- ‘దళిత్ ట్రూత్’ పుస్తకావిష్కరణ సభలో ఉద్ఘాటన
- పోరాటబాట ఉన్నది, ప్రజలే పోరాడాలి
- రాజ్యాంగసంస్థలు బందీగా ఉంటే రాజ్యాంగం వృధా
ప్రజాస్వామ్య సంస్థలు ఆక్రమణకు గురి అయినప్పుడు రాజ్యాంగం అమలు కాజాలదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఈ రోజున రాజ్యాంగం బందీగా ఉన్నదనీ, ఇది పోరాటానికి తగిన సమయమనీ, ప్రజలు పోరాటం చేయాలనీ అన్నారు.
దిల్లీలో శనివారంనాడు ‘దళిత్ ట్రూత్ ’ అనే గ్రంథాన్ని విడుదల చేసిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దళితుల గురించీ, వారి పట్ల సమాజం ఎట్లా వ్యవహరించిందన్న సంగతీ తనకు రాజకీయాలలో ప్రవేశించడానికి పూర్వమే ఆసక్తికలిగించిన అంశమని చెప్పారు. ‘‘అప్పుడు లండన్ లో కన్సల్టెంట్ గా పని చేస్తూ ఉండేవాడిని. దేశంలో ఏమి జరుగుతున్నదో నాకు సమాచారం లేదు. నాకు పెద్దగా ఆసక్తి కూడా లేదు. కానీ లండన్ వీధులలో తిరుగుతున్నప్పుడు నాకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. దానికి సంబంధించి ఏదో ఒకటి చదవి ఉంటాను. నా దేశంలో అంటరానివారు ఉంటారనే ఆలోచన నాకు సమ్మతి కానేకాదని స్పష్టంగా అనిపించింది. ఒక మానవుడు అటువంటి నిర్ణయానికి (తోటి మానవుడిని అంటుకోరాదనే నిర్ణయానికి) ఎట్లా వస్తారో నాకు అర్థం కాలేదు. ఒక మనిషి మరో మనిషిని ఇష్టపడకపోవచ్చు. దాన్ని అర్థం చేసుకోగలను. కొంతమందికి మరికొంతమందిపైన కోపతాపాలు కూడా ఉండవచ్చును. ఒక కుక్కను ముట్టుకోవడానికీ, ఒక క్రిమిని చేత్తో కొట్టి చంపడానికి సంకోచించని మనిషి మరో మనిషిని అంటుకోవడానికి నిరాకరిస్తాడనే ఆలోచన నా బుర్రలోకి ఎక్కలేదు. ఆ విషయం నాకు అర్థమే కాలేదు. నాకు ఈ విషయంలో చాలా సుదీర్ఘమైన ప్రయాణం జరిగింది. ఇలా ఎందుకు జరుగుతోందని ఆలోచించాను. ఏదో ఒక కారణం వల్ల ఇది జరుగుతోందని చెప్పజాలను. ఒక మనిషి మదిలో అంటరాని ఆలోచనను ఎట్లా తొలగించాలని ఆలోచించసాగాను,’’ అని రాహుల్ వివరించారు.
‘‘అధికారంపైన వ్యామోహం ఉన్న రాజకీయ నాయకులకు పొద్దున లేచిన దగ్గరినుంచి పదవి ఎట్లా వస్తుందీ,దాన్ని కాపాడుకోవడం ఎట్లా అనే ఆలోచనే ఉంటుంది. నాకు ఎందుకో పదవులపైన అంత వ్యామోహం లేదు. విచిత్రమైన విషయం. నేను అధికారం మధ్యలో, సరిగ్గా మధ్యలోనే, జన్మించాను. కానీ నాకు మాత్రం అధికారం పట్ల ఆసక్తి లేదు. ఇది ఆశ్చక్యకరం. నేను రాత్రి పడుకోపోయే ముందు దేశం గురించి ఆలోచిస్తాను. నిద్ర లేవగానే అదే పని మీద ఉంటాను. దేశాన్ని ప్రేమించేవారు దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. నేనూ అదే పని చేస్తాను….ఏ కారణం లేకుండానే ఈ దేశం నాకు పూర్తి ప్రేమ ఇచ్చింది. పొద్దునే లేవగానే నేను ఆలోచించేది ఏమిటంటే ఈ దేశం నాకు ఇంత ప్రమే, ఇంత గౌరవం ఇచ్చింది కదా వాటిని నిలుపుకోవడం ఎట్లా? నాకు కేవలం ప్రేమ మాత్రమే కాదు హింసను కూడా చూపించింది. అందుకే దేశం నాకు నేర్పాలని అనుకుంటోందన్న సంగతి గ్రహించాను. నేర్చుకో, అర్థం చేసుకో అని దేశం నాకు చెబుతోంది. దారిలో వెడుతుంటే కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటి నుంచి కూడా పాఠాలు నేర్చుకోవచ్చు. రెండు, మూడు సందర్భాలు చెబుతాను,’’ అంటూ వివరించారు.
‘‘ఒక రోజు వాట్సప్ లో విడియో చూశాను. అందులో ఉన్నావ్ (యూపీలో గ్రామీణ ప్రాంతం) లో యువకుడిపైన లాఠీ చార్జి జరుగుతోంది. చొక్కా చింపి నగ్నంగా ఉన్న వీపుమీద లాఠీలతో దడదడా బాదుతున్నారు. ఒక వ్యక్తిపైన ఒక పోలీసు లాఠీ చార్జి చేయడం కాదు. ఒక వ్యక్తిపైన పోలీసుల సమూహం లాఠీ చార్జి చేసింది. మీకు గుర్తున్నదా? ‘నేనూ, నా స్నేహితులూ కలసి ఒక ముస్లిం యువకుడిని కొట్టివచ్చిన రోజు నేను చాలాసంతోషంగా ఉన్నాను,’’ అని వీర్ సావర్కర్ అన్నారు. పదిపదిహేను మంది పోలీసులు నిర్భాగ్యుడైన ఒక దళిత యువకుడిని కొట్టడం నేను కళ్ళారా చూశాను. ఇప్పుడు జరుగుతున్నట్టు రష్యా, ఉక్రేయిన్ మధ్య యుద్దం లాంటిది కాదు. రష్యా యుద్ధం చేసే శక్తి ఉక్రేయిన్ కు లేదనుకున్నది. ఉక్రేయిన్ యుద్దం చేస్తున్నది. యుద్ధం కొనసాగుతున్నది. ఉన్నావ్ లో జరిగింది అటువంటిది కాదు. నేను ఉన్నావ్ వెళ్ళాను. హతుడైన యువకుడి ఇంటికి వెళ్ళాను. కూర్చున్నాను. యువకుడి తండ్రి చేయిపట్టుకున్నాను. తండ్రి చేయి వణుకుతూ ఉన్నది. నేను తండ్రితో మాట్లాడాను. ‘‘మీకు ఈ రోజు చాలా దుఃఖం కలిగి ఉంటుంది. మీవెంట నిలబడటానికి నేనువచ్చాను’’ అని చెప్పాను. ‘‘చాలా దుఃఖం కలిగింది. ఇటువంటి ప్రపంచంలో జీవించలేనని అనుకున్నాను. బాధతో పాటు సంతోషం కూడా కలిగింది రాహుల్ జీ’’ అన్నాడు. ‘‘సంతోషమా? ఎందుకు?’’ అని అడిగాను. నా కొడుకును కొట్టి చంపినతర్వాత స్పందించిన డజను మంది యువకులు పురుగుమందు తాగి ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి అక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంది. వారి సంగతి కనుక్కుందామని ఆస్పత్రికి వెళ్ళాం. యువకులందరూ ఇన్ టెన్సివ్ కేర్ యూనిట్ లో వరుసగా పడుకొని ఉన్నారు. వారి దగ్గర వారి కుటంబసభ్యులు ఉన్నారు. మొదటి యువకుడి దగ్గరికి వెళ్ళి అతిని కుటుంబ సభ్యులతో మాట్లాడితే వారికి ఏమీ తెలియదని అర్థమెంది. డాక్టర్ పక్కకు పిలిచి ఇంగ్లీషులోఅడిగితే యువకుడు బతకడని చెప్పారు. నేను ఆ సంగతి వారి కుటుంబ సభ్యులకు చెప్పలేను. రెండో యువకుడి దగ్గరికీ, మూడో యువకుడి దగ్గరికి వెళ్ళాను. అదే డాక్టర్ అదే సమాధానం చెప్పాడు. నాలుగో యువకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడు ఈ యువకుడు బతుకుతాడని చెప్పాడు. ఆ యువకుడు స్పృహలో లేడు. మిగతావారంతా బతుకుతారని డాక్టర్ చెప్పారు. సంతోషం కలిగింది. వారిలో స్పృహలో ఉన్న యువకుడి దగ్గరికి వెళ్ళాను. ఎట్లా ఉన్నావని అడిగాను. ‘మా సోదరుడిని కుక్కను కొట్టినట్టు పోలీసులు కొట్టడం నేను వాట్సప్ లో చూశాను. సహించలేకపోయాను. ఇంటికి పోయాను. క్రిమిసంహారక మందు కనపించింది. దాన్ని తాగేశాను. ఆ తర్వాత నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు,’ అని చెప్పాడు. నేను ఆ యువకుడి చేయిపట్టుకున్నాను. నీకు ఏమీ కాదు. బతుకుతావు. డాక్టర్ చెప్పారు. భయపడవద్దు. మాకు చేతనైన సాయం మేము చేస్తామని చెప్పాను. మరో యువకుడి దగ్గరికి వెళ్ళాను. ఏం జరిగింది తమ్ముడూ అని అడిగాను. ‘నేను వాట్సప్ చూసినప్పుడు నా మనసులో తుపాను చెలరేగింది. నా సోదరుడిని పోలీసులందరూ కలిసి కుక్కను కొట్టినట్టు కొట్టడం కనిపించింది. అటువంటి హింస నాపైన రోజూ జరుగుతూనే ఉంది. చూడలేకపోయాను. ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగాను. ఇక్కడికి తెచ్చారు,’ అని చెప్పాడు. అది ఒక ఒప్పందం ప్రకారం డజను మంది కలిసి కూడబలుక్కొని పురుగుల మందు తాగారని నేను ముందు అనుకున్నాను. కానీ అది కాదని తెలిసింది. ప్రతి యువకుడి హృదయంలో మంటలు చెలరేగినాయి. అందరూ విడివిడిగా పురుగుమందు తాగారు. మరో యువకుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇక్కడున్నావని అడిగాను. ‘రాహుల్ జీ నా దేశంలో మాకు ఇటువంటి అనుభవం రోజూ ఎదురవుతూనే ఉంది. వాట్సప్ చూసిన తర్వాత గుండెమండి ఇంటికి వెళ్ళి పురుగుల మందు తాగాను. ఇక్కడికి తెచ్చారు,’ అని అన్నాడు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను కనుక ఆ యువకుడి స్థానంలో ఉంటే, మరణించడానికి సిద్ధంగా ఉన్న నేను మరణించే ముందు నా సోదరుణ్ణి కొట్టినవాడిని చంపి నేను మరణిస్తాను అనుకున్నాను. నా సోదరిని ఎవరైనా పది మంది కలిసి కుక్కను కొట్టినట్టు కొట్టి ఉంటే నేను ఆత్మహత్య చేసుకునే ముందు కొట్టినవారిని చంపేసేవాడిని. నిజానికి నా తండ్రిని చంపారు. చంపినవారి పట్ల నాకు ఎటువంటి ద్వేషం లేదు. వారిని చంపడానికి నేను ప్రయత్నించలేదు. కానీ ఆస్పత్రిలో అటువంటి ఆలోచన వచ్చింది. ఆస్పత్రిలో యువకుడిని అడిగాను. పేపర్లు చదువుతావా అంటే చదువుతానన్నాడు. మీసోదరుడిని చంపిన వ్యక్తి పేరు కనుక్కోగలవా అంటే కనుక్కోగలను అన్నాడు. మీ ఇంట్లో చాకు కానీ కత్తి గానీ ఉన్నదా అని అడిగాను. ‘ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న’ అని అన్నాడు. ‘నేను మీ స్థానంలో ఉంటే సోదరుడిని పోలీసులు చంపినందుకు చలించి పోయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయిస్తే, దాని కంటే ముందు మీ సోదరుడిని చంపినవాడి ఇంటికి వెళ్ళి వాడి ఛాతీలో చాకు దించేవాడిని అని చెప్పాను. అతని మొహం తెల్లగా మారింది. ‘మీరు ఏమి మాట్లాడుతున్నారు?’ అని అడిగాడు. నేను అన్నదే మళ్ళీ అన్నాను. ‘నా సోదరిని ఈ విధంగా ఎవరైనా కొట్టి చంపితే నేను అతడిని చంపి నేను చస్తాను’ అన్నాను. ‘రాహుల్ జీ మీరు ఇంత చదువుకున్నారు ఈ మాత్రం అర్థం చేసుకోలేరా? నేను కనుక అతణ్ణి చంపితే మళ్ళీ దళితుడిగానే పుడతాను,’ అని అతడు సమాధానం చెప్పాడు. నేను చలించిపోయాను. అతని గొంతులో వేల, లక్షల మంది బాధ నిండి ఉంది. అందుకే అతడు చంపలేనని అంటున్నాడు. ఇది మొదటి కథ.
పునర్జన్మ నమ్మని బీజేపీ నాయకుడి కథ
రెండో కథ ఏమంటే కొన్ని రోజుల కిందట పార్లమెంట్ లో ఒక బీజేపీ సీనియర్ నేతతో కబుర్లు చెబుతూ కూర్చున్నాను. కసరత్తు గురించి, ఆహారపుటలవాట్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అకస్మాత్తుగా నేను ఒక ప్రశ్న అడిగాను. మీకు పునర్జన్మ మీద నమ్మకం ఉన్నదా అని. నమ్మనని చెప్పారు. మీకు పునర్జన్మ మీద నమ్మకం లేనప్పుడు రాముడిమీద నమ్మకం ఎట్లా పెట్టుకుంటారు? మీరు చెప్పింది నిజమే కానీ బయట ఎవరితో మన సంభాషణ గురించి చెప్పకండి అన్నారు. ఈ రోజు ఏమి జరుగుతోంది? మన రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. రాజ్యాంగం హిందుస్థాన్ చేతిలో ఒక ఆయుధం. రాజ్యాంగ సంస్థలు లేకపోతే రాజ్యాంగం నిష్ప్రయోజనం. మీరంటారూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని. నేనూ అదే మాట అంటాను. కానీ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేస్తారు? ప్రజాస్వామ్య సంస్థలన్నీ ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఉన్నాయి. మీ చేతుల్లో కానీ నా చేతుల్లో కానీ లేవు. సంస్థలు మన చేతిలో లేకపోతే రాజ్యాంగం కూడా మన చేతిలో లేనట్టే లెక్క. ఇదేదీ కొత్త దురాక్రమణ కాదు. మహాత్మాగాంధీ ఛాతిలో మూడు బెల్లెట్లు దించినప్పుడే ఈ ఆక్రమణ మొదలయ్యింది. అంబేడ్కర్ జీ ఉన్నారు. రాజ్యాంగాన్నితయారు చేయడానికి, పరిరక్షించడానికీ, అభివృద్ధి చేయడానికీ కృషి చేశారు. అందుకే ఆయన ఫొటో ముందు పూలు పెట్టాం. అంబేడ్కర్ మన చేతికి ఆయుధం ఇచ్చారు. కానీ ఆ ఆయుధానికి ఈ రోజు అర్థం లేదు. ఒక కారు ఉంది. అందులో ఐదుగురు కూర్చున్నారు. వారిలో మీరు విమానాశ్రయానికి వెళ్లాలని అనుకుంటున్నారు. తక్కిన నలుగురు జైపూర్ వెళ్లాలంటున్నారు. డ్రైవర్ బండిని ఆగ్రా తీసుకువెడుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ఇది జరుగుతోంది. ఎలా? మీడియాను కంట్రోల్ చేస్తూ, కోటీశ్వరుల్లో నలుగురైదుగురు ప్రముఖులను కంట్రోల్ చేస్తూ తమ అభీష్టాన్నినెరవేర్చుకుంటున్నారు. పెగాసెస్ తో రాజకీయ నాయకులను అదుపులో ఉంచుకొన్నారు. పెగసస్, సీబీఐ, ఈడీ చేతుల్లో పెట్టుకొని రాజకీయ వ్యవస్థపై అదుపు సంపాదిస్తారు. మీరు చూశారు, మాయావతి పోటీ సైతం చేయలేదు. మనం మాయావతికి సందేశం పంపాం. పొత్తు పెట్టుకుందామని చెప్పాం. మీరే ముఖ్యమంత్రి కండని చెప్పాం. సమాధానం లేదు. కాన్సీరామ్ అంటే నాకు గౌరవం. ఆయన చెమటోడ్చి ఉత్తరప్రదేశ్ లో దళిత వాణిని ప్రోది చేసి వినిపించారు. కాంగ్రెస్ కు నష్టం జరిగింది. కానీ ఆయన దళిత వాణిని సమైక్యంగా వినిపించారు. అటువంటి వాణిని పరిరక్షించేందకు ఈ రోజు మాయావతి పోరాడటానికి నిరాకరిస్తున్నారు. బీజేపీ విజయానికి మార్గాన్ని సుగమం చేశారు.ఎందుకు? సీబీఐ, ఈడీ, పెగాసస్. పోరాటం కేవలం ప్రజలు చేస్తారు. ప్రజల వాణి ఎలుగెత్తి చాటనంత వరకూ వీరు వ్యవస్థల్ని అదుపులో ఉంచుకొని రాజ్యాంగాన్ని అమలు కానివ్వరు. నేను చెప్పేది కొందరు ఒప్పుకోవచ్చు. మరికొందరు ఒప్పుకోకపోవచ్చు. కానీ ఎప్పుడైతే రాజ్యాంగం పని చేయదో అప్పుడు దెబ్బ సూటిగా అర్భకులపైనే పడుతుంది. అర్భకులు ఎవరు? దళితులూ, అల్పసంఖ్యాకవర్గాలవారూ, ఆదివాసీలూ. నిరుద్యోగులూ, చిన్నరైతులూ తదితరులు. పోరాటానికి ఇదే సమయం. గాంధీజీ చెప్పారు.ఇతరులు చెప్పారు. పోరాటానికి పంథా ఉంది. దాన్ని అనుసరించాలి. ఇది అంత తేలికైన పని కాదు. దారి ఉన్నది. దారిలో నడవవలసిన అవసరం ఉన్నది. ధన్యవాదాలు,’’ అంటూ రాహుల్ ప్రసంగం ముగించారు.
కులవ్యవస్థ సృష్టించిన అబద్ధాలను బద్దలు కొట్టే పుస్తకం ఇది: రాజు
సభలో తొలి వక్తగా మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు ప్రసంగించారు. ‘‘రాహుల్ జీ విడుదల చేయబోయే పుస్తకం నిజాలు, అబద్ధాలకు సంబంధించింది. దళితుల జీవితాల గురించిన వాస్తవాలూ, కులవ్యవస్థ సృష్టించిన అబద్ధాలు,’’ అని కాంగ్రెస్ పార్టీలో దళిత వ్యవహారాల సచివులు, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు ఉద్ఘాటించారు. ‘‘ఈ పుస్తకంలో దళితుల గతం గురించీ, వారు ఎదుర్కొన్న సమస్యల గురించీ వివరణాత్మకంగా ఉంది. కులాధిక్యాన్ని ప్రదర్శించేవారు వివక్షను తమ అబద్ధాలతో కప్పి పుచ్చాలని చూస్తారు. ఎందుకంటే వారి ఆధిక్యాన్ని ఇంకా కొనసాగించాలంటే దళితులకు సంబంధించిన నిజాలు మరుగునే ఉండాలి. ఏదైనా రాజకీయ, సామాజిక వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటే మనం నిజం ఏమిటో తెలుసుకోవాలి. ఈ నిజాన్ని ముసుగు కప్పి ఉంచారు. ఒక ముసుగుకాదు, ఎన్నో ముసుగులు ఉన్నాయి. ప్రతిముసుగూ కులవ్యవస్థ చేసిన కల్పనలతో తయారు చేయబడింది. ఈ అబద్ధాల ముసుగుల దొంతరలను తొలగించి మనం వాస్తవాన్ని, నిజాన్ని తెలుసుకోవాలి. దళిత వాస్తవికత ఏమిటి? సమానత్వాన్నీ, సౌభ్రాతృత్వాన్నీ అమలు చేస్తామని రాజ్యాంగం హామీ ఇచ్చినప్పటికీ కలుపుగోలుతనం వెనక వివక్ష దాగి ఉంటుంది. ఈ పుస్తకం చెప్పే దళిత వాస్తవికత అదే. కులవ్యవస్థను నిర్మూలించాలనుకునే సత్యశోధకులకు ఈ పుస్తకం ఆయుధం వంటిది. అందుకే కులవ్యవస్థ కొనసాగిస్తూ వచ్చిన అబద్ధాలు ఏమిటో తెలుసుకోవాలి. ఈ పుస్తకం రెండు మార్గాల గురించి చెబుతుంది. ఒక దారి దళితులను చట్టసభలవైపు తీసుకువెడుతుంది. మరో దారి బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి దూరంగా, మనువాదానికి దగ్గరగా తీసుకువెడుతోంది. అక్కడ సమానత్వం అంతమౌతుంది. కులవ్యవస్థ బలోపేతమై కొనసాగుతుంది. తాము అంబేడ్కర్ వైపునకు ప్రయాణం చేస్తున్నారా లేక అంబేడ్కర్ కు దూరంగా వెడుతున్నారో తెలుసుకోవలసిన అవసరం దళితులకు ఉంది. వివిధ రాజకీయ పక్షాలు దళితులను ప్రభావం చేసి ఆకర్షించే క్రమంలో సత్యమేమిటో, అసత్యమేమిటో ఈ పుస్తకం స్పష్టంగా చెబుతుంది. ఈ పుస్తకం దళితుల జీవితాల గురించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించీ చెబుతుంది. అదే సమయంలో చిన్న స్థాయిలో ఉన్న దళితుల వాణిని కూడా పరిచయం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పుస్తకం దళితజీవితాలను విశ్లేషించి దళిత వేడుక జరుపుతుంది. భారత దేశానికీ, ప్రపంచానికీ దళితులు చేసిన మేలు ఏమిటో, వారు సాధించిన విజయాలు ఏమిటో వివరిస్తుంది. దళితుల జీవితంలోని వివిధ కోణాలను ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. రాజకీయ సాధికారికత నుంచి వ్యాపారరంగంలో అవకాశాల దాకా అన్ని విషయాలనూ చర్చిస్తుంది. విద్య నుంచి సినిమా వరకూ, న్యాయం నుంచి అన్యాయం వరకూ, దళితులను రాజ్యాంగం వైపు సమీకరించడం, రాజ్యాంగానికి దూరంగా నడిపించడం వరకూ సకల అంశాలనూ స్పృశిస్తుంది. ఈ పుస్తకానికి ప్రేరణ రాహుల్ గాంధీ ఇచ్చిన రెండు ప్రభావవంతమైన ప్రసంగాల నుంచి వచ్చింది. మొదటిది 2015లో బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతిని ఆయన జన్మస్థలం మావ్(Mhow – మధ్యప్రదేశ్ లోని ఈ గ్రామం పేరు డాక్టర్ అంబేడ్కర్ నగర్ గా మార్చారు) లో కాంగ్రెస్ పార్టీ జరుపుకకుంటున్న సందర్భంలో రాహుల్ ప్రసంగించారు. కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పిలుపునిచ్చారు. బహుశా ఈ దేశ రాజకీయ చరిత్రలో అంబేడ్కర్ తర్వాత కులవ్యవస్థపైన ధ్వజమెత్తిన రాజకీయ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కడే. రాహుల్ చేసిన రెండో ప్రభావవంతమైన ప్రసంగం 2016లో నాగపూర్ లో చేసింది. అందులో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నరెండు భావజాలాల గురించి మాట్లాడారు. దళితులను కులవ్యవస్థలో బందీలుగా కొనసాగించే భావజాలం ఒకటి. దళితులకు కులవ్యవస్థ నుంచి విముక్తి ప్రసాదించాలనే కాంగ్రెస్ భావజాలం రెండోది. దళితుల గొంతుకల విశ్రమ సంగీతాన్ని, వివిధ రంగుల పూల గుత్తులను తమ కథనాలతో కట్టివేసి భవిష్యత్తుపైన పెను ఆశాభావంతో, విస్తారమైన అవకాశాలతో పొందుపరచి నాకు వ్యాసాలందించిన మేధావులకు ధన్యవాదాలు. నాకు ఈ పని చేయడానికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు,’’ అని రాజు అన్నారు.