- గత 13 ఫైట్లలో విజేందర్ తొలి ఓటమి
- రష్యన్ బాక్సర్ చేతిలో టెక్నికల్ నాకౌట్
భారత తొలి ప్రొఫెషనల్ బాక్సర్, వరుసగా 12 విజయాల మొనగాడు విజేందర్ సింగ్ కు తొలిసారి ఓటమి ఎదురయ్యింది. గోవా రాజధాని పనాజీ మాండోవీ నదిలో లంగరు వేసిన మెజెస్టిక్ ప్రైడ్ కేసినో నౌక రూఫ్ టాప్ మీద వినూత్నంగా నిర్వహించిన 8 రౌండ్ల ఈ పోరులో ఆరున్నర అడుగుల రష్యన్ ప్రో-బాక్సర్ ఆర్టిష్ లోప్ సాన్ చేతిలో విజేందర్ పరాజయం పాలయ్యాడు.
2019 నవంబర్ లో ఘనా బాక్సర్ చార్లెస్ ఆడాము పైన నాకౌట్ విజయంతో వరుసగా 12 ప్రో ఫైట్లు నెగ్గిన మొనగాడిగా విజేందర్ కు రికార్డు ఉంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో భారత్ కు కాంస్యపతకం అందించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న 35 ఏళ్ల విజేందర్ కరోనా కారణంగా ప్రాక్టీసుకు దూరమయ్యాడు.
Also Read: ఆల్-ఇంగ్లండ్ క్వార్టర్స్ లో సింధు
విజేందర్ టెక్నికల్ నాకౌట్…..
ఒలింపిక్స్, ప్రపంచ బాక్సింగ్ పోటీలలో భారత్ కు కాంస్యపతకాలు సాధించిపెట్టిన విజేందర్ 2015లో ప్రొఫెషనల్ బాక్సర్ గా తన కెరియర్ ప్రారంభించాడు. నాలుగేళ్ల కాలంలో వేర్వేరు దేశాలకు చెందిన 12 మంది ప్రత్యర్థుల పై తిరుగులేని విజయాలు సాధించిన విజేందర్ కు 13వ ప్రత్యర్థి చేతిలో మాత్రం ఓటమి తప్పలేదు.మొత్తం ఎనిమిదిరౌండ్ల ఈ పోరు మొదటి మూడురౌండ్లలో విజేందర్,అతని ప్రత్యర్థి లోప్ సాన్ పంచ్ కు పంచ్ విసురుకొంటూ సమఉజ్జీలుగా నిలిచారు.
అయితే నాలుగోరౌండ్ నుంచే రష్యన్ బాక్సర్ లోప్ షాన్ భారీముష్టిఘాతాలతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి ధాటికి తట్టుకోలేక విజేందర్ ఓసారి నేలకొరిగి ఆ పైన లేచి నిలబడగలిగాడు.తీవ్రంగా అలసిపోయినా విజేందర్ తుదివరకూ పోరాడినా జడ్జీలతో పాటు రింగ్ అంపైర్ సైతం టెక్నికల్ నాకౌట్ ఫలితాన్ని రష్యన్ బాక్సర్ కే అనుకూలంగా ఇచ్చారు.దీంతో ఐదేళ్ల విజేందర్ ప్రో కెరియర్ లో తొలిపరాజయంతో ఓటమి భారాన్ని మూటకట్టుకోక తప్పలేదు.
Also Read: టీ-20 సిరీస్ లో నేడే టైటిల్ ఫైట్
తన కెరియర్ లో 8 నాకౌట్లతో సహా మొత్తం 12 విజయాలతో దూకుడుమీదున్న విజేందర్ జైత్రయాత్రకు లోప్సాన్ గండికొట్టాడు. డబ్లుబీవో ఆసియా- పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ పోరులో మాత్రం తనకంటే తొమ్మిదేళ్ల చిన్నవాడైన లోప్సాన్ దూకుడు ముందు విజేందర్ నిలువలేకపోయాడు.26 సంవత్సరాల లోప్సాన్ కు ప్రో బాక్సర్ గా ఆరు బౌంట్లలో రెండు నాకౌట్లతో సహా నాలుగు విజయాలు, ఓ ఓటమి, ఓ డ్రా రికార్డు ఉన్నాయి.నేలమీద కాకుండా నీటిపైన జరిగిన ఈ బ్యాటిల్ ఆన్ షిప్ బౌట్ లో మాత్రం విజేందర్ పూర్తిగా మునిగిపోక తప్పలేదు.