మచిలీపట్నం: జిల్లా ఆస్పత్రిలో రౌడీయిజం జరిగింది. బంటుమిల్లి మండలం జయపురం కు చెందిన రేళ్ల చిట్టెమ్మ (75) యాక్సిడెంటులో మృతి చెందగా మచిలీపట్నం జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకువచ్చారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం భౌతిక కాయాన్ని స్వగ్రామం తరలించేందుకు ఆస్పత్రిలోని అంబులెన్స్ నిర్వాహకులను ను సంప్రదించగా అప్పటికే వేరొక శవాన్ని తీసుకుని చల్లపల్లి వెళ్లిందని చెప్పడంతో ఆస్పత్రి బయట ఉన్న అంబులెన్సులను ఆశ్రయించారు. ప్రయివేటు అంబులెన్సుల యజమానులు మచిలీపట్నం నుండి బంటుమిల్లి మండలం జయపురం వెళ్లడానికి రూ. 7000 డిమాండ్ చేయడం తో దిక్కుతోచని మృతుని బంధువులు బస్ స్టాండు దగ్గరలోని కార్ల స్టాండు వద్దకు వెళ్లి రూ. 2000 రూపాయలకు కారు మాట్లాడుకుని వచ్చి మృతదేహాన్ని కారులో ఎక్కించే సమయంలో ఆస్పత్రి బయట ఉన్న ప్రయివేటు వాహన దారులు ఒక్కసారిగా కర్రలతో, చెట్టు కొమ్మలతో దాడికి దిగి వీరంగం సృష్టించారు. భయబ్రాంతులకు గురయిన మృతుని బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయివేటు అంబులెన్సుల యజమానులపై, డ్రైవర్లపై కేసు నమోదు చేశారు.