Tuesday, December 24, 2024

ఢిల్లీకి ఇక్కడ ఐదేళ్ళలో అమిరిన ‘సెట్టింగ్’ ఇది…

జాన్ సన్ చోరగుడి

రాసేటప్పుడు తెలుగులో సమయానికి సరైన పదం తోచనప్పుడు, ఆంగ్లాన్ని ఆశ్రయించక తప్పదు. కేవలం అదే కారణంతో- ‘సెట్టింగ్’ అనే బహు అర్ధాల ధ్వనులు పలికే పదాన్ని ఇక్కడ వాడక తప్పడం లేదు. అయితే ఇందుకు నేపధ్యం చెప్పడం అవసరం.

‘మూడవ సారి కూడా నేనే…’ అంటున్న మోడీజీకి ఇన్నాళ్ల తర్వాత, మేము అధికారంలో ఉండడం వల్ల ఇక్కడ ఇంత జరిగింది అని- ‘షో కేసింగ్’ చేసుకోవడానికి మునుపటికంటే- “జగన్మోహన్ రెడ్డి-ఎ.పి.”లో ఎక్కువ ‘ఛాయిస్’ కనిపిస్తున్నట్టుగా ఉంది. ‘క్రిస్మస్ – న్యూ ఇయర్ సీజన్లో’ కోస్తా జిల్లాల్లో కేంద్ర మంత్రులు వరస పర్యటనలు చూస్తుంటే, ఇన్నాళ్లకు ఇక్కడ జరుగుతున్న పనుల ‘సెట్టింగ్’ బిజెపి చేస్తున్న అటువంటి ‘క్లెయిమ్’కు అనువుగా అనిపిస్తున్నట్టుగా ఉంది. 

ఉండేవి కాదు

‘ఎ.పి.’కి సంబంధించి గతానికి ఇది భిన్నం. అప్పట్లో- ‘బియాండ్ అమరావతి, దేర్ ఈజ్ నో వాల్డ్’ అన్నట్టుగా ‘అమరావతి’ చుట్టూ మన ప్రపంచం మొత్తం పరిభ్రమిస్తూ ఉండేది! దాంతో తొలి ఐదేళ్ల కాలంలో కొందరు కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పటికీ, వారు వెలగపూడి తాత్కాలిక సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రిని కలిసి, శాలువా కప్పించుకునే (ఫోటోలు ‘మీడియా’కు విడుదల చేయడం మినహా) తరహా సుహృద్భావ పర్యటనలు మినహా, క్షేత్రస్థాయి పర్యటనలు లబ్ధిదారులతో ముఖాముఖి, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడ్డం ఉండేది కాదు. అస్సలు సెక్రటరీలు కలెక్టర్ కలిసి అతిధిగా వచ్చిన కేంద్ర మంత్రులతో ఒక ‘ప్రోగ్రామ్’ చేయడం అరుదు.

Also read: ఈ ప్రభుత్వం ఆ పని పూర్తిచేసింది!

విభజన తర్వాత 2014-2019 మధ్య చంద్రబాబు తొలి ఐదేళ్ల కాలంలో ఇక్కడ జరిగిన కదలికలు ఏమైనా ఉన్నవి అంటే, అవి పునర్విభజన చట్టంలోని అంశాలను కేంద్ర హోం శాఖ సంబంధిత మంత్రిత్వ శాఖల తదుపరి చర్య కోసం రాయడం వల్ల జరిగిన కదలికలుగా మాత్రమే వాటిని చూడాల్సి ఉంటుంది. మంగళగిరిలో 2018లో స్థాపించబడిన ‘ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్’ సంస్థ ప్రారంభం అటువంటిదే. లెక్కకోసం అయితే అలా చట్టం ద్వారా వచ్చినవి మరికొన్ని కూడా ఉన్నాయి.

స్వంత పనిలో

అప్పట్లో కేంద్రం ప్రధాన ‘ఎజెండా’ కూడా భిన్నమైనది. అది భారత ప్రభుత్వంలో- ‘వాజపేయి బిజెపి’ నుంచి ‘మోడీ బీజీపీ’గా జరగాల్సిన పార్టీ రూపాంతర ప్రక్రియ ఎలా ఉండాలి? అనే- ‘చింతన్ బైఠక్’ ప్రధానంగా సాగింది. ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రిత్వ శాఖలకు కొత్త ప్రతిపాదనలు పంపడం వంటివి తక్కువ. ఇలా ఐదేళ్లు ఎవరి స్వంత పనిలో వారు పడిపోవడంతో- దక్షిణాదిన ఒక కొత్త రాష్ట్రం తన ప్రమేయం లేకుండా ఏర్పడి, ఎవరికీ పట్టక అది నిస్సహాయంగా మిగిలిందనే స్పృహ అందరికీ కొరవడింది.

ఆయన ‘ఎజెండా’ వేరు 

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం,  నిపుణులు బృందాలు కనుక శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమీషన్ పరిశీలనలను ప్రతిపాదనలను ప్రాతిపదికగా చేసుకుని, తన మొదటి ప్రభుత్వానికి ‘రోడ్ మ్యాప్’ వేసుకుని ఉంటే, అప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా రాజకీయంగా కూడా ఆయన పార్టీ ఇప్పుడున్న నిస్సహాయ పరిస్థితి కంటే మరింత మేలైన స్థితిలో ఉండేది. కానీ ఆయన ‘ఎజెండా’ వేరుగా ఉండేది.

‘విలువలేదు…’ 

జగన్ మోహన్ రెడ్డిది పూర్తిగా ఇందుకు భిన్నమైన ధోరణి. ఆయన ఎంత ముందుగా తన పార్టీ ‘మ్యానిఫెస్టో’ మీద కసరత్తు చేసాడోగానీ, గత ఎన్నికల మొదట్లోనే ‘నవరత్నాలు’ అంటూ ప్రజల ముందుకు తెచ్చిన జాబితాలో ఐక్యరాజ్య సమితి ఉపాంగం అయిన యు.ఎన్.డి.పి. ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’లోని 17 అంశాల్లో నుంచి, జగన్ తన తొలి ప్రాధాన్యతలు ఎంపిక చేసుకున్నాడు. ఇవి మన దేశం 2030 నాటికి చేరాల్సిన లక్ష్యాలు. అందువల్ల ఈ ముఖ్యమంత్రి పాలనలో నిబంధనల పరిధిలో పనిచేసుకు పోయే వెసులుబాటు ఇక్కడి ‘బ్యూరోక్రసీ’కి పెరిగింది. “జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల మాటకు విలువలేదు” అనే విమర్శకు మూలమిదే!

Also read: ఏదో తేడా ఉన్నట్టుగా అనిపించడం లేదూ…?!

అమరావతి డిజైన్లు

అయితే, ఎన్నికలకు ఆరు నెలలు ముందు కూడా చంద్రబాబు- ‘నార్మన్ ఫోస్టర్’ ఆర్కిటెక్ట్ కంపెని ఇచ్చిన అమరావతి రాజధాని డిజైన్లు పరిశీలనలో ఉన్నాడు. మీరు ఆయన్ని ఇప్పడు కూడా పరిశీలనగా చూడండి, ప్రజల ముందుకు తన పార్టీ తెస్తున్న ఎన్నికల ప్రణాళిక ఎటువంటిది, అని  కాకుండా ఎవరితో కలిసి ఎన్నికల బరిలో దిగితే ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ‘పవర్’ చేజిక్కించుకోవచ్చు, అనేది లక్ష్యంగా ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా ఆయన పనిచేస్తున్నాడు. ఇలా మొదటి నుంచి బాబుది కేవలం- ‘టెక్నికల్’ దృష్టి. అందులో ప్రజలు – నాయకుడు అనే సహజ మానవ సంబంధ అంశ అస్సలు ఉండదు. 

బాబు విజయం

అయినప్పటికీ ఇక్కడ చంద్రబాబు ‘సక్సెస్’ను మనం ప్రస్తావించక తప్పదు. గడచిన నాలుగేళ్ల ఏడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాల్లో ఫలానాది తప్పని ఆయన ప్రజల్ని ఒప్పించి, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ‘రికార్డు’ ఆయనకు లేదు. అయినప్పటికీ, మరో మూడు నెలల్లో ఎన్నికలు అనేసరికి, అన్ని నియోజకవర్గాల్లో- టి.డి.పి. కి ‘సమీప ప్రత్యర్థి’ స్థానాన్ని అలాగే నిలబెట్టుకుని, గెలుపుకు ఉన్న అన్ని అవకాశాల్ని కూడదీసుకుంటున్నాడు.

అది కృతకమా కాదా? అనేది ఎలా ఉన్నా, అక్కడక్కడా తనకు అనుకూలమైన ‘టాక్’ ఉండేటట్టుగా ఆయన ‘సోషల్ మీడియా’తో మేనేజ్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇటువంటి ‘ఫార్ములా’ అనుసరించే నాయకులు అధికారంలో ఉన్నప్పుడు- ప్రజలు, ప్రాంతము, ప్రభుత్వము, అనే మౌలిక అంశాల ఉనికి ఎక్కడ కనిపించదు.

 

 ‘చివరి బెంచి’ 

అయితే, జగన్ మోహన్ రెడ్డిది ఇందుకు భిన్నమైన విధానం. అతడు ఎన్నికల ముందే పలు శ్రేణులకు ‘కమిట్మెంట్’ ఇచ్చి సి.ఎం. అయ్యాక దాన్ని పూర్తిచేశాడు. అభివృద్ధి పరంగా అన్ని ప్రభుత్వ శాఖల్ని ‘ఆపరేషన్’లో ఉంచి, వాటి వద్ద సిద్ధంగా ఉన్న విస్తరణ ప్రణాళికల్ని 13 జిల్లాల్ని 26 గా చిన్నవి చేసి, ఏ శాఖ సేవలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి ‘డెలివరీ’ చేస్తున్నాడు. మొదటిసారి దీనివల్ల అన్ని ప్రభుత్వ శాఖల ‘సర్వీసు’లు చివరి ‘మైలు’ వరకు చేరుతున్నాయి.

Also read: ‘వై… ఏ.పి. నీడ్స్ దిస్ గవర్నెన్స్?’ 

ఉదా: యువజన సర్వీసులు – క్రీడల శాఖ ఏ పార్టీ ప్రభుత్వ ప్రాధాన్యతా క్రమంలో అయినా అది ‘చివరి బెంచి’ అంశం. అటువంటిది, ‘కోవిడ్ కాలం’ కష్టం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖాతాలో పడినప్పటికీ- ‘ఆడుదాం ఆంధ్ర’ అంటూ గ్రామీణ క్రీడల ద్వారా బి.సి., ఎస్సీ, ఎస్టీ. శ్రేణుల యువతను జగన్ ‘వర్చ్యువల్’గా ఆట మైదానాల్లో కలిసి; చివరికి ఆ శాఖ సేవలతో కూడా ఆయన ప్రజా జీవనాన్ని స్పృశించాడు.

‘సెట్టింగ్’ అంటున్నది… 

ఈ మాట ఊరికే అంటున్నది కాదు. ‘కోవిడ్’ కాలం గడిచాక, విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ 2022 జూన్ 12 న విశాఖపట్టణంలో జరిపిన మేధావుల సదస్సులో- ‘ఈస్ట్రన్ ఇండియా నీడ్స్ ఎవల్యూషన్’ అన్నారు. ‘తూర్పు తీరంలోని పోర్టులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయవలసి ఉందని, అప్పుడే ప్రపంచ మార్కెట్ తో మన వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది’ అని ఆ సదస్సులో జై శంకర్ అన్నారు.

కాకినాడలో

ఇది జరిగిన నాలుగు నెలలకు అక్టోబర్ 28న కాకినాడలో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్’ సదరన్ కేంపస్ కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ ప్రారంభించారు. కేంద్ర పరిశ్రమలు-వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ-“ ట్రేడ్ హబ్‌’గా కాకినాడ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమని, ఫార్మాస్యూటికల్స్, ఆటో, టెక్స్ టైల్, రైస్, రైస్ బ్రాన్ ఆయిల్, పళ్లు, కూరగాయల వాణిజ్యానికి ఏ.పీ.లో అపార సామర్థ్యం ఉందని” అన్నారు.

Also read: సర్కారు తలనెరిసిన తనానికి సలాములు

విశాఖలో

గత ఏడాది మార్చిలో విశాఖలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ- “రాష్ట్రంలోని అన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో జాతీయ రహదారులను అనుసంధానం చేస్తాము అంటున్నారు. నిర్మాణంలో ఉన్న ‘నేషనల్ హైవేస్’ అన్నీ డిసెంబర్ 2024 నాటికి పూర్తి అవుతాయని అవి పూర్తి అయితే, వాటిలో ఒకటైన రాయపూర్-విశాఖపట్టణం రోడ్డు ద్వారా ఖనిజ నిక్షేపాలు వున్న ఛత్తీస్ ఘడ్ కు ఏ.పి. పోర్టులు అందుబాటులోకి వస్తాయని అంటారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం 2,014 కి.మీ. పొడవైన 70 రోడ్డు ప్రాజెక్టులు రూ.33.540 కోట్ల వ్యయంతో తమ శాఖ నిర్మిస్తున్నది. ఇలా వీరి పర్యటనల వరస గత డిసెంబర్ చివరి వరకు సాగుతూనే ఉంది. 

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్ సుఖ్ మాండవియా 

గుంటూరులో 

డిసెంబర్ 29న గుంటూరు సమీపంలో పొన్నూరు వద్ద కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్ సుఖ్ మాండవియా మాట్లాడుతూ “రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు బాగుందని, వైద్య రంగం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ ను 104 మొబైల్ మెడికల్ క్లినిక్ ను కేంద్ర మంత్రి సందర్శించారు. వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని అక్కడ ఉన్నప్పటికీ, ఈ పర్యటన ఆద్యంతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం. టీ. కృష్ణబాబు పర్యవేక్షించారు.

నెల్లూరులో

ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులతో కలిసి నూతన సంవత్సరం జరుపుకోవడం ఆనందాన్ని కలిగించింది అని జువ్వలదిన్నె వద్ద జరిగిన సభలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తం రూపాల అన్నారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇక్కడకి వచ్చారు. 

బాపట్లలో 

జనవరి 2న నిజాంపట్నం వద్ద కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తం రూపాల మాట్లాడుతూ.”సాగర్ పరిక్రమ కార్యక్రమంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, కొత్తపట్నం, చీరాల వాడరేవు, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్, ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్స్, రూ 20 వేల కోట్లతో అభివృద్ధి జరుగుతుందని, వికేంద్రీకృత విధానంతో ఈ కార్యక్రమాలను కేంద్రం నిర్వహిస్తుందన్నారు.

విజయనగరంలో

ఈ వ్యాసం ముగిస్తున్నప్పుడు శనివారం (6 జనవరి 2024) మరో కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ తో కలిసి పర్షోత్తం రూపాల జిల్లాలోని పూసపాటి రేగ మండలంలో పర్యటిస్తున్నట్టుగా వార్త. ఇక్కడ రూ. 24 కోట్లతో రాబోతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ టెండర్ దశలో ఉందని కలెక్టర్ చెప్పారు.   

అనుగ్రహభాషణం

అయితే ఇదే కాలంలో కొందరు రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారులు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడి ప్రభుత్వం పరిపాలనపై కొన్ని సంస్థల సదస్సుల్లో మాట్లాడుతూ- ప్రజలు, ప్రాంతము, కాలము, అన్నీ మరిచి విమర్శలు చేస్తున్నారు. పునాదులు వద్ద మొదలయిన రాష్ట్రనిర్మాణం ఎలా ఉండాలో వీరు చెప్పరు. వీరు దేశం 2030 నాటికి చేరాల్సిన లక్ష్యాలు, అందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న వైఖరి గురించి ఎక్కడా మాట్లాడరు. వీరిలో కొందరు ఫిలాసఫీ చెబుతారు. మరికొందరు ఎన్నికల్లో నైతికత ప్రజాస్వామిక విలువలు గురించి, మరికొందరు ఆర్ధిక క్రమశిక్షణ గురించి మాట్లాడతారు. ఇలా అందరు అనుగ్రహభాషణం తరహా సందేశాలు ఇస్తారు. అవి విన్నప్పుడు వీరి సమస్య ఏమిటో మనకు స్పష్టం కాదు.

మరో ఐదేళ్లు

ఆరోగ్యకరమైన ప్రతిపక్షం గానీ, ‘మీడియా’ గానీ, నిష్పాక్షికంగా తూకం వేసే పౌర సమాజం గానీ లేకుండా; కేవలం ప్రజల ఆమోదమే మాకు ప్రాతిపదిక అంటూ 2024 ఎన్నికలకు సిద్దమవుతున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక వైపు ఉంది. మరోవైపు ‘పదేళ్ల ఆంధ్రప్రదేశ్’ పనితీరుపై తన నిస్పాక్షిక అంచనా ఏమిటో చెప్పకుండా తాత్సారం చేస్తూనే మూడవ ‘టర్మ్’ కోసం దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం ఎలా? అని  ‘ఢిల్లీ’ చూస్తున్నది. విభజన జరిగి అప్పుడే మరో ఐదేళ్లు ముగుస్తున్నాయి. మనం మన రాజకీయ అనారోగ్యం ఇంకా ముదరబెట్టుకోవడానికి ఇది సమయం కాదేమో.

Also read: మోడీ అంబుల పొదిలో కొత్త బాణమైన ఏ.పి. జి.ఎస్. టి. కేస్! 

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles