Monday, December 30, 2024

నీలాకాశాన్ని కొలిచే కొలబద్ద

వ్యంగ్యరచన

కరోనా తగ్గింది కదానని సూర్యారావు భార్యని తీసుకొని సూపర్ మర్కెట్ కి వెళ్ళాడు.

‘‘ఎన్నాళ్ళైందోనండీ పిల్లలకి పంటికిందికి మంచి వంటలు చేసిపెట్టి…తిండికి వాచిపోయి ఆవురావురంటున్నారు’’ అని బాధపడింది శ్రీదేవి.

పిల్లలేం కర్మ! తనకి మాత్రం ఏదో ఒకటి తినాలనిపించినా, నోరు కట్టుక్కూర్చున్నాడు. ఈ కరోనా ఎంత కాలం ఉంటుందో ఏమోనన్న భయంతో ఖర్చులు తగ్గించేసుకొన్నాడు. పైపెచ్చు పిల్లలేవైనా కావాలని అడుగుతే ‘‘ఇల్లు కదుల్తే కరోనా తగుల్తుందేమో’’నని బెదిరించేవాడు.

ఆ దెబ్బకి రేపు నాన్న  లేకపోతే ఎట్లా? అమ్మ లేకపోతే ఎట్లా? తమ్ముడు లేకపోతే ఎట్లానని ఊహించుకొని బాధపడి నోరు తెరిచి ఏదీ అడిగేవాళ్ళు కాదు. కానైతే అతని భార్య తనూ, పిల్లలూ ఇంట్లోనే పడి ఉంటున్నారు కదానని, ఉన్న దాంట్లోంచే యూట్యూబ్ లో వంటలూ, వార్పులూ చూసి ఏవేవో కొత్తకొత్త వంటలు చేస్తుండేది. కరోనా అందర్నీ ఇళ్ళకే కట్టిపడేసి ఇళ్ళాళ్లకి మాత్రం క్షణం తీరిక లేకుండా చేసింది. శ్రీదేవి పడుతున్న శ్రమ చూసి తనూ అప్పుడుప్పుడు మధ్యలో చేయిచేసుకొని, వంటలు చెడగొట్టేవాడు. ‘‘మీ మగాళ్ళు బయట ఒరగబెట్టడానికి తప్ప ఇంట్లో తింటానికే గానీ ఎందుకూ పనికి రారు,’’ అని తనని అల్లరి పెట్టేది శ్రీదేవి.

సూపర్ బజార్

‘‘మరి నలభీములు సంగతేమంటావ్?’’

భీముడి వంట తిని అరిగించుకోలేక విరాటరాజు బావమరిది కీచకుడు ద్రౌపది వెంట పడ్డాడు. మీరు వంట చేస్తే మా బ్రతుకులు ద్రౌపది బ్రతుకులా తయారౌతాయి.

‘‘బియ్యంలో రాళ్ళు ఏరి వేయకుండా రాళ్ళు ఉడికే దాకా వండు, కోర్టులో కేసుల్లాగే నీ వంట ఎప్పటికీ తెమలదు. అయినా భీముడెప్పుడూ ద్రౌపది కోసం వండి వార్చినట్లగా మహాభారతంలో చెప్పలేదు. ఇంట్లో వంట చేసేది ఆడవాళ్ళే.’’

శ్రీదేవి ఇలా కడిగెయ్యగలదని సూర్యారావు ఎప్పుడూ అనుకోలేదు. ‘‘నా వంట తినలేక కడుపు మాడ్చుకుంటే ఎంతో కొంత మిగుల్చుకోవచ్చు కదా!’’ అన్నాడు.

‘‘అందుకే పేదవాడి ఆకలికి కొండలు కరిగిపోతున్నాయి. నదులూ, సముద్రాలూ ఇంకిపోతున్నాయి.’’

ఏడవలేక నవ్వేశాడు సూర్యారావు.

కరోనా తగ్గిన తరవాతనైనా పిల్లల కోరిక తీర్చొచ్చని తనతో సూపర్ మార్కెట్ కొచ్చింది శ్రీదేవి. అక్కడ కావల్సినవన్నీ తీసి హడావుడిగా ఒక బుట్టలో పడేస్తోంది. ‘‘ఎన్నాళ్ళైందోనండీ ఈ లిటిల్ హార్ట్స్ ని చూసి. అరే ఇంకా సింథాల్ ఒరిజినల్ సోప్స్ వస్తున్నాయే? ఆర్గానిక్ కందిపప్పుతో చారు కాస్తే, మన చిన్నప్పుడు వచ్చినంత సువాసన వస్తుందేమోనండీ’’ అంటూ చిన్నపిల్లలా ఒక్కొక్క వస్తువూ తీసి బుట్టలోవేసింది. ‘‘ఇవన్నీ అవసరమేనా’’ అనిపించిందతనికి. ఆమె సంతోషానికి అడ్డురావడం ఇష్టం లేక చూస్తూ ఊరుకొన్నాడు. ‘‘ఇన్ని వస్తువులు ఒక్కసారి మొయ్యగలుగుతామా?’’ అని మాత్రం పైకి అన్నాడు.

‘‘పొట్టకి లేని బరువు చేతులకుంటుందా?’’

పొట్ట బరువెక్కుతే గుండెపోటు రావడం అలాగుంచి వికారంగా కనిపిస్తాం. ‘‘మనకా ప్రాబ్లం ఉండదులెండి. ఒకటిన్నర సంవత్సరాల తరువాత ఇప్పుడేగా మార్కెటింగ్ కి వచ్చింది,’’ అన్నది శ్రీదేవి.

కౌంటర్ దగ్గర అన్ని వస్తువులూ ఉంచి బిల్ చేయమన్నాడు. బిల్ రెడే చేసి కార్డా,క్యాషా అన్నాడు. కార్డేనని జేబులోంచి డెబిట్ కార్డ్ తీసిచ్చాడు. మెషీన్ లో పెట్టి చూసిన క్యాషియర్ ‘‘ఇన్ సఫీషియంట్ బ్యాలెన్స్ సార్’’ అన్నాడు.

బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోవడానికి అవకాశమే లేదు. కరోనా టైంలో ఇంటిల్లిపాదీ కడుపు కట్టుకొని కూడబెట్టిన సొమ్ము, ఎలా మాయమైపోతుంది! ఇందులో ఏదో మాయుంది. మోసం ఉంది.

‘‘సార్ కొన్ని వస్తువులు తగ్గించి బ్యాలెన్స్ ఎంతుంటే అంతకి సరిపెట్టుకోండి సార్!’’ అన్నాడు క్యాషియర్.

శ్రీదేవి మొహం తెల్లబోయింది. మూడొంతులు వస్తువులు తీసేసింది అయినా తలాభారానికి బ్యాంక్ బ్యాలెన్స్ సరిపోలేదు. సూర్యరావు దగ్గర క్రెడిట్ కార్డు కూడా లేదు. ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో తనకిష్టమైన టీపొడిని కూడా తీసేశాడు. అప్పుడు కానీ కార్డు మారలేదు.

ఇద్దరూ తేలిగ్గా ఉన్నసంచిని ఊపుకుంటూ బరువైన హృదయంతో ఇంటికి వచ్చారు.

‘‘నువ్వేమీ దిగులు పడకు. నేను రేపు బ్యాంకు వాళ్ళకి కంప్లయింట్ ఇచ్చి విషయం తేల్చుకుంటాను. మన డబ్బులెక్కడికీ పోవు,’’ అని భార్యని సమాధాన పర్చాలని చూశాడు సూర్యారావు.

‘‘ఈ మధ్యన కార్డు ఎక్కువసార్లు ఆన్ లైన్ ట్రాస్ జాంక్షన్లకి వాడాం. ఎక్కడో మోసం జరిగగుంటుంది. ఆ విషయం బ్యాంకువాళ్ళకి కంప్లయింట్ యిస్తే తేలిపోతుంది. అప్పుడు మోసం జరిగిందని తేలితే సైబర్ క్రైంలో కంప్లైంట్ చేస్తాను.’’

‘‘మన డబ్బులు మనచేతికి ఎప్పుడు రావాలో ఏంటో. అప్పటి దాకా పిల్లలు కడుపు కట్టుకొని ఉండాల్సిందే,’’ అంటూ దిగులుమొహం పెట్టింది శ్రీదేవి.

బ్యాంక్ వాళ్ళకి ఆన్ లైన్ లో కంప్లయింట్ ఇచ్చాడు. కార్డు బ్లాక్ చేయించాడు. ‘‘అయినా చెల్లని కార్డుని ఎవరు మిస్ యూజ్ చేయగలుగుతారు?’’ అంటూ పెదవి విరిచాడు సూర్యారావు.

ఆ మర్నాడు కరోనా కొంత తగ్గిన తర్వాత తెరుచుకున్న ఆఫీసుకి మొదటిసారి బయలుదేరాడు. జేబులో బొటాబొటిగా రెండు లీటర్లకి సరిపడా డబ్బులున్నాయి. ఆ పూటకి ఆఫీసుకి వెళ్ళి రావడానికి అవి సరిపోతాయి. ఈ లోగా బ్యాంకువాళ్ళు సమస్యని సాల్వ్ చేస్తారు అనుకున్నాడు. ఎంతోధీమాగా భార్యాపిల్లల్ని ఎదుర్రమ్మని ఆఫీసుకు బయలుదేరాడు.

దార్లో పెట్రోల్ బంక్ దగ్గర బైక్ ఆపి, ముందున్న అద్దంలోకి చూసుకుంటూ రెండు లీటర్లు పెట్రోలు కొట్టమని జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చాడు. ‘‘సార్, మీరిచ్చిన డబ్బులకి రెండు లీటర్ల పెట్రోల్ రాదు సార్, ఒక లీటర్ పోయించుకోండి’’ అన్నాడు.

శ్రీదేవికి బొత్తిగా బుద్ధిలేదు. చెప్పకుండా తన జేబులోంచి డబ్బులు తీసుకొని వాడుతుంది. ఎన్ని సార్లు చెప్పినా ఆ మనిషంతే…విసుక్కొన్నాడు. అతని మౌనాన్ని అంగీకారంగా భావించి లీటర్ పెట్రోల్ తో సరిపుచ్చాడు బంక్ అతను.

ఆ బాయ్ కేసీ చూడటానికి అతనికి మొహం చెల్లలేదు. పైపెచ్చు ఈ పెట్రోల్ ఆఫీసుకు వెళ్ళేవరకూ సరిపోతుంది. తిరిగి వచ్చేటప్పుడు ఎలా?

ఎవర్నైనా చేబదులు అడగాలి. అయినా యీ కరోనా కరువులో అందరి జేబులూ చిల్లులు పడే ఉంటాయి. బైక్ పాడయ్యిందని ఆఫీసులో పెట్టేసి, ఏ శాస్త్రినో సగం దూరం వరకూ లిఫ్ట్ అడిగి, మిగిలిన దూరం కాళ్ళకి పని చెప్తే సరి. నడకతో రెసిస్టెన్స్ పెరుగుతుంది. అప్పుడు కరోనా తన దగ్గరరకు వచ్చే చాన్స్ ఉండదనుకొని రాజీలో కూడా సంతోషంగా సర్దుకుపోయాడు.

ఆ సాయంత్రం అనుకున్నట్టే సగం దూరం లిఫ్ట్ అడిగొచ్చి, మిగిలిన సగం దూరం ఇంటికి నడిచొచ్చి అలిసిపోయి, కుర్చీలో కూలబడి, ‘‘శ్రీదేవీ కొంచెం టీ పెట్టు’’ అన్నాడు.

‘‘మర్చిపోయారా? నిన్నేకదా, డబ్బులుసరిపోక టీప్యాకెట్ తిరిగిచ్చేశాం. అన్నట్టు సాయంత్రం బ్యాంకు వాళ్ళు ఫోన్ చేశారు…’’ చటుక్కున లేచిపోయాడతను. ఏం చెబుతోందని క్యూరియస్ గా భార్యకేసి చూశాడు.‘‘మీ అక్కౌంటులో ఉన్న బ్యాలెన్స్ నిన్న మనకైన ఖర్చుకు సరిపోయిందట. ఈ కార్డు వాడ్డం అలవాటైన తర్వాత మనం బిల్లులు చూడ్డం మానేశాం. కానీ అన్ని వస్తువులకీ రేట్లు పెరిగిపోయాయి. పాలవాళ్ళు, పేపర్ వాళ్లూ కూడా రేట్లు పెంచేశారు. అదేమిటంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో ధరలు పెరిగిపోయాయి అన్నారు. మీ జీతం ఎప్పుడండీ పెరిగేది?’’

‘‘పెరగదు. పెరిగినా మనం పొదుపుగా, గుట్టుగా కడుపు నిండిన వాళ్ళాలా బ్రతకాలి’’ అని చెప్పాడతను.

అతనికి నీలాకాశాన్ని కొలవడానికి కొలబద్ద ఒకటి దొరికింది. అదే పెట్రోల్ ధర.

Krishna Rao Nandigam
Krishna Rao Nandigam
నందిగం కృష్ణారావు ప్రముఖ నవలా రచయిత, కథకుడు. ప్రఖ్యాత న్యాయవాది. మొబైల్: 93930 33345

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles