- కాలుష్యకాసారంగా మారిన దేశరాజదాని నగరం
- దిల్లీలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జలిమి వైఫల్యం
అది యావత్ భారతదేశానికి రాజధాని. నేడు కర్కశ కాలుష్యానికి నిశాని. రాజుల కాలం నుంచి వేల సంవత్సరాల చరిత్రకు సాక్షీభూతంగా నిలిచే మహానగరి. ఆకాశహర్మ్యాలు, విశాలమైన వీధులు, అధికారగణ పద ఘట్టనలు, రాత్రిపవలు తేడాలు లేకుండా సాగే రాచకేళులు అక్కడి నిరంతర దృశ్యాలు. అంతటి మహానగరం, మిని భారతదేశం కొన్నాళ్ళుగా తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సర్వ వ్యవస్థలు అక్కడే ఉన్నా చుట్టూ సమస్యలే చుట్టుముట్టుతున్నాయి.
Also read: ఆయుర్వేదంలో అధ్యయనం అవసరం
కరోనా వైరస్ ప్రబలిన వేళ అత్యంత ప్రమాదకరంగా మారిన నగరాల్లో దిల్లీ స్థానం మొదటిది. గట్టిగా నాలుగు చినుకులు పడితే చాలు ఊరంతా నీరు ఏరులై పారుతుంది. ఇక ట్రాఫిక్ జామ్ గురించి చెప్పనక్కర్లేదు. అనుకున్న గమ్యానికి ఎప్పుడు చేరుకుంటామో ఆ దేవదేవుడు కూడా చెప్పలేడు. ఇక కాలుష్యం తాజాగా తీవ్ర స్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ అతి తీవ్రమైన స్థాయికి చేరుకొని అందరినీ భయభ్రాoతులకు గురి చేస్తోంది. చిన్నారులు, వ్యాధిగ్రస్థులు వణికిపోతున్నారు.
Also read: ఉడికిపోతున్న ఉక్రెయిన్
మానవ తప్పిదాలు కాలుష్యం కోరలు పెంచాయి
సహజసిద్ధమైన అతి చలి, వేడి వాతావరణంతో పాటు మానవ తప్పిదాల వల్ల ప్రబలిన కాలుష్యం కొన్నాళ్ల నుంచీ ఎక్కిరిస్తోంది. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగులను సగం మందిని ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (ఇంటి నుంచే పని) చేయండని ఆదేశాలిచ్చింది. ప్రైవేట్ కార్యాలయాలకు కూడా అదే సూచనలు ఇచ్చింది. ప్రాథమిక పాఠశాలలను కొన్నాళ్ల పాటు మూసెయ్యమని ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాలతో పాటు మార్కెట్ పనివేళలను కూడా కుదించుకోండని హుకుం వేసింది. కాలుష్య తీవ్రత ఎక్కువ వున్న ప్రాంతాలలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ట్రాఫిక్ నియంత్రణలో సరి-బేసీ విధానాన్ని అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పెరిగిన వాహనాలు, పరిశ్రమలు, రద్దీతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనం కారణంగా కూడా దిల్లీలో కాలుష్యం రోజురోజుకు తీవ్రస్థాయికి చేరుకుంటోంది. పంట వ్యర్ధాల దహనానికి సంబంధించిన పూర్తి బాధ్యతను అమ్ ఆద్మీ ప్రభుత్వం తీసుకుంటున్నట్లు ప్రకటించినా కాలుష్య సమస్యలకు పూర్తి పరిష్కారం లభించినట్లు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాణిజ్య, పారిశ్రామిక, వ్యాపార సంస్థలు అందరు సమిష్టిగా బాధ్యత తీసుకోవాలి. చలికాలం వచ్చిందంటే చాలు గాలిలో నాణ్యత పడిపోవడం వల్ల పిల్లలు శ్వాస తీసుకోడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు.
Also read: నవ్యాంధ్ర నిండుగా వెలగాలి
దిల్లీ ప్రతిష్ఠ కాపాడాలి
దిల్లీ మహానగరం కాలుష్య కాసారంగా మారిన ఈ క్రమంలో దిల్లీ వాసులు విషపూరితమైన గాలిని పీల్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు మరింత బాధపడుతున్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టుతున్నాయని వాపోతున్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా పదే పదే హెచ్చరిస్తోంది. ఇంటగెలిచి రచ్చ గెలవమని సామెత. మిగిలిన రాష్ట్రాలకు విస్తరించాలనుకున్న అమ్ ఆద్మీ పార్టీ, దేశాన్ని, అన్ని రాష్ట్రాలను కలకాలం ఏలాలనుకున్న బిజెపి ముందుగా దేశరాజధానిపై దృష్టి సారించాలి. రాజకీయాలకు తావివ్వకుండా దిల్లీ నగరాన్ని అన్ని రకాలుగా రక్షించాలి. సకల జనులకు నివాసయోగ్యత పెంచాలి. శాశ్వతమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పథక రచన చెయ్యాలి. దిల్లీ ప్రతిష్ఠ, పరపతిని కాపాడాలి.
Also read: కాంగ్రెస్ ఖడ్గధారి ఖడ్గే