Wednesday, January 22, 2025

కామం ప్రేరిత హత్యలు పది, కామాంధుడికి ఉరి

విద్యాతురాణాం న సుఖం న నిద్ర

అర్థాతురాణాం నగురుర్ న బంధు:

క్షుధాతురాణాం నరుచిర్న పక్వం

నిద్రాతురాణాం న సుఖం న శయ్యా

కామాతురాణాం నభయంనలజ్జ

నిజంగా చదువుకోదలచుకున్నవాడు సుఖం నిద్ర కోరుకోడు. డబ్బు మీద ప్రేమ ఉన్నవాడికి గురువు బంధువనే తేడా ఉండదు. బాగా ఆకలితో ఉన్న వాడు అన్నం రుచిగా ఉందా, ఉడికిందా లేదా అని చూడడు. అలసి నిద్రించే వాడు మంచం బాగుందా, పరుపు మెత్తగా సుఖంగా ఉందా అని ఆలోచించడు. అట్లాగే కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి భయమూ ఉండదు, సిగ్గూ ఉండదు.

వరంగల్ లో సంజయ్ అనే వలసకూలీ కామం అతన్ని ఉరి దాకా తీసుకుపోయింది. బీహార్ నుంచి పొట్టకూటికి వచ్చిన కూలీ, సంజయ్ కుమార్ యాదవ్ పెళ్లయి ముగ్గురు పిల్లలున్న తల్లితో కామ సంబంధాలు పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె పెద్దకూతురిపై కూడా అత్యాచారం చేశాడు. చివరకి ఇతని కామం పదిమంది హత్యకు ఒక రేప్ కు దారి తీసి, బుధవారంనాడు (అక్టోబర్ 27, 2020) ఉరిశిక్ష పడేట్టు చేసింది.

బీహార్ నుంచీ గీసుకొండకు

బీహార్ నుంచి కూలీపనికోసం 24 ఏళ్ల సంజయ్ వరంగల్ పట్టణ పరిసరాల్లో ఉన్న గీసుకొండ గ్రామానికి వలస వచ్చి బస్తాల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. తనతో పాటు మక్సూద్ అనే మరో వలస కూలీ మొత్తం కుటుంబంతో సహా వచ్చి ఈ గ్రామంలోనే పనిచేస్తున్నాడు. మక్సూద్ భార్య నిషా ఆలంకు పరిచితురాలైన రఫీకా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానన్నాడు కాని వాడికి ఆ ఉద్దేశం లేదు. ఆమె అప్పడికే మొదటి భర్తతో విడిపోయింది. ముగ్గురు పిల్లలు. సంజయ్ కామాతురుడై ఆమె పెద్ద కూతురు మైనర్ బాలిక మీద కన్ను వేసాడు. ఆమెపై లైంగిక దాడి కూడా చేసి ఉంటాడని రఫీకా అనుమానించింది. అయినా తనను పెళ్లి చేసుకోవాలని వత్తిడిచేస్తే పెద్దల అనుమతికోసం బెంగాల్ కు వెళ్లాలని మాయమాటలు చెప్పి మార్చి నెల మూడో వారంలో ఆమెను రైలెక్కించి తాడేపల్లి గూడెం చేరుకుంటున్న సమయంలో ఆమెకు నిద్రమాత్రలిచ్చి, నడుస్తున్న రైల్లోంచి తోసివేశాడనీ, ఒక్కడే వచ్చిన సంజయ్ ని మక్సూద్ భార్య నిలదీసిందనీ పోలీసులు కనిపెట్టారు. తన ప్రశ్నలకు సంజయ్ తప్పుడు సమాధానాలు విని నిషా ఆలం మరింత అనుమానించింది. పోలీసులకు చెబుతానని బెదిరించింది.  తన నేరం బయటపడకుండా ఉండాలంటే తన కథ తెలిసిన వారెవరూ బతక కూడదని అనుకున్నాడనీ ప్రాసిక్యూటర్ కథనం. మక్సూద్ కుటుంబాన్ని మట్టుబెట్టాలనుకున్నాడు. మక్సూద్ బిడ్డ పుట్టినరోజు సందర్బాన్ని ఎంచుకున్నాడు. విందు భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. మత్తులో జోగుతున్న తొమ్మిది మందిని దగ్గరలో ఉన్న బావిలో పడేసాడు. నీళ్లలో మునిగి అందరూ చనిపోయారు. ఈ సంఘటన సంచలనం కలిగించింది. ఎవరు ఎందుకు చంపారో తెలియక కొన్ని రోజులు గందరగోళం సృష్టించింది. పోలీసులు దర్యాప్తులో సంజయ్ సంగతి బయటపడింది.కేవలం అయిదునెల్లలో దర్యాప్తు పూర్తి చేశారు. ప్రాసిక్యూషన్ పూర్తయింది. కోర్టు వంద మంది సాక్షులను విచారించింది. నిందితుడు బీహార్ వాసి కనుక, ఇక్కడ ఒంటరి వాడు కనుక దర్యాప్తులో పెద్దలెవరూ జోక్యం చేసుకోలేదు. పోలీసులు తమ విధిని నిర్వర్తించుకోగలిగారు.

పెద్దలు జోక్యం చేసుకోలేదు, న్యాయం నిలబడింది

ప్రాసిక్యూషన్ కూడా తన పని చేసుకోగలిగింది. న్యాయం నిలబడింది. కానీ పేదరికం, నిరుద్యోగం నిర్మూలించలేని ప్రభుత్వాల వైఫల్యం  బీహార్లో ఒక యువకుడిని పనికోసం వేల మైళ్ల దూరం కుటుంబానికి దూరంగా పంపించి వేసింది.

సంజయ్ వంటి 24 ఏళ్ల యువకుడు కుటుంబపు రక్షణ, అదుపు లేని ఒంటరి బతుకు బతుకుతూ దారి తప్పి కామప్రకోపానికి లోనైపోయాడు. పెళ్లయిన తల్లితో సంబంధం పెట్టుకుంటే అడిగేవాడు లేడు. ఆమె పెద్దకూతురు ఇంకా మైనర్ బాలికే అయినా వాడి కామపు కళ్లకు భయాలు లేవు, సిగ్గూ లజ్జా లేవు. ‘కామాతురాణాం న భయం న లజ్జ’ అన్న సూక్తిని శ్రీశ్రీ ఇంకాస్త కసిగా కవితారూపంలో ‘కామాతురాణాం న ముసలిర్నపిల్ల,’ అని మార్చినట్టు వాడికి తల్లికి పిల్లకు తేడా లేకుండా పోయింది. వాడి అదుపులేని మెదడు మీద సోషల్ మీడియాలో అవాంఛనీయ ధోరణులు కూడా దాడి చేసి ఉంటాయి. సుడిగుండాలు సినిమాలో హీరో నాగేశ్వర్ రావు అడిగినట్టు ఈ నేరం ఎవరు చేసినట్టు? ఈ దేశం ఏమైపోతున్నట్టు?

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles