- కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు
- మోదీ బడా పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు
కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశంలోని రైతాంగం అధోగతిపాలవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారుల చేతిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాహుల్ విమర్శించారు. చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. రైతుల ఆందోళనను మోదీ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. దేశంలోని పలు కీలక రంగాలకు సంబంధించిన గుత్తాధిపత్యం కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే ఉందని రాహుల్ విమర్శించారు. దేశంలో ఇప్పటికీ ఎక్కువ శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.
ఇది చదవండి: ట్రాక్టర్ ర్యాలీకి అనుమతిపై అధికారం పోలీసులదే
మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ రాహుల్ :
దేశంలో ఉన్న మండీ వ్యవస్థను మోదీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. మండీ వ్యవస్థ వల్లే వినియోగదారులకు సరసమైన ధరలకు సరుకులు చేరుతున్నాయని అన్నారు. కొత్త సాగు చట్టాల అమలుతో కేవలం రైతులకే కాకుండా దేశంలోని మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారని రాహుల్ తెలిపారు. రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు రైతుల జీవితాలు, ఉపాధిని పణంగా పెడుతున్నారని ఆరోపించారు. స్వార్ధ రాజకీయాల కోసం రైతుల జీవితాలను బడా పారిశ్రామిక వేత్తలకు దారదత్తం చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. సాగు చట్టాలను రద్దు చేసేవరకు రైతుల పక్షాన పోరాడుతామని రాహుల్ స్పష్టం చేశారు.
ఇది చదవండి: సాగు చట్టాల అమలుకు సుప్రీంకోర్టు బ్రేక్