కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పడుతోందని అనుకుంటున్న వేళలో డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి కూడా ప్రారంభమైంది. ఇప్పటి వరకూ మనల్ని డెల్టా వేరియంట్ వెంటాడింది. ఆ వేట పూర్తిగా ముగియక ముందే శాస్త్రవేత్తలు ఊహించినదాని కంటే ముందుగానే డెల్టా ప్లస్ వ్యాప్తి కూడా ప్రారంభమైంది. ఇప్పటివరకు ఈ కొత్త రకం వైరస్ 11 రాష్ట్రాలకు వ్యాపించిందని అంటువ్యాధుల నివారణ కేంద్రం డైరెక్టర్ సుజిత్ కుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో తొలి డెల్టా ప్లస్ కేసు తిరుపతిలో నమోదైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మీడియాకు తెలిపారు.
Also read: కశ్మీర్ మంచు కరిగేనా?
దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ కేసులు 48
అయితే, డెల్టా ప్లస్ సోకిన వ్యక్తికి చికిత్స కూడా పూర్తయిందని, బాధితుడి నుంచి ఎవరికీ వ్యాప్తి చెందలేదని మంత్రి స్పష్టం చేయడం కాస్త ఊరటనిచ్చే అంశం. మన దేశంలోని 18 జిల్లాల్లో ఈ రకం కేసులు 48 ఉన్నాయని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ ప్రకటించారు. బ్రిటన్ రకం కన్నా ఇది బలమైందని అంటున్నారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం దీని ప్రథమ లక్షణం. దీని వల్లనే మూడో వేవ్ వస్తుందని చెప్పడం తొందరపాటేనని కొందరు నిపుణులు అంటున్నారు. వైరస్ ఉత్పరివర్తనలకు ( మ్యుటేషన్స్) గురికావడం సాధారణమైన ప్రక్రియగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే అనేక రకాలు వచ్చాయి. భవిష్యత్తులో ఇంకా కొన్ని రకాలు రావచ్చు. ఈ మార్పులను నియత్రించడం మన చేతిలో లేదు. జాగ్రత్తలు పాటించడం, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడం, చికిత్సా సదుపాయాలు, సిబ్బందిని సమృద్ధిగా సిద్ధం చేసుకొని ఉండడం మన చేతుల్లో ఉన్న పనులు, చేపట్టాల్సిన చర్యలు. ఎన్ని రకాలు వచ్చినా నియంత్రించుకొనే శక్తి, మానసికంగా సిద్ధపడడం ముఖ్యం. డీలా పడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి నిబంధనలు కూడా అత్యంత కీలకమైనవి. ఇప్పుడిప్పుడే నిబంధనలను సడలించుకుంటున్నాం. మూడో వేవ్ రాకముందే డెల్టా ప్లస్ వచ్చి మీద పడడంతో, లాక్ డౌన్ / కర్ఫ్యూ వ్యూహాలను మళ్ళీ అమలుచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డెల్టా ప్లస్ ను అధ్యయనం చేయడానికి పరిశోధనా బృందాన్ని కూడా మనం నిర్మించుకున్నాం. దానిపేరు ‘ఇండియన్ సార్స్ -కోవ్ -2 కన్సార్టియం ఆన్ జినోమిక్స్’.
Also read: రాజకీయం కాదంటే కుదురుతుందా?
అప్రమత్తంగా ఉండటమే రక్ష
డెల్టా ప్లస్ ను ఆందోళనకర రకంగా కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించిన నేపథ్యంలో, ఈ పరిశోధనా బృందం సమీక్షా సమావేశాలు జరుపుకుంటోంది. వీరి అధ్యయనం మేరకు అన్ని రాష్ట్రాలకు తగు సూచనలు అందుతాయి.అప్రమత్తంగా ఉండడమే మొదటి ఆయుధమని నిపుణులు చెబుతూనే ఉన్నారు.భారత్ లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్లపై పనిచేస్తాయని చెబుతున్నారు. స్పష్టత రావాలి.ఫైజర్ కూడా 90 శాతం సామర్ధ్యం కలిగివుందని అంటున్నారు. ఫైజర్ మనకు ఇంకా చేరాల్సివుంది. డెల్టా ప్లస్ వ్యాప్తి మొదలైన నేపథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి మూడు ప్రశ్నాస్త్రాలు సంధించారు. (1) ఈ వైరస్ ను గుర్తించి, వ్యాప్తిని అరికట్టేందుకు విస్తృత పరీక్షలు ఎందుకు నిర్వహించలేదు (2) ఈ వేరియంట్స్ పై వ్యాక్సిన్లు ఎంత సమర్ధంగా పనిచేస్తాయి, దీనిపై పూర్తి సమాచారం ఎప్పటికి తెలుస్తుంది (3) మూడో దశ ఉధృతిలో ఈ వేరియంట్ ను నియంత్రించేందుకు ప్రణాళికలేంటి. ఇవీ రాహుల్ ప్రశ్నలు. రాజకీయాలు, ఇగోలు ఎట్లా ఉన్నా, ఈ మూడు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలను త్వరితగతిన చెప్పడం కేంద్ర బాధ్యత. మహారాష్ట్రలో మరణాలు కూడా సంభవించినట్లు సమాచారం. వ్యాప్తిలో వేగం, తీవ్రత దృష్ట్యా ప్రభుత్వాలు మరింత శ్రద్ధగా, వేగంగా ముందుకు కదలాలి. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ధైర్యాన్ని నూరిపోయాలి. చికిత్సపై భరోసాను కల్పించాలి.ఒకనెల అటుఇటుగా మూడో వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అది వచ్చేలోపు వ్యాక్సినేషన్ అన్ని డోసులను పూర్తి చేసుకోవడం అత్యంత ముఖ్యం.సింగల్ డోస్ కలిగిన స్పుత్నిక్ వంటి వ్యాక్సిన్లు ఏమేమి ప్రపంచ మార్కెట్ లో ఉన్నాయో? తెలిసికొని, యుద్ధప్రాతిపదికన తెప్పించుకోవడం అత్యంత కీలకం.
Also read: దేశమంతటా రాజకీయాలాట!