- ఉద్రిక్తంగా దేవినేని ఉమ నిరసన దీక్ష
- టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట
- ఉమ అరెస్టు, దీక్ష అనుమతిలేదన్న పోలీసులు
ప్రతిపక్ష తెలుగుదేశం, అధికార వైసీపీ నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చలికాలంలో ఆరని మంటను రాజేస్తున్నాయి. నిన్నటి మొన్నటి దాకా హిందూ దేవాలయాలపై దాడులు, ఆలయాల సందర్శన పేరుతో ప్రతిపక్షాలు, ప్రభుత్వం ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్రాన్ని వేడెక్కించారు. దాడులకు కారణం మీరంటే మీరంటూ ఆరోపణలు గుప్పించుకున్నారు. సంక్రాంతి నేపథ్యంలో కొంత సద్దుమణిగినట్లు అనిపించింది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న నేతలు హూందా మరిచి ప్రవర్తిచడంతో రాజకీయాలు రాను రాను దిగజారిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
ఇది చదవండి: రాష్ట్రపతి పాలనకు తెలుగుదేశం డిమాండ్
నాని వ్యాఖ్యలతో టీడీపీ నేతలు మండిపడ్డారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి వ్యాఖ్యలపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేవినేని ఉమ గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు దీక్షకు కూర్చొంటానని ఛాలెంజ్ చేశారు. ఈనేపథ్యంలో దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. భారీగా చేరుకున్న తెలుగుదేశం శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భారీగా పోలీసులు మోహరించి ఉమను అరెస్టు చేసి పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు. ఎన్టీఆర్ కూడలి వద్దకు వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ శ్రేణులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. గొల్లపూడిలో 144 సెక్షన్, పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉందని దేవినేని ఉమ నిరసనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే …ఇంటికొచ్చి కొడాతాం –కొడాలి నాని
నిన్న (జనవరి 18) ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వైసీపీ నేతల చేతిలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని దెబ్బలు తింటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధికి, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కొడాలి నాని సవాల్ విసిరారు. దీనిపై మీ ఇంట్లో అయినా చర్చకు సిద్ధమని అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇంటికొచ్చి బడితెపూజ చేస్తామని కొడాలినాని ఉమను హెచ్చరించారు. నాని వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర స్తాయిలో విరుచుకుపడ్డారు. నాని అసభ్య పదజాలంతో టీడీపీ నేతలపై చేస్తున్న విమర్శలపై ఉమ మండిపడ్డారు. మంత్రిగా ఉండి బూతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.బూతుల మంత్రికి ప్రజలే బుద్ధి చెబుతారని ఉమ అన్నారు.
ప్రజల పక్షాన మాట్లాడితే కొడతారా!
దేవినేని ఉమను అరెస్టు చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. సమస్యలపై గళమెత్తితే ప్రభుత్వం దాడులు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం అండదండలు చూసుకుని ఆపార్టీ నేతలు, కార్యకర్తలు చెలరేగిపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న దేవినేని ఉమను అరెస్టు చేయడం అక్రమమని అన్నారు. దేవినేని ఉమకు బడితె పూజ చేస్తానన్న కొడాలి నానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోదా అని ప్రశ్నించారు.
ఇది చదవండి: తిరుపతిలో హిందుత్వ అజెండా అమలు చేస్తున్న తెలుగుదేశం