- ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసుల మోహరింపు
- మెట్రోస్టేషన్ల మూసివేత
- నిఘా నీడలో ఎర్రకోట
సాగు చట్టాల రద్దుకోసం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం ఉధృతిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా రాస్తారోకోకు పిలుపునివ్వడంతో దేశ రాజధానిలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గణతంత్రదినోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాస్తారోకో సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 50 వేల మంది పోలీసులను సరిహద్దుల వద్ద మోహరించారు. ఇంకా అవసరమైతే అదనపు లగాలను మోహరించాలని యోచిస్తున్నారు. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాలలో డ్రోన్ల సహాయంతో భదత్రను పర్యవేక్షిస్తున్నారు. ఘాజీపూర్ సరిహద్దుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటర్ కెనాన్లను సిద్ధంగా ఉంచారు.
భద్రతావలయంలో ఢిల్లీ:
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా ఎర్రకోట వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎర్రకోటవైపు వచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాస్తారోకో దృష్ట్యా ఢిల్లీ వ్యాప్తంగా మెట్రో స్టేషన్లలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. నిరసన కారులను అడ్డుకునేందుకు బారికేడ్లు, ఇనుపకంచెలను ఏర్పాటు చేశారు. పరిస్థితులు అదుపుతప్పితే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లను సిద్ధంగా ఉంచారు.
Also Read: రైతుల ఆందోళనపై రాజ్యసభలో విపక్షాలు గరం గరం
మెట్రోస్టేషన్లు మూసివేత:
రాస్తో రోకో నేపథ్యంలో మండీ హౌస్, ఐటీఓ, ఢిల్లీ గేట్, యూనివర్శిటీ, లాల్ ఖిల్లా, జామా మసీదు, జనపథ్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లను మూసివేశారు. సింఘు, టిక్రీ సరిహద్దుల్లో భారీ భద్రతా బలగాలను మోహరించారు. దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు రహదారులను దిగ్బంధనం చేయనున్నారు. రాస్తారోకోలో భాగంగా అంబులెన్సులు, స్కూలు బస్సులు వంటి అత్యవసర సేవలకు ఆటంకాలు సృష్టించబోమని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. రాస్తారోకోను శాంతియుతంగా నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.