Tuesday, January 21, 2025

రాముడితో దశరథుడి సంభాషణ

రామాయణమ్19

నా రాముడంటే మీకెందుకంత ఇష్టం ? దశరథుడు తన మంత్రి, సామంత, పురోహితులను అడిగాడు నిర్ణయం తీసుకునే ముందు.

రాముడు కనపడగానే వారి మాటలు మరొక్కసారి ఆయన మనసులో ప్రత్యక్షమై మనసును ఆనందంతో నింపివేసినవి.

నారాముడు సర్వలోక మనోహరుడు!

రాముని గురించి సభలో వ్యక్తమయిన అభిప్రాయాలు ఇవి !.

ప్రజాసుఖత్వే చన్ద్రస్య ..సుఖము కలిగించుటలో చంద్రసమానుడు

వసుధాయా క్షమాగుణైః.. ఓర్పు మొదలైన గుణములలో పృధ్వీసమానుడు.

బుధ్యాబృహస్పతేత్తుల్యో…బుద్ధిలో దేవగురువు బృహస్పతి సమానుడు

వీర్యే సాక్షాచ్ఛచీపతే.. పరాక్రమంలో సాక్షాత్తూ దేవేంద్రడే!

ధర్మజ్ఞః ..ధర్మములెరిగినవాడు

Also read: రామపట్టాభిషేకంపై వృద్ధనరపతి నిర్ణయం

సత్యసన్ధశ్చ..సత్య ప్రతిజ్ఞకలవాడు

శీలవాన్.. శీలవంతుడ

అనసూయకః.. అసూయలేనివాడు

క్షాన్తః.. ఓర్పుకలవాడు

సాన్త్వయితః.. కష్టాలలో ఉన్నవారిని ఓదార్చువాడు

శ్లక్ష్ణః.. మృదుస్వభావి

కృతజ్ఞః.. ఎవరైనా మేలు చేస్తే మరువని వాడు

విజితేన్ద్రియః..ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనేవాడు.

Also read: పరశురాముడి గర్వభంగం

రాముడికి కోపం కలిగినా అనుగ్రహము కలిగినా అవి వ్యర్ధములుగావు.

చంపదగినవానిని చంపితీరుతాడు, చంపతగని వారి విషయములో అసలు కోపము వహించడు!

ఎవడినైతే అనుగ్రహించాడో వాడు ఈ లోకంలో అందరికన్నా ఐశ్వర్యవంతుడవుతాడు!

రామమ్ ఇన్దీవరశ్యామమ్ సర్వశత్రు నిబర్హణమ్….నల్లకలువవలే ఉండే రాముడు శత్రుసంహారకుడు!

అసలిన్నెందుకు! లోకంలోని శ్రేష్టమైన గుణాలన్నీ ఎవరిలో ఉన్నాయి అని అడిగితే అందరి చూపుడు వేలు రాముడివైపు తిరుగుతుందట!

ఇన్ని ఆలోచనలు మదిలో తిరుగుతూ వున్న దశరధమహారాజు ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు “రామవర్మాహం అహంభో అభివాదయే” అన్న రాముని మాటలతో!

Also read: సీతారామ కళ్యాణం

రామా ! పుష్యమీ నక్షత్రగడియలలో నిన్ను యౌవరాజ్యపట్టాభిషిక్తుడిని గావింప నిశ్చయించాను!

రామా! నీవు ఇకనుండి ఇంకా జాగ్రత్తగా మెలగవలె!

నీవు ఇంకా వినయవంతుడవై ఎల్లప్పుడును ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని కామము వలన కలిగే వ్యసనములకు,  క్రోధము వలన కలిగే వ్యసనములకు దూరంగా ఉండవలె!

 ధాన్యాగారాలను, ఆయుధాగారాలనూ ఎల్లప్పుడూ చక్కగా నింపి ఉంచు.

ప్రజలను, అమాత్యులను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచు!

 అని హితవు పలికాడు దశరధమహారాజు

ఇంత సంతోషకరమైన వార్తను కౌసల్యా దేవికి చేరవేశారు రాముని మిత్రులు.

(మన స్మృతులు ఈ విధంగా చెపుతున్నాయి:

కామము వలన కలిగే వ్యసనములు..పది..అవి

వేట , జూదము ,పగటినిద్ర ,పరుల దోషాలు వినడం చెప్పడం  ,

పరస్త్రీ సంభోగము, తాగుడు, నృత్యము, గీతము, వాద్యము,  పనీపాటలేకుండ దేశసంచారము చేయడం ఇవ్వన్నీ వ్యసనాలే.

BE MERRY BE HAPPY CULTURE …

Also read: శివధనుర్భంగం: బాలరాముడు కళ్యాణరాముడైన వేళ

ఇక కోపం వలన కలిగే వ్యసనాలు

చాడీలు చెప్పడం complaining mentality

సత్పురుషులను బంధించడం, బాధించడం, ద్రోహము, ఈర్ష్య, అసూయ, ప్రక్కవాడి డబ్బు కాజేయడం, వాక్పారుష్యమ్ అనగా ఊరకే ఎదుటివాడిని తిట్టిపోయడం, దండపారుష్యమ్ అనగా ఎదుటివాడిని కొట్టటం.

వీటన్నిటికీ దూరంగా ఉండమని హితవు పలుకుతున్నాడు దశరధుడు!)

అద్దంలో తన ప్రతిబింబం తనే తనివితీరా చూసుకునే విధంగా తన ఎదురుగా నిలబడ్డ రాముని కనులారా చూసుకున్నాడు దశరథ మహారాజు.

ఆయనను ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు !

చెప్పవలసిన అన్ని విషయాలు చెప్పాడు !

రామచంద్రుడు తండ్రివద్ద సెలవు తీసుకొని తల్లి మందిరానికి బయలుదేరాడు.

Also read: విశ్వామిత్రుడిని ‘బ్రహ్మర్షీ’ అని సంబోధించిన వశిష్ట మహర్షి

ఆయన అటు వెళ్ళాడో లేదో మరల దశరథుని మనసులో ఏదో ఆందోళన, చెప్పలేని ఏదో తెలియని ఆవేదన.

 మరల సుమంత్రుని పిలిచాడు రాముని మరియొక్కసారి శీఘ్రంగా ఇక్కడికి తీసుకురా! అని ఆజ్ఞాపించాడు.

రాజాజ్ఞపాటించాడు సుమంత్రుడు.

తండ్రికి ఎదురుగా కూర్చుని మరల నన్ను పిలిపించారెందుకు? అన్నట్లుగా చూశాడు రామచంద్రుడు!

దశరథుడప్పుడు, ‘‘నాయనా! నీ పట్టాభిషేకమహోత్సవము ఎంతత్వరగా జరిగితే అంత మంచిది. నాకెందుకో అమంగళకరమైనదేదో జరుగబోతున్నదనిపిస్తున్నది. శకునాలు కూడా అవే చెపుతున్నాయి. క్రూర గ్రహాలు రవి, కుజ, రాహువులు నా జన్మ నక్షత్రాన్ని ఆక్రమించినట్లు దైవజ్ఞులు చెపుతున్నారు.

ఇవ్వన్నీ చూస్తుంటే నాకు మృత్యవైనా సంభవించవచ్చు లేదా అంతటి గొప్ప ఆపద అయినా కలుగవచ్చు.

నాయనా నేను ఈ లోకంలో జన్మించినందుకు అన్ని సుఖములు అనుభవించాను. క్షత్రియధర్మాలన్నీ నెరవేర్చాను!

.

దేవ ఋణము, ఋషి ఋణము, పితృదేవతా ఋణము, బ్రాహ్మణ ఋణము అన్నీ తీర్చివేశాను.

ఇక నీకు రాజ్యాభిషేకము చేయడమొక్కటే నేను చేయవలసిన పని.

Also read: బొందితో కైలాసం, త్రిశంకు స్వర్గం

మనిషి మనసు చంచలమయినది. ఏ నిమిషానికి అది ఏమి ఆలోచిస్తుందో ఏమి జరుగనుందో ఎవరికీ తెలియదు! నా మనస్సులో వేరొక ఆలోచన రాక పూర్వమే నీకు పట్టాభిషేకం జరుగవలె!

భరతుడు ఈ నగరంలో లేనప్పుడే నీకు పట్టాభిషేకం జరుగవలెనని నా అభిప్రాయం.

సోదరుని గూర్చి ఇదేమి ఆలోచన తండ్రీ! అని అడుగుతావేమో!

ఆతడు ధర్మాత్ముడే! నిన్నుఅనుసరించిఉండేవాడే. ఇంద్రియనిగ్రహముకలవాడే. సత్పురుషులు వెళ్ళేదోవలోచరించేవాడే. దయాశీలుడే.

 కానీ…

ఎంతటి వాడి మనస్సయినా చంచలము నాయనా!

ఈ రోజు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. రేపు పుష్యమితో కూడుతాడు. రేపు సరి అయిన సమయమని దైవజ్ఞులు చెపుతున్నారు.

ఇక నీవు వెళ్ళిరా అని అనుమతించాడు.

రాముడు తల్లి మందిరం చేరుకున్నాడు. అప్పటికే ఈ వార్తవిని సుమిత్ర, లక్ష్మణుడు అక్కడికి చేరుకున్నారు!

సీతాదేవిని కూడా రప్పించారు.

Also read: వశిష్ట, విశ్వామిత్రుల సంఘర్షణ

(యజ్ఞములు చేస్తే దేవతా ఋణము

స్వాధ్యాయాధ్యయనములు చేస్తే ఋషిఋణము

సంతానం కనటం వల్ల పితృఋణము

దానాదులచేత బ్రాహ్మణ ఋణము ….తీరుతాయి

ఈ పనులన్నీ సమృద్ధిగా చేసినవాడు దశరధ మహారాజు.)

Also read: అహల్య శాపవిమోచనం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles