(జై సురేందర్ కుమార్, ధర్మపురి)
ప్రముఖ పుణ్యక్షేత్రం గోదావరి నది తీరాన గల ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున 2 గంటల 30 నిమిషాలకు శ్రీ లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నరసింహ, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల మూలవిరాట్ లకు విశేష అభిషేకాలు, నివేదన వేద మంత్రపుష్పము, వేదపండితులు, అర్చకులు నిర్వహించారు, అనంతరం 4 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదికపై స్వామివార్లను ఆసీనులు గావించి ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనలు, నివేదనలు, వేద మంత్ర పుష్పము, అనంతరం వేద ఘోష జరిగాయి. ఉదయం 5 గంటలకు మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో వైకుంఠ ద్వారం భక్తుల దర్శనార్థం తెరిచారు. భక్తులు వైకుంఠ ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ప్రధాన అర్చకులు నంబి శ్రీనివాస్ చార్యులు తదితర వేదపండితులు, అర్చకులు వేదమంత్రాల ఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్థానిక శేషప్ప కళావేదిక లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, సిబ్బంది భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా పోలీసులు వాహనాలను, నియంత్రించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విరాళాలు ఇచ్చిన దాతలను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా స్వామి వారి క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు.
ఇదీ చదవండి:అన్ని అవతారాలకు భిన్నం నరసింహ తత్వం