- ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయన్నది ముఖ్యం
- ఎన్నికల కమిషన్ పనితీరు ప్రధానం
- అభ్యర్థుల నైతిక విలువల స్థాయి కీలకం
- పార్టీల ప్రజాస్వామ్య స్పృహ నిర్ణాయకం
డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు
ప్రజాస్వామ్యానికి మూలం ‘వియ్ ద పీపుల్ (We, the people)’ అనే ఆలోచన. ఈ ఆలోచనని ఆచరణలో పెట్టే విధానాన్ని ఎన్నికలంటాం. ప్రజాభిప్రాయం ప్రకారం, ప్రజల కోసం, ప్రజల చేత పరిపాలన జరగడం కోసమే ఎన్నికలనే ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా ప్రజాప్రతినిధులని గుర్తించడంలోనే ఉంది మజా. ఇదే కీలకం. ఆ విధంగా చట్టసభలు ఏర్పడటం, చట్టాలు చేయడం, వాటి అమలు ద్వారా పరిపాలన సాగడంతోనే ఎన్నికల పరమార్థం నెరవేరుతుంది. అదే ప్రజాస్వామ్యం. అప్పుడే ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, భవిష్యత్ కోసం కృషి పక్షపాతం లేకుండా జరుగుతుందని నమ్మకం. అప్పుడే ఎన్నికలు సార్థకం అయినట్టు. అందుకోసమే మన రాజ్యాంగం 1950లో అందరికీ హక్కులు కలుగజేసే ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులదే పరిపాలన బాధ్యత అని చెప్పడం జరిగింది. ఈ విషయం 320వ అధికరణలో స్పష్టంగా ఉంది. అందుకోసం ఒక స్వతంత్ర వ్యవస్థని పొందు పరిచారు. అదే భారత ఎన్నికల కమిషన్ (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా). ఈ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తితో, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్దేశించారు. అయితే, ఎన్నికలు ఏ విధంగా జరపాలనేది ఎన్నికల కమిషన్ బాధ్యత. దానికి ప్రభుత్వం సహకరించాలని మాత్రమే రాజ్యాంగం చెబుతోంది. ఒక విషయంలో మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో ఆలోచించారని భావించాలి. రాజకీయ పార్టీల గురించి కానీ, వాటి పాత్ర గురించి కానీ రాజ్యాంగంలో ఎక్కడా ఏ విధమైన ప్రస్తావనా లేదు. ఎన్నికలు ఎలా నిర్వహించాలన్నది క్లిష్టమైన ప్రశ్న. ప్రభుత్వాన్ని నడపాలంటే పార్టీలే నడపగలవనే దృష్టితో పార్టీలు ఎన్నికల ద్వారా రంగంలోకి వచ్చి ప్రభుత్వాన్ని అధీనంలోకి తీసుకున్నాయి.
పెద్దల స్వప్నం సాకారం కావాలి
మనకు 1947లో స్వాతంత్ర్యం రాకముందే ఎన్నో సంవత్సరాలుగా మన పెద్దలు దేశాన్ని గురించి ఎన్నో కలలు కన్నారు. ఏ విధంగా స్వతంత్ర దేశంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనలు చేశారు. ఒకరి ప్రతిపాదనలతో ఒకరు విభేదించారు కూడా. వివరంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అందుకనే మన రాజ్యాంగాన్ని అంత త్వరగా ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగంగా తయారు చేయగలిగారు. అంతే కాకుండా స్వతంత్ర్యం వచ్చిన మూడు సంవత్సరాలలోపే మనం మొదటి సార్వత్రిక ఎన్నికలు జరుపుకోగలిగాం. అందరికీ ఓటు హక్కు కల్పించాం. రాష్ట్రాలకు శాసనసభలూ, దేశానికి పార్లమెంటూ ఉండే విధంగా శాసనసభల, పార్లమెంటరీ నియోజకవర్గాలను ఏర్పాటు చేసుకున్నాం. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలో ఇది ఒక అబ్బురంగా భావించారు. మరి ఈ 73 (2019 వరకూ) సంవత్సరాలలో 17 ఎన్నికలు జరిగాయి. ఒక్కసారి తప్పితే అన్నిసార్లూ సరైన గడువు ప్రకారం జరగడమే కాకుండా అన్ని సార్లూ శాంతియుతంగా ఎన్నికలు జరిగాయి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి అధికారం శాంతియుతంగా బదిలీ కావడం కూడా ప్రజాస్వామ్య దేశాలలో విశేషంగా చెప్పవచ్చు. మన మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ 20 నెలలలోనే దేశాన్ని ఎన్నికలకోసం సమాయత్తం చేశారంటే ఆయన, ఆయనకు సహకరించిన తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎన్నికల ద్వారా దేశాభివృద్ధి జరుగుతుందనీ, దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందనీ అచంచల విశ్వాసంతో కృషి చేశారు.
1975లో ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించడం ఒక మచ్చగా మిగిలిపోయింది. అయితే, అప్పుడు కూడా ఆత్యయిక పరిస్థితిని అంతం చేసి ఎన్నికలు జరిపించాలని నిర్ణయించినప్పుడు ఆ ఎన్నికలు పద్ధతిగా, శాంతియుతంగా జరిగాయి. ఆ తర్వాత వచ్చిన మొరార్జీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ దేశంలో ఆత్యయిక పరిస్థితి ప్రకటించే అవకాశం లేకుండా 1978లోనే రాజ్యాంగ సవరణ చేసింది. ఈ విషయంలో గత చరిత్ర గర్వించదగినదే. అయితే, మరి 17 సార్లు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ప్రభుత్వాలు ఉన్నా దేశ అభివృద్ధి విషయంలోనే కాక, రాజ్యాంగంలో ప్రతిపాదించిన చాలా విషయాలలో ఎందుకని ప్రగతి సాధించలేకపోయింది? అనుకున్న మార్పును ఎందుకు తీసుకొని రాలేకపోయాం? ఈ విషయం ఆలోచిస్తే ఆశించినదొకటి జరిగినది మరొకటా అనిపిస్తుంది. ఎందుకని? ఎన్నికలలో మనం సరైన ప్రజాప్రతినిధులని ఎన్నుకోలేకపోవడమే ప్రధాన కారణం. అంతేగాక, ఎన్నికలలో పెడపోకడలకు కారణం రాజకీయ పార్టీలు, వాటి నాయకులు దూరదృష్టి లేకుండా వ్యవహరించడమేనని చెప్పాల్సి వస్తుంది.
స్త్రీల విషయంలో ఎన్నో ప్రశ్నలు!
కడచిన 73 సంవత్సరాలలో దేశం ప్రగతిపథంలో ముందుకు సాగలేదని కాదు. అనేక రంగాలలో ప్రాథమిక వసతులు నిర్మించుకున్నాం. ఐఐటీ, ఐఐఎం వంటి అత్యున్నత శ్రేణికి చెందిన విద్యాసంస్థలూ, సాంకేతిక విద్యాసంస్థలూ నెలకొల్పుకున్నాం. అవి ఎన్నో అద్భుతాలను సాధించాయి. ప్రపంచంలో భారతీయులు ఎవ్వరికీ తీసిపోరని నిరూపించాయి. అయినా, పేదరికంలో మగ్గుతున్న దేశంగా గుర్తింపు పోవడం లేదు. ఆర్థిక వ్యత్యాసాలు ఇంకా పెరిగాయి. సామాజిక అభివృద్ధి విషయంలో, ముఖ్యంగా స్త్రీల విషయంలో ఎన్నో ప్రశ్నలు. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మనం ఆశించిన సంస్కరణలను ఎందుకు సాధించలేకపోతున్నారు? మన ఎన్నికలలో, ప్రజాప్రతినిధులని ఎన్నుకోవడంలో మార్పు ముఖ్యమని గుర్తించాలి. అవినీతి ఎందుకు పెరిగింది? నిత్యాసర వస్తువులు అందుబాటులో లేకుండా ఎందుకు పోయాయి? ఎన్నికలలో డబ్బు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అవినీతి అంత ఎక్కువ పెరిగింది. ప్రజలు లంచం కూడా అంతే ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని అర్థం అవుతోంది. వీటన్నిటికీ ప్రధాన కారణం ఓటర్లు ప్రజాప్రతినిధులను కాకుండా పార్టీ ప్రతినిధులను ఎన్నుకోవడం. ఎందుకంటే పార్టీలు నిర్ణయించే అభ్యర్థులే ఎక్కువగా ఎన్నికవుతున్నారు. అయితే, ఎన్నికైనవాళ్ళని గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. గెలిచిన వాళ్ళలో ఎక్కువమంది కోటీశ్వరులే కాదు, స్థానికేతరులు, వాళ్ళలో చాలామంది క్రిమినల్ చరిత్ర ఉన్నవాళ్లే. అయితే, అట్లాంటివాళ్ళనే పార్టీలు నిలబెడుతున్నాయి వాళ్ళయితేనే ఎన్నికవుతారనే భావనతో. ఇంకొక విషయం ఏమిటంటే ఒక్కొక్క నియోజకవర్గంలో అభ్యర్థుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది గత నలభై సంవత్సరాలలో. దీనివల్ల గెలిచినవాళ్ళకి 25 లేదా 30 శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయి. అంటే, గెలిచిన అభ్యర్థికి సగానికిపైగా ఓట్లు రావడం లేదు. దీనికి కారణం పోటీ చేస్తున్న పార్టీల సంఖ్య కూడా బాగా పెరిగిపోవడం. ఎన్నికల కమిషన్ ఎక్కువ పార్టీలకు ఎన్నికలలో పోటీకి అనుమతి ఇవ్వడం. ఓటు హక్కు వినియోగానికి అర్హతను 18 సంవత్సరాలకు తగ్గించిన తర్వాత గూడా 35 సంవత్సరాల కిందట ఎక్కువ మంది మగాళ్ళు, సగంమందికి పైగా మహిళా ఓటర్లే అయినా వాళ్ళు అభ్యర్థులలో 15 శాతం మంది కూడా ఉండరు. మొత్తం మీదికి మన ఎన్నికల వ్యవస్థలో మహిళలకు శాపవిముక్తి లేదా అనిపిస్తున్నది.
గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి
ఎన్నికలలో రాజకీయ పార్టీలూ, అభ్యర్థులూ ఓటు అడిగే పద్ధతిలో మార్పు రానంతవరకూ ఎన్నికల ద్వారా మన ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమే. ముఖ్యంగా ఎన్నికలు సామరస్యంగా జరగాలి. గెలుపు-ఓటములను సమానంగా స్వీకరించాలి. ఎన్నికల తర్వాత విజేతలూ, పరాజితులూ కలసి పని చేయడం ప్రజాస్వామ్య సంస్కృతి. అప్పుడే మన శాసనసభల ద్వారా, ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరుగుతుంది.
ఎన్నికల ప్రక్రియ కలుషితం అవుతొంది ఇలా…
ముఖ్యంగా రాజకీయ పార్టీలూ, అభ్యర్థులూ ఎన్నికల్లో చేసే ప్రచారం, దాని పద్ధతి, ప్రచార సాధనాలు, టెలివిజన్ చానళ్ళు, వాటి విధానాలు ఎన్నికలని కలుషితం చేయడమే కాకుండా క్రమంగా ఎన్నికలు పెనుభారంగా తయారైనాయి. అభ్యర్థుల విషయంలోనే కాక ఎన్నికల్లో ఖర్చు రాను రాను పెరిగిపోవడమే కాక ఎన్నికలు సామాన్యులకు కాకుండా ధనికుల ఆటగా రూపొందాయి. ఖర్చు పెరిగిన కొద్ది ఆ డబ్బుకోసం బయటివారిపైన ఆధారపడటం కూడా పెరిగిపోయింది. అట్లా ఖర్చు పెరిగిపోయి బయటినుంచి వచ్చే డబ్బుపైన ఆధారపడటం పెరుగుతోందంటే గెలిచినవాళ్ళు ఎవరికి సేవ చేస్తారు? ఎవరికి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు? డబ్బిచ్చినవారికే కదా! ఆ విధంగా ఎన్నికలు వ్యాపారస్థులపరం అయ్యాయి. నియోజకవర్గంపైన, ప్రజల సంక్షేమంపైన ప్రజాప్రతినిధుల దృష్టి తగ్గింది. దీనివల్ల ఎన్నికల ప్రచార ధోరణే మారిపోయింది. ఒకరినొకరు తిట్టుకుంటూ, శత్రువులలాగా పోరాడుకుంటూ బాధ్యతారహితంగా వ్యవహరించడంతో ఎన్నికలు విఫలం అయ్యాయి. ఆ తర్వాత ఓటర్లని ఏదో ఒక విధంగా ఆకర్షించడానికి ఎన్నోరకాల ఉచితాలు ఇవ్వజూపడమే కాకుండా ఓట్లను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడం సర్వసాధారణమైపోయింది. ఓటుకి రెండువేల రూపాయలతో మొదలై ఇరవై వేల రూపాయలవరకూ వెళ్ళిందని అంటున్నారు. ఇటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షించగలవు? గెలిచినవాళ్ళని ప్రజాప్రతినిధులు అనవచ్చా? ఏ కొద్దిమందో తప్ప మిగతావారిని ప్రజాప్రతినిధులు అనడం సమంజసం కాదు.
నిస్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతున్నాయా?
అధికారంలో ఉన్న పార్టీలు, వాటి అభ్యర్థులు ఎన్నికలలో ఓటరుని ప్రభావితం చేయడంకోసం ఎన్నోరకాల అనుచితాలకి దిగజారడం చూస్తున్నాం. ఎన్నికలు నిస్పక్షపాతంగా, స్వతంత్ర సంస్థ ద్వారా జరుగుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఈ విధంగా జరిగితే ఎన్నికల వల్ల ప్రజలకు కష్టనష్టాలే మిగిలిపోతాయి. అందుకే నేను ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల జాబితాలో భారత దేశాన్ని ఒక ప్రశ్నార్థకంగా పరిగణిస్తున్నాను. మన రాజ్యాంగంలో ఊహించనివిధంగా ఎన్నికలు తయారైనాయి. ఓటు అడిగే విధానం, ఓటు వేసే కారణాలు మారనంతవరకూ దేశ భవిష్యత్తు గురించి గొప్పగా ఏమి ఆశించగలం?
ప్రభుత్వంలో వివిధ ఉన్నత పదవులలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన 120 మంది ప్రముఖులు 2020లో రాష్ట్రపతికి ఒక వినతిపత్రం సమర్పించారు. తర్వాత వినతిపత్రాన్ని పుస్తకంగా ప్రచురించారు. అంతకు ముందు నేను ‘నెక్స్ట్ బెటర్ గేమ్ చేంజర్ ఇన్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా’ అనే పుస్తకం ప్రచురించాను. ఈ రెండు పుస్తకాలూ దేశంలో ఎన్నికల కమిషన్ పనిచేస్తున్న విధానం స్వతంత్రంగా, నిష్కర్షగా లేకపోగా అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థుల విజయానికీ ఏ విధంగా గత రెండు ఎన్నికల్లో తోడ్పడిందో ఉదాహరణలతో సహా వివరించాను. అయినప్పటికీ, ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వం కానీ ఏ జాగ్రత్తలూ తీసుకోలేదు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అధికార దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో 1978లోనే కొన్ని మార్పులు తీసుకువచ్చారు. అయినా కానీ 2019 ఎన్నికలలో ఎన్నికల కమిషన్ అధికారాలను ఏ విధంగా దుర్వినియోగం చేసిందో చూశాం. అట్లాగే సుప్రీంకోర్టు కూడా ఈ అధికార దుర్వినియోగం విషయంలో స్పందించలేదు. ఎన్నికల బాండ్ల ద్వారా రూ. 2500 కోట్లు సమీకరించి ఎవ్వరికీ తెలియనీయకుండా, వివరాలు అడిగినా చెప్పకుండా ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఎన్నికలలో గెలవడానికి చేయని అక్రమం అంటూ లేదనేది బహిరంగ రహస్యం. ఇదే విధంగా ముందుముందు ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్య దేశంగా భారత్ పరిగణించబడుతుందా అన్నది సందేహాస్పదం.
ఎన్నికలంటే వేలకోట్ల ఖర్చు
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత విషమించిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికలకు ఇంకా చాలా ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తున్నామంటే ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుసుకోవచ్చు.
దేశంలో ఎన్నికలు స్వతంత్రంగా, నిస్పక్షపాతంగా జరగకపోవడం వల్ల ప్రజాప్రతినిధుల పోకడలు, శాసనసభల్లో తమకున్న మెజారిటీని ఉపయోగించి చేస్తున్న ప్రజావ్యతిరేక చర్యలూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పెడ ధోరణులను సరిదిద్దకపోతే దేశ అభివృద్ధి మిథ్య, గాలిబుడగ, మాయాబజార్ చందంగా ఉంటుంది. ఎన్నికల వ్యవస్థని, ఎన్నికల పద్ధతులను సరిదిద్దకుండా మన రాజ్యాంగంలో మన దేశ నిర్మాతలు ఆశించిన, ఊహించిన దానికి విరుద్ధంగా జరిగే ప్రమాదం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది.
పది ముఖ్యమైన సూచనలు
ఎన్నికలు జరిగే విధానాన్ని, పద్ధతులని, ఎన్నికల ప్రచార ధోరణిని మార్చాలి. ఇందుకోసం ముఖ్యమైన నిర్దిష్టమైన చర్యలు అవసరం. అటువంటి పది ముఖ్యమైన చర్యలను ఇక్కడ ప్రస్తావిస్తాను:
- ఎన్నికలని సామరస్యంగా, కలసి పనిచేసే ఉద్దేశంతో ఆలోచించి అమలు చేయగలిగినప్పుడే ఆశించిన ఫలితాలు సాధించగలం. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. అప్పుడే మన పరిపాలన విధానంలో మార్పులు ఆశించవచ్చు. అప్పుడే మన దేశ భవిష్యత్తు, అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది. అయితే, ఈ మార్పు ముందు మన రాజకీయ నాయకులలో రావాలి. ఎన్నికలు ఏ విధంగా జరగాలన్నది మన రాజ్యాంగం నిర్వచించలేదు. ఎన్నికల కమిషన్ నిస్పక్షపాతంగా వ్యవహరించగలిగినప్పుడే, అధికార పార్టీకీ, ఆ పార్టీ అభ్యర్థులకు ప్రయోజనం కలిగే విధంగా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వ్యవహరించనప్పుడే ఇది సాధ్యం. ఎన్నికల కమిషన్ కు రాజ్యాంగం అప్పజెప్పిన బాధ్యత అది. ఈ విషయాన్ని గత పది సంవత్సరాలలో సుప్రీంకోర్టు రెండు, మూడు సందర్భాలలో గుర్తు చేసింది కూడా.
2.ముందుగా ఎన్నికలలో ఎంత తక్కువ ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులను ఎన్నుకోగలమో చూడాలి. అన్ని పార్టీల నాయకులూ కలసి, కూర్చొని తీర్మానించినప్పుడే అది సాధ్యం. లేకపోతే ప్రతి ఎన్నికలో పెట్టే ఖర్చు అంతులేని విధంగా పెరిగిపోతూ ఉంది.
3.నియోజకవర్గంలో అభ్యర్థులు స్థానికులు అయినప్పుడే ఎన్నికలలో సానుకూలమైన మార్పులు మొదలవుతాయి. ఎన్నికలలో అయ్యే ఖర్చును స్థానికులే భరించాలి. బయటివాళ్ళ డబ్బు ఏ రూపంలోనూ రాకూడదు. అట్లా జరగాలంటే నియోజకవర్గం అభ్యర్థులు అందరూ కలిసి ఓటర్లని అభ్యర్థించవచ్చు. కలిసి ప్రచారం చేసుకోవచ్చు గదా.
4. ఎవరికి వాళ్ళు ప్రచారంలో వ్యక్తిగత దూషణకే పరిమితం అవగూడదు. అట్లా కాకుండా ఎన్నికల్లో అభ్యర్థులు నియోజకవర్గానికి ఏ విధంగా నిధులు సమకూర్చుతారు, ఎట్లా అభివృద్ధి చేయదలిచారు అనే విషయాలకే పరిమితమై మాట్లాడాలి. ఎందుకు తమకు ఓటు వేయాలనే విషయం వివరించేందుకు మాత్రమే అభ్యర్థి ప్రచారం పరిమితం కావాలి. అభ్యర్థులందరూ కలిసి కనీసం రెండు, మూడు సార్లయినా ప్రజల ముందుకు రావాలి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. అప్పుడే ఎన్నికల్లో ఖర్చు తగ్గించవచ్చు. అప్పుడే సామాన్యులు కూడా ఎన్నికలలో పాల్గొనవచ్చు. కోటీశ్వరుల అవసరం ఉండదు. కండబలం ఉన్నవారు కాకుండా సేవాభావం దండిగా ఉన్నవారే అభ్యర్థులుగా రంగంలో దిగాలి.
5. ఎన్నికలలో పోటీ చేసే పార్టీలు, అభ్యర్థుల సంఖ్యని తగ్గించాలి. మూడు లేదా నాలుగు బదులు 10 లేదా 15 మంది అభ్యర్థులు పోటీ చేయడం వల్ల ఎన్నికల్లో మూడోవంతు ఓట్లు వచ్చినవాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు.
6. ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని నివారించాలి. ఎన్నికల సందర్భంగా కాంట్రాక్టర్లూ, కార్పొరేట్ల దగ్గరి నుంచి డబ్బు తీసుకునే అలవాటుకు స్వస్తి చెప్పాలి. అప్పుడే ఓటర్లకి డబ్బు ప్రలోభాన్ని నివారించగలం. ఈ విషయంలో అధికారంలో ఉన్న పార్టీలు, వాటి అభ్యర్థుల మీద బాధ్యత ఎక్కువగా ఉంది. ఇందుకు అనుకూలంగా ప్రస్తుతం కొన్ని చట్టాలు, ప్రభుత్వ నిర్ణయాలు మార్చాలి.
7. ఎన్నికల కమిషన్ నియమావళిని రెండు సార్ల కంటే ఎక్కువగా ఉల్లంఘించినవారు అభ్యర్థిత్వం కోల్పోయే విధంగా నియమం పెట్టుకోవాలి. నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ ఖర్చు పెడితే ఏ విధంగా అనర్హులవుతారో, ఎన్నికల కమిషన్ కోడ్ ను ఉల్లంఘించినవారు సైతం అదే విధంగా అనర్హులు కావాలి.
8. ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఇతర పార్టీలు, స్వచ్ఛందసంస్థల ప్రమేయం కూడా ఉండాలి. అప్పుడే ఎన్నికల కమిషన్ నిస్పక్షపాతంగా పని చేయగలదు. అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థగా పని చేయాలి. దీనికి సుప్రీంకోర్టు ఒక పర్యవేక్షక సమితిని పార్టీల ప్రమేయం లేకుండా నియమించాలి.
9. అసెంబ్లీకి కానీ లోక్ సభకి కానీ ఎన్నికలు ఒకటి, రెండు దఫాలుగానే జరగాలి. అయిదు నుంచి ఎనిమిది దఫాలు కాదు. 15 నుంచి 35 రోజుల్లో కాదు. ఇంతకు ముందు ఎన్నికల ప్రక్రియను మూడు దఫాలలో పూర్తి చేయగలిగినప్పుడు ఇప్పుడు మనం ఒకే రోజులో పూర్తి చేసుకోగలగాలి. అందుకు సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీలు తమ అభ్యర్థుల అధికార దుర్వినియోగాన్ని తగ్గించవచ్చు. ఎన్నికల ప్రక్రియ మొత్తం – ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ల పర్వం, ప్రచారకాండ, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన- రెండు లేదా మూడు వారాలలో ముగిసిపోవాలి. ఇప్పుడు అది సాధ్యమే. ప్రచారానికి ఆరు రోజుల కంటే ఎక్కువ ఎందుకు? ప్రచార, ప్రసార సాధనాల ద్వారా ఓటర్లని ఓట్లు అభ్యర్థించడానికి మూడు రోజుల వ్యవధి చాలు. కొన్ని మారుమూల నియోజకవర్గాలను మినహాయిస్తే అంతకంటే వ్యవధి ప్రచారానికి అనవసరం.
10. అట్లాగే, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు చిహ్నాలు 2024లో అవసరం ఉన్నదా? 1952లో చిహ్నాలు కావాల్సి వచ్చాయి. ఇప్పుడు అవసరమా? ఈ ఎన్నికల చిహ్నాల వల్ల అభ్యర్థుల ప్రతిభ, ప్రత్యేకతకి ప్రాముఖ్యం లేకుండా పోయింది. ఈ అలవాటు ఇప్పుడు మారాలి. అప్పుడే పార్టీల మాయాజాలం నుంచి బయటపడగలం. బయటపడడం చాలా అవసరం.
ఎన్నికలు దైవాధీనం కాదు
ఎన్నికలు దైవాధీనాలని ఇప్పటికీ కొంతమంది భావిస్తున్నారు. చాలామంది పార్టీలతో, కార్యకర్తలతో సంబంధం లేని లాభార్జన దృష్టిలో ఎన్నికల ప్రవీణులను (మేనేజర్లని) ఆశ్రయించడం చూస్తున్నాం. అందుకే ప్రశాంత్ కిశోర్ లాంటి వాళ్ళ గిరాకీ పెరిగింది. ఎన్నికలంటే మేనేజ్ చేయడమనీ, లెక్కల గోల్ మాల్ అనీ అర్థం చేసుకుంటున్నారు. ప్రజలను ప్రజాప్రతినిధులు ఎట్లా అర్థం చేసుకుంటారు, వారి అవసరాలు ఎలా తీర్చుతారు అనే విషయాలతో సంబంధం లేకుండా డేటానే సర్వం అన్నట్టు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్ర, వాటి బాధ్యతలను పూర్తిగా విస్మరించడమే అవుతుంది. దేశ భవిష్యత్తునూ, ప్రజాస్వామ్య మనుగడనూ పట్టించుకునేవారంతా ఆలోచించవలసిన విషయం ఇది. ఇప్పుడు పట్టించుకోకపోతే ఆనక విచారించవలసి వస్తుంది.
కంప్యూటర్ వల్ల, ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో పడే ప్రతి అడుగూ అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఎవరు ఎట్లా ఓటు చేశారో తెలుసుకునేందుకు వీలుంది. నియోజకవర్గం స్థాయిలో మాత్రమే కాదు బూతు స్థాయిలో ఎవరు ఎట్లా ఓటు చేశారనే వివరాలు ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికల కమిషనే స్వయంగా అందజేస్తోంది. ఈ లెక్కల వివరాలు ఉపయోగించడం నాయకులకు చేతకాక కన్సల్టెంట్ల కోసం వెతుకుతున్నారు. నా ఉద్దేశంలో ఇది బాధ్యతారాహిత్యం.
సుకుమార్ సేన్ స్ఫూర్తి
మొట్టమొదటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ ఏ విధంగా ఎన్నికల చరిత్రను ఆరంభించారో, అదే విధంగా, అదే ధైర్యంతో కొత్త ఆలోచనలతో ఎన్నికల పద్ధతులను ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంలో ఎన్నో టెక్నాలజీ విజయాలు తోడ్పడతాయి. లోక్ సభ, శాసనసభ ఎన్నికల వైశిష్ట్యాన్ని పోగొట్టకుండా రెండిటికీ ఒకేసారి ఎన్నికలు జరిపించాలి. మొత్తం ఎన్నికల ప్రక్రియను 15-20 రోజుల్లో పూర్తి చేయాలి. అట్లాగే పార్టీలూ, అభ్యర్థులు కలసి ఉమ్మడిగా ప్రచారం చేసే విధానాన్ని రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టాలి. దీనికి అనుగుణంగా ఓటర్లని ప్రభావితం చేయడానికి తీసుకోవలసిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికలు మన ప్రజాస్వామ్య అవసరమే కాకుండా మన అభివృద్ధికీ, భవిష్యత్తుకూ కీలకం. ఈ కొత్త విధానాన్ని బాలకులకు తెలిసే విధంగా హైస్కూల్స్ లో మాక్ ఎలక్షన్ తరహాలో నిర్వహించాలి. అభ్యర్థులందరూ కలసి ప్రచారం చేసే ధోరణిని ప్రోత్సహించాలి. అప్పుడే మన ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం ప్రసాదిస్తుంది. ఈ మార్పులన్నీ రాబోయే అయిదారు ఎన్నికలలో జరగాలి. అందుకే ఇరవై, ముప్పై సంవత్సరాలలో, అంటే మన రిబప్లిక్ నూరేళ్ళ వయస్సులోకి వచ్చే సరికి 2050 నాటికి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా కళకళలాడుతూ వర్థిల్లాలి. ఇప్పటి నుంచే మన పిల్లలని అందుకు సమాయత్తం చేయాలి.