దరిశి చెంచయ్య
(Ghadar Party : Reminiscences)
జ్ఞానం ఒకరి సొత్తు కాదు. అది మానవాళి సమిష్టితత్వానికి చింతనాత్మక సంకేతం. ఒళ్ళంతా స్వార్ధం, ఓర్వలేనితనం నింపుకున్న తరాలు వారి వారసులకూ ఆ లక్షణాలనే అందిస్తాయి. అవే విలువలని భ్రమిస్తాయి. మనమేంటో మాటలు కాదు, చేతలే చెప్పాలి. అలా చేతల్లో అజరామర జీవితాన్ని నిర్మించుకున్న దార్శనికుడు, విశ్వనరుడు గదర్ వీరుడు దరిశి చెంచయ్య!
ఆయన రాసిన “నేనూ – నా దేశం” ఆత్మకథ కాదు. అది మన దేశ స్వాతంత్ర్యం కోసం విదేశాల్లో ఉంటూ సామ్రాజ్యవాదం పై యుద్ధం ప్రకటించిన పోరాటవీరుల వ్యధ. సమానత్వం కోసం ఎన్నో కష్టనష్టాలను సంవత్సరాలపాటు ఓర్చుకున్న త్యాగాల గాథ. అసూయ ద్వేషాలు, ఆత్మస్తుతి పరనిందలు సహజాతంగా మారిపోయిన మన జాతికి అవంత త్వరగా అర్ధంకావు!
తెలుగు నేల మీద 70 ఏళ్ళు నిండిన ఆయన స్వీయచరిత్ర “నేనూ , నా దేశం” గ్రంథంలోని గదర్ పార్టీ గురించిన ఆయన స్మృతులను, పంజాబ్ లో ప్రత్యేకంగా గదర్ మహోద్యమం యొక్క చరిత్ర పరిరక్షణ, అధ్యయనం కోసం జలంధర్ లో స్థాపించిన “దేశ్ భగత్ యాద్గార్ కమిటీ” ఆద్వర్యంలో పరమిందర్ సింగ్ సంపాదకుడిగా “Ghadar Party : My Reminiscences ; D. Chenchiah” పేరిట ఆంగ్లంలో ప్రచురించారు!
పరిమిందర్ సింగ్ విశ్లేషణాత్మకమయిన ముందుమాటతో 64 పేజీల్లో చెంచయ్యగారి జ్ఞాపకాలను అనువదించడంతో పాటూ, కొన్ని అంశాల్లో ఆయన వ్యక్తపరిచిన చారిత్రక సంఘటనల పట్ల భిన్నాభిప్రాయాలు ఉండగల అవకాశాన్ని సంపాదకులు స్పష్టం చేయడం బావుంది. మొత్తం ఆయన ఆత్మకథ అనువాదం చాలా పెద్ద కార్యక్రమం కాగలదని బహుశా గదర్ పార్టీ ఉద్యమ చరిత్రకి సంబంధించి భాగాల్ని ఇలా ప్రచురించారు!
మరో విశేషం ఏమిటంటే ఎన్నడో గద్దె లింగయ్య గారు ఆదర్శ గ్రంథ మండలి తరపున తెచ్చిన మొదటి ప్రచురణ మొదలుకొని మూడేళ్ళక్రితం బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ ప్రచురణ వరకూ తెలుగు వారి వద్ద ఉన్నది ఏకైక వృద్ధుడైన చెంచయ్య గారి చిత్రం మాత్రమే. మొట్ట మొదటి సారిగా నవీన ఉత్తేజంతో చుర కత్తుల్లాంటి చూపులతో ఉన్న నవయువ దరిశి చెంచయ్య అరుదైన ఫొటో ఈ ఆంగ్ల గ్రంథానికి ముఖచిత్రం కావడం గమనార్హం!
సుమారు ఐదొందల పేజీలంటూ చదవడానికి ఏడుపు మొహం పెట్టే వారు ఇంగ్లీషులో సంక్షిప్తీకరించి ప్రచురించిన పుస్తకమైనా చదూతారని ఆశ. ఎప్పుడూ ఆలస్యంగా మేల్కొనే తెలుగు జాతి యథాతథంగా ఆయన ఆత్మకథను సంక్షిప్తంగా ప్రచురించే కార్యక్రమం కనీసం భవిష్యత్తులో అయినా చేయాలని ఆశిస్తూ, ఆసక్తి ఉన్న మిత్రుల కోసం స్కాన్డ్ సాఫ్ట్ కాపీ పంపుతున్నాను!
(నేనూ, నా దేశం స్వీయచరిత్ర కి 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, దరిశి చెంచయ్య గారి జయంతి, వర్ధంతి డిసెంబరు నెలలోనే కాన చాలా రోజులుగా ఆయన కృషి గురించి ఒక వ్యాస సంకలనం తీసుకురావాలని, చిన్న కార్యక్రమం చేయాలని తపిస్తున్నాను. ఆ బుక్ కోల్కతా బాలాజీగారి సహకారంతో త్వరలోనే రానుంది. మనం విస్మరించిన మహత్తర కార్యాన్ని నిర్వహించిన పంజాబ్ ఉద్యమ వారసత్వాన్ని మనసారా అభినందిస్తూ, పుస్తకం ముఖచిత్రం, అలాగే జలంధర్ లోని గదర్ స్మారక సంస్థ కొన్ని ఫొటోలతో ఇలా ఈ చిన్ని రైటప్!)
– గౌరవ్