- భారత కెప్టెన్ విరాట్ విస్మయం
- ప్లేయర్-ఆఫ్- ది- సిరీస్ గా బెయిర్ స్టో
ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకొన్నా కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం విజయానందాన్ని మరచి తీవ్రఅసంతృప్తితో ఉన్నాడు.తమజట్టు భారీస్కోర్లతో మ్యాచ్ లు నెగ్గినా, సిరీస్ విజేతగా నిలిచినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు మాత్రం ఇంగ్లండ్ కు ఇవ్వటంలో ఔచిత్యం ఏమిటని భారత కెప్టెన్ ప్రశ్నించాడు.
పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన సూపర్ సండే ఆఖరి వన్డేలో భారత్ 7 పరుగుల సంచలన విజయంతో సిరీస్ విజేతగా నిలిచింది.సిరీస్ లోని మొదటి, ఆఖరి వన్డేలలో భారత్ విజయాలు సాధిస్తే రెండోవన్డేలో మాత్రం ఇంగ్లండ్ సూపర్ చేజింగ్ విజయంతో భారత్ ను కంగుతినిపించింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సామ్ కరెన్…
Also Read: సెంచరీల కోసం ఆడను- విరాట్
ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరివన్డేలో భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. సమాధానంగా 330 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ తన కోటా 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఇంగ్లండ్ టాపార్డర్ విఫలమైనా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగిన సామ్ కరెన్ 83 బాల్స్ లో 95 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలవడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకొన్నాడు.
భారత పేస్ జోడీ శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌల్ చేసి 7 వికెట్లు పడగొట్టారు. శార్దూల్ 67 పరుగులిచ్చి 4 వికెట్లు, భువీ 42 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత విజయంలో ప్రధానపాత్ర వహించారు.అద్భుతంగా రాణించిన తమ బౌలర్లను పక్కనపెట్టి ఓడిన జట్టులో నాటౌట్ గా నిలిచిన ఆటగాడికి అవార్డు ఇస్తారా అని భారత కెప్టెన్ ప్రశ్నించాడు.
ప్లేయర్- ఆఫ్- ది సిరీస్ బెయిర్ స్టో….
సిరీస్ లోని మొత్తం మూడుమ్యాచ్ ల్లో ఓ సెంచరీతో సహా 218 పరుగులు సాధించిన ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టోకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చారు.భారతజట్టు సిరీస్ విజేతగా నిలిచిన వ్యక్తిగత అవార్డులు ఇంగ్లండ్ ఆటగాళ్ళకు ఎలా ఇచ్చారో తనకు అర్థంకాలేదని మ్యాచ్ ఆనంతరం కెప్టెన్ కొహ్లీ వాపోయాడు.
Also Read: క్రికెట్ దేవుడికి కరోనా పాజిటివ్
పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణించాడని, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు అన్ని విధాలా అర్హుడని కొహ్లీ గుర్తుచేశాడు. భువీకి సిరీస్ అత్యుత్తమ ఆటగాడి అవార్డు ఇచ్చి ఉండాల్సిందన్నది తన అభిప్రాయమని చెప్పాడు.
విరాట్ కొహ్లీ కెప్టెన్ గా భారతజట్టు నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 3-1తోను, పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ను 3-2తోనూ, తీన్మార్ వన్డే సిరీస్ ను 2-1తో నెగ్గి మూడుఫార్మాట్లలోనూ సిరీస్ లు సొంతం చేసుకోడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.