Sunday, December 22, 2024

కాకలు తీరిన రాజకీయ నేత కాకా

రాజకీయాల్లో కాకలు తీరిన నేతగా, ‘కాకా’గా చెరగని ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవ శాలి గడ్డం వెంకటస్వామి(92). భారత  రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్ అంబేద్కర్‌తో కలసి పనిచేసిన వారిలో కాకా ఒకరు. కార్మిక  నేతగా ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. భారత దేశ  అత్యున్నత రాష్ట్రపతి పదవికి అతి సమీపానికి వెళ్ళి ఆ పదవి పొందలేక పోయానని కాకా పదే పదే చెపుతుండే వారు.

 హైదరాబాద్ లో ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేయించి గుడిసెల వెంకట స్వామిగా గుర్తింపు పొందారు.  ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు మొదటిసారి ప్రతిపాదన చేసిన వ్యక్తి వెంకటస్వామి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఎఐసిసి బాధ్యునిగా, ఎంపీగా , కేంద్ర మంత్రిగా,  ఆయన అందించిన బహుముఖ సేవలు నిత్య జ్ఞాపకాలుగా  మిగిలాయి. గడ్డం వెంకటస్వామి  5 అక్టోబర్ 1929న హైదరాబాద్ లో జన్మించారు. చిన్న వయసులోనే నిజాం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. మొదట ఆర్యసమాజ్‌లో, ఆ తర్వాత రామానందతీర్థ శిష్యుడిగా కాంగ్రెస్‌లో పనిచేశారు. సాయుధ పోరాట సమయంలో జైలుకెళ్లిన కాకా.. హైదరాబాద్ విలీనం అనంతరం రాజకీయాలు వదిలేసి కుటుంబ పోషణ కోసం కూలీ పని చేశారు. అప్పుడే కార్మిక నాయకుడిగా ఎదిగారు. హైదరాబాద్‌లో నిలువనీడ లేకుండా ఉన్న పేదల కోసం ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసి వారి కోసం పోరాడారు.

ఆర్థికంగా బలపడ్డాక మళ్లీ రాజకీయాల్లోకి వచ్చిన కాకా అనేక పదవులు అలంకరించారు. 1957- 62 మరియు 1978-84 ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ్యులుగా రెండు పర్యాయాలు ఉన్నారు. 1967లో 4 వ లోక్ సభకు ఎన్నికైయ్యారు.1969-71 వరకు ప్రజా పద్దుల కమిటీ సభ్యుడు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గంనుండి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు. 1971లో 5వ లోక్ సభకు (2వ పర్యాయం), 1977లో 6వ లోక్ సభకు (3వ పర్యాయం), 1989లో 9వ లోక్ సభ (4వ పర్యాయం), 1991లో 10వ లోక్ సభకు (5వ పర్యాయం), 1996లో 11వ లోక్ సభకు (6వ పర్యాయం), 2002-2004 అద్యక్షుడి గా, ఎ.ఐ.సి.సి. ( ఎస్ సి & ఎస్ టి ), 2004లో 14వ లోక్ సభకు (7వ పర్యాయం) ఎన్నికయ్యారు.

1978 – 1982 లేబర్ మరియు సివిల్ సప్లయిస్, ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ మంత్రిగా పని చేశారు. ఫిబ్రవరి 1973 – నవంబర్ 1973 వరకు లేబర్ మరియు పునరావాస కేంద్ర ఉపమంత్రిగా పనిచేశారు. నవంబర్ 1973-మార్చి 1977 వరకు సప్లై అండ్ రీహాబిలిటేషన్ కేంద్ర ఉప మంత్రిగా పనిచేశారు. 21 జూన్ 1991 నుండి 17 జనవరి 1993 గ్రామీణాభివృద్ధి కేంద్ర మంత్రిగా, 18 జనవరి 1993 నుండి ఫిబ్రవరి 1995 టెక్ట్స్ టైల్స్ కేంద్ర సహాయమంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్)గా, 10 ఫిబ్రవరి నుండి 1995-15 సెప్టెంబర్ 1995 వరకు టెక్ట్స్ టైల్స్ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా, 15 సెప్టెంబర్. 1995 నుండి 10 మే 1996 వరకు కార్మిక శాఖ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా, 20 ఫిబ్రవరి 1996-16 మే 1996 కార్మిక మరియు టెక్ట్స్ టైల్స్ శాఖ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. అలాగే కాంగ్రెస్ పార్లమెంట్ పార్టీ డిప్యుటి లీడర్ గా, లోక్ సభ మెంబర్, కమిటి ఆన్ ఎనర్జి , మెంబర్, కమిటి ఆన్ ఇన్ స్టాలేషన్ ఆఫ్ పోట్రైస్ / స్టేటస్ ఆఫ్ నేషనల్ లీడర్స్, పార్లమెంటేరియన్ ఇన్ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ మెంబర్, కమిటి ఆన్ ఎతిక్స్ మెంబర్, కాన్సులేటివ్ కమిటి, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్  మెంబర్, స్టాండింగ్ కమిటి ఆన్ ఎనర్జీ  పని చేశారు.

కాకా  పెద్ద కుమారుడు గడ్డం వినోద్, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, చిన్నకుమారుడు గడ్డం వివేకానందా, పెద్దపెల్లి నియోజక వర్గానికి ఎం.పి.గా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారునిగా పనిచేశారు. ఆయన 2014, డిసెంబరు 22వ తేదీ హైదరాబాదులో మరణించారు.

డిసెంబర్ 22…గడ్డం వెంకట స్వామి వర్ధంతి

ఇదీ చదవండి : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles