Tuesday, January 21, 2025

మళ్ళీ దిల్లీ చలో

  • స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు
  • గిట్టుబాటు ధరల ప్రకటన

దిల్లీలో 2020-21లో తీవ్రస్థాయిలో ఉద్యమించి, విరమించిన రైతులు మళ్ళీ ఉద్యమించడానికి సిద్ధమయ్యారు. ‘దిల్లీ చలో’ పేరుతో ఆందోళన చేపట్టారు. గతంలో ఉద్యమించిన సంఘాలకు చెందినవారిలో పలువురు మళ్ళీ పోరాటబట్టారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నవేళ రైతు సంఘాలు ఆందోళనకు దిగడం నేడు చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలలకు సరిపడా ఆహారం, డీజిల్, కావాల్సిన సామగ్రి అన్నీ సిద్ధం చేసుకొనే రైతులు పోరుకు దిగినట్లు సమాచారం అందుతోంది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సహా పలువురు బిజెపి నేతల ఇళ్ల ముందు నిరసనలు చేపట్టే అవకాశాలు వున్నాయని నిఘా నివేదికలు చెబుతున్నాయి. పంజాబ్, హరియాణా నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో హస్తినకు బయలుదేరారు. తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరేంత వరకూ దేశ రాజధానిని వీడేదిలేదని రైతులు మళ్ళీ భీష్మప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ నిరసనలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆందోళనలను భగ్నం చేయడానికి, సరిహద్దుల్లోనే అడ్డుకోడానికి ఇప్పటికే పోలీసులు చర్యలు చేపట్టారు. శంభు సరిహద్దు వద్ద రైతులపై భాష్పవాయివును ప్రయోగించినట్లు తెలుస్తోంది. స్మోక్ బాంబ్స్ ను కూడా వదిలారు. దట్టమైన పొగతో ఆకాశమంతా నిండిపోయింది. ఈ ప్రభావంతో నిరసనకారులు, మీడియా ప్రతినిధులు పరుగులు పెట్టినట్లు సమాచారం.

Also read: ప్రతిభాభూషణులు- పద్మవిభూషణులు

కదం తొక్కుతున్న రైతులు

అయినప్పటికీ బారికేడ్లను బద్దలు కొట్టుకొని రాజధానిలోకి ప్రవేశించడానికే రైతులు కదం తొక్కుతున్నారు. 2020లో చేపట్టిన రైతుల ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కేంద్ర ప్రభుత్వం దిగి రావడంతో రైతు సంఘాలు అప్పట్లో విరమించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని, తమ డిమాండ్లు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని ఈ రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్లో కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను విరమించి తీరాలన్నది ఇప్పుడు కూడా రైతు సంఘాలు చేస్తున్న ప్రధాన డిమాండ్. పంటకు కనీస మద్దతు ధర, 2020లో రైతుల పెట్టిన కేసులను ఎత్తివేయడం మొదలైన డిమాండ్లను రైతు సంఘాలు తాజాగా మరోసారి కేంద్రం ముందు పెడుతున్నాయి. ప్రస్తుతం నిరసన తెలుపుతున్న రైతులకు అప్పటి వలె ఇప్పుడు కూడా తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని, రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ వూరుకోమని భారత్ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయిత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. దేశంలో అనేక రైతు సంఘాలు ఉన్నాయని, ఒక్కొక్క సంఘానిది ఒక్కొక్క సమస్య అనీ, ప్రతి సమస్యను తీర్చడం ప్రభుత్వ బాధ్యతనీ ఆయన అంటున్నారు. ‘భారత్ కిసాన్ యూనియన్’ ఉత్తరప్రదేశ్ కేంద్రంగా నడుస్తోన్న రైతు సంఘం. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే చౌదరి చరణ్ సింగ్ కు ‘భారతరత్న’ ప్రకటించింది. ఈ కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుల్లో చరణ్ సింగ్ కీలకమైన నేత కావడం ఒక విశేషం.

Also read: ఈ సారి కరోనా వల్ల ముప్పు తక్కువే!

చరణ్ సింగ్ కు భారతరత్న ప్రకటించినా…

చరణ్ సింగ్ కు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన వేళ దేశవ్యాప్తంగా రైతులు పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రశంసలు అందించిన అనందం ఇంకా పచ్చగా ఉండగానే, నేడు రైతు సంఘాలు ఆందోళనకు సిద్ధమవ్వడం బిజెపి ప్రభుత్వాన్ని కలచి వేస్తోంది. ఈ ఉద్యమం ఎటువంటి రూపు తీసుకుంటుందో అనే భయాలు మొదలవుతున్నాయి. గతంలో ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.మొత్తంగా రైతు ఉద్యమం ప్రాయోజిత ( స్పాన్సర్డ్ ) కార్యక్రమంగానే బిజెపి గతంలో భావించింది. ఇప్పటికే అవే భావనలు తనకు వున్నాయి. సోమవారం నాడు రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపినప్పటికీ అవి విఫలమైనాయి. మార్కెట్ ఒడుదుడుకులతో సంబంధం లేకుండా పంటకు కనీస మద్దతు ధర కల్పించడం, ఆ దిశగా చట్టం చేయడం అని అంశాలలో ఇరువైపుల ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. ఎం.ఎస్.పి, స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు, పంట రుణాల మాఫీకి సంబంధించి చట్టపరమైన హామీలు ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పిన మాటల పట్ల రైతు సంఘాలకు విశ్వాసం కుదరడం లేదు. నేడు మళ్ళీ ఆందోళనల పర్వం ప్రారంభించడానికే రైతులు సిద్ధమవుతున్నారు. అప్పట్లో ఆందోళనల్లో మరణించిన రైతు కుటుంబాలకు కేంద్రం పరిహారం ప్రకటించినా, ఇంతవరకూ అందకపోవడంపై కూడా ఆగ్రహానికి మరో కారణం.

Also read: జమిలి ఎన్నికలు జరిగేనా?

నరేంద్రమోదీ ప్రభుత్వం పరిష్కరిస్తుందా?

వివాదాస్పద విద్యుత్ చట్టం 2020 ని రద్దు చేయడం, దీని వల్ల కేంద్రం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరంచేస్తే, తమకు అందే రాయితీలు పోతాయని రైతులు భయపడుతున్నారు. భూసేకరణ చట్టం 2013ను పునర్నిర్మించడం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలాగడం మొదలైనవి రైతులు చేస్తున్న డిమాండ్లు. ఈ డిమాండ్ల నడుమ కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా అగ్గికి ఆజ్యం పోసినట్లవుతున్నాయి. పంటలకు కనీస మద్దతు ధరపై ఇంత హడావిడిగా చట్టాన్ని తీసుకురాలేమన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. ఇది ఇలా ఉండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతులకు భరోసా ఇచ్చేలా మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలిపించి తీరుతామని రాహుల్ అంటున్నారు. ప్రస్తుతం మళ్ళీ పైకి లేచిన రైతు ఆందోళనల వెనక ప్రతిపక్షాల కుట్రలు, కొందరి పెట్టుబడులు, కొన్ని ఉగ్రసంస్థల హస్తాలు ఉన్నాయని బిజెపికి చెందిన నేతలు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. మొన్ననే రైతుసంఘ వ్యవస్థాపకుడు, దివంగత నేత చరణ్ సింగ్ తో పాటు, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కు కూడా బిజెపి ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించడం గమనార్హం. ఏది ఏమైనా, ‘దిల్లీ  చలో’ ఆందోళన బిజెపికి కొత్త తలనొప్పి. మొత్తంగా చూస్తే, దేశ వ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో వున్న రైతు సమస్యలను పునఃసమీక్ష చేయాల్సిన బాధ్యత కేంద్రానికి వుంది. రైతు సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపించడం అత్యంత ముఖ్యమైన అంశం. అన్నదాత కంట కన్నీరు ఏ పాలకునికైనా శాపమై నిలుస్తుంది. కర్షకుడి హర్షం చూసినదే నిజమైన ప్రజాప్రభుత్వం. నరేంద్రమోదీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయదారుల సమస్యల వైపు ప్రత్యేకమైన దృష్టి సారించి, దేశాన్ని అన్నపూర్ణగా నిలబెడుతుందని ఆశిద్దాం.

Also read: లక్షద్వీప్ వైపు లక్షలమంది చూపు!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles