రామాయణమ్ – 220
మహాదేవుడు శ్రీరామునే చూచుచూ ఆయన సౌందర్యాన్ని తనివితీరా గ్రోలుతూ, ‘‘రామా! రాజీవనేత్రా! మహాబాహూ! పరంతపా! ధర్మపోషకా, నీవు లోకాలను ఆవరించిన చీకట్లను పారద్రోలితివి. రావణుడి వల్ల జనులకు కలిగిన భయమును పోగొట్టితివి…ఇక నీవు అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడవై నీ వారితోసుఖముగా నుండుము…అదుగో అటు చూచితివా దివ్యవిమానము. అందుండి నీ తండ్రి దశరథ మహారాజు నిన్ను చూచుచున్నాడు’’ అని పలికెను. మహేశ్వరుడు ఈ సంగతి తెలుపగానే రాముడు తన తండ్రిని చూచెను.
Also read: అగ్నిదేవుడి చేతుల మీదుగా సీతను స్వీకరించిన శ్రీరామచంద్రుడు
ప్రాణాధికుడైన ప్రియపుత్రుని కౌగలించుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని దశరథుడు, ‘‘రామా, నీవు లేని వైకుంఠము, స్వర్గము నాకు ఇష్టము కాదురా నాయనా. నీకు సత్యము చెప్పుచున్నాను. శత్రు సంహారము చేసి వనవాస నియమము పూర్తిచేసుకొన్న నిన్ను చూసి నా హృదయము ఉప్పొంగుచున్నది. ఆ రోజు నా కిప్పటికీ గుర్తు ఉన్నది. కైకమాటలు నా చెవులలో ఇంకా మారుమ్రోగుతునే ఉన్నవి.’’
లక్ష్మణుని కూడా ఆలింగనము చేసుకొని …‘‘నాయనా లక్ష్మణా, నీవు ధన్యుడవు అన్నను అనుసరించినావు.’’
‘‘అమ్మా సీతా, నీవు నీ భర్తను సేవించుచూ అధికమైన కీర్తిని పొందినావు’’ అని పలికెను …
అప్పుడు రామచంద్రుడు, ‘‘తండ్రీ, నా తల్లి కైకపై కోపమును విడిచి ఆమెను అనుగ్రహింపుము’’ అని అడుగగా, అందుకు చిరునవ్వునవ్వి అటులే అని దశరథుడు పలికెను.
Also read: సీతమ్మ అగ్నిప్రవేశం
పులకిత హృదయముతో దశరథుడు మరల దివ్యవిమానమెక్కి స్వర్గమునకు పయనమాయెను
స్వర్గాధిపతియైన దేవేంద్రుడు రాముని చూచి, ‘‘రామచంద్రా, ఒక్కవరము కోరుకోవయ్యా. నీకు వరము ఇవ్వాలని ఉంది’’ అని అన్నాడు.
‘‘దేవేంద్రా, నీకు నా మీద యున్న ప్రేమయే నాకు పెద్దవరము ఇంక వరమెందులకు? నాదొక్క మనవి. నా కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వానర, గోలాంగూల, భల్లూక వీరులకు తిరిగి ప్రాణదానము చేయవా? అదే నాకు నీవు ఇవ్వగల పెద్దవరము’’ అని రాముడు పలికెను.
Also read: రాముడి పలుకులకు బిత్తరబోయిన సీతమ్మ
అందుకు సంతోషముగా దేవేంద్రుడు అంగీకరించి రామసైన్యము అంతా పునరుజ్జీవితులగునట్లుగా వరమొసంగెను.
నిద్రనుండిలేచినట్లుగా వారు లేచిరి. యుద్ధమునకు ముందు ఎంత ఉత్సాహముగా ఆరోగ్యముగా ఉండిరో అదే విధముగా వారు మరల కనపడసాగిరి.
‘‘రామచంద్రా, ఈ వానర జాతి ఎక్కడ ఉంటే అక్కడ భూమి పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది .నదీనదాలు అమృతప్రాయమైన జీవజలాలను త్రికాలాలలో కూడా అందిస్తాయి’’ అని కూడా వరమిచ్చి, ‘‘రామచంద్రా, ఇక నీవు సత్వరమే అయోధ్యకు వెళ్ళి నీకోసమే తపించుచున్న నీ తమ్ములను కలుసుకొనుము. తల్లులను, పౌరులను ఆదరించి పట్టభిషిక్తుడవు కమ్ము!’’ అని చెప్పి దేవతలందరితోకూడి దివ్యవిమానమెక్కి దేవేంద్రుడు స్వర్గమునకు వెళ్ళెను.
ఆ రాత్రికి ఆ మహాసేన అంతా ఆనందముగా విశ్రమించెను..
తెల్లవారింది. రాముని వద్ద జయశబ్దములు పలుకుచూ దోసిలియొగ్గి విభీషణుడు నిలుచుండెను.
Also read: రాముని సందేశము సీతమ్మకు వినిపించిన హనుమ
వూటుకూరు జానకిరామారావు