రామాయణమ్ – 149
ధ్వంస రచన
ఒరిగిన లతలు
విరిగిన తరులు
ఊగిన గిరులు
తెగిన చెరువులు
అల్లకల్లోలమయిపోయింది
అశోకవనం.
ఎటుచూసినా విధ్వంసపు ఆనవాళ్ళే!
లతాగృహాలు
చైత్యగృహాలు
అన్నీ
విరిగిన స్తంభాలతో
ఒరిగిన గోడలతో
కూలిన కప్పులతో
క్షణకాలములో ఎక్కడికక్కడ
వికృత రూపము సంతరించుకొన్నది అశోకవనము.
Also read: అశోకవన విధ్వసం ప్రారంభించిన హనుమ
అది ఆనందము అల్లుకున్న
అశోకమా!
కాదుకాదు
శోకలతలు అల్లుకున్న
పెనుపందిరి!
ఆ విధముగా వన విధ్వంసము చేసి
ఎవరొస్తారో రండిరా అన్నట్లుగా వన ముఖద్వారము వద్ద వేచిచూస్తున్నాడు
మహాబలి వాయుపుత్రహనుమంతుడు.
Also read: సీతమ్మను ఓదార్చిన హనుమ
పక్షుల అరుపులూ
విరిగిపడుతున్న చెట్లూ,
భీతిల్లి అరుస్తున్న నానా మృగగణాలూ మొత్తం అశోక వనమంతా ఒకటే కలకలం.
ప్రళయవేళలో కాలుడు సృష్టించే భీభత్సానికి వెరచి పరుగులిడే జీవజాలము సృష్టించే అలజడి ఎలా ఉంటుందో లంకా వాసులందరికీ ఇప్పుడే రుచి చూపెడుతున్నట్లుగా ఉన్నది.
లంక లంక అంతా అదిరిపోయింది. ఘోరమైన అపశకునాలు కనపడుతున్నాయి అందరికీ.
సీతమ్మ వద్ద కావలికాస్తున్న రాక్షస స్త్రీలు ఒక్కసారిగా ఉలిక్కిపడి మేలుకొని ఏమి జరిగినదో ఒకరినొకరు అడిగి తెలుసుకుంటున్నారు.
Also read: రాముని ససైన్యముగా తోడ్కొని రమ్ము, హనుమకు సీతమ్మ పురమాయింపు
వారి ఎదుట మహాభయంకర ఆకారముతో ఒక పెద్దవానరుడు వనమును ధ్వంసము చేయుట కనపడినది. మేల్కొన్న రాక్షస్త్రీలను ఇంకా బెదరగొట్టటానికై ఆయన తన ఆకారమును మరింత భీకరముగా కనపడునట్లు పెంచసాగెను.
ఆయనను చూడగనే ..రాక్షస్త్రీలంతా
‘‘ఎవడు వీడు? ఎచటి వాడు? వీనికి ఇచ్చట ఏమి పని? అని తమలో తాము తర్కించుకొంటూ, సీతమ్మ వద్దకు వెళ్ళి …నిజము చెప్పు ఎవడీ వానరుడు? నీతో ఏమి మాటలాడినాడు? నీకేమి భయములేదులే మాతో చెప్పుము’’ అని అడుగగా ….
.
అప్పుడు సీతమ్మ, ‘‘వాడెవడో ఎచటి వాడో నా కేమి తెలియును? కామరూపము ధరించి ఇటకొచ్చిన మరియొక రాక్షసుడేమో! అయినా రాక్షసుల గురించి నాకేమి తెలియును … వాడు మీ అంతఃశత్రువేమో? తెలిస్తే గిలిస్తే మీకే తెలియాలి. జాడలు పాములకే కదా తెలియును’’ ….అని అమాయకముగా సమాధానమిచ్చెను….
కొందరు రాక్షసస్త్రీలు పరుగు పరుగున రావణుని కడకు విషయము నివేదించుటకొరకు వెళ్ళిరి.
Also read: హనుమ సూచనను సున్నితంగా తిరస్కరించిన సీతమ్మ
వూటుకూరు జానకిరామారావు