- కోవిద్ మహమ్మారి స్వైరవిహారంలోనూ సర్జరీలు చేసిన వైద్యుడు
- డెంటల్ సర్జన్ల భౌతిక సమావేశంలో పలువురి ప్రశంసలు
ఓరల్ అండ్ మాక్సిలోఫేసియల్ సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజి ఆధ్వర్యంలో రెండు రోజుల ప్రత్యక్ష సభ నిర్వహించింది. కోవిద్ మహమ్మారి వచ్చిన తర్వాత పరోక్షంగా ఆన్ లైన్ సభలు నిర్వహించడం పరిపాటి. కానీ ప్రత్యక్షంగా ఆఫ్ లైన్ సభను నిర్వహించిన దంతవైద్యులు చరిత్ర సృష్టించారు. కోవిద్ విజృంభించి ప్రజలను బెదరగొడుతున్న కాలంలో సైతం సర్జరీలు చేసి డెంటల్ సర్జెన్లు చాలామంది బాధితులకు సేవలందరించారని అసోసియేషన్ అధ్యక్షుడు బూరా నందగోపాల్ తన సహచరులను అభినందించారు. ఇది ఇండియన్ ఓరల్ అండ్ మాక్సిలోఫేసియల్ సర్జన్స్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ఆరవ మహాసభ.
కోవిడ్ పాండెమిక్ విశృంఖలంగా ఉన్న రోజుల్లో కూడా తెలంగాణలో డెంటల్ సర్జన్లు శస్త్రచికిత్సలు నిర్వహించడం వృత్తిపట్ల వారికి ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తున్నదని నందగోపాల్ వ్యాఖ్యానించారు. సర్జన్లు 57 పత్రాలను సమర్పించారనీ, అవి కాకుండా 36 పత్రాలను సభలలో అందజేశారనీ ఆయన తెలియజేశారు.
డాక్టర్ బొట్టు చంద్రకాంత్ ను ఈ సందర్భంగా డెంటల్ సర్జన్లు అందరూ కలసి ఘనంగా సన్మానించారు. కోవిడ్-19 స్వైరవిహారం చేస్తున్న రోజుల్లో సైతం డాక్టర్ చంద్రకాంత్ ప్రమాదాలలో గాయపడినవారికి సర్జరీ చేశారనీ, కోవిద్ బారిన పడకుండా ప్రజలకు నివారణకోసం మందులు కూడా సరఫరా చేసి నానావిధాలుగా ఆయన సేవలందించారనీ కొనియాడారు.
‘మాస్క్ తీయండి. నోరు తెరవండి,’ అంటూ రోగులకు చెప్పేది డెంటల్ సర్జన్లు మాత్రమేననీ, కరోనా సమాజాన్ని వణికుస్తున్న సమయంలో ఎవరినైనా నోరు తెరవమని అడగడం సాహసమేననీ డాక్టర్ చంద్రకాంత్ తన సన్మానానికి సమాధానం చెబుతూ వ్యాఖ్యానించారు. వైద్య విద్యార్థులు కేవలం తరగతి గదులలో బోధనలకు పరిమితం కాకుండా సమాజం కష్టాలలో ఉన్నప్పుడు పని చేస్తున్న వైద్యులను చూసి నేర్చుకోవలసింది చాలా ఉన్నదని డాక్టర్ చంద్రకాంత్ అన్నారు.