- సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాకే పరీక్షలు
- కళాశాలలు తెరిస్తే కఠిన చర్యలు
తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని యూనివర్సిటీల పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.ఈ మేరకు అన్ని యూనివర్శిటీలకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను ఈ రోజు నుంచి (మార్చి 24) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఉన్నత విద్యామండలి పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్శిటీలకు సూచించింది. విద్యార్థులు, లెక్చరర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
Also Read: థియేటర్లు మూసివేతపై క్లారిటీ ఇచ్చిన తలసాని
తెలంగాణలో నేటి నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం కావాల్సిఉన్నాయి. కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈ రోజు నుంచి (మార్చి 24), తృతీయ సంవత్సరం పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కావాల్సిఉంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 వరకు కొనసాగాల్సి ఉండగా కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది.
కళాశాలలు తెరిస్తే కఠిన చర్యలు:
మరోవైపు ఇంటర్మీడియట్ కళాశాలలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి జలీల్ హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కళాశాలలను మూసి ఉంచాలని యాజమాన్యాలను ఆదేశించారు. అయితే ఆన్ లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
Also Read: ఉచిత మంచినీరు అందేదెన్నడు