Thursday, November 7, 2024

పోలవరం డ్యాము ఎత్తు తగ్గించి నది పొడవునా పది బ్యారేజీలు కట్టాలి !

నూర్ బాషా రహమతుల్లా

ఆనకట్టలను ఎంత పటిష్టంగా నిర్మించినప్పటికీ వాటికీ జీవిత కాలం ఉంటుందనీ, భారత్ లోని అనేక డ్యాములకు కాలంచెల్లిందనీ 50 ఏళ్ళు దాటాక కాంక్రీటు డ్యాముల్లో సమస్యలు మొదలై వాటిదిగువన ఉన్న లక్షలాది ప్రజలకు ప్రమాదం ముంచుకొస్తుందని ఐక్య రాజ్యసమితి హెచ్చరించింది. అలాంటి డ్యాములు ఇప్పటికే 1115 ఉన్నాయట. 2050 నాటికి 4250 డ్యాములజీవితకాలం ముగుస్తుందట. ముళ్ళపెరియార్ ఆనకట్ట నిర్మించి 100 ఏళ్ళు దాటిందని అది బద్దలైతే కేరళ తమిళనాడు ప్రజలప్రాణాలు పోతాయని హెచ్చరించింది.

పెద్ద  డ్యామ్ ల వల్ల వరదలు వస్తాయా?

వరదలకు పెద్ద డ్యాములు కూడా కారణం అవుతున్నాయా? భారీ డ్యాములు వద్దు. నదులు సముద్రంలో కలిసే వరకు ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న రిజర్వాయర్లూ, బ్యారేజీలూ కట్టాలి. నది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి. నదులలోనే విస్తారమైన జలసంపద నిలువ చేయవచ్చు అని కే ఎల్ రావుగారు ఆనాడే చెప్పారు. విపత్తులపై జాతీయ వ్యూహం లేదు. నా చిన్నప్పుడు నందికొండ నాగార్జున సాగరమోస్తుందీ అని బిక్షగాళ్ళు పాటలు పాడుతూ అడుక్కునేవాళ్ళు. దాన్ని మూయటం చేతగాక అప్పుడు వరదలోచ్చాయని జనం చెప్పుకున్నారు. ఇండియాలో నూటపాతికకు పైగా వాతావరణ జోన్లు ఉన్నాయి. ఒకపక్క వరదలు, మరోవంక కరవు కాటకాలు.

ఇది చదవండి: పోలవరం నిర్మాణంలో కీలక ఘట్టం

ముంపు ముప్పు జాబితా

నేటికీ ముంపు ముప్పు జాబితాలో పంజాబ్‌, పశ్చిమ్‌ బెంగాల్, బిహార్‌, యూపీ, ఏపీ, హరియాణా, కేరళ ఉన్నాయి. రిజర్వాయర్ల నిర్వహణ వ్యవస్థ శాస్త్రీయంగా లేదు. డ్యాములు పగలటంద్వారా కలిగే విపత్తు మనకు మనమే కల్పించుకుంటున్నాము. డ్యాములకు బదులు బ్యారేజీలు పెద్దపెద్ద చెరువులు రిజర్వాయర్లు ఎక్కువ సంఖ్యలో నిర్మించుకోవాలి. బిహార్‌ కోరుతున్నట్లు విపత్తుల నిర్వహణ వ్యయమంతా కేంద్రమే భరించాలి.

కలుషిత నదులు

దేశంలోని 351 కలుషిత నదుల్లో గోదావరి,కృష్ణా, నాగావళి, తుంగభద్ర, కుందు  అనే 5 నదులు  ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. తెలంగాణాలో మూసీ, మంజీరా, మానేరు, కిన్నెరసాని నదులు ఉన్నాయి. నదులకు కూడా మానవహక్కులు ఉంటాయని కోర్టులు చెప్పాయి. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి డిల్లీ వెళ్ళి పోలవరం ప్రాజెక్టుకు 55 656 కోట్ల నిధులు అడిగారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో 300 గ్రామాల ప్రజలు ఆదివాసీలకు నిర్వాసితులకు నేటికీ ఆర్‌ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా అందలేదు. పునరావాసం బాధ్యత తనకు లేదని కేంద్ర బిజెపి ప్రభుత్వం అంటోంది.

డ్యామ్ ల బదులు బరాజులు నిర్మించాలి

పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచి కూడా తగ్గించబోమని జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు నిర్ణీత ప్రకారం నిర్మించ వచ్చుగాని ప్రాజెక్టులో నీళ్లు నిలపడం మాత్రం సాధ్యం కాదు. 45.72 (150 అడుగులు) మీటర్ల మేర ప్రాజెక్టు నిర్మించితే 85 వేల కుటుంబాలను తరలించ వలసి వుంటుంది. అదే 41.15 (135 అడుగులు) మీటర్ల ఎత్తు అయితే తరలించవలసిన పునరావాస కుటుంబాల సంఖ్య ఖర్చు బాగా తగ్గుతుంది. పోలవరం నిర్మాణం వల్ల  లక్ష ఎకరాల పైన భూమి, 373 హెక్టార్ల అటవీ భూమి మునిగిపోతాయి. దాదాపు 1.6 లక్షల జనం నిరాశ్రయులవుతారు. డ్యాములకు బదులు బరాజుల నిర్మాణం జరిగితే ఈ నష్టాలను తగ్గించవచ్చు. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలు  రాజమహేంద్రవరం కూడా మునిగిపోకుండా కాపాడవచ్చు. గోదావరి నదిలో నౌకాయాన సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి కాకినాడ వరకు వరదలను అరికట్టి నావలు నడపవచ్చు.700 టీఎంసీల జలాలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయి.

ఇది చదవండి: ముమ్మరంగా పోలవరం పనులు-సీఎం జగన్

జలరవాణా మార్గాలు

మహారాష్ట్రలో బాబ్లీ కట్టారు కాబట్టి పూర్వం లాగా నీళ్ళు మనకు రావు. కాబట్టి భారీ కాంక్రీట్ డ్యాము కాకుండా ఆదిలాబాదు- వరంగల్- కరీంనగర్-ఖమ్మం జిల్లాల్లో గుర్తించిన పెద్ద బెల్లాల-ఎల్లంపల్లి -చిన్నూరు -సూరారం-కాంతనపల్లి -ఇచ్చంపల్లి -ఈదర- దుమ్మగూడెం -భద్రాచలం -కూనవరం -శబరి, పోలవరం లాంటి ప్రదేశాలలో గోదావరి పైన చిన్న చిన్న బరాజ్‌లను, రిజర్వాయర్లను డ్యాములను, జలాశయాలను నిర్మించి డ్యాములకు లాకులను ఏర్పాటుచేస్తే సముద్రం నుంచి  600 కిలోమీటర్ల వరకు జలరవాణా మార్గం ఏర్పడుతుంది. హిమాచలప్రదేశ్ బియాస్ నదిపై నిర్మించిన మనాలీ డ్యామ్ కూలిపోయి ఎంత నష్టం జరిగిందో చూశాము. భారీడ్యాములు కూలితే జరిగే ప్రమాదం ఎక్కువ. పోలవరం 150 అడుగుల ఎత్తులో నిర్మాణం జరిగితే నిత్యం గోదావరిలో 50 అడుగుల లోతు 30 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుంది.

నదులపై ప్రతి వంద కిలోమీటర్లకూ ఒక బ్యారేజి

కాబట్టి నదులపై ప్రతి వంద కిలోమీటర్లకొకటి చొప్పున చిన్న చిన్న బ్యారేజీలు, మినీ హైడల్ ప్రాజెక్టులు కట్టి ఎక్కడికక్కడే నీటి అవసరాలు తీర్చాలని,నదుల రెండు గట్లనూ రహదారులుగా మార్చాలి.  నదులు జీవనప్రదాతలు. దేశంలో జీవజల  నదులన్నీ నిర్లక్ష్యానికి గురై, విషకలుషితం అయ్యాయి. నర్మద ఒక్కటే కాదు- బెట్వా, పెంచ్‌, చంబల్‌ తదితర వందలాది నదుల్లో తగినంత నీరు లేదు. నదులపట్ల కనీస బాధ్యతను గాలికొదిలేసి, వాటిని స్వార్థ ప్రయోజనాలకు బలిపెడుతున్నారు. పెనుమూడి వంతెన దగ్గర బ్యారేజీ కడితే ప్రకాశం బ్యారేజీ నుండి అవనిగడ్డ అక్విడక్టు వరకూ కృష్ణానదిలోనే ఎన్నో నీళ్ళు నిలవ చేయవచ్చు.వాగులపై స్లూయిజ్ లు కూడా బాగుచెయ్యాలి .

భద్రాచలం డివిజన్ 1959 దాకా తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా వుండింది. కోయదొరలు, కొండరెడ్లు, గొత్తికోయలు, శబరులు, గోండులు, వాల్మీకులు, దొమ్మరులు, కాటికాపరులు, చెంచులు, పరికముగ్గులవాళ్ళు, పిచ్చుకగుంట్లు, బుడబుక్కలు, ప్రధానులు, పెద్దమ్మల వాళ్ళు, తోటీలు, పలు గిరిజన తెగల వారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు. భద్రాచలం నుండి వాజేడు ,చింతూరుల మీదుగా ఖమ్మం అనేక ప్రయాసలకోర్చి వెళ్ళవలసి వుంటుంది. భద్రాచలం రోడ్ గా పిలువబడే రైల్వే స్టేషన్ ఇక్కడికి 40 కి.మీ.దూరంలోనున్న కొత్తగూడెం లో ఉంది.

సుందరయ్య స్వప్నం

కీ.శే.పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకం (1946) లో కొవ్వూరు-భద్రాచలం అనే కొత్త రైలు మార్గాన్ని కోరారు. అది నేటికీ నెరవేరలేదు. భద్రాచలం ఏజెన్సీ వాసులు, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల మీదుగా వయా మారేడిమిల్లి ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెడతారు. పోలవరం నిర్మాణం జరిగితే ఈ మండలాలన్నీ పూర్తిగా నీటిలో మునిగిపోతాయి. శబరి నదిపై ఉన్న బ్రిడ్జిలు ఎప్పుడూ నీటిలోనే మునిగి ఉంటాయి. ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు కుంట వరకు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంచెత్తుతుంది. జాతీయ రహదారి, భద్రాచలం నుంచి మారేడుమిల్లి రహదారి పూర్తిగా నీటమునుగుతుంది. దీంతో భద్రాచలం వాసులు ఆంధ్ర ప్రాంతంలోని రాజమండ్రికి వెళ్లాలంటే తెలంగాణ ప్రాంతంలోని పాల్వంచ, సత్తుపల్లి మీదుగా రాజమండ్రికి చేరుకోవాల్సి ఉంటుంది. దీనికోసం 230 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాలి. అటు కృష్ణా జిల్లా తిరువూరు వెళ్లాలన్నా బంజర మీదుగా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప చేరుకోలేరు.

కె.ఎల్ రావు ప్రతిపాదించిన గంగాకావేరి అనుసంధానం

 
పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి మళ్లించారు.‘మహానది-గోదావరి’, గోదావరి-కృష్ణా- కావేరి నదుల అనుసంధానం కావాలంటున్న కేంద్రం గంగా-కావేరీ నదుల అనుసంధానం జరిపి వందలాది బ్యారేజీలు కట్టి ఉత్తరాది వరదల ప్రాంతాల నీళ్ళను దక్షిణాది కరువు ప్రాంతాలకు తరలించే పని కేంద్రం చేపడితే బాగుండేది. డాక్టర్‌ కె.యల్‌.రావు కేంద్రమంత్రిగా 2,640 కిలోమీటర్ల ‘గంగ-కావేరి అనుసంధాన పథకం ప్రతిపాదించారు. ఉత్తర భారతంలోని బ్రహ్మపుత్ర, గంగ వంటి జీవనదుల నీటిని దక్షిణ భారతానికి మళ్లించాలి.

ఇది చదవండి: కాళేశ్వరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు కేంద్రం బ్రేక్

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం

అందువల్ల ఉత్తరాదిన వరదల బెడదను నివారించి దక్షిణాదిన నీటి కొరతను తీర్చటానికి గంగా కావేరీ నదులను అనుసంధానం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం 2002 అక్టోబరు 31న కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రప్రభుత్వం కూడా సరే అని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఒకే దేశం- ఒకే ప్రజ- నినాద స్పూర్తితో అన్నీ రాష్ట్రాల ప్రజలు ఐక్యమవ్వాలంటే అన్నిరాష్ట్రాలకూ సదుపాయాలు సమంగా అందాలి. దేశంలో వరదలతో కొన్ని రాష్ట్రాలు అల్లాడుతుంటే తాగు, సాగు నీటి కొరతతో కొన్నిరాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు కాకూడదంటే వందలాది బ్యారేజీలు కట్టాలి.అన్ని రాష్ట్రాల దాహార్తిని తీర్చాలి. అన్ని రాష్ట్రాల భూములకు వరదలను అరికట్టి సాగునీటిని కల్పింఛాలి.ఇతర రాష్ట్రాల నుంచి నీటిని తీసుకునే రాష్ట్రాలు, తమ నీటిని పొరుగు రాష్ట్రాలకు ఇవ్వటంలేదు.

నదుల అనుసంధానాన్ని వ్యతిరేకించిన రాష్ట్రాలు

బిహార్‌, కేరళ, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, ఒడిశా, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాలు నదుల అనుసంధానానికి ఒప్పుకోలేదు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ ,గుజరాత్‌, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, హరియాణా, మహారాష్ట్రలు అనుసంధానానికి అంగీకరించాయి. గోదావరికి పైనుంచి నీళ్లు తీసుకువస్తే తప్ప, ఇక్కడి నీటిని బయటకు తరలించే అవకాశం లేదన్నది తెలంగాణ అభిప్రాయం. పెన్నకు, కావేరికి తరలించడానికి చాలినంత నీరు గోదావరిలో ఉండదనీ, మహానది నుంచి నీటిని గోదావరికి మళ్లించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరిక.

నదులు అనేకం, నీటి ఎద్దడి అనివార్యం

దేశంలో 450 నదులు ప్రవహిస్తున్నా 60 కోట్ల భారతీయులు తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్నారు. 84 శాతం జనానికి కుళాయి నీళ్లు అందుబాటులో లేవు. పోలవరం ప్రాజెక్టు వద్దనీ, వరదల ఒండ్రు వల్లనే తమ భూమి సారవంతమవుతుందనీ కోనసీమ కొబ్బరి రైతులు, తమ కొబ్బరి చెట్లకోసం కోనసీమకు రైలుమార్గం కూడావద్దన్నారని ఒక పుకారు. భారీ వ్యయంతో పోలవరం లాంటి భారీ డ్యాములు కట్టే కంటే నదులు సముద్రంలో కలిసే దాకా ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న రిజర్వాయర్లూ,బ్యారేజీలూ కట్టాలి. ఎక్కడికక్కడే చిన్న బ్యారేజీలూ, రిజర్వాయర్లూ స్థానిక అవసరాలకు ఉపయోగపడతాయి. నది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి. వేరే భూమి కొననక్కరలేదు.అలా చేస్తే నదులలోనే విస్తారమైన జలసంపద నిలువ చేయవచ్చు.

(రచయిత విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles