Thursday, November 21, 2024

అన్నదాత ఆక్రందన పెడచెవిన పెట్టడం అనర్థం

ప్రపంచం అంతా కొత్త సంవత్సరాది సంబరాలు చేసుకుంటుంటే వేలాది మంది రైతులు హరియాణా, దిల్లీ సరిహద్దులో కటిక చలిలో కఠోరమైన దీక్ష కొనసాగిస్తున్నారు. శనివారంనాడు వారి దీక్ష 38వ రోజులో ప్రవేశించింది. కరోనా బలం తగ్గినా కొత్త అవతారం ఎత్తిందనీ, లండన్ నుంచి భారత్ కు వచ్చినవారితో పాటు మన దేశంలో ప్రవేశించిందనీ ప్రభుత్వం చెబుతున్నది. గుండె జబ్బు వల్లనో, ఊపిరితిత్తుల వ్యాధి వల్లనో, ఆత్మహత్య కారణంగానో కొందరు ఉద్యమ రైతులు మరణించారు. కానీ కరోనా వల్ల ఎవ్వరూ మృతిచెందలేదు. నిజంగా కరోనా ఉద్యమ రైతులకు సోకితే వారిని ఎవరు ఆదుకుంటారంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఈ రచయితతో శుక్రవారంనాడు మాట్లాడుతూ బోరుమని విలపించారు. తమ అస్తిత్వంకోసం, తమ జీవితాలు బుగ్గికాకుండా కాపాడుకునేందుకు ఎప్పుడూ లేని విధంగా ఉద్యమిస్తున్న రైతులను ఖలిస్తాన్ ఏజెంట్లనో, నక్సలైట్లనో, చైనా, పాకిస్తాన్ తొత్తులనో నిందిస్తున్న అధికారపార్టీ నాయకులను ఆయన దుయ్యపట్టారు.

రైతు ఉద్యమం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు:

కొత్త సంవత్సరాదిలో మనం మాట్లాడుకోవలసింది దిల్లీలో ఉద్యమిస్తున్న రైతుల గురించి. మరో విషయం ఏదీ అంతకంటే ముఖ్యమైనది కాదు. రైతులు ఎందుకు ప్రాణాలకు తెగించి ఎముకలు కొరికే చలిలో నిరసనదీక్ష కొనసాగిస్తున్నారో తెలుసుకోవాలి. అన్నదాత ఆక్రందన వినిపించుకోవాలి. మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయచట్టాలూ తెచ్చిన పద్ధతిని పరిశీలించాలి. చట్టాల వల్ల వచ్చే చిక్కులను పరిశీలించాలి. ‘ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) యాక్ట్, ఫార్మర్స్ (ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటెక్షన్)అగ్రీమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, ఎసన్షియల్ కమాడిటీస్ (ఎమెండ్ మెంట్ )యాక్ట్- ఈ మూడు చట్టాలూ రైతులకు ఎనలేని మేలు చేస్తాయనీ, వారి ఆదాయాలను పెంచివేస్తాయనీ, వారి సమస్యలన్నిటికీ ఈ మూడు చట్టాలూ సమాధానం చెబుతాయనీ ప్రభుత్వం శక్తివంచనలేకుండా ప్రచారం చేస్తున్నది.కానీ రైతులు ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు.

చర్చలు జరిపామంటూ దబాయించడం వృధాప్రయాస:

మూడు చట్టాలనూ తెచ్చే ముందు రైతు సంఘాలతో, రాష్ట్ర ప్రభుత్వాలతో సమాలోచనలు జరిపామంటూ ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న మాట సత్యదూరం. మోడల్ ఏపీఎంసీ చట్టం, 2017, తెచ్చే ముందు వ్యవసాయానికి సంబంధించిన అందరితో చర్చలు జరిపిన మాట వాస్తవం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డ్ లకు తోడుగా ప్రైవేటు మార్కెట్ యార్డ్ లకు ఈ చట్టం అవకాశం కల్పించింది. పాడైపోని ధాన్యం క్రయవిక్రయాలకు సంబంధించి రెండు శాతం మార్కెట్ సెస్సునూ, రెండు శాతం కమిషన్ ఏజెంట్లకు యూజర్ చార్జీలనూ చెల్లించాలని ప్రభుత్వం చట్టం  చేసింది. మార్కెట్ యార్డ్ లకు ఈనాం లకూ లింక్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చలు జరిపింది. ఈ చట్టాన్ని అమలు జరిపే విషయం పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.

ఆ చట్టాలకు అభ్యంతరం లేదు:

పదిహేనవ ఆర్థిక సంఘం 2019లో సమర్పించిన నివేదికలో ఈ మోడల్ ఏపీఎంసీ చట్టాన్ని సమర్థించింది. దానితో పాటు కాంట్రాక్ట్ ఫార్మింగ్, సర్వీసెస్ యాక్ట్ 2018ని జతచేసింది. వీటిని సమర్థంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సహకాలను కూడా ఆర్థిక సంఘం ప్రకటించింది. ఈ మోడల్ చట్టాలకు అనుగుణంగా రాష్ట్రాలు తమ ఏపీఎంసీ చట్టాలను సవరించుకోవాలని ఆర్థిక సంఘం సలహా చెప్పింది. మోడల్ వ్యవసాయ సంస్కరణల చట్టాలను అమలు చేసే రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహిస్తుందని  2020 ఫిబ్రవరి ఒకటో తేదీన తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు.

సంస్కరణలకు రైతులు వ్యతిరేకం కాదు:

ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాలు మోడల్ వ్యవసాయ సంస్కరణలను ఆమోదించాయి. రైతులకు యథాస్థితి కొనసాగాలని లేదు. వారు సంస్కరణలకు వ్యతిరేకం కాదు. ఆత్మహత్యలు తప్ప గత్యంతరం లేని ప్రస్తుత స్థితిలో ఉండిపోవాలని లేదు. అదే సమయంలో పెనం నుంచి పొయ్యిలో పడమంటే అందుకు సిద్ధంగా లేరు. అందుకే మోడల్ వ్యవసాయ చట్టాన్ని జయప్రదం చేయడానికి సుముఖత వెలిబుచ్చారు. ప్రైవేటు కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచివేస్తామంటే స్వాగతించారు.  అన్ని రాష్ట్రాలూ మోడల్ వ్యవసాయ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతున్న దశలో అకస్మాత్తుగా మోదీ ప్రభుత్వం అడ్డం తిరిగింది. అనూహ్యమైన చర్యలకు పూనుకున్నది. 5 జూన్ 2020న వ్యవసాయానికి సంబంధించి మూడు ఆర్డినెన్స్ లను రాష్ట్రపతి చేత జారీ చేయించింది. ఏపీఎంసీ చట్టానికీ, మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం 2018కీ ఈ ఆర్డినెన్స్ లు పూర్తిగా విరుద్ధమైనవి. ఈ మూడు ఆర్డినెన్స్ లనూ జారీ చేసే ముందు రైతు సంఘాలతో కానీ, రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపలేదు. రాధామోహన్ సింగ్ వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మోడల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ లైవ్ స్టాక్ మార్కెటింగ్ (ప్రొమోషన్ అండ్ ఫెసిలిటేషన్ )యాక్ట్ 2017ను మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు సిఫారసు చేసింది. ఆ చట్టానికి మూడు ఆర్డినెన్స్ లూ విరుద్ధం.

అడ్డగోలుగా బిల్లు ‘ఆమోదం’ :

ఫార్మర్ ప్రొడ్యూస్ అండ్ ట్రేడ్ బిల్లును రాజ్యసభలో అడ్డగోలుగా ఆమోదించారు. సెలక్ట్ కమిటీకి ఈ బిల్లును పంపించాలని ప్రతిపక్షం ఎంత గొడవపెట్టినా, ఓటింగ్ నిర్వహించాలని పట్టుపట్టినా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఖాతరు చేయలేదు.  మూజువాణీ ఓటుతో బిల్లు సభ ఆమోదం పొందిందంటూ ఏకపక్షంగా, దురుసుగా ప్రకటించారు. ఏమాటకామాట చెప్పుకోవాలి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా నయం. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ హయాంలో ప్రభుత్వానికి లోక్ సభలోనూ, రాజ్యసభలోనూ మెజారిటీ ఉన్నప్పటికీ దాదాపు అన్ని బిల్లులనూ ప్రతిపక్షాలు కోరినట్టు సెలక్ట్ కమిటీకి పంపించి, దాని ఆమోదం పొందిన  తర్వాతనే బిల్లును ఆమోదించినట్టుగా పరిగణించేవారు. రాష్ట్రపతికి పంపించేవారు. ఎన్ డీఏ ప్రభుత్వం ఇప్పుడు వ్యవహరించినంత నిరంకుశంగా యూపీఏ సర్కార్ వ్యవహరించలేదు.

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు, 2014, ఆమోదం పొందిన విషయంలో మాత్రం లైట్లు తీసి, టీవీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి, బిల్లును ఆమోదించినట్టు అప్పటి సభాపతి ప్రకటించారు. కానీ అప్పటికే విభజన బిల్లుకు యూపీఏ భాగస్వామ్యపక్షాలతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మద్దతు కూడా ఉన్నది. కనుక స్పీకర్ నిర్ణయం ఏకపక్షం అనడానికి వీలులేదు. ప్రస్తుతం బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీఏ కరోనా మహమ్మారిని అడ్డంపెట్టుకొని హడావిడిగా, చర్చ లేకుండా, రచ్చ నడుమ ప్రతిపక్షాల విజ్ఞప్తులను పెడచెవినపెట్టి చాలా ముఖ్యమైన బిల్లులను పార్లమెంటు ఆమోదించినట్టు ప్రకటించింది. కేంద్రమంత్రిమండలి సమావేశంలో ఆర్డినెన్స్ లపైన మాట్లాడనివ్వలేదని ఫిర్యాదు చేస్తూ హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. అకాళీదళ్ ఎన్ డీఏ నుంచి వైదొలిగింది.

కనీస మద్దతు ధర ఒక రక్షణకవచం:

ఈ చట్టాలు రాకముందు దేశంలోని రైతులు కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) కు అటూ ఇటుగా ధాన్యం అమ్ముకుంటున్నారు. కనీసమద్దతు ధరకు మండీల దగ్గర తమ ధాన్యంలో నాలుగింట మూడు వంతులకుపైగా పంజాబ్ రైతులు అమ్ముకోవడం ఆనవాయితీ. అసహాయ రైతుకు ఎంఎస్ పీ ఒక రక్షణ కవచం. హరియాణా రైతులు కూడా ఎంఎస్ పీ ప్రకారం తమ ధాన్యం విక్రయిస్తున్నారు. దక్షిణాదిలోనే ఎంఎస్ పీ చెల్లించి ధాన్యం కొనుగోలు చేయడం తక్కువ. అందుకే, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను నిర్వహించింది. వచ్చే ఏడాది అటువంటి ఏర్పాటు చేయబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. అది వేరే విషయం. మొత్తంమీద రైతులు మండీలలో, మార్కెట్ యార్డులలో కనీస మద్దతు ధరకు కాస్త తక్కువైనా గౌరవప్రదమైన ధరకు అమ్ముకునేవారు.

ఈనామ్ లింకు కలిగి ఉన్న 940 మార్కెట్ యార్డులలో రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. రైతులు నయాపైసా  సెస్సు చెల్లించనక్కరలేదు. ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులే చెల్లించాలి. ఈ 940 మార్కెట్ యార్డులలో 7500 రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డులను చట్టం పరిధిలో నుంచి మినహాయించారు. పెద్ద పెట్టుబడులు పెట్టి ధాన్యం కొనుగోలు చేసే కార్పొరేట్ సంస్థలకే విధిగా ధాన్యం ఆ సంస్థలు చెప్పిన ధరలకే అమ్ముకోవలసి వస్తుంది. ప్రభుత్వం కొనుగోలు చేయదు. కనీస మద్దతు ధర అంటూ ప్రకటించినా అది కొర్పొరేట్ సంస్థలతో సంప్రతించి వాటికి అనుకూలంగానే ఉంటుంది. అన్నదాతల అశాంతికి తగిన బలమైన కారణాలు  ఉన్నాయి.

కొర్పోరేట్ సంస్థలకు అప్పగించడమే లక్ష్యం:

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల లక్ష్యం కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడమే. ఆ సంస్థలు సెస్సు చెల్లించనవసరం లేదు. చౌకగా రైతుల నుంచి ధాన్యం కొని అపరిమితంగా నిల్వ చేసుకోవచ్చు. మార్కెట్ లో కృత్రిమ కొరత సృష్టించవచ్చు. ధరలు పెంచి నిల్వ ఉంచిన ధాన్యాన్నిదశలవారీగా విడుదల చేసి ఎక్కువ ధరకు అమ్ముకొని విపరీతమైన  లాభాలు గడించవచ్చు. కార్పొరేట్ సంస్థలు అన్నీ ఒక్కటై, కార్టల్ గా ఏర్పడి ఇప్పుడు సిమెంట్ ధరను శాసిస్తున్నట్టే రేపు ధాన్యం ధరలను సైతం శాసించవచ్చు. మండీలను బలపర్చుతామనీ, ప్రోత్సహిస్తామనీ మోదీ, వ్యవసాయమంత్రి తోమర్ అంటున్నారు కానీ జరిగేది మాత్రం దానికి పూర్తిగా భిన్నంగానే. మండీల వ్యవస్థను నీరుగార్చడమే ఈ చట్టాల ఉద్దేశం. ఇందులో అనుమానం లేదు.

పాత చట్టాలకు పూర్తి విరుద్ధంగా కొత్త చట్టాలు:

కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో కూడా 2018నాటి చట్టంలో ఉన్న అంశాలు కొత్త చట్టంలో లేవు. ధరలనూ, కొనుగోళ్ళనూ నియంత్రించే విధానానికి పనిగట్టుకొని మంగళం పాడారు. ఒక కార్పొరేట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం అమలులో ఏదైనా తేడా వస్తే, పంట నాణ్యతపైన విభేదాలు తలెత్తితే వాటి పరిష్కారం కోసం రైతు ఆర్ డీవో కు, ఆ తర్వాత కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు. కానీ న్యాయవాది సాయం తీసుకోకూడదు. రైతులకు చట్టాలూ, నిబంధనల విషయంలో అవగాహన అంతగా ఉండదు. కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ప్రవీణులై ఉంటారు. వారికి ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధాలు ఉంటాయి. బలమైన వ్యవస్థల అండదండలు ఉంటాయి. న్యాయవాది సహాయం లేకుండా రైతు ఒక వేళ కలెక్టర్ దాకా వెళ్ళినా న్యాయంకోసం పోరాటం చేసే పరిజ్ఞానం కానీ, శక్తి కానీ అతడికి ఉండవు. కలెక్టర్ స్థాయిలో కూడా సమస్య పరిష్కారం కాకపోతే సదరు రైతు దిల్లీకి వెళ్లాలి.  అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాలలోని బక్క రైతు దిల్లీకి ఎప్పుడు వెళ్ళాలి. రాష్ట్ర రాజధాని ముఖం చూడని రైతులే మన రాష్ట్రాలలో సగానికి పైగా ఉంటారు. చదువు అంతగా లేని రైతులకు పాతికేసి పేజీల ఒప్పందాలపైన సంతకాలు పెట్టాలో లేదో తెలియదు. వివాదం పరిష్కారంలో రైతులకు న్యాయవాదుల సాయం అందకుండా చేయడంలోని ఆంతర్యం ఏమిటి? ఇది రైతు పట్ల వివక్ష కాదా? ఇదేనా రైతులకు మేలు చేసే విధానం?

ఇది అధర్మం, అన్యాయం:

పంజాబ్ మండీలలో ఎంఎస్ పీ (కనీస మద్దతు ధర) చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తున్న విధానాన్ని దేశవ్యాప్తంగా సమర్థంగా అమలులోకి తేవలసిన ప్రభుత్వం వ్యాపారులకూ, కార్పొరేట్ సంస్థలకూ వ్యవసాయరంగాన్ని ధారాదత్తం చేసే ప్రయత్నాలు చేయడం అధర్మం, అన్యాయం.  రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలూ రైతు ప్రయోజనాలను హరించి, బడా కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. పార్టీల వారీగా వాదించడం మానుకొని చట్టాలను అధ్యయనం చేసి నిస్పక్షపాతంగా మాట్లాడేవారు ఎవరైనా ఈ సంగతి ఒప్పుకుంటారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ్ అదానీ ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయో, ముఖేష్ అంబానీ సంస్థలలోకి ఫేస్ బుక్ వంటి సంస్థలు కూడా ఎందుకు భారీ పెట్టుబడులు పెడుతున్నాయో అర్థం చేసుకోవడం సామాన్య రైతుకు అసాధ్యం. అర్థం చేసుకునే శక్తి ఉన్నావారు అధికంగా ప్రభుత్వం పక్షాన, కార్పొరేట్ రంగం పక్షాన ఉన్నారు. ఎవరైనా ఇది అన్యాయమని గళం ఎత్తితే వారిని దేశద్రోహులుగా జమకట్టి, అవహేళన చేయడానికి ప్రభుత్వ అనుకూల మీడియా ఉండనే ఉన్నది. అందుకే  ఈ మూడు చట్టాలనూ రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చట్టాలు రద్దు చేయడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.

ఎంఎస్ పీకి చట్టబద్ధమైన హామీ:

స్వామినాధన్ కమిటీ సిఫార్సు చేసిన సీ2 ప్లస్ 50 శాతం కనీస మద్దతు ధరగా నిర్ణయించాలనీ, ఆ విధంగా నిర్ణయించిన కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ) విషయంలో ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలనీ రైతులు గట్టిగా కోరుతున్నారు. ఇది రైతుల కనీస డిమాండ్.  విద్యుత్ చట్టంలో సైతం సవరణ జరగాలని కోరుతున్నారు. రెండు అంశాలపైన అవగాహన కుదిరిందనీ,తక్కిన అంశాలపైన చర్చలు జరుపుతామనీ వ్యవసాయమంత్రి చెబుతున్నారు. పంటల ఊర్పిళ్లు అయిన తర్వాత గడ్డిని తగులబెడితే శిక్షాత్మక చర్యలు ఉంటాయని చట్టాలలో ఉంది. అటువంటి చర్యలు ఉండబోవని ప్రభుత్వం చెప్పింది. అంగీకారం కుదిరిన రెండో అంశం విద్యుత్ సబ్సిడీలు కొనసాగుతాయన్న హామీ. ఈ రెండింటి కంటే ముఖ్యమైన డిమాండ్లు చాలా ఉన్నాయి.  జనవరి నాలుగో తేదీన మరొక విడత రైతు సంఘాల ప్రతినిధులు కేంద్ర మంత్రుల బృందంతో చర్చలు జరపబోతున్నారు. ఆ  చర్చలలో ప్రధానాంశాలపైన అంగీకారం కుదరకపోతే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. రైతు ఉద్యమాన్ని చైనా లేదా పాకిస్తాన్ లేదా నక్సలైట్లు లేదా పంజాబ్ లో కమిషన్ ఏజెంట్లు నడిపిస్తున్నదని అంటూ అవహేళన చేయడం ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న రైతులను రెచ్చగొట్టడమే.

అటు అదానీ, ఇటు అంబానీ, మధ్యలో ప్రధాని:

జనాభాలో సగానికిపైగా ఉన్న రైతులను ఆగ్రహానికి గురి చేసి ఎన్ డీ ఏ సర్కార్ బావుకునేదేమిటో అర్థం కావడం లేదు. ‘అటు అదానీ, ఇటు అంబానీ, మధ్యలో ప్రధాని’ అన్న మాట నిజం అవుతున్నది. భేషజాలకు పోకుండా పట్టువిడుపులు ప్రదర్శించాలి.  రైతు సంఘాల పట్ల  సద్భావం ఉండాలి. మనస్పూర్తిగా చర్చలు జరిపి ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కోవాలి. విద్య, వైద్య రంగాల నుంచి తప్పుకున్నట్టే వ్యవసాయరంగం నుంచి కూడా నిష్క్రమించి చేతులు దులుపుకొనే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించాలి. రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని హైజాక్ చేసి కేంద్రం చేతుల్లోకి తీసుకునే సమాఖ్య స్పూర్తికి విరుద్ధమైన పెడపోకడలకు స్వస్తి చెప్పాలి.  రైతులలో కొంతమందికి చదువు రాకపోవచ్చు. కానీ వారికి ఇంగితజ్ఞానం దండిగా ఉంటుంది. వారి తెలివితేటలనూ, వివేకాన్ని తక్కువగా అంచనా వేయడం పొరపాటు. మూడు వ్యవసాయ చట్టాలనూ ఉపసంహరించుకోవడం దేశానికి మంచిది. అన్నదాతలను ఆవేదనకు గురి చేయడం అనర్థదాయకం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం వాస్తవిక దృష్టితో వ్యవహరించాలి. ప్రస్తుత చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత రైతు ప్రతినిధులతో, రాష్ట్రప్రభుత్వాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలు తీసుకురావాలి.

ఇదీ చదవండి:రాజస్థాన్-హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత

ఇదీ చదవండి:కేంద్ర మంత్రులతో రైతు నేతల చర్చలు బుధవారం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles