- న్యూస్ ఎక్స్ ఇంటర్వ్యూ లో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అంతా ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రేనని బీజేపీ పార్లమెంటు సభ్యుడు, వివాదాస్పద రాజకీయ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి న్యూస్ ఎక్స్ చానల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో తెల్లవారుజామున రెండు గంటలకు పూజ చేశారు కానీ దానిని ప్రచారానికి వినియోగించుకోలేదని ఆయన అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయవ్యయాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) తో ఆడిట్ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం గొప్పదని అభివర్ణించారు. దేశంలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని స్వామి అభినందించారు. టీటీడీలో క్రైస్తవులకు ఉద్యోగాలు ఇచ్చారంటై దుష్ప్రచారం చేస్తున్నారనీ, టీటీడీలో ఉన్న క్రైస్తవ ఉద్యోగులు ఇదివరకు నియమించినవారేననీ, టీటీడీలో అన్యమతస్తుతు కేవలం ఏడుగురు ఉన్నారనీ, వారందరినీ ఇదివరకటి ప్రభుత్వం నియమించిందనీ చెప్పారు. వారిని కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభత్వరంగ సంస్థలలోకి బదిలీ చేసిందని, ఇకపైన టీటీడీలో హిందూమతస్థులను మినహా తక్కిన మతాలవారిని నియమించరాదని విధాన నిర్ణయం తీసుకున్నారని స్వామి తెలియజేశారు.
టీటీబీ చైర్మన్ గా వైఎస్ జగన్ తన బంధువును (పిన్ని భర్త, బాబాయి) వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తే ఆయన క్రిస్టియన్ అనీ, ఆయన భార్య క్రిస్టియన్ మిషనరీ అనీ దుష్ప్రచారం చేశారనీ, వారిద్దరూ నరేంద్రమోదీ కంటే కూడా పక్కా హిందువులని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అన్ని దేవాలయాలనూ స్వాధీనం చేసుకొని అన్ని దేవాలయాలకూ ముఖ్యమంత్రినే చైర్మన్ గా నియమించుకోవడాన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానంలో కేసు వేశానని తెలిపారు.
Also Read : తిరుపతిలో హిందుత్వ అజెండా అమలు చేస్తున్న తెలుగుదేశం
అవాస్తవాలు రాసిన విలేఖరుల అరెస్టు
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో లక్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారంపై పెచ్చులూడితే విగ్రహాల ధ్వంసం అంటూ అవాస్తవాలు రాసిన ఏబీఎన్ విలేఖరి రవికిరణ్ నూ, ఎన్ టీవీ విలేఖరి కాట్రగడ్డ రామ్ మోహన్ నూ పోలీసులు అరెస్టు చేసినట్టూ, ఈటీవీ ప్రతినిధిపైన పోలీసులు కేసు పెట్టినట్టూ తెలిసింది.