Sunday, December 22, 2024

డెక్కన్ రేడియో

పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది. డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు మొదలయ్యేవి. ‘యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే’ ఉర్దూ తెలియని వాళ్లు కూడా వసీం అక్తర్ చదివే వార్తలు వినడం నాకు తెలుసు. ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం వింటున్నట్టుగా వుండేది. నేను ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను. కొన్ని ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా పెద్దవా అన్న మాట అటుంచి గొప్పగొప్ప వాళ్ళతో కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది.

దేశానికి స్వాతంత్రం రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే, అప్పటి నిజాం సంస్థానంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. 1933 లో రెండువందల వాట్ల ట్రాన్స్మిషన్ శక్తితో, ‘డెక్కన్ రేడియో’ అనే పేరుతో ఒక ప్రైవేటు రేడియో స్టేషన్ ను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఆ రేడియో ట్రాన్స్ మిటర్ ను స్తానికంగా రూపొందించడం విశేషం. వాస్తవానికి ఈ రేడియో కేంద్రం ఒక కుటుంబం ఆద్వర్యంలో ఏర్పడింది. ఆ కుటుంబసభ్యులే కేంద్రం నిర్వహణ బాధ్యత చూసుకునేవారు. చిరాగ్ ఆలీ లేన్ లోని ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో కేంద్రం పనిచేసేది.

ఉర్దూలో వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు, పాటలు ప్రసారం అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా దొరికేవి కావు. దానితో స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ కార్యక్రమాలను రికార్డ్చే సేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్ రేడియోలో మొదటి మ్యూజిక్డై రెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్ రేడియోలో స్టుడియో ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర కాలంలో రవూఫ్ ఈ కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.

మొహరం మాసంలో రేడియో కేంద్రానికి సెలవు ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.
ఆ తరువాత కొన్ని మార్పులు చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన రోజుల్లో కూడా సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో వెలువడిన వార్తల ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే వార్తల్లో చోటుచేసుకునేది.

రెండేళ్ళ తరువాత అంటే 1935 లో డెక్కన్ రేడియో కేంద్రాన్ని నిజాం స్వాధీనం చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్ లెస్ విభాగం కింద డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు పెట్టింది. నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఆధ్వర్యంలో డెక్కన్ రేడియో కేంద్రానికి మరిన్ని హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్ ను దిగుమతి చేసుకున్నారు. రేడియో కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతా బాద్ లోని యావర్మ జిల్ అనే భవనంలోకి మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను నిర్మించారు. నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా నెలకొల్పారు. దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక ప్రాంతాలకు కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని లండన్ పంపించి బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఎంతటి శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.

తరువాతి రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి శ్రోతల నుంచి విశేషమైన ఆదరణ లభించడం అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్, హీరా బాయ్ బరడేకర్, ఆవిడ సోదరి సరస్వతీ రాణే వంటి సుప్రసిద్ధ సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ సంగీత కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్ రేడియోలో ప్రోగ్రాములు ఇచ్చారు. డెక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి కాని వాటి వ్యవధి చాలా పరిమితం.

(సమాచార సేకరణకు సహకరించిన అనేకానేకమందికి అనేక వందనాలు. కృతజ్ఞతలు – భండారు శ్రీనివాసరావు)

(12th November: Public Service Broadcasting Day)

Related Articles

1 COMMENT

  1. డెక్కన్ రేడియో అని ఫ్రీక్వెన్సీ 107.8 Mhz అని బొమ్మలో ఉన్నది, కవనంలో 1933 లో మొదలు పెట్టిన రేడియో అని ఉన్నది. 107.8 Mhz FM Transmissionకు సంబంధించిన Frequency. 1930లకే FM ఇండియాలో వచ్చిందా! నాకు తెలిసి మొదటి FM Station ఆకాశవాణి వారు చెన్నై లో 1977లో మొదలుపెట్టారు.మొదటి కమర్షియల్ FM Station బెంగుళూరులో కాబోలు 2001 లో మొదలయ్యింది. ప్రపంచంలోనే, FM Radio అనే కాన్సెప్ట్ 1930లలో వచ్చినా ఎఫ్ ఎం Commercial రేడియో 1940ల వరకూ రాలేదు.
    నేను అనుకోవటం డెక్కన్ రేడియో అని ఒక Community Radio హైదరాబాదులో కొంతకాలం క్రితం వచ్చింది. ఇప్పుడు లేదు. ఆ రేడియో ఫ్రీక్వెసీ 107.8Mhz. ఆ బొమ్మ పట్టుకొచ్చి “సకలం” వారు మీ వ్యాసానికి తగిలించేశారు, ఐదారేళ్ళ క్రితం ఆంధ్ర ప్రభ వారు జమునా రాణి గురించి వ్రాసిన వ్యాసానికి, జమున బొమ్మ వేసినట్టు.
    Deccan Radio (Community Radio) గురించిన వివరాలు ఈ కింది లింకులో ఉన్నాయి
    https://communityvoices.in/…/community-media-profile/1288/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles