Sunday, December 22, 2024

దేవీ ఉపాసనే ప్రకృతి ఉపాసన

అప్పాల‌ శ్యాంప్రణీత్‌ శర్మ అవధాని

ధరణిమయీం తరణిమయీం పవనమయీం గహన దహన హోతృమయీమ్‌।

అంబుమయీమిందుమయీం అంబామనుకంపమాదిమా మీక్షే॥ (మూకపంచశతి)

మనం కోరకుండానే భూమి సకల‌ ప్రాణుల‌నూ భరిస్తోంది. తినడానికి కావల‌సిన ఆహార ధాన్యాల‌ను ఇస్తోంది. మేఘాలు వర్షించి నదుల‌రూపంలో మన దప్పికను తీరుస్తున్నాయి. మనం తింటున్న ఆహారం జఠరాగ్ని రూపంలో పచనం అవుతుంది. ఈ ప్రకృతి ఎప్పడికప్పుడు కొత్తకొత్త సొబగులు అద్దుకుంటోంది. ఎవరి ఆదేశానుసారం ఇవన్నీ జరుగుతున్నాయి? జీవుల‌కు ఇంతమేలు చేస్తూ ప్రాణుల‌న్నింటిని రక్షించమని ఎవరు చెప్పారు? వీటన్నింటిని నడిపిస్తోంది జీవకోటిపై జగన్మాతకు ఉన్న అవ్యాజమైన ప్రేమే కదా!

సృష్టి మొత్తమునకు తల్లిదండ్రులు ప్రకృతిపురుషులు. ఈ ఇద్దరికి తమ సంతానంపై సమాన బంధుత్వ, బాధ్యతలు ఉన్నాయి. అయితే పురుషునికన్నా స్త్రీయే ఎక్కువ మమకారము, వాత్సల్య‌ముతో పోషణ బాధ్యత కలిగి ఉండటం ప్రతక్షంగా కూడా అనుభవంలో ఉన్నదే. ‘‘మాతృహీన శిశుజీవనం వృధా’’ అన్న వాక్యము మనకు తెలిసినదే! ఈ కారణముల‌న్నింటితోనే ప్రకృతి ఉపాసన, పరతత్వమును మాతృమూర్తిగా భావించటం సంప్రదాయంగా వస్తున్నది. ఇహ, పరములు రెండింటిని కోరుకునే వారికి ప్రకృతి ఉపాసన తప్పనిసరి.

శ్లో॥      స్త్రీరూపాం చింతయేద్దేవీం పుంరూపంవా విచింతయేత్‌।

                అథవా నిష్కళం ధ్యాయేత్‌ సచ్చిదానంద క్షణం॥

తా॥     ప్రకృతి తత్త్వమునే కొందరు స్త్రీరూపమని, మరికొందరు పురుషుడని, శివుడని, విష్ణువని ఆదిశక్తియని ఆరాధిస్తున్నారు. ఎవరు ఎలా ఆరాధించినా, కొలిచినా, తల‌చినా అది సత్యానికి విరుద్ధంకాదు.

Also Read : వేలాల మల్లిఖార్జున స్వామికి రామగుండం సీపీ ప్రత్యేక పూజలు

భగవత్‌ తత్త్వమును ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు అర్థం చేసుకునేందుకు వీలుగా మన పెద్ద‌లు సగుణోపాసన, నిర్గుణోపాసన అని రెండురకముల‌ను ఏర్పాటు చేశారు. మనకు తోచినపద్ధతిలో మనం దేవుని ఊహించుకొని పూజించుకోవడం సగుణోపాసన అంటారు. అటువంటి సగుణోపాసనే దేవ్యుపాసన. ‘‘శ్వేతాశ్వతరోపనిషత్తు’’ దీనిగురించి ఈ విధంగా చెబుతున్నది.

మం॥   సర్వాననా శిరోగ్రీవ: సర్వభూత గుహాశయ:।

                సర్వవ్యాపీ సభగవాం స్తస్మాత్సర్వగత:శివ:॥

తా॥     భగవత్తత్త్వము సర్వవ్యాపకమైనది. సర్వగతమైనది. శుభంకరమైనది. ఈ సృష్టిలోని అన్నిముఖాల‌ను,మెడల‌ను ఉపయోగించుకుంటు జీవులందరి హృదయాల‌లో నివసించగలదు. అంటే భగవంతుడు ఏరూపములనైనా ధరించి భక్తుల‌ కోరికప్రకారం ఎక్కడైనా ఉండగల‌డని అర్థం.

అదేవిధంగా జగన్మాతకూడా అందరి హృదయాల‌లో నివసిస్తు వారి బుద్ధిని, ఇంద్రియాల‌ను, కర్మల‌ను నిర్దేశించకపోయినట్లయితే మానవుడు తనంతట తానుగా దేవి సాక్షాత్కారాన్ని పొందలేడనేది సత్యం.

అందుకే ల‌లితా సహస్రనామంకూడా ‘‘ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియశక్తి స్వరూపిణి’’ అని స్తుతించింది. దీనినే శంకర భగవత్పాదుల‌వారు ఈ విధంగా చెబుతారు.

Also Read : పరిపూర్ణమైన వ్యక్తిత్వ సిద్ధాంతం కృష్ణతత్వం!

శ్లో॥      త్వమేవ కారణం కార్యం క్రియాజ్ఞానం త్వమేవహి।

                త్వామంబ నవినాకించిత్‌ త్వయి సర్వం ప్రతిష్ఠితమ్‌॥

‘‘అమ్మా! నీవే కారణభూతురాల‌వు. కార్యరూపిణివి, క్రియారూపిణివి. జ్ఞానమునీవే. నీవేలేకుంటే ఏదీలేదు. నీలోనే అంతా ఉన్నది’’ అంటారు. అగ్నికి వేడినిచ్చే శక్తి, సూర్యునికి వెలుగునిచ్చే  శక్తి, చంద్రునికి వెలుగునిచ్చే శక్తి ఇలా ప్రతిదానిలో ఉండే శక్తి ఆ ‘‘చిచ్ఛక్తి’’యే. అందుకే ‘చిచ్ఛక్తిశ్చేతనారూపా’… అంటూ అమ్మవారిని శక్తిచైతన్యరూపంగా ఆరాధిస్తున్నాము. ఆ శక్తి సందర్భానుసారంగా ఒక్కోసారి ఒక్కోరీతిలో వ్యక్తమవుతుంది. ఆ శక్తిని ప్రసన్నం చేసుకొని పరమార్థాన్ని పొందడానికి జరిపే ఉత్సవాలే శరన్నవరాత్రి ఉత్సవాలు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల‌ అంతరార్థం శక్తి ఉపాసనే!

జగన్మాతకు జననీరాజనం

దేవీనవరాత్రులు శరదృతువులో వస్తాయి. అందుకే దీనిని శరన్నవరాత్రునికూడా అంటారు.  ఈ శరన్నవరాత్రుల‌ను ఆశ్వియుజమాసంలో వచ్చే మొదటిరోజున అంటే ప్రతిపదనుండి దశమి వరకు ఆచరించాల‌ని ధర్మప్రవృత్తి, మత్స్యపురాణం, దేవీపురాణం,స్కాన్దపురాణం మొదలైన ఎన్నో గ్రంథములు వివరించాయి. దానిని ఆధారంగా చేసుకొని భారతదేశం నలుమూల‌లా ఈ నవరాత్ల‌రును అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.

మైసూర్‌ ఉత్సవాలు

దసరా ఉత్సవానగానే గుర్తుకువచ్చేది మైసూర్‌. ప్రపంచంలో మరెక్కడా ఇంత సంబరంగా దసరా వేడుకలు జరగవేమో అన్నంత ఘనంగా జరుగుతాయి మైసూర్ లో వేడుక‌లు జ‌రుగుతాయి. 15వ శతాబ్దంలో విజయనగరరాజు ఈ  ఉత్సవాల‌ను ప్రారంభించినట్లుగా చరిత్ర. 16వశతాబ్దం నుండి మైసూర్‌రాజు వడయార్‌ దీన్ని కొనసాగించారు. ఈ ఉత్సవా గురించి పర్షియన్‌రాయబారి అబ్దుల్‌రజాక్  తనపుస్తకంలో తెలియచేశాడు. త‌రువాత కాలంలో కర్ణాటక ప్రభుత్వం ఈ ఉత్సవాల‌ను రాష్ట్రపండుగగా ప్రకటించింది. మైసూర్‌ మహారాజుద్వారా ఈరోజున ప్రత్యేకపూజలు నిర్వహించబడతాయి. ఇక్కడి ప్రధానదేవాల‌యం చాముండేశ్వరి దేవాల‌యం.

Also Read : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

దసరారోజున చాముండేశ్వరి అమ్మవారిని 750కిలో బంగారు ఆభరణాల‌తో అలంకరిస్తారు. 9 రోజుల‌ నవరాత్ల‌రు పూజాకార్యక్రమాల‌ అనంతరం పదవరోజున ఈ అలంకారాన్ని జరుపుతారు. అనాటి రాజరికానికి గుర్తుగామిగిలిన ఆయుధాల‌కు పూజలు నిర్వహిస్తారు. రాజదర్బార్‌తో ఒకప్పటి రాచఠీవిని ప్రదర్శిస్తారు. ఆనాటి రాజకుటుంబీకులంతా దీనికి హాజరవుతారు. నగరంలోని ‘దొడ్డకరే’ మైదానం కవిసమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు,  వివిధ ఆటలు, విచిత్ర వేషధారణల‌తో హోరెత్తిపోతుంది. ప్రఖ్యాతి చెందిన మైసూర్‌ మహారాజప్యాలెస్‌ రంగురంగుల విద్యుద్దీపాల‌తో అంకరించబడి ధగద్ధగాయమానంగా వెలుగులు విరజిమ్ముతుంది. దసరా సందర్భంగా ఇక్కడ జరిగే ‘జంబూ సవారిఉత్సవం’ కనుల‌తో చూడవల‌సినదే! చక్కగా అలంకరించబడిన 12ఏనుగులు చాముండ్వేరిమాత ఉత్సవమూర్తిని తీసుకొని మైసూర్‌ ప్యాలెస్‌నుండి బయుదేరి బన్నిమంటపం వరకు చేరుకుంటాయి. అక్కడ శమీపూజా నిర్వహిస్తారు. ఈ మైసూర్‌ దసరావేడుకల‌ను తిల‌కించడానికి దేశంనలుమూలల‌నుండే గాక విదేశాల‌నుండి సైతం పర్యాటకులు విచ్చేస్తారు.

కల‌కత్తా కాళీమాత

దుర్గాపూజకు పేరొందిన ప్రాంతం బెంగాల్‌. దుర్గా పూజాదికాలు, నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడంలో బెంగాల్‌ ప్రజ‌లు పెట్టింది పేరు. 17వశతాబ్దంలో రాజానాబ కృష్ణదేవ్‌ అనే అతడు ఈ ఉత్సవాల‌ను ప్రారంభించినట్టుగా చరిత్ర. ఇక్కడ వాడవాడలా విగ్రహాల‌ను నిలిపి పూజిస్తారు. కొన్నివందల‌ ఏళ్ళుగా ఒకే కుటింబీకులు ఆయా మంటపాల‌ను నిర్వహిస్తుంటారు. ఇది ఒకవిశేషం. ఈఉత్సవాలు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పండుగగా పేరుపొందాయి. ఈ నవరాత్రుల‌ సమయాన్ని ఇక్కడ దేవిపక్షం అనిపిలుస్తారు. దుర్గాదేవికి నేత్రచిత్రణ జరిపే కార్యక్రమాన్ని ‘‘చక్షుదాన్‌’’ అనిఅంటారు. విగ్రహాల‌ను తెచ్చే సమయంలో ‘‘కోలాబౌ’’ అనేపేరుతో అరటిచెట్టును అలంకరించి పసుపుచీరచుట్టి ముందుగా తెస్తారు. ముఖ్యమైన పూజల‌న్ని షష్ఠినుండి మొదల‌వుతాయి. సప్తమినాడు భోదన్‌ అనే క్రియతో విగ్రహాల‌కు ప్రాణప్రతిష్ఠచేస్తారు. ఆయారోజుల‌ననుసరించి ఆయా అలంకారాలు చేస్తారు. పూజాదికాల అనంతరం విగ్రహాల‌ను నీటిలో నిమజ్జనంచేస్తారు.

ముంబాయిలో ముంబాదేవి

మహారాష్ట్ర రాజధాని ముంబాయిలోని ముంబాదేవి ఆల‌యం అత్యంతం ప్రసిద్ధి చెందింది. ఈ దేవి పేరు మీదుగానే ఈనగరానికి ముంబాయి అని పేరువచ్చింది. నగరంలోని ముంబాదేవి ఆల‌యంతోపాటుగా ఉన్న మహాల‌క్ష్మీ, జోగీశ్వరి మొదలైన దేవాల‌యాలో దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రతి దేవాయంలో భజనలో లేదా హరికథో ఉంటుంది. ఇదిరాత్రిదాకా సాగుతుంది. ప్రజు 9రోజులుపాటు భక్తితో, నియమంతో ఉంటు ఆల‌యాను దర్శిస్తారు. ముంబాదేవి మరియు మహాల‌క్ష్మిదేవి ఆల‌యాల‌లో ఈఉత్సవాలు అత్యంత ఆడబరంగా నిర్వహిస్తారు. ఉదయాన్నించి రాత్రిదాకా దేవిదర్శనంకోసం భక్తులు బారులు తీరుతారు. నవరాత్రులో వచ్చే మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ఇష్టమైనదని వీరి నమ్మకం. కాబట్టి ఆ రోజులో మరింత ఎక్కువసంఖ్యలో జనం అమ్మవారిని దర్శిస్తారు. ఒక పళ్ళెంలో తాంబూలం, గులాబీపూలు, నెయ్యి, కొబ్బరికాయ, రాగి నాణాలు పెట్టుకొని స్త్రీలు, పురుషులు పిల్ల‌ల‌నుకూడా వెంటపెట్టుకొని దేవాల‌యానికి తండోపతండాలుగా కదిలి వస్తుంటే ఆ దృశ్యం కమనీయంగా ఉంటుంది. దేవాల‌యంలో ఉన్న అఖండజ్యోతిలో తమవెంట తెచ్చిన నేతిని పోస్తారు. నవరాత్రులు ఆరంభంనుంచి చివరిదాకి ఈ జ్యోతి అఖండగా వెలుగుతూనే ఉంటుంది. ఈ నవరాత్రుల‌ సందర్భంగా మహాల‌క్ష్మి ఆల‌యంవద్ద, మార్వాడీబజారులోని ముంబాదేవి ఆల‌యం దగ్గర విజయదశమి రోజున బ్రహ్మాండమైన సంత జరుగుతుంది. సాయంకాలం శమీపూజ అనంతరం అందరి ఆశీర్వాదాల‌ను తీసుకొంటారు. సాయంకాలం దేవాల‌యాల‌లో విందుభోజనాలుంటాయి. సింగడీలు, శక్కర్‌బాత్‌, ఖిష్రిబాత్‌ మొదలైన వంటకాల‌తో విందు ఆరగిస్తారు.

Also Read : శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్

తుల్జాపూర్‌ అంబాభవాని

మహారాష్ట్ర ఉస్మానాబాద్‌ జిల్లాలో నెల‌కొన్న‌ సహ్యపర్వత పంక్తుల‌లో ఒక‌టైన‌ యమునాచ పర్వతంపై కొలువున్న తుల్జాపూర్‌లోని దేవత అంబాభవానిమాత. అంబాభవాని దేవి ఈప్రాంతంలో చాలామందికి కుల‌దేవత. ఈ దేవాల‌యం గురించి స్కందపురాణంలో వివరించి ఉన్నట్లుగా తెలుస్తున్నది. మహారాష్ట్రరాజు ఛత్రపతి శివాజీ ఇక్కడి అమ్మవారిని దర్శించగా దేవి ఆయనకు ఖడ్గాన్ని ప్రసాదించిందని దానితోనే శివాజీ అప్రతిహత విజయాని సాధించాడని చరిత్ర. ఇక్కడ నవరాత్రుల పూజకార్యక్రమంలో భాగంగా వాయించే వాయిద్యాని వినడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఈ వాయిద్యాల‌ను ‘చౌగఢ’అంటారు. ప్రతీరోజు మూడు సార్లు వాయిద్యాన్ని వాయిస్తారు.

ఆమ్నాయ పీఠాల‌లో దసరా ఉత్సవాలు

శంకరభగవత్పాదువారు దేశంలో నాలుగు మూలలో స్థాపించిన నాలుగు ఆమ్నాయపీఠాలో శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్సవాలు అతిసుందరంగా నిర్వహింపబడతాయి.

పూర్వామ్నాయ పూరీ గోవర్ధనపీఠంలో ప్రస్తుత పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీస్వామి నిశ్చలానంద సరస్వతి స్వామివారు నవరాత్రి ఉత్సవాల‌ను నిర్వహిస్తారు. చివరి రోజున రాజరాజేశ్వరి దేవిని పూజిస్తారు.

దక్షిణామ్నాయ శ్రీశృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీభారతీతీర్థ మహాస్వామివారు మరియు ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీవిధుశేఖర భారతీ స్వామివారు శృంగేరిలో దసరాఉత్సవాల‌ను నిర్వహిస్తున్నారు. ఇక్కడి శ్రీ శారదాదేవి దేవాల‌యంలో ప్రతిరోజు విశేష అంకారాలు, పారాయణల‌తో అమ్మవారు శోభిల్లుతుంది. విజయదశమినాడు శ్రీభారతీతీర్థ మహాస్వామివారు వ్యాఖ్యానసింహాసనాన్ని అధిష్ఠిస్తారు. దర్బారు ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే రథోత్సవంనందు జ‌గ‌ద్గురువులు అభరణాల‌ను ధరించి ఛత్రచామరాల‌తో, వేదఘోషతో, మేళతాళాతో ఊరేగుతారు. ఈ ఉత్సవం విద్యారణ్యుకాలంలో ప్రారంభమైంది. విజయనగరసామ్రాజ్యాన్ని స్థాపించిన విద్యారణ్యులు రాజ్యాధికారాన్ని నిరాకరించి కేవలం రాజముద్రికనుమాత్రం అంగీకరించారు. దానికి గుర్తుగా ఈనాటికి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.  

పశ్చిమామ్నాయ ద్వారకా^ఉత్తరామ్నాయ జ్యోతిష్పీఠాధీశ్వరులైన శ్రీశ్రీశ్రీస్వరూపానంద సరస్వతీ స్వామివారు కూడా ఎంతో వైభ‌వంగా జ‌గ‌న్మాత‌ను ఆరాధిస్తారు. వేద‌వేదాంత శాస్త్ర స‌ద‌స్సుల‌ను నిర్వ‌హిస్తారు.

 రచయిత వేదపండితులు

 రచయిత మొబైల్: 9440951366

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles