భయంతో ఓ భక్తుడు తల దాచుకుందామని దేవాలయంలోకి వెళ్తే… ఆ గుడిపై బాంబులు పడ్డాయి… దాని నుంచి తప్పించుకుందామని రోడ్డు మీదకు పరుగెత్తితే, ఆకాశం నుంచి ఉరుములు, పిడుగులు వచ్చి ఉక్కిరి బిక్కిరి చేశాయి… నేటి మానవాళి పరిస్థితి అలాగే ఉంది. కరోనా వైరస్ వల్ల సంవత్సరం నుంచి అందరూ బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. దాని ప్రభావం తగ్గిపోయిందని అనుకోగానే, అదే వైరస్ కొత్త కొత్త రూపాలను సంతరించుకుని సందిగ్ధంలో పడేసింది. ఇంతలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. దీనితో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
మళ్ళీ కరోనా మహమ్మారి
మళ్ళీ కరోనా వైరస్ విజృంభించిందనే వార్తలు కలవరం పెడుతున్నాయి. ఈ కరోనా అంశం ఇలా రగులుతూ ఉండగా… మరో కొత్త బాంబు పేలింది. దాని పేరు ” సూపర్ బగ్”. ఇది బ్యాక్టీరియా. ఔషధాలను కూడా తట్టుకునే శక్తి దీనికి వుంది. ఇది మరో మహమ్మారిగా రూపాంతరం చెందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ఆనవాళ్లు భారతదేశంలోనూ బయటపడ్డాయి. దీన్ని ప్రాణాంతకమైన బ్యాక్టీరియాగా భావిస్తున్నారు. ఇది ఎలా వ్యాపిస్తుందో, అర్ధమవ్వక శాస్త్రవేత్తలు తలలు బాదుకుంటున్నారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా దీని వ్యాప్తి ఉంటుందని కొందరు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కానీ, దీనిపై ఇంతవరకూ ఎటువంటి స్పష్టత లేదు.
Also Read : చేజేతులా తెచ్చుకున్న ముప్పు
జపాన్ లో తొలిసారిగా
మొట్ట మొదటిసారిగా 2009వ సంవత్సరంలో ఈ సూపర్ బగ్ ను జపాన్ లోని ఒక రోగిలో గుర్తించారు. బ్రిటన్ లోనూ దీని ఆనవాళ్లు బయటపడ్డాయి.2019 కల్లా సుమారు 270మందిలో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు కనిపెట్టారు. వారిలో 8 మంది మరణించారు. వీరు కేవలం ఈ సూపర్ బగ్ వల్లనే మరణించారని చెప్పడానికి ఆధారాలు లేవని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికాలోని జాన్స్ హాష్కిన్స్ బ్లూమ్ బర్గ్ స్కూల్ అఫ్ పబ్లిక్ హెల్త్ కు సంబంధించిన డాక్టర్ ఆర్డురో క్యాసడేవాల్ దీనిపై ప్రత్యేక పరిశోధనలు చేశారు. ఈ ఫంగస్ ఎక్కడి నుంచి వస్తోందో.. ఇప్పటికీ ఒక మహా రహస్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే వున్నాయి.
ఫంగస్ స్వరూప స్వభావాలపై పరిశోధన
ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ ఫంగస్ మానవులకు సోకుతోందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆసుపత్రి వాతావరణంలో ఇది ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందని చెబుతున్నారు. జ్వరం, చలి వంటి లక్షణాలు కనిపిస్తాయని, శరీరంలోకి ప్రవేశించే ముందు… కొంత సమయంపాటు చర్మంపై జీవిస్తుందని అంటున్నారు. ఇది రక్తం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ) కూడా వెల్లడించింది. దీన్ని ఔషధాలతో లొంగతీసుకోలేం. దీన్ని అదుపు చేయడం కష్టమని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడిసీ ) కూడా చెబుతోంది.
Also Read : మళ్ళీ వస్తోంది మహమ్మారి!
అత్యంత ప్రమాదకరమైన వ్యాధి
అమెరికా దీన్ని ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల జాబితాలో చేర్చింది. 2019లోనే ఈ విషయాన్ని వెల్లడించింది. సూపర్ బగ్ గా పిలుచుకొనే ఈ బ్యాక్టీరియా పేరు ” క్యాండిడా ఆరిస్” (సీ ఆరిస్). దీని ఆనవాళ్ళను మనదేశంలో తొలిసారిగా అండమాన్ దీవుల్లో గుర్తించారు. అసలు దీన్ని కనిపెట్టడమే ఒక “మైలురాయి”గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది విజృంభించే ప్రమాదం ఉంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారు దీని విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే అది తీవ్ర అనారోగ్యాలకు గురిచేస్తుందని, నివేదికల ఆధారంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ వాతావరణంలో దీని మూలాలు బయటపడవు. ఇది ఎక్కడ నుంచి వచ్చి మనుషులకు ఎలా సోకుతుందో? చెప్పలేని పరిస్థితిలోనే శాస్త్రవేత్తలు ఉన్నారు.
బ్యాక్టీరియాపై అధ్యయనం
యూనివర్సిటీ అఫ్ ఢిల్లీకి చెందిన డాక్టర్ అనురాధ చౌదరి బృందం ఈ బ్యాక్టీరియా తీరుతెన్నులపై అధ్యయనం చేస్తున్నారు. మనుషుల తాకిడి ఎక్కువగా ఉండే బీచ్ లలో ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రస్తుత అధ్యయనాలు చెబుతున్నాయి. పర్యావరణ సమతుల్యతను కోల్పోవడం పెద్ద దెబ్బ. ప్రగతి పయనంలో భాగంగా కోట్లాది జీవరాశులకు మనిషి ద్రోహం చేశాడు. ఎదుగుదల పోరాటంలో ఇటువంటి ముప్పులను మనిషి కొని తెచ్చుకున్నాడు. మనిషి మారితే ఆన్నీ సర్దుకుంటాయి. అప్పటి దాకా మహమ్మారులను ఎదుర్కోవడం తప్ప, చేయగలిగింది ఏమీ లేదు. అప్రమత్తంగా ఉందాం.
Also Read : బిగుస్తున్న ఉక్కు పిడికిలి