Wednesday, December 25, 2024

అభివృద్ధి – ఆదివాసులు – హింస

 (ఎవరికి వికాసం? ఎవరికి వినాశనం??)

“గాంధీజీ అస్తమానూ అనే మాటల్ని నాన్నగారు పదేపదే చెబుతూండేవారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలంటే, కట్టు బట్టలతో యువత గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ పని చేయడం ప్రారంభించాలి. ఈ మాటలు చిన్నప్పటి నుంచి వినడం వల్ల కావచ్చు. పట్టణాలు, నగరాలు విడిచిపెట్టి గ్రామాల్లోనే ఉండి పని చేయాలని నేను నిర్ణయించుకున్నా. అనుకున్నట్టుగానే మా పెళ్ళయిన 20 రోజులకు నేనూ, నా భార్యా ఢిల్లీ వదిలి అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రం బస్తర్ జిల్లా , ఇప్పటి చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోకి ప్రవేశించి సరాసరి ఒక చెట్టు కింద మా సామాను అంతా సర్దుకుని ఉండటం మొదలెట్టాం. అలా 18 సంవత్సరాలు అక్కడే ఉన్నాం. 18 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం మమ్మల్ని తరిమేసింది.

 ప్రస్తుతం నా పై సుమారు 100 వారెంట్లు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టిలో నేనో అతి ప్రమాదకరమైన నక్సలైట్ ని. నిస్సందేహంగా, నేనెప్పుడూ ఎవరినీ కనీసం ఒక్క దెబ్బయినా కొట్టలేదని చెప్పగలను. ఎప్పుడూ ఎవరినీ పల్లెత్తు మాటనలేదు, ఎన్నడూ హింసని సమర్దించలేదు.” (పేజి – 5)

“స్వాతంత్ర్యం నాటి మన లక్ష్యాలేమిటి? గ్రామాల్ని అభివృద్ధి చేస్తామనే కదా! కానీ మనం ఏం చేశాం? ఈ రోజు ప్రభుత్వం తన దేశ గ్రామాలకే చేజేతులా నిప్పు పెట్టి అంటిస్తోంది. ముందూ, వెనుకలు చూడకుండా గ్రామాలు తగలబెడుతోంది.

ఇదెలా జరిగిందనే విషయం మనకి అర్ధం కావాలంటే, మనం ఇక్కడ గాంధీజీ మాటలు గుర్తు చేసుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన ప్పుడు గాంధీజీ ఆంగ్లేయుల అభివృద్ధి నమూనా వినాశకరమైందన్నాడు. ఎందుకంటే, ఆ అభివృద్ధి నమూనా ప్రకారం మీ దగ్గర ఎంత ఎక్కువుంటే మీరంత అభివృద్ధి అయినట్లు, మీ దగ్గర తక్కువ ఉంటే మీరు వెనకబడి ఉన్నట్లు. అనేక కట్టడాలు, భవనాలు మీదగ్గరుంటే మీరు అభివృద్ధి అయినట్లు, అదే, తలదాచు కోడానికి ఒక గుడిసుంటే మీరు వెనకబడి ఉన్నట్లు. మీ దగ్గర కారుంటే మీరు అభివృద్ధి అయినట్లు, అదే సైకిలుంటే మాత్రం ఇంకా వెనకబడి ఉన్నట్లు.”  (పేజి – 8)

“సల్వాజుడుం తగలబెట్టిన అనేక గ్రామాల్లోంచి రెండు గ్రామాల్ని ఎంపిక చేసుకొని మా సంస్థ కార్యకర్తలు అక్కడ పునరావాస కార్యక్రమాలు చేస్తున్నట్లు నేను మీకు దీనికి ముందు రాసిన లేఖలో తెలియజేసాను. ..వీటిలో నేన్ ద్రా అనే గ్రామానికి కార్యకర్తలతో వెళ్ళడం జరిగింది. నా ముందు దాదాపు 150 మంది ఆదివాసీ స్త్రీ పురుషులు, పిల్లలు సమావేశమయ్యారు. వాళ్ళ ఒంటిమీది బట్టలన్నీ మాసిపోయి, చిరిగిపోయి ఉన్నాయి. ఎందుకంటే, వాళ్ళు బజారు పోయేందుకు అనుమతి లేదు. వెళితే చంపేస్తారు. ఎక్కువ మంది చిక్కి శల్యమై ఎముకల గూళ్ళలా ఉన్నారు. ఎందుకంటే, మూడేళ్ళుగా వాళ్ళ పంటలు తగల బెట్టేస్తున్నారు కనుక. నేను మీకోసం ప్రధానంగా ఏం చెయ్యాలని అనుకుంటున్నారని నేను వాళ్ళని అడిగాను.

ఒక ఆదివాసీ వృద్దుడు నిలబడి చెప్పడం మొదలెట్టాడు. ‘‘రెండేళ్ళ క్రితం నా 12 సంవత్సరాల అమ్మాయిని సల్వాజుడుం వాళ్ళు పట్టుకుని కేంప్ లోకి తీసికెళ్ళి పోయారు. నా కూతురు ఇంకా అక్కడే ఉంది. మీరు నా కూతుర్ని మా దగ్గరకు తీసుకు రాగలరా?” స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై సంవత్సరాల అనంతరం నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది. మనం రోజూ పాడుకునే ‘జన గణ మన అధినాయక’ ఈ ముసలి ఆదివాసి గురించేనా? భారత రాజ్యాంగ పీఠిక మొట్టమొదటి వాక్యం ‘భారతదేశ ప్రజలమైన మేము’తో మొదలు అవుతుంది. అందులో ఈ ఆదివాసులు కూడా భాగంగా ఉన్నారా?” (పేజి 25)

ఆదివాసులకి స్వాతంత్ర్యం వచ్చిందా ?

సీత ఓడిపోతే గెలిచేదెవరు? సైనికులకు వీరత్వ పురస్కారాలు ఎందుకు ఇస్తారు? ఒక దేశం సొంత భూభాగంలోని కొంత భాగాన్ని ఆక్రమించుకోడానికి తన బిడ్డలైన ప్రజలపై యుద్ధం చేస్తుందా? ఆదివాసీ అమ్మాయి కోసి కథేమిటి? సోముడెలా చనిపోయాడు? స్త్రీల జననాంగంలో రాళ్ళు పెట్టించి కొట్టించి, చిత్ర హింసలకి గురిచేసిన అత్యున్నత పోలీసు ఉన్నతాధికారికి ఈ దేశంలో పడే శిక్ష ప్రమోషనా? మనది దోపిడీ ఆర్థిక వ్యవస్థా? మన దేశ అభివృద్ధి నమూనా ఏమిటి? అసలు గణతంత్రం అంటే ఏమిటి? ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహను కూడా నక్సలైట్ అని చంపాలనుకోవడం నిజమా? ఇలాంటి అనేక విషయాలు తడిముతూ ఆదివాసులపై దశాబ్దాలుగా జరుగుతున్న అమానుషమైన దాడుల గురించి తెలుసుకోగోరే వారికి కళ్ళకు కట్టినట్లు జరుగుతున్న దారుణాల్ని చూపిస్తూ, ఒళ్ళు గగుర్పొడిచే  వాస్తవాల్ని చిత్రించే పుస్తకం ఇది!

హిమంశుకుమార్ రచన అభివృద్ధి – ఆదివాసులు  – హింస (ఎవరికి వికాసం? ఎవరికి వినాశనం??) అయిదేళ్ళ క్రితం హిమాచల్ వెళ్ళినప్పుడు హిమంశుని కలిసి ఆయన రాసిన పుస్తకం తెచ్చుకుని అప్పటికప్పుడు హిందీ నుండి తెలుగు చేసి ప్రచురించాను. ఆనాడు రాతపూర్వకంగా లేఖల రూపంలో వచ్చిన రెండు స్పందనలు, ఒకటి ఖమ్మం మిత్రులు సమతా శ్రీధర్ గారు రాసినదీ, రెండు బాపట్ల నుండి టి. రవిచంద్ గారు రాసిందీ. రెండూ విలువైన భావాలు. రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న విరసం సాహిత్య పాఠశాలలో ప్రారంభోపన్యాసానికి హిమంశు వస్తున్నట్లు తెలిసింది. ఆదివాశీల పక్షాన దశాబ్దాలుగా నిరంతరం అహింసాత్మక పోరాటం చేస్తున్న ఆయన కృషి గురించీ, అలాగే కూతవేటు దూరంలో జరుగుతున్న హక్కుల హననం గురించి తెలుసుకోగోరే వారి కోసం సంక్షిప్తంగా ఈ పుస్తక పరిచయం !

(అప్పట్లో విశాఖ పాడేరు నుండి ఆదిలాబాద్ ఉట్నూరు వరకూ అనేక ఆదివాసీ ప్రాంతాల్లో ఆవిష్కరణ చేయబడ్డ 56 పేజీల పుస్తకాన్ని ఆసక్తి ఉన్నవారి కోసం సాఫ్ట్ కాపీ పంపు తున్నాను. అవకాశం ఉన్న మిత్రులు మా ప్రయత్నాలకు ఆర్దికంగా సహకారం అందిస్తే సంతోషం. ఆలోచనాపరులకు ఈ పుస్తకం అందుబాటులో ఉందని చెబుతూ మిత్రులు రాసిన లేఖాభిప్రాయాల ఫొటోలతో ఐదేళ్ళ నాటి ఈ అనువాద గ్రంథం కోసం, చాన్నాళ్ళుగా అనుకుంటున్న ఈ పుస్తకం పై ఈ చిన్న రైటప్!)

గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles