు”, దాని ప్రక్కనే “యువభారతి” ఇవన్నీ భాగ్యనగర సాంస్కృతిక పునురుజ్జీవన చరిత్రకు ఆనవాళ్ళు. యాభై ఏండ్ల క్రిందట, భాగ్యనగరంలో తొలిసారి కాలిడిన నన్నీ కూడలి మిక్కుటంగా ఆకర్షించేది.
Also read: భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగింది ధర్మయుద్ధం
నూట ఇరవై రెండు సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణదేవరాయాంధ్ర నిలయం ఏర్పడడానికి కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారు ప్రధాన కారకులు. దాదాపు అరవై డెబ్భై ఏండ్ల క్రిందట “ఆంధ్రసారస్వత పరిషత్తు” ఏర్పాటు జరిగినప్పుడు దేవులపల్లి రామానుజరావు గారా సంస్థలో ఎక్సిక్యుటివ్ సభ్యులు. పిదప జీవితాంతం వారే అధ్యక్షులు. హైదరాబాద్ రాకముందు మొట్టమొదటి సారి నేను చదివిన రామానుజరావు గారి పుస్తకం “వ్యాస మంజూష”. తర్వాతి కాలంలో ఆయన రచనలు మరికొన్ని చదివే అవకాశం కలిగింది.
వరంగల్లు ఆయన పుట్టిపెరిగిన ఊరు
వరంగల్లు రామానుజరావు గారు పుట్టి పెరిగిన ఊరు. శిథిలావస్థలో ఉన్న ఒకానొకప్పటి ఓరుగల్లు పురాతన చరిత్రను ఆయన మన కట్టెదుట సాక్షాత్కరింప జేస్తున్నారు. ఆయన మాటల్లోనే వినండి: “కదనరంగమే గాక మా ఊరు కళాక్షేత్రము కూడా. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం మొదలైన కళలు మా ఊరిలో కాకతీయ ప్రభువుల అధ్వర్యాన వేయి ముఖాలుగా విస్తరించినవి. కాకతీయ ప్రభువుల పోషణలో, ప్రోత్సాహంలో, తెలుగుభాష, తెలుగు సాహిత్యము, తెలుగు కళలు, అద్వితీయముగా అభివృద్ది చెందినవి. నాడు తెలుగు భాష దాదాపుగా అధికార భాషగా అమలులోకి వచ్చినది. కాకతీయ ప్రభువులు తెలుగులో శాసనాలను వ్రాయించినారు. వరంగల్లు కోటలో కట్టడాలు, వేయి స్తంభాల దేవాలయము, పద్మాక్షీ దేవాలయము, మొదలైన ఆలయాలు యీ రోజు శిథిలమైనప్పటికినీ, నాడు శిల్పము, సంగీతము, చిత్రలేఖనము, నృత్యము వంటి కళలు సాధించిన అత్యున్నత స్థాయికి సాక్షీభూతములుగా, సజీవ నిదర్శనాలుగా నిలిచి ఉన్నవి. గడచి పోయిన ఆనాటి చరిత్రనే కాదు, జరుగుతున్న ఈనాటి చరిత్రలోను మా ఊరు వరంగల్లు గణనీయమైనది”. క్రీశ1326లో కాకతీయ సామ్రాజ్యంతో బాటు కన్నుమూసిన తెలుగుజాతి వైభవం, క్రీశ 1335 లో విజయనగర సామ్రాజ్య స్థాపనతో పునః ఉదయించింది.
Also read: మహాభారతం: ఆదిపర్వం: ఉదంకోపాఖ్యానం-3
భావసమాధి
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆవరణలో పలుసార్లు వారిని చూసే అవకాశం కలిగింది. పొడుగు, పొట్టీ కాక, చామనచాయతో, కళ్ళద్దాలతో, గంభీర వదనంతో, పరిషత్తు కార్యాలయం వెలుపల కుర్చీ వేసుకొని, “భావసమాధిలో” మునిగి వున్న రామానుజరావుగారి దర్శనం పరిషత్తు ఆడిటోరియమ్ లో జరిగే సభలకు వెళ్ళే నాబోటి వారికి తరుచూ సంభవించేది. ఆయనది గాంధేయమార్గం. రామానుజరావుగారు కేవలం ఆంధ్రసారస్వత పరిషత్తు మాత్రమే గాక, శ్రీకృష్ఢదేవ రాయాంధ్ర నిలయం నిలదొక్కుకోవడానికి, ఉస్మానియా యూనివర్శిటీ హిందీ విద్యాలయంగా మార్పు చెందకుండా వుండడానికి, భాగ్యనగరంలో పలు అకాడమీలకు భవనాలు ఏర్నడడానికీ వజ్రసంకల్నంతో పని చేసినవాడు.
ఉత్పల సత్యనారాయణాచార్య రచించిన “ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు” కావ్యంలో యాభై ఏండ్ల క్రిందటి హైదరాబాద్ చరిత్రతో బాటు, ఆంధ్ర సారస్వత పరిషత్తు, రామానుజరావుగారు, తదితర సాహితీవేత్తల దర్శనం, అబిడ్స్ కూడలిలో ప్రతి ఆదివారం దొరికే పాతపుస్తకాల దర్శనంతో సహా లభిస్తుంది. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించిన పుస్తకాలు కడు విలువైనవి. అందులో ఒక విలువైన పరిశోధనా గ్రంథం “ఆంధ్రోద్యమ చరిత్ర”. దాని కాపీలు నేడెక్కడా లభించడం లేదు. అకలంక జాతీయవాది, ఉత్తమ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, సంస్థా నిర్మాత, తెలుగుజాతికి ప్రాతఃస్మరణీయుడైన రామానుజరావు గారికి వినయపూర్వక నివాళి.
Also read: మహాభారతము – ఆది పర్వము – ఉదంకుని నాగస్తుతి
నివర్తి మోహన్ కుమార్