Sunday, December 22, 2024

ఎవరు చరిత్ర హీనులు?

మొదటిభాగం

రాచకొండ పరిధిలోని రామన్నపేట సర్కిల్ కు చెందిన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో జూన్ 18, 2021 న షెడ్యూల్డ్ కులానికి (మాల), ప్రొటెస్టెంట్ మతానికి చెందిన మరియమ్మ (45) మృతి చెందింది (లాకప్ డెత్). గతంలోనే ఆమె తన భర్తను కూడా కోల్పోయింది. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ ప్రజల నుండి రావలసినంతగా స్పందన రాలేదు. పత్రికలలో, అంతర్జాలంలో కొంతమేర ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి జూన్ 21, 2021న అర్ధరాత్రి అందుబాటులో ఉన్న పౌరహక్కుల ప్రజాసంఘం ప్రతినిధులు, ఓయూ జాక్ ఛైర్మన్ అందరం ఫోన్ లో సంప్రదించుకోవటం జరిగింది. మరుసటిరోజు ఉదయం అందుబాటులో ఉన్న నేను (జయ వింధ్యాల), ఇక్బాల్ ఖాన్, సలీం, గడ్డం అశోక్ – నలుగురం నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి బయలుదేరి వెళ్ళాము.

అంతర్జాలంలోను, రాష్ట్ర పత్రికలలోనూ యాదాద్రి భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో లాకప్ మరణం అనే విషయమే మా దగ్గర ఉన్న సమాచారం. మా దగ్గర ఉన్న సమాచారంతో భువనగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాము. అక్కడ తెలిసిన అసలు విషయం అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ అని. అయితె భువనగిరి పోలీస్ స్టేషన్ లాకప్ లో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఆ మనిషిని ఎప్పుడు, ఎందుకు తెచ్చారు అని అక్కడ వున్న పోలీసులను అడగగా – దొంగతనం కేసులో రెండురోజుల కిందట తెచ్చాము అన్నారు. ఎందుకు జైలుకు పంపలేదని మేము అడగగా – పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లలో ఉండటం చేత ఆలస్యం అయిందన్నారు.

అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ హెడ్ కానిస్టేబుల్, మరో 5 మంది పోలీసులు ఉన్నారు. మేము వచ్చిన విషయం చెప్పగా అధికారులు ఎవరూ అందుబాటులో లేరనీ, సబ్-ఇన్స్పెక్టర్ (మరియమ్మ మరణానికి కారకులైన అధికారి) మహేష్ రాచకొండ సీపీ గారు పిలిచారు కనుక అక్కడికి వెళ్లారన్నారు. మరియమ్మ కేసును దర్యాప్తు చేయడానికి మల్కాజిగిరి పోలీస్ డివిజన్ ఏసీపీ గారిని విచారణ అధికారిగా నియమించినట్లు చెప్పారు. విచారణ అధికారితో ఫోన్ లోనే మేము మాట్లాడాము. “మరియమ్మ మరణానికి కారకులుగా చూపిన సబ్-ఇన్స్పెక్టర్ ను, కానిస్టేబుల్స్ ను రాచకొండ సీపీ ఆఫీస్ కు అటాచ్ చేసినట్లు, పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు, మరియమ్మ శవాన్ని ఆమె కొడుకుకు అందించినట్లు చెప్పారు విచారణ అధికారి తెలిపారు. “మరియమ్మ కొడుకు ఉదయ్ కుమార్ ఖమ్మం ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్నట్లు మాకు సమాచారం ఉన్నది, ఈ పరిస్థితులలో మరియమ్మ శవాన్ని కొడుకుకు ఎలా ఇచ్చారు “? అని మేము విచారణ అధికారిని అడిగాము. తనకు ఆ విషయం తెలియదని విచారణ అధికారి చెప్పారు. మేము మరియమ్మ కేసుకు సంబంధించిన FIR ల గురించి అడిగాము. విచారణ అధికారి హెడ్ కానిస్టేబులు కు ఇవ్వమని చెబుతానని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ మరియమ్మ పై రిజిస్టర్ చేసిన FIR, మరియమ్మ మరణానికి చెందిన FIR లు ఇచ్చారు.

మరియమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అడ్డగూడూరు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన క్యాథలిక్ చర్చి ఫాదర్ బాలశౌరిని మేము కలిసాము. బాలశౌరి చెప్పిన విషయాలు — మార్చి, 2021 లో, కోమట్లగూడెం గ్రామం, చింతకానిపల్లి మండలం, ఖమ్మం జిల్లా నివాసితురాలైన మరియమ్మ వంట మనిషిగా కుదిరినట్లు గాను, నెలకు 3000/- రూపాయలు జీతంతో పాటు చర్చి కాంపౌండులోనే ఉండేటందుకు ఉచితంగా ఒక గది, వాటర్, కరంట్ అన్ని సదుపాయాలను కలిపించినట్లు కమిటీకి చెప్పారు. 07 జూన్ 2021 నాటి రాత్రి కొడుకు ఉదయ్ కుమార్ తో కలిసి మూడు లక్షల పై బడి డబ్బులను దొంగతనం చేసి మరియమ్మ పారిపోయినదని చెప్పారు. ఆ సమయం లో ఫాదర్ బాలశౌరి హైదరాబాద్ లోని చెల్లి దగ్గెరకు వెళ్లినట్లు చెప్పారు. చెల్లి దగ్గర నుండి 08 జూన్ 2021 నాడు వచ్చినట్లుగాను, బీరువా తెరచి ఉన్నట్లుగాను, దానిలో ఉండవలసిన డబ్బులు లేవనీ, అట్టి డబ్బు మరియమ్మ, ఆమె కొడుకు ఉదయ్ కుమారు, మరియు కొడుకు స్నేహితుడు శంకర్ దొంగిలించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు మా కమిటీకి చెప్పారు. ఆ తరువాత డబ్బులను తిరిగి ఇవ్వాలని మరియమ్మకు కబురు పంపగా, ఆమె నుండి ఎలాంటి సమాధానం లేదని అందుకే 17 జూన్ 2021 నాడు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినట్లు కమిటీ కి చెప్పారు. కమిటీకి మరియు ఫాదర్ కు మధ్య జరిగిన సంభాషణ … ఈ సంభాషణ మొత్తం 450 మంది గ్రామ ప్రజల ముందు జరిగింది. కొన్ని క్షణాలలో అందరూ చర్చి ప్రాంగణంలోకి ఆ గ్రామ ప్రజలు వచ్చారు. గ్రామంలో సుమారుగా 450 గడపలు ఉన్నాయని ఫాదర్ చెప్పారు.

క్షేత్రస్థాయి విచారణ కమిటీ ( క్షే.వి.క) : పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో రెండు లక్షలు దొంగతనం జరిగింది అని ఉన్నది, మీరు మూడు లక్షల పై చిలుకు దొంగతనం చేసారు అంటున్నారు. ఏది వాస్తవం ?
ఫాదర్ : బీరువాలో రెండు లక్షలు ఉన్నాయి, మరో స్థలం లో సుమారుగా లక్ష ముప్పై నుండి లక్ష యాభై వరకున్నాయి, అట్టి డబ్బును కూడా ఎత్తుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ లో మాత్రం ఒక్క బీరువాలోని డబ్బు గురించే ఫిర్యాదులో రాసాను.
క్షే.వి.క : పోలీసులకు మీరు ఫిర్యాదు 16-06-2021 న చేసారు అని చెపుతున్నారు, మీరు 17-06-2021 అంటున్నారు?
ఫాదర్ : 16 ఉండవచ్చు, జ్ఞాపకం లేదు
క్షే.వి.క : మరియమ్మను మీ దగ్గెర ఎవరు ఉంచారు ? మీ ప్రయత్నం లో భాగంగా మరియమ్మ వంట మనిషిగా కుదిరినదా?
ఫాదర్ : నల్లగొండలో ఉన్న చర్చిలో మరియమ్మ కూతురు, అల్లుడు పనిచేస్తున్నారు. వారే నియమించారు.
క్షే.వి.క : మరియమ్మకు ముందు వంట మనిషిగా ఎవరు ఉండే వారు?
ఫాదర్ : తోమసమ్మ అనే మహిళ.
క్షే.వి.క : ఆమె ఎందుకు మానేసింది ? ఎన్ని నెలలు మీ దగ్గర వంట మనిషిగా పనిచేసింది?
ఫాదర్ : సుమారు 6 నెలలు పనిచేసింది. ఎందుకు మానేసిందో తెలియదు. మానేస్తున్నట్లు రెండునెలల ముందే చెప్పింది.
క్షే.వి.క: చర్చి నిర్మాణం జరుగుతుంది కదా, చర్చికి ఏమైన కమిటి ఉన్నదా ?
ఫాదర్ : అవును ఈ మధ్యనే మొదలు పెట్టాము. దాని నిర్మాణం కోసమే డబ్బులు బీరువాలో పెట్టాను. చర్చి డబ్బులే ఎత్తుక వెళ్లారు? ఎంత అడిగినా మరియమ్మ వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. ఆమె కూతురు, అల్లుడు మరియమ్మకు, ఉదయ్ కుమార్ కు వారి వెంట ఉన్న స్నేహితుడు శంకర్ కు దొంగతనం చేసే బుద్ధి ఉన్నది అని చెప్పారు.
క్షే.వి.క : చర్చికి కమిటీ ఉన్నదా ?
ఫాదర్ : ఉన్నది. ప్రెసిడెంట్ అగస్టీన్ ( అగస్టీన్ అక్కడే ఉన్నారు. పరిచయం చేసారు).
క్షే.వి.క : మరియమ్మ దొంగతనం గురించి చర్చి కమిటి పెద్దలకు వివరించి ఉన్నారా ?
ఫాదర్ : లేదు, 18-06-2021 నాడు ప్రెసిడెంట్ కు చెప్పాను.
క్షే.వి.క : మరియమ్మ చనిపోయాక చెప్పారు?
ఫాదర్ : అవును
క్షే.వి.క : ముందు ఎందుకు చెప్పలేక పోయారు ?
ఫాదర్ : మౌనంగా ఉన్నారు.
క్షే.వి.క : అగస్టీన్ గారు దొంగతనం విషయం తెలిశాక మీ కమిటీ సభ్యులు ఏం ఆలోచించారు?
ఫాదర్ : (అగస్టీన్ మాట్లాడనివ్వలేదు): డబ్బు మొత్తం సొంతంగా సమకూర్చుతున్నాను, వారికి తెలియదు, దొంగతనానికి గురైన డబ్బులు సొంతంగా సమకూర్చినవే. అందుకే వారికి డబ్బు వ్యవహారాలు తెలియవు.
క్షే.వి.క : కమిటీ ఎందుకు ? చర్చికి బ్యాంకు అకౌంట్ ఉన్నదా ? ఉంటే అకౌంట్ పని ఏంటి?
ఫాదర్ : చర్చికి కమిటీ ఉండాలి. బ్యాంకు అకౌంట్ ఉన్నది. దొంగతనానికి గురైన డబ్బులు సొంతంగా సమకూర్చినవి. అకౌంట్ లో వేయలేదు.
క్షే.వి.క: మరియమ్మ ఏమేమి పనులు చేసేది?
ఫాదర్ : వంటతో పాటు చర్చికి చెందిన అన్ని పనులు చేసేది.
క్షే.వి.క: అన్ని పనులూ అంటే ?
ఫాదర్ : ప్రేయర్ స్థలాన్ని, నివసించే ఇంటిని, చర్చి ప్రాంగణాన్ని శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం ఇలాంటివి అన్ని చేసేది.
క్షే.వి.క: ఇసుకను తరలిస్తున్న లారీ డ్రైవర్లకు మీకు ఏం సంబంధం? మీరు ఇసుక వ్యాపారం చేస్తారని అంటున్నారు?
ఫాదర్ : చర్చికి ఇసుక అవసరం. గిట్టని వాళ్ళు ఇసుక వ్యాపారం చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారు.
క్షే.వి.క: మరియమ్మ దగ్గర పోలీసులు రికవరీ చేసామని చెపుతున్న డబ్బులు మీరే లారీ డ్రైవర్లతో ఇప్పించారని చెపుతున్నారు? పోలీసులు రికవరీగా చూపుతున్న డబ్బు మీదేనా?
ఫాదర్ : దొంగతనం చేసిన డబ్బులే పోలీసులు రికవరీ చేసారు. నావి కావు. పాప భీతితో మరియమ్మ చనిపోయింది.
క్షే.వి.క: 08-06-2021 నుండి 17-06 2021 వరకు మీ మనుషులు, పోలీసులు కలిసి మరియమ్మను, మరియమ్మ కొడుకును వేటాడుతున్నారని ప్రచారం జరుగుతుంది? మరియమ్మ చేసింది దొంగతనమే కదా ? అంతగా వేటాడాలా ?
ఫాదర్ : మరియమ్మ సంబంధీకులనే పంపాను. ఆమెను వేటాడలేదు. పోలీసులకు 17-06-2021 నాడు రాతపూర్వకంగా ఉదయం ఫిర్యాదు చేసాను. మరియమ్మ దగ్గరకు పోలీసులు ఎప్పుడు వెళ్లారో తెలియదు. కానీ 18-06-2021 నాడు మధ్యాహ్నం తరువాత మరియమ్మ చనిపోయిన విషయం తెలిసింది. ఎలా చనిపోయిందో, ఎందుకు చనిపోయిందో తెలియదు.

క్షేత్రస్థాయిలో కమిటీ పర్యటిస్తున్నప్పుడు::

అక్కడ చర్చి మరియు స్కూల్ ఉన్నాయి. స్కూల్ నన్స్ పర్యవేక్షణలో ఉన్నది. చర్చి కు ఫాదర్ గా బాల శౌరీ నియమితులైనారు. రెండు కలిపి సుమారుగా 4/5 ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. మరియు వచ్చే అతిథులకు నివాసం, క్వార్టర్స్, వ్యవసాయం, వాటర్ ప్లాంట్ కూడా ఇదే ప్రాంగణంలో ఉన్నాయి. వీటికి పెద్ద నల్గొండ లోని చర్చి ఫాదర్.

అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కొత్తగా నిర్మాణం జరిగినది, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి ఈ పోలీస్ స్టేషన్ వరకు. ఈ పోలీస్ స్టేషన్ కు రామన్నపేట సర్కిల్, చౌటుప్పల్ ఏసీపీ, యాదాద్రి భువనగిరి డీసీపీ లు. పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ లు ఉన్నాయి. కానీ పనిచేయటం లేదని చెపుతున్నారు. మేము వెళ్ళినప్పుడు పనిచేస్తున్నాయి. అక్కడి కంప్యూటర్ స్క్రీన్ పై పోలీస్ స్టేషన్ బయట జరుగుతున్న విషయాలు కనిపించాయి. ఇదే విషయాన్ని అప్పుడు అక్కడ ఉన్న పోలీసులను అడుగగా, మరియమ్మను తెచ్చినప్పుడు పనిచేయలేదు, ఇప్పుడు పనిచేస్తున్నాయి అని చెప్పారు.

మేము రెండు కమిటీలుగా ఏర్పడి ఒక కమిటీ ఖమ్మం, మరొక కమిటీ అడ్డగూడూరు వెళ్ళింది. మరియమ్మను ఆమె గ్రామము నుండి మగ పోలీసులు తెచ్చారు. ఆడ పోలీసులు మరియమ్మ వెంట లేరు. ఖమ్మంలో ఉన్న మా ప్రతినిధులను మరియమ్మ కొడుకును, మరియు గ్రామ ప్రజలను కలిసినారు. మరియమ్మ కొడుకు మరియు గ్రామ ప్రజలు చెప్పిన సమాచారం ప్రకారం — చర్చి ఫాదర్ మనుషుల వేధింపులకు, పోలీసుల వేధింపులకు భయపడి పక్కనే ఉన్న అడవిలో మరియమ్మ తలదాచుకున్నదనియు, దొంగతనం చేయలేదని అందరికి చెప్పుకొని ఏడ్చినదనియు, ఫాదర్ చంపేస్తాడనియు మరియమ్మ చెప్పినట్లు చెప్పారు. మరియమ్మతో పాటు మరియమ్మ కొడుకు కూడా చర్చిలోనే వుండేవారనియు చెప్పారు. ఫాదర్ పేరుకు మాత్రమే ఫాదర్. అన్ని చెడు అలవాట్లు వున్నాయనియు మరియమ్మ చెప్పినట్లు చెప్పారు. అయితే మా దృష్టికి కూడా ఈ విషయం వచ్చినది. పోలీసులను ఒక పావుగా వాడుకున్నట్లు కూడా మా దృష్టికి వచ్చింది. దీనిని ఎవరు నిర్ధారిస్తారు? నిర్దారించేటందుకు ఆధునిక / వైజ్ఞానికమైన మెకానిజం అవసరం. ఆ మెకానిజం ప్రభుత్వం దగ్గెరనే ఉన్నది? ఆ మెకానిజం తేల్చవలసిందే.

చర్చి ఫాదర్ కు పోలీసులతో అంత సాన్నిహిత్యం ఎందుకు? మరియమ్మ, ఆమె కొడుకు, కొడుకు స్నేహితుడు దొంగతనం చేసారని ఒక్క క్షణం అనుకుందాము. బీదలను, పాపులను రక్షించే చర్చి, చర్చి ఫాదర్ ఎందుకు వారిని రక్షించలేక / క్షమించలేకపోయారు. ఫాదర్ దగ్గర ఎందుకు ఎక్కువ రోజులు / నెలలు వంట మనుషులు ఉండలేక పోతున్నారు? మరియమ్మ ఎందుకు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు వచ్చిన క్షణాలలోనే కుప్పకూలి పోయింది? (అని చెపుతున్నారు). దీనికి చర్చి ఫాదర్ బాల శౌరి కూడా ఎందుకు బాధ్యుడు కాకూడదు? మరియమ్మ మరణానికి కారకులైన పోలీసులతో పాటు చర్చి ఫాదర్ అంతే బాధ్యత, ఎందుకు కాకూడదు? మరియమ్మ మరణానికి చర్చి ఫాదర్ ను పక్కకు తొలగిస్తే న్యాయం జరుగుతుందా? మరియమ్మ హత్యకు ఎవరు బాధ్యులు?

అందుకే మేము దీని గురించి ప్రజావాజ్యంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించటం జరిగింది. NHRC సూచనల ప్రకారం మరియు 176(1-A) of Cr.P.C., 1973 మహిళ పోలీస్ కస్టడీలో / జ్యూడిషియల్ కస్టడీలో చనిపోయినప్పుడు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ లేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తో విచారణ జరిపించాలని ఉన్నది. హైకోర్టు The Judicial Magistrate of First class, Alair జడ్జి గారిని విచారణ జడ్జిగా ఆదేశించినది. హైకోర్టు ఆదేశాల ప్రకారం NHRC సూచనలతో పాటు sub-Section (3) of Section 176 Cr,P.C, ప్రకారం విచారణ జడ్జి గారు మరియమ్మ శవానికి రీ-పోస్ట్ మార్టంతో పాటు నిబంధనల ప్రకారం విచారణ పూర్తి చేసి సీల్డ్ కవర్లో నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలను జారీ చేసినది.

మరియమ్మ మరణంపై రాష్ట్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రాజకీయ పార్టీలలోని దళిత నాయకులతోనూ, ఎమ్మెల్యే, ఎంపీ లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరియమ్మ కుటుంబానికి చెందిన కొడుకుకు 15 లక్షల నగదు, ఒక ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, అదే విధంగా ఆమె ఇద్దరు కూతుర్లకు చెరి పది లక్షల నగదు ఇస్తున్నట్లు సమావేశంలో ప్రకటించి వాటిని వారికి అందచేశారు. ఇంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం “దళిత బంధు” పేరుతో అంచెలంచెలుగా రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు పది లక్షల చొప్పున నగదు సహాయం చేస్తుందని ప్రకటన చేసింది. దీని అమలును యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మొదలు పెట్టినది.

తెలంగాణ కాంగ్రెస్ సిఎల్ఫీ నాయకుడు భట్టి విక్రమార్క మరియమ్మ లాకప్ మృతి గురించి వారి పంథాలో ముందుకు నడిచారు. వారికి మేమూ సహకరించాము. మరియమ్మ లాకప్ డెత్ ను నిరసిస్తూ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబెడ్కర్ విగ్రహం దగ్గర క్యాండిల్ లైట్ ప్రోగ్రామ్ చేశాము.

మరియమ్మ లాకప్ డెత్ కు కారకులుగా చూపబడుతున్న పోలీసులను ఉద్యోగాల తొలగించినట్లు విచారణ అధికారిగా నియమితులైన మల్కాజిగిరి ఏసీపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ అంతా మీ ఇష్టమేనా ? ఉద్యోగాలనుండి తీసివేస్తే మరియమ్మ తిరిగి వస్తుందా ? ప్రాణం విలువకు కొలమానం ఉద్యోగం నుండి తొలగించడమేనా? సీసీటీవీ ఫుటేజిలు లేవని చెప్పారు. ఇప్పుడు ఆ రోజు పనిచేయలేదు అంటున్నారని కోర్టు తన అసహనాన్ని తెలిపింది. ప్రజావాజ్యం ఇంకా విచారణలోనే ఉన్నది.

హైకోర్టు నియమించిన విచారణ జడ్జి ఆలేరు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఇంకా తమ నివేదికను హైకోర్టుకు సమర్పించలేదు. కానీ ప్రభుత్వం నియమించిన విచారణ అధికారి వేసిన అఫిడవిట్ తో పాటు కోర్టుకు అందించిన మెటీరియల్ ప్రకారం మరియమ్మ శరీరంపై గాయాలు ఉన్నట్లు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులు తెలుపుతున్నాయి. మా దృష్టికి వచ్చిన మరో ప్రధానమైన విషయం, మరియమ్మ సామాజిక వర్గం, ఫాదర్ సామాజిక వర్గం మరియు పోలీసుల సామాజిక వర్గం ఒకటే ఎందుకు మీరు పెద్దగా చేస్తున్నారు అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారికి సామాజిక వర్గం అంటే ఏమిటి అని అడిగాము. వారు వివరించిన అందమైన విషయం … మరియమ్మ కుటుంబం – ఫాదర్ కుటుంబం ఎస్సీ సామాజికం, పోలీసులు బహుజనులు. ఎస్సీ సామాజిక వర్గం బహుజనులలో భాగమే. వాళ్ళు వాళ్ళు ఏమైన చేసుకుంటారు. అనవసరంగా హక్కుల సంఘాల వారు పెద్ద ఇష్యూ చేశారు అన్నారు.
హింసను – కులాన్ని బట్టి, మతాన్ని బట్టి కొందరు చూస్తున్నారు కాబట్టే రాజ్యం / రాజ్యం ను డిక్టేట్ చేస్తున్న వారు, వారిని వాడుకుంటున్నది. వారినే కొలమానంగా రాజ్యం చూపుతున్నది. రాజ్యంను శాసించేది రాజ్యాంగం కావాలి. కొందరు వ్యక్తులు / సంస్థలు కాకూడదు. రాజ్యాంగం అంటే ప్రజలే.

-జయ వింధ్యాల,

అడ్వకేట్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ స్టేట్ # మలక్పేట్ ఎక్స్ రోడ్, హైదరాబాద్, @ 9440430263

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles