- చిన్న పిల్లలకు పెద్ద వ్యాధులు
- ఆటపాటలు లేక అరిష్టం
ఆడుతూపాడుతూ స్కూల్లో చదువుకొనే 12 ఏళ్ళ చిన్న పిల్లగాడు గుండెపోటుతో మరణించిన సంఘటన గుండెను పిండుతోంది. మధ్యప్రదేశ్ లో ఈ దుర్ఘటన జరిగింది. స్కూల్ కు వెళ్లి తరగతి గదిలో పాఠాలు విని స్కూల్ బస్సులో ఇంటికి తిరిగి వెళ్తున్న సందర్భంలో బస్సులో ఉన్నపళంగా ఒక్కసారిగా కూలిపోయాడు. ఆ వెనువెంటనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రాథమిక లక్షణాలు బట్టి దానిని కార్డియాక్ అరెస్టుగానే డాక్టర్లు భావిస్తున్నారు. కరోనా తర్వాత ఇటువంటి కేసులు పెరుగుతున్నట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయని డాక్టర్లు అంటున్నారు. ఇంత చిన్న వయస్సులో ఇలా గుండె ఆగిపోయిన సంఘటన ఇదే మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్ లో చెప్పుకుంటున్నారు. సమాచారం అందింది కాబట్టి ఇలా చెబుతున్నారు కానీ, బయటకు తెలియకుండా ఇలాంటి కేసులు ఇంకెన్ని నమోదవుతున్నాయో అనే మాటలు కూడా వినపడుతున్నాయి. ఇది కేవలం మధ్యప్రదేశ్ కు చెందిన ఉదంతం మాత్రమే. ఇంతకంటే చిన్నారులు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారనే వార్తలు ఈ మధ్య తరచూ వింటున్నాం. వింటానికే హృదయ విదారకంగా ఉన్నా, ఈ అంశంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సివుంది. ఇటీవలే వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన 8 ఏళ్ళ బాలుడు చికిత్స పొందుతూ ఉన్నపళంగా కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు ఒదిలాడు. చిన్నపిల్లలు, యువత కూడా గుండెపోటుకు గురయ్యే పరిస్థితులు రావడం ఆరోగ్యపరంగా పెద్ద సవాల్ గా భావించాలి. అతి వ్యాయామంతో క్రీడాకారులు, సినిమా హీరోలు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.
Also read: భారాస భవిష్యత్తు ఏమిటి?
ఒత్తిడి వల్ల మరణాలు
పోటీతత్త్వం, తానేంటో చూపించాలనే తపన, తద్వారా గుండెపై పడే ఒత్తిడితో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరుగుతోంది. అందులో యువత ఉండడం అనారోగ్యకర పరిణామం. ఒకప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే గుండెపోటు ఇప్పుడు చిన్న వయస్సులోనే వస్తోంది. షుగర్, బిపి, అధికబరువు, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి మొదలైనవి గుండె జబ్బుకు ప్రధానమైన కారణాలుగా చెబుతారు. ఇవ్వేమీ లేని చిన్నవారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. చిన్నపిల్లలు, యువతకు కూడా షుగర్, బిపి వచ్చేస్తోంది. గుండెజబ్బులు మగవాళ్ళ కంటే ఆడవాళ్లకు తక్కువగా వస్తాయనే ప్రచారం నిన్నటి దాకా ఉంది. ఇప్పుడు ఆ సిద్ధాంతం తప్పని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. చిన్నారులకు గుండెపోటు ఎందుకు వస్తోందో ఇంకా బలంగా పరిశోధనలు జరగాల్సివుంది. గుండె జబ్బులు రాకుండా ఉండడం చాలా వరకూ మన చేతుల్లోనే ఉందని కూడా డాక్టర్లు అంటుంటారు. లైఫ్ స్టైల్ జబ్బుల ఖాతా పెరుగుతోంది. చిన్నపాటి క్రమశిక్షణతో వీటన్నిటిని అధిగమించవచ్చని సూచిస్తున్నారు. శారీరక వ్యాయామం, యోగ, ఆహార నియమాలు, కళలు, ఆధ్యాత్మికత ఆరోగ్యాన్ని ఇస్తాయని ఎక్కువగా వింటున్నాం. శారీరకమైన ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు మనోప్రవృత్తిని మంచిదారిలో పెట్టడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని భావించాలి.
Also read: సువర్ణాక్షరాలతో లేపాక్షి
సవాలుగా మారిన బాలల ఆరోగ్యం
ఆరోగ్యకరమైన ఆహారం కొరత, ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోవడం, పేదరికం, వసతుల లేమి మొదలైన ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. జన్యుపరమైన అంశాలు కూడా దాగి వున్నాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో చదువు ఎంత ముఖ్యమో, ఆటపాటలు కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలి. ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆరోగ్యం కూడా పెద్ద సవాల్ గా మారుతోంది. కరోనా ప్రభావం కూడా ప్రజారోగ్యంపై ఎక్కువగా ఉంది. కరోనా అనంతర దుష్ప్రభావాలు కూడా ఎక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆరోగ్యం, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై ఇంకా కసరత్తులు పెరగాలి. ఆరోగ్యకరమైన మెదడు, మనసు, శరీరం మూడూ ముఖ్యం.
Also read: సరిహద్దుల్లో మళ్ళీ ఘర్షణ