“ఇదివరలో బొంబాయిలోని పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించిన ‘గదరువీరులు’, ‘సర్ధార్ పృధ్వీసింగ్’ మొదలగు గ్రంథములలో గదరు పార్టీ పుట్టుకను గురించి సరిగా వ్రాయబడ లేదు. జితేంద్రనాధ లాహిరీ పేరు లేనేలేదు. గ్రంథకర్తలకు వివరములను ఇచ్చిన గదర్ బాబాలు, నాయకులకు సైతం ఈ విషయం తెలియదు. గదరు పార్టీని నిర్మించిన కొంత కాలానికి వీరు పార్టీలో చేరి, గదరు ఉద్యమాన్ని ఎంతో వృద్దికి తెచ్చిరి. గదరు పార్టీని స్థాపించిన వారిలో నేనొక సభ్యుడను. అందువలన ఈ వివరాలను వ్రాయగలుగుతున్నాను. స్థాపించిన సభ్యులలో మరొకరు మాత్రమే జీవించి ఉన్నారు. (ప్రొ. రంజిత్ సింగ్ జెయిన్, బెనారస్ హిందూ యూనివర్సిటీ).”!
Also read: అద్వితీయ భావోద్యమకారుడు, విజ్ఞానశాస్త్ర ప్రచారోద్యమ ధీరుడు యాళ్ళ సూర్యనారాయణ
భారతదేశ విముక్తి కోసం అత్యధిక శాతం మంది పంజాబీయులతో నెలకొల్పిన గదర్ విప్లవపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దరిశి చెంచయ్య 70 ఏళ్ళ క్రితం రాసిన “నేనూ – నా దేశం” ఆత్మకథలో స్వయంగా రాసిన మాటలివి. ఆనాటికే కాదు, ఈనాటికీ దేశంలోనూ, ముఖ్యంగా మన తెలుగు ప్రాంతంలోనూ అదే పరిస్థితి నెలకొని ఉంది. ఒక మహత్తరమైన చారిత్రక పాత్ర పోషించిన మహనీయుడి జీవితం పట్లా, కృషి పట్లా మనకీ, మనం భావోద్యమాలుగా భ్రమపడుతున్న వాటికీ కించిత్తు శ్రద్ధ కూడా లేదనడానికి విస్మరించ బడిన చెంచయ్య గారి జీవితమే సజీవసాక్ష్యం!
బిపిన్ చంద్రపాల్, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కందుకూరి వీరేశలింగం మొదలగు నాయకుల ప్రభావంతో చిన్న తనంలో స్వయంగా ఉపాధ్యాయుడే పరీక్ష రోజు కుంకుమ తీసుకొచ్చి విద్యార్థులకు పంచి పెడుతూ, పెట్టుకుంటే భయం పోతుందనే ప్రచారం చేస్తుంటే, తరగతిగది మొత్తం మీద ఆ కుంకుమ పెట్టుకోకుండా పరీక్ష రాసి 64 మంది విద్యార్థులలో మెట్రిక్యులేషన్ పరీక్ష పాసైన ఏకైక విద్యార్థి చెంచయ్య ఒక్కరే!
Also read: ఆయనే ఒక ధిక్కార చరిత్ర
అంతేనా, అందరూ ఏదో జరుగుతుందని భయపడి వాడటం మానేసిన బావిలో ఈత కొట్టడం మొదలు, దయ్యాలు, శకునాల వంటి నమ్మకాలను ప్రతిఘటించే వరకూ, అమెరికా ప్రయాణాన్ని చెంచయ్య గారితో మానిపిం చలేక స్వయంగా ఆయన బావగారు మనుషుల్ని పెట్టి చెంచయ్య కాళ్ళు విరగ్గొట్టించాలనే సలహా వరకూ రావడం మొదలు ఇంటి బ్రాహ్మణులు, గురువులకు బియ్యం, దక్షిణ పెట్టవద్దంటారు!
ఇంకా, “మా వంశానికి పారంపర్యంగా గురువులున్నారు. మావారు వారి పాదాల్ని కడిగి ఉదకాన్ని తలమీద ప్రోక్షించుకుని దక్షిణ తాంబూలాలు, బహుమతులు ఇచ్చేవారు. నాకు ఈ అలవాటంటే పరమ అసహ్యం. విద్యార్థి దశలో కూడా వారిని గౌరవించడానికి గాని, చివరకు లేచి నిల్చుని నమస్కరించడానికి గాని నేనెప్పుడూ అంగీకరించలేదు..” అనేంత దాకా ఆనాటి బ్రాహ్మణాధిక్యతకి వ్యతిరేకంగా నిల్చిన ఆత్మగౌరవ ధిక్కారం చెంచయ్య గారిలో అడుగడుగునా కనిపిస్తుంది.
Also read: వర్ణం నుండి కులం దాకా
ఎగ్మోర్ నుండి అమెరికా ప్రయాణం. మధ్యలో రెండు నెలలు జపాన్ లో విడిది. తర్వాత 1912 డిసెంబరు మాసంలో మొత్తానికి అమెరికా చేరిన ఆయన ఆ ఏడే ఒక అద్వితీయమైన పాత్రను పోషించారు. అది ఆనాటిదాక ఎవరూ ముందుకు వచ్చి సాహసించలేని అద్భుతమైన అవకాశం! ఏకంగా మహత్తర గదర్ పార్టీ స్థాపనలో భాగం కావడం. బుద్దిపరంగా పంజాబీ యోధుడయిన లాలా హర్ దయాల్ కీ, శారీరకంగా బెంగాలీ ధీరుడయిన జితేంద్రనాధ లాహరికీ ప్రియ శిష్యుడిగా మారిన ఏకైక దక్షిణ భారతీయ వీరుడు దరిశి చెంచయ్య!
“కశ్మీర్ దేశంలో జమిందారీ ప్రభుత్వం ఉంది. అక్కడి రాజులు, జమీందారులు, బ్యాంకర్లు, విద్యావంతులు, పాలకవర్గము హిందువులే; వీరు చాలాకొద్దిమంది. ప్రజ లేమో మహమ్మ దీయులు; వారు రైతులు మొదలగు నిరక్షరకుక్షులు. కడుబీదలు, పాలక పాలితుల మధ్య పొత్తు ఎంతమాత్రం లేదు. ఇలాంటి పరిస్థితులు గల కశ్మీరంలోని ప్రజలలో తిరుగుబాటు తీసుకుని రావటం సులభ సాధ్యమని మేమునిశ్చయించుకున్నాము. 1925 సం.లోగా కాశ్మీరులో రిపబ్లిక్కును స్థాపించాలని మా సంకల్పం. ఒక పెద్ద ఇండియా మేపును గోడకుతగిలించాము. కాశ్మీరు సరిహద్దులను ఎర్రసిరాతో చక్కగా కనబడేలాగు గీచి, 1925 సం.లోగా “కాశ్మీర్ రిపబ్లిక్” అని అందరి దృష్టిని ఆకర్షించేలాగ వ్రాశాము.”
1925లో సుమారు శతాబ్దం క్రితం ఏకంగా “కశ్మీర్ రిపబ్లిక్” అనే ప్రోగ్రాం తీసుకోవడం, దాంట్లో తెలుగు వాడైన దరిశి చెంచయ్య భాగమై కశ్మీర్ ని విముక్తి చేయడానికి సిద్ద పడటం – అసలు ఊహించగలమా? ప్రస్తుత పరిస్తితులలో చెంచయ్య ఉండుంటే ఎలా స్పందించే వారు? దేశంలోనే తలమానికమైన ప్రాంతాన్ని సాక్షాత్తూ పాలకులే నాశనం చేస్తూ కశ్మీరీలపై అమానుషమైన దమనకాండ సాగిస్తుంటే ఎంత తీవ్రంగా ప్రతిఘటించే వారు?
అయిదుగురు అన్నదమ్ముల్లో మూడో వాడిగా ఉండి ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకున్నాయన. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన పాత్ర వహించిన తీరును చదవడం దానికదే ఒక అపూర్వమైన అనుభూతి. “గడిచిన 150 సం.రాలలో మూడు గొప్ప ఆదర్శ విప్లవాలు జరిగాయి. మొదటిది ఫ్రాన్స్ లో సుమారు 1700 సం. లో జరిగింది.. రెండవది ఇటలీలో 1850 ప్రాంతంలోజరిగింది. మూడవది 1917 లో రష్యాలో జరిగిన విప్లవం” అన్న చెంచయ్య గారు ఈ దేశ వామపక్షాలకు కాకుండా పోవడం భావోద్యమాల దౌర్భాగ్యం!
Also read: ప్రజల కోసం పాత్రికేయం
“జపాన్‌లో సన్యట్ సేన్ గారిని సందర్శించాను. ఆయన కుమారుడు ప్రస్తుత చైనా కొమిం టాంగ్ ప్రభుత్వ ప్రధానమంత్రి సన్ ఫో, నేనూ కాలిఫోర్నియా యూనివర్సిటీ లో కల్సి చదూకున్నాం. టోకియోలో ఆయన అడ్రసు లభించక చివరకు జపాన్ సి.ఐ.డి. కేంద్ర కార్యాలయానికి వెళ్లి అడిగాను. వారు నన్ను ఎన్నో ప్రశ్నలు వేసి కడపట ఒక ఆఫీసర్ నన్ను తన కారులో సన్ యెట్ సేన్ గారి ఇంటివద్ద వదిలిపెట్టి వెళ్ళాడు. నా విజిటింగ్ కార్డును పంపగానే సన్యెట్సేన్ సర్వసామాన్యమైన బట్టలతో ఎదురువచ్చి చేతులు పట్టుకుని, తన కుమారుని చూచినట్టు వాత్సల్యంతో నన్ను లోపలికి తీసుకు వెళ్ళాడు. తన కుర్చీలో నన్ను కూర్చోబెట్టి యినుప కుర్చీలో కూర్చున్నాడు. అంతకన్నా చవుక కుర్చీలు, బట్టలు ఏ బీదవాని ఇంటిలోనూ ఉండక పోవచ్చు. అతి నిరాడంబర జీవి!”
ఇదీ చెంచయ్య గారి స్థాయి. ఈ రోజు కనీసం ఆయన చేసిన కృషి మాట అలా ఉంచి దాంట్లో శతాంశంలో కూడా ఆయనతో సరితూగలేని వాళ్ళంతా తామేదో వీర విప్లవకారుల మనీ, వారి స్థాయికి చెంచయ్య గురించి పెద్దగా పట్టించుకోనక్కరలేదనే ఫోజులు చూస్తుంటే వెగటనిపిస్తుంది. “హిందూ సంఘంలో కులాలు ఉన్నంత కాలం హరిజనులకు మోక్షం కలుగదు. వ్యక్తిపరమైన ఆస్తి వున్నంత వరకూ ధనికులు ఉండి తీరుతారు. అప్పుడు బీదలు కూడా వుండక తప్పదు. అట్టి సంఘంలో అస్పృశ్యులు, అనాధలు, చండాలురు అణగదొక్కబడ్డ పంచములకు దారిద్య్రం తప్పదు. ఆర్ధికంగా న్యాయం జరిగే సంఘం ఏర్పడే వరకు, సంఘంలో దరిద్రులుండక తప్పదు.” అన్నాయన “దోపిడీ వ్యవస్థ పోతేనే మోక్షం” అంటూ “కమ్యూనిస్టు కత్తికి రెండు వైపులా పదునే.” అని ఉద్ఘాటించి ప్రకటించారు
ఒకరా ఇద్దరా? కె. బి. కృష్ణ మొదలు కామ్రేడ్ ఎన్. కె. కృష్ణన్ వరకూ, సుబ్బరాయన్, కాళేశ్వరరావు, రంగా, యామినీ పూర్ణ తిలకమ్మ గారి నుండి పొణకా కనకమ్మ గారి దాకా పదుల సంఖ్యలో చదివే ప్రతి తరానికీ ఎంతోమంది మహా మహుల్నీ, గదర్ విప్లవోద్యమంతో మొదలెడితే, కులాంతర వివాహాలు,సంఘ సంస్కరణోద్యమాలు, స్వాతంత్ర్య సంగ్రామం, సాహిత్యసేవ, సోషలిస్టు పార్టీ నిర్మాణం, కాంగ్రెస్ ఉద్యమం, సాంస్కృతిక వికాసక్రమం, కమ్యూనిస్టు ఉద్యమం.. ఇలా అనేకానేక ప్రజా ఉద్యమాల్నీ క్షుణ్ణంగా వివరించారు!
అందుకే నార్ల వారు ‘సర్వోత్కృష్టమైనది’ గా పేర్కొన్న ఇంతటి మహత్తరమైన స్వీయచరిత్ర ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళూ ఒక భయంకరమైన విస్మరణకు లోనై కేవలం కొద్దిమంది బుద్దిజీవులు దాచుకుని, చదూకునే గ్రంథంగా మిగిలి పోవడం నిజంగా అతిపెద్ద విషాదం కాదని ఎవరైనా అనుకుంటె, అంతకు మించిన ఆత్మవంచన మనకి మరోటి లేదనేది నా నిశ్చితాభిప్రాయం. అమూల్యమైన దరిశి చెంచయ్య ‘నేనూ,నా దేశం’ పుస్తకాన్ని ఇకనైనా కనీసం అభ్యుదయ, వామపక్ష, ప్రగతిశీల లిబరల్ సంఘాలైనా వారి తరగతుల్లో పరిచయం చేయాలని,చేస్తారని ఆశిస్తూ ఈ చిన్న రైటప్.
Also read: ఎగిరే ధిక్కార పతాక – కలేకూరి ప్రసాద్!
– గౌరవ్