“గాంధి పుట్టిన దేశమా ఇది…నెహ్రు కోరిన సంఘమా ఇది…” అని మొదలుపెట్టి, సామ్యవాదం, రామరాజ్యం సంభవించే కాలమా? అంటూ ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితమే ఆరుద్ర అనే కవి ప్రశ్నించాడు. “కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగె నేడు.. ప్రతి మనిషి మరియొకరిని దోచుకొనేవాడే.. తన స్వార్ధం తన సౌఖ్యం చూచుకొనేవాడే… అంటూ మరో మహాకవి శ్రీశ్రీ ఆవేదన, ఆవేశం రంగరించి పాటగా రగిలించాడు. ఆరుద్ర ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలి ఉన్నాయి, శ్రీ శ్రీ రగిలించిన అగ్ని ఇంకా రగులుతూనే ఉంది.
అరవై ఏళ్ళ కిందటే దావానలం
అరవై ఏళ్ళ క్రితమే సమాజంలో ఈ దావాలనాలు పుట్టాయి. అవి గిట్టే రోజులు ఎప్పుడో? రాజ్యాంగం అందరికీ అర్ధమవ్వాలి, ప్రజాస్వామ్యం అందరూ అనుభవించాలి, చట్ట సభల్లో సభ్యులు హుందాగా ప్రవర్తించాలి, మూడు స్థంభాలు మూలమై నిలిచి దేశ గౌరవాన్ని నిలుపాలి, సమాజంలోని ప్రజలందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కులు సొంత మవ్వాలి. నేరచరితులు చట్ట సభల మెట్లు తొక్కకూడదు అనే మాటలు ఈ మధ్య తరచూ వింటున్నాం. రాజ్యంగ దినోత్సవం సందర్బంగా, సభాపతుల వందేళ్ల పండుగ సందర్బంగా తాజాగా మళ్ళీ విన్నాం. ఇవన్నీ వినటానికి బాగానే ఉంటాయి. ఆచరణ సాధ్యమా అన్నది ప్రధానమైన ప్రశ్న. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ నడుపుతున్న చట్ట సభల్లో ప్రతి క్షణమూ సద్వినియోగమై, ప్రతిమాట విలువైనదై సాగే కాలం మనం చూడగలమా అనే ఆవేదనలో విజ్ఞులు తలలు పట్టుకొని రోదిస్తున్నారు.
సచ్ఛరితులు రాజకీయాలలోకి వస్తారా?
సచ్చరితులను రాజకీయల్లో చూడాలనే కోరిక ప్రజలందరికీ నిజంగా ఉంటే, అది ఓటు రూపంలో ప్రతి ధ్వనిస్తే, అప్పుడు సాధ్యమవుతుంది. అది సాధ్యమా అన్నదే ప్రశ్న. శాసన-కార్యనిర్వాహక-న్యాయ వ్యవస్థలే మూడు స్థంభాలు. మీడియాను నాలుగో స్థంభంగా అభివర్ణిస్తున్నా, అధికారికమైన హోదా మీడియాకు ఇప్పటి వరకూ లేదు.ఈ నాలుగు వ్యవస్థల మధ్య సమన్వయం, సరసమైన వాతావరణం, సహకారం సరిగ్గాలేవనే విమర్శలు ఈ మధ్య దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగ హక్కులు సమగ్రంగా, సంపూర్ణంగా అందరూ అనుభవించిననాడే, ఆ స్ఫూర్తి, ఆ దీప్తి నిలబడుతుంది. సదస్సులు, సంబరాల వల్ల ఒరిగేది ఏమీ లేదు. పడికట్టు పదాలతో కాలం వెళ్లబుచ్చుకోవడం తప్ప ఏ ప్రయోజనం నెరవేరదు.
సర్వోత్కృష్టమైన సంవిధానం
సామాన్యుడికి రాజ్యాంగం తెలియడం వల్ల ఏ ఉపయోగం లేదు. అది అందిననాడే అసలు ప్రయోజనం నెరవేరుతుంది. భారత సంవిధానం సర్వోత్కృష్టమైంది. ఇది చట్టంగా రూపం ఏర్పరచుకుంది. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరపాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన, కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఏ విధంగా ఉండాలో రాజ్యాంగం నిర్దేశించింది. రాజ్యాంగ రచన చాలా పెద్దది. ఎన్నో అధికరణలు, షెడ్యూల్స్ ఇందులో ఉన్నాయి. అనేక హక్కులు అందులో పొందుపరచారు. ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉండాలి. అని మొదట్లోనే రాశారు. ఆచరణలో ఇది ఎక్కడుంది? అసమానతలు అలాగే కొనసాగుతున్నాయి.
రాజ్యాంగ సవరణ సౌలభ్యం
అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటు ఉంది. అనేక సవరణలు జరిగాయి. ఇంకా జరగాలి అని కూడా అంటున్నారు. సవరణల ద్వారా సాధించిన ఫలితాలపై సమగ్రమైన సమీక్ష జరగాల్సిఉంది. భారత రాజ్యంగ నిర్మాణంలో బ్రిటన్, అమెరికా, ఐర్లాండ్, రష్యా, కెనడా, జర్మనీ రాజ్యాంగాల నుండి కూడా కొన్ని గ్రహించాం. అంబేద్కర్ మహనీయుడు మొదలు ఎందరో మహనీయులు రాజ్యంగ నిర్మాణానికి సర్వ శక్తులు, యుక్తులు ధారపోశారు. గాంధీ నుండి మోదీ వరకూ “రామ రాజ్య” స్థాపన జరగాలని నినదిస్తున్నారు. శ్రీరాముడు పాలించిన కాలం, అప్పటి యుగధర్మం వేరు. అంతెందుకు, స్వరాజ్య సాధన కోసం పోరాడిన నాయకులు, తదనంతరం పాలనలో భాగస్వామ్యులైన నాయకులు వంటివారిని నేడు దివిటీ పట్టి వెతికినా కానరారు.
సామ్యవాదం, రాజరాజ్యం స్వప్నాలు
దేశాన్ని సుభిక్షంగా, శాంతియుతంగా నిలబెడుతూ పాలించడమే నేటి రామరాజ్యమైతే, అది సాధించడానికి చాలా కసరత్తులు, త్యాగాలు, ప్రయోగాలు చెయ్యాలి. ఆ సాహసం మన ఏలినవారికి ఉంటే? అది సాధ్యమే. మునుముందుగా, నాలుగు మూల స్థంభాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పాలి. చట్ట సభల తీరు మార్చాలి. చట్ట సభలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో తీరు మారాలి. న్యాయమూర్తుల నియామకంలోనూ పారదర్శకత సాధించాలి. మీడియాలో స్వయం సంస్కరణ సాధిస్తే, నియంత్రణ చెయ్యాల్సిన అవసరమే రాదు. “నో యువర్ కాన్స్టిట్యూషన్” (కె వై సి )తో పాటు, నో యువర్ లీడర్ కూడా ముఖ్యం. ఇవన్నీ, నిజంగా సాధించ గలిగితే, సామ్యవాదం, రామరాజ్యం సహజంగానే సంభవిస్తాయి.