పరువునష్టం కేసులకు సంబంధించిన చట్టాన్ని అత్యవసరంగా పునస్సమీక్షించాలి. యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా లాంటి అనేక దేశాలు అలాంటి చట్టాన్ని తొలగించుకున్నాయి. మన పొరుగు దేశమైన శ్రీలంక కూడా తొలగించుకుంది. రాజకీయనాయకులు తమ ఎన్నికల ప్రసంగాలలో విసిరిన ఛలోక్తులకో, అనాలోచిత వ్యాఖ్యలకో జైలుపాలు కావడం నిజంగా ఒక విడ్డూరమైన పరిస్థితికి దారితీస్తుంది. రాజకీయనాయకులు తమ ఎన్నికల ప్రసంగాలలో దొర్లించే ఆలంకారికపదాలు, అతిశయోక్తులు లేదా నర్మగర్భం మాటలపట్ల ఉదారంగా వ్యవహరించవలసిన అవసరాన్ని 1965లో సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థ దృష్టికి తెచ్చింది. “…అలాంటప్పుడు వాతావరణం సాధారణంగా పాక్షికత నిండిన స్పందనలతో, భావోద్వేగాలతో ఉద్రిక్తంగా మారుతుంది; ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే క్రమంలో మాటల్లో అతిశయోక్తులు దొర్లించడం, గోరంతను కొండంతలు చేయడం, నర్మగర్భమైన మాటల్ని రువ్వడం జరుగుతూ ఉంటుంది. అదంతా ఆటలో భాగం. కనుక, న్యాయస్థానపు ప్రశాంతవాతావరణంలో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ మేరకు వాటికి మినహాయింపు నివ్వడం, ఆక్షేపణీయ ప్రసంగాలను ఈ వెలుగులో అర్థంచేసుకోవడం అవసరం” (కుల్తార్ సింగ్ వర్సెస్ ముక్తార్ సింగ్-1965) అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
మన బహుళపక్ష ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు. కనుక పరువునష్టం అభియోగాన్ని ఎదుర్కొని ఏళ్లతరబడి ఎన్నికలకు దూరమయ్యే ప్రమాదం ప్రతి రాజకీయనాయకుడికీ ఎదురవుతుంది. పరిణత ప్రజాస్వామ్యాలలోని ప్రజలు నిర్భయంగా చలోక్తులను ఆనందించగలిగి ఉండాలి. తమను చూసి తమే నవ్వుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే జనాన్ని జైలుకు పంపే పనిలోనే మన కాలమంతా వెచ్చించాల్సివస్తుంది.