- వేలాదిమంది భద్రతా బలగాల మోహరింపు
- రైతులను ఖాలీ చేయించేందుకు అధికారుల యత్నాలు
- ససేమిరా అంటున్న రైతు సంఘాల నేతలు
- యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న సరిహధ్దులు
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఖాలీ చేయించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. సింఘు,ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. సరిహద్దుల్లో వేసిన టెంట్లను ఖాలీ చేయాలని అధికారులు, పోలీసులు రైతులను హెచ్చరించారు. దీనికి రైతు సంఘాలు ఘాటుగానే స్పందిస్తున్నాయి. సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు వెనక్కి వెళ్లేది లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించారు. పలు రాష్ట్రాలనుంచి రైతులు ఢిల్లీ చేరుకునేందుకు తరలివస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేదుకు ముందు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. సరిహద్దుల్లో కేంద్ర సాయుధ బలగాలను మోహరించి 144 సెక్షన్ విధించారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇది చదవండి: రైతు ఉద్యమంలో దేశద్రోహులు
ఉత్తరప్రదేశ్ నుంచి భారీగా తరలివస్తున్న రైతులు:
రైతుల ఉద్యమాన్ని కేంద్రం నీరుగారుస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రోజు నుంచి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. చట్టాలు రద్దయ్యేవరకు వెనక్కి వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ తెగేసి చెప్పారు. టికాయిత్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్ జిల్లాలైన మీరట్, భాగ్ పత్, బిజ్నోర్, ముజఫర్ నగర్, మొరదాబాద్, బులందర్ షహర్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు చేరుకున్నారు.
ఇది చదవండి: హింసాత్మకంగా కిసాన్ పరేడ్
రైతులకు నీరు, కరంటు సరఫరా నిలిపివేత:
రైతులను ఖాలీ చేయించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సరిహద్దులనుంచి వెళ్లాలని ఘజియాబాద్ పరిపాలనా అధికారులు రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. రైతులు స్వచ్ఛందంగా ఖాళీ చేయని పక్షంలో అధికారులే టెంట్లను తొలగిస్తారని జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. ఇందులో భాగంగా రైతులు వేసుకున్న గుడారాలకు, విద్యుత్, నీటిసరఫరా నిలిపివేశారు. పరిప్థితి అదుపుతప్పకుండా వేలాది మంది పోలీసులు ఘూజిపూర్ సరిహద్దులో మోహరించారు.
ఈ రోజు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈనేపథ్యంలో రైతుల ఆందోళన ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో నని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం నాటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.
ఇది చదవండి: మెట్టు దిగిన ప్రభుత్వం, బెట్టువీడని రైతన్నలు