ఆయన అజాత శత్రువే కాదు, అపర చాణుక్యుడు కూడా. రోశయ్య విషయంలో చాణుక్యుడు అనే మాట పడికట్టు పదం కాదు. తూకం వేసినట్లు సరిపోయే మాట. కౌటిల్యుడు ‘అర్థశాస్త్రం’ రాశాడని మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. దానిని అక్షరాలా అంకెల్లో ఆచరించడానికి ప్రయత్నం చేసిన మంత్రివర్యుల్లో రోశయ్యది తొలి వరుస. పంచెకట్టు, ధగధ్ధగాయమానమైన ధవళ వస్త్ర ధారణ, చెరగని చిరునవ్వు, గంభీరమైన వాతావారణాన్ని కూడా క్షణాల్లో నవ్వులమయం చేసే హాస్యచతుర సంభాషణ, ఎంతటి ప్రత్యర్థినైనా ఉన్నపళంగా నవ్వులపాలు చేయగలిగిన వాగ్ధాటి, ఎక్కడెక్కడి అంకెలనో అలవోకగా చెప్పగలిగిన ధారణ (జ్ఞాపకశక్తి), వివాదాలకు దూరంగా ఉండాలనే విజ్ఞత, అధినాయకుల పట్ల విధేయత, పదవుల యెడల భయభక్తులు మొదలైన సుగుణాలన్నీ మూర్తీభవించిన కోవిదుడు.
Also read: రోశయ్య జీవితం ఫలప్రదం, జయప్రదం
ద్వితీయంలో అద్వితీయం
ఎందరు ముఖ్యమంత్రులు మారినా,ద్వితీయ స్థానం ఆయనదే.ద్వితీయ స్థానమైనా, అది అద్వితీయం. దేశభక్తి, ప్రభుభక్తి నింపుకొని రాజకీయాల్లో కొనసాగారు. మాటలతూటాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడినా, వారిపై రవ్వంత ద్వేషభావం ఉండేది కాదు. ఆ సమయంలో వారికి కోపం వచ్చినా, ఆయన పట్ల ఎటువంటి వైరత్వం ఉండేది కాదు. సహజంగానే ఆయనకు ఎవరిపైనా శత్రుత్వం ఉండదు. ఈ భూమిపై శత్రువులు లేకుండా ఎవ్వరూ ఉండరు. ‘అజాతశత్రువు’ అంటే శత్రువులు లేకుండా ఉండడం కాదు, శత్రుత్వం అనే భావన పుట్టుకతో లేకపోవడమే అజాతశత్రుత్వం. ఆ సుగుణాన్ని పుణికిపుచ్చుకున్నవాడే ‘అజాతశత్రువు’. రోశయ్య ఆ కోవకు చెందినవాడు. టంగుటూరి ప్రకాశంపంతులు,ఎన్ జి రంగా వంటి ఆదర్శనాయకులతో తిరిగిన అనుభవం ఆయనది. ఎన్ జి రంగాకు ప్రియశిష్యుడు కూడా. అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, వై ఎస్ రాజశేఖరరెడ్డి వంటి హేమాహెమీలతో మెలిగిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. వీరంతా విభిన్నమైన మనో ప్రవృత్తి కలిగినవారు. వారందరినీ తట్టుకొని నిలబడ గలిగిన చతురుడు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కూడా ఎంతగానో మెప్పించిన తీరు రోశయ్యది. రెండవసారి కూడా గవర్నర్ గా పదవీ కాలాన్ని పెంచాలని జయలలిత వంటి నేత అనుకున్నదంటే అది రోశయ్యకే సాధ్యమైంది. బిజెపి ప్రభుత్వం రావడం వల్ల అది జరగలేదు కానీ, లేకుంటే తప్పకుండా రెండు పర్యాయాలు వరుసగా తమిళనాడు గవర్నర్ గా చరిత్ర సృష్టించి ఉండేవారు. అంతమంది ముఖ్యమంత్రులు, అటువంటి నేతలతో శభాష్ అనిపించుకోవడం వెనకాల కేవలం లౌక్యం మాత్రమే పనిచేసిందనుకోరాదు. కేవలం ‘ఎస్ బాస్’ ధోరణి కూడా కాదు. అందరికీ తలలో నాలుకలా మెసలుతూనే, ఎప్పుడు ఏమి చెప్పాలో అది చెబుతూ, అనవసరమైన వాటిని నిద్వంద్వంగా ఖండిస్తూ ముందుకు సాగేవారు. పదహారు విడతల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రతిపాదనలు చేసిన సుదీర్ఘ అనుభవం కేవలం ఆయన సొత్తు.
Also read: అజాత శత్రువు, అపరచాణక్యుడు రోశయ్య
మాటల మాంత్రికుడు
ఎన్టీఆర్, చంద్రబాబు వంటి నాయకులను కూడా మాటలతో ఆడుకున్న వైనం ఆయనది. 2009 సెప్టెంబర్ 2వ తేదీ నాడు వై ఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఆచూకి తెలియక యంత్రాంగం కొట్టుమిట్టాడుతునప్పుడు ఆన్నీ తానై ప్రభుత్వ వ్యవస్థను నడిపిన ధీశాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమీర్ పేటలోని భూమి వ్యవహారంలో ఆరోపణలు వచ్చినా, తర్వాత కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి, ఆయన పరువు నిలబెట్టింది. ఆర్ధిక మంత్రిగా ప్రసిద్ధికెక్కినా అనేక శాఖలు నిర్వహించారు. ఆయన జీవితంలో కష్టమైన రోజుల గురించి చెప్పాలంటే అది ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలమే. రెండవ స్థానంలో ఎంతో విజయవంతమైన ఆయన ప్రథమ స్థానంలో రాణించలేకపోయారు. మారిన రాజకీయ సంస్కృతి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం మనలేక పొయ్యారు. ముఖ్యమంత్రి పదవిని ముళ్లకిరీటంగానే భావించుకుంటూ వచ్చారు. ఆ పదవి నుంచి దిగిపోయి గవర్నర్ గా పనిచేసినంతకాలం ఎంతో హాయిగా ఉన్నారు. కష్టపడి, తెలివిని నమ్ముకొని, ఓర్పు, సహనం పాటిస్తూ పైకొచ్చారు. ఎదగడం, ఒదగడం రెండూ తెలిసిన ప్రాజ్ఞుడు. బలహీనతల మధ్య నడుస్తూ బలాన్ని పెంచుకున్న సాహసి. సంఖ్యాబలం లేని సామాజిక వర్గం నుంచి వచ్చి రాజకీయాల్లో రాణించిన ఘనత ఆయనది. సంపన్న కుటుంబ నేపథ్యం కూడా ఉన్నవాడు కాదు. అంతా రెక్కల కష్టం, లెక్కల కష్టం. 90ఏళ్ళ వయస్సుకు చేరువవుతున్న తరుణంలో తనువు చలించారు. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని సంపూర్ణం, పరిపూర్ణం చేసుకున్న భాగ్యశాలి. రోశయ్య నిష్క్రమణతో తెలుగు రాజకీయల్లో పెద్దదిక్కు వెళ్లిపోయింది.
Also read: జేబులో మహాప్రస్థానం, తిరుపతిలో ఆవిష్కరణ