Thursday, November 21, 2024

అంబేడ్కర్ బాటలో … గుజరాత్ లో బౌద్ధం

14 ఏప్రిల్ 2023 బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పుట్టిన రోజున హైదరాబాద్ – హుస్సేన్ సాగర్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన అతిపెద్ద, కంచు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది! ఆయన పట్ల దేశ ప్రజల ప్రేమాభిమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆ రకంగా భారత రాజ్యాంగ నిర్మాతకు దక్కాల్సిన గౌరవం దక్కుతోంది. ‘‘లైట్ ఆఫ్ ఆసియా’’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గౌతమ బుద్ధుణ్ణి, ఆయన బోధించిన ధర్మాన్ని ప్రచారం చేసిన అశోక చక్రవర్తిని ఈ ఆధునిక  కాలంలో కూడా ప్రజలు స్మరించుకుంటున్నారు. అంతేకాదు, హిందూ మతాన్ని త్యజించి ఆరు లక్షల మందితో అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడం కూడా సమకాలికులకు స్ఫూర్తినందిస్తోంది. తెలంగాణ టూరిజం శాఖ నాగార్జున సాగర్ లో బుద్ధవనాన్ని ఎంతో అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ స్థాయిలో దాన్ని నిలబెట్టడానికి ఇంకా కృషి చేస్తోంది. ఇక భారతదేశం బయట జరిగే విషయాలు చెప్పుకోవాలంటే – ఉత్తర అమెరికాలో అంబేడ్కర్ జయంతిని…డా. బి. ఆర్. అంబేడ్కర్ సమానత్వపు రోజు (DAY OF EQUALITY)గా గుర్తించి జరుపుకుంటున్నారు. అంతే కాదు, నెల పొడవునా ‘దళిత చరిత్రమాసం’గా పలు కార్యక్రమాలు నిర్వహించారు.

హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ పక్కన, సచివాలయం చెంత అంబేడ్కర్ భారీ విగ్రహం

ఈ విషయాలు ఇలా ఉంటే, అదే రోజు 14 ఏప్రిల్ 2023న గుజరాత్ లో మరో మహాద్భుతం జరిగింది-గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్ లో యాభైవేల మంది దళితులు బౌద్ధం స్వీకరించారు. ఆ రాష్ట్రంలోని పలు గ్రామాల్లోంచి, పట్టణాలలోంచి, నగరాల్లోంచి, అటవీ ప్రాంతాల్లోంచి దళితులూ, ఆదివాసీలూ అక్కడి రమాకాంతా మైదానంలో సమావేశమయ్యారు. హిందూ మతాన్ని త్యజించి, బాబా సాహెబ్ అంబేడ్కర్ నడిచిన దారిలో నడిచి, బౌద్ధం స్వీకరించారు. ఆ రాష్ట్రంలోని దళితులు, ఆదివాసీలు, వెనకబడిన జాతులవారు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఓ కార్యక్రమం నిర్వహించుకున్నారు. దంగాపూర్ ఆదివాసీలైతే కుటుంబాలకు కుటుంబాలు తరలి వచ్చి, బుద్ధదీక్ష తీసుకున్నారు. కార్యక్రమం చూడడానికి మరికొన్ని లక్షల మంది అక్కడికి చేరుకున్నారు.

నాగార్జునసాగర్ లో బుద్ధవనంలో అద్భుత నిర్మాణం

ఆ కార్యక్రమాన్ని స్వయం సైనిక్ దళ్ (SSD) అనే స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వహించింది! అప్పుడు – ఆ ఏప్రిల్ 14న జరిగిన  ఆ కార్యక్రమం బౌద్ధభిక్షు ప్రజ్ఞారత్న ఆధ్వర్యంలో జరిగింది  – వీరు పోరుబందర్ లోని గ్రేట్ అశోకా బౌద్ధ విహార్ నుండి వచ్చి, ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అక్కడి వారందరికీ బుద్ధదీక్ష ఇప్పించారు. కార్యక్రమాలు ఆ విధంగానే కొనసాగితే – రాబోయే రెండేళ్ళలో అంటే 2025 నాటికి ఒక కోటి మంది దీక్ష తీసుకుంటారని దీని వెనక కృషి చేస్తున్న స్వయం సైనిక్ దళ్ ఆశిస్తోంది.

Also read: మనిషన్నది మరిచాక మతమేదైతే నేమిటి?

ప్రభుత్వం మతాల మధ్య విద్వేషాలు రగిలించడమే కాదు, హిందూ మతస్థుల మధ్య కూడా కలహాలు సృష్టిస్తోంది. బలవంతంగా హిందుత్వను  ప్రజల మీద రుద్దడం వల్ల ఫలితాలు వ్యతిరేకంగా వస్తున్నాయి. హిందూ మతంలోని ఎగుడుదిగుళ్ళని, నిచ్చెనమెట్ల కుల సంస్కృతిని బలపర్చడం, మహిళల హక్కులు-మానవ హక్కులు హరించడం ఈ దేశ ప్రజలు భరించలేకపోతున్నారు. మనుధర్మ శాస్త్రాన్ని మన ప్రాచీన రాజ్యాంగం అంటూ నెత్తికెత్తుకోవడం, దేశద్రోహులైన గాడ్సే, సావర్కర్ ల స్థాయి అనూహ్యంగా పెంచడం – ఈ దేశ ప్రజలకు నచ్చడం లేదు. నీతిలేని, చదువులేని ప్రబుద్ధులంతా మహానాయకులై వెలిగి పోవడం – అధర్మమే ధర్మంగా చలామణి అవుతూ ఉండడం – ఈ దేశ ప్రజలకు కష్టంగా ఉంది. అందుకే  వేల సంఖ్యలో జనం బుద్ధమార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీన్నిహిందూ దేశంగా మార్చాలని కలలు కంటున్న నేటి పాలకులకు, లక్షల మంది హిందూ మతాన్ని త్యజించడం – ఒక చెంపపెట్టు!

బుద్ధుడికి వందనం చేస్తున్న బౌద్ధ సన్యాసులు

అధికారంలో ఉన్నవారు ఉగ్రమార్గాన్ని వెతుక్కుంటూ ఉంటే దానికి దీటైన సమాధానం చెప్పగల సమతామార్గాన్ని, నైతిక రుజుమార్గాన్ని సామాన్య ప్రజలు వెతుక్కుంటున్నారు. దేవుడనే రాముడి బూచీ చూపించి పాలకులు రాజకీయాలు చేస్తుంటే – అసలు దేవుడనేవాడే లేడన్న బుద్ధమార్గాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. శోభాయాత్రల పేరుతో పాలకులు అల్లర్లు, కల్లోలాలు ప్రోత్సహిస్తుంటే… మనసు ప్రశాంతంగా ఉంచుకుని…సర్వజనాభ్యుదయాన్ని కాంక్షించే బుద్ధమార్గాన్ని జనం కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యనాయకులంతా ఆ రాష్ట్రంవారే – బ్యాంకులు దోపిడి చేసి పారిపోయిన దొంగలంతా అక్కడి వారే. అలాంటి గుజరాత్ రాష్ట్రంలో సామాన్యుల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ కార్యక్రమం తేటతెల్లం చేసింది. అబద్ధాలతో అధికారంలో ఉందామనుకున్నవారికి బదులుగా – అబద్ధం ఆడరాదనీ, దొంగతనాలు చేయకూడదని చెప్పిన బుద్ధమార్గాన్ని గురజాత్ ప్రజలు కావాలనుకుంటున్నారు. ఇది ఎంతో ఆహ్వానించతగిన పరిణామం. మనం బతుకుదాం. మరొకరిని బతకనిద్దాం. మొత్తానికి మొత్తంగా మనిషిని బతికించుకుందాం – అనే సూత్రానికి కట్టుబడ్డ సామాన్యుల చైతన్యం చాలా గొప్పది. వెలుగు వెంట నీడలుండడం కాదు, నీడల్ని మాయం చేయగల వెలుగులు అక్కడ దేదీప్యమానంగా ప్రసరిస్తున్నాయి.

Also read: గాంధీజీ స్థానంలో సావర్కరా? హవ్వ-సిగ్గుచేటు!

హిందూమతంలోని పూజలు, భజనలు, పాపాలు, పుణ్యాలు, ఆత్మలు, పునర్జన్మలు – ఆచారాలు, సంప్రదాయాలు వీటన్నిటి కంటే ముఖ్యంగా ఉన్నతులు, నిమ్నవర్గాలు వంటివన్నీ – మూఢనమ్మకాల పుట్టలు! వీటిలో వేటికీ ఆధారాలు లేవు. నిరూపణలు లేవు. కేవలం విశ్వాసాల ఆధారంగా శతాబ్దాలుగా కొనసాగుతూ మానవుల జీవితాలు దుర్భరం చేస్తున్నాయి.  అందుకే, వాటినన్నింటినీ వదిలి స్వేచ్ఛాలోచనకు, మానవవాదానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి విలువనివ్వాలని స్వయం సైనిక్ దళ్ ప్రచారం చేస్తోంది. మనుషుల్ని ఎగుడుదిగుడు స్థాయిల్లో ఉంచి, వివక్ష చూపుతున్న హిందూ ధర్మాన్ని తిరస్కరించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. ఆనాడు అంబేడ్కర్ చేసిందే ఆదర్శంగా తీసుకుని, ఈ రోజు దేశంలో లక్షల మంది బౌద్ధం స్వీకరిస్తున్నారు. మనుషులందరిదీ ఒకే స్థాయి అని నినదిస్తున్నారు. ఎవరి జ్ఞానాన్ని వారు, ఎవరి వివేకాన్ని వారు తట్టిలేపుకోవాలని, నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలని, బుద్ధిని ఉపయోగించాలని స్వయం సైనిక్ దళ్ జనానికి బోధిస్తోంది. దీక్ష తీసుకునే విషయంలో ఎవరూ ఎవరినీ బలవంతం చేయడం లేదు. ఎవరూ  ఎవరినీ ప్రభావితం చేయడం లేదు. ఎలక్షన్లలో మాదిరిగా ఎవరూ ఎవరినీ డబ్బుతో లొంగదీసుకోవడం లేదు. స్వచ్ఛంగా ఇలాంటి పని ఆలోచనాపరులే చేస్తారు.  అదీగాక, ఇది – పూజలో మంత్రాలు వల్లెవేసి మతమార్పిడి చేసే తంతు కాదు. అసలు బౌద్ధం – మతమే కాదు! అదొక జీవన విధానం!! బుద్ధుడి బోధనలు పూర్తిగా స్వీకరించి, అందుకు అనుగుణంగా తమ జీవన విధానం మార్చుకుంటారు. అంతే  – ఇది న్యాయసమ్మతంగా, చట్టబద్ధంగా, మనస్ఫూర్తిగా చేయవల్సిన పని! దీక్ష తీసుకునే వారు వారివారి కలెక్టర్ ఆఫీసుల్లో అప్లికేషన్లు నింపాలి. ఆ తర్వాత అందులో ప్రకటించినవన్నీ నిజాలా, కాదా – అనేది పోలీసు ఎంక్వయిరీ జరుగుతుంది. దీక్ష తీసుకున్నవారి వివరాలన్నీ గజిట్ లో అచ్చేస్తారు. ఇదంతా అధికారికంగ జరిగే కార్యక్రమం.

గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో అంబేడ్కర్ ఫొటోతో ఊరేగింపుగా బౌద్ధం స్వీకరించడానికి వచ్చిన దళిత, ఆదివాసీ మహిళలు

ఈ స్వయం సైనిక్ దళ్  ఎప్పుడు ఏర్పడింది? ఏమేం పనులు చేస్తుందో చూద్దాం – తొలుత 2006లో ఒక యాభైమందితో ఏర్పడింది. ఒకే ఆలోచనా విధానం గల మిత్రులయిన దళిత కార్యకర్తలతో మొదలైంది.  ఆ సంఖ్య క్రమంగా ఊహించనిరీతిలో పెరుగుతూ పోయింది. ఈ స్వయం సైనిక దళ్ లో ఎవరు చేరవచ్చు? అంటే – నిచ్చెనమెట్ల సంస్కృతిని తిరస్కరించేవారంతా చేరొచ్చు. అందరికీ సమానమైన స్థాయి, హక్కులు, బాధ్యతలు కావాలనుకునేవారు చేరొచ్చు. మనుషులంతా ఒక్కటే అన్న భావనగలవారే ఈ స్వయం సైనిక దళ్ సభ్యులవుతారు. వీరిలో కొందరు నాయకులు, మరికొందరు కార్యకర్తలు అనే హెచ్చుతగ్గులుండవు. కలసి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ‘చింతన శిబిరాలు’ ఉంటాయి. అందులో అందరూ సమానమే. కొందరు వేదిక మీద ఉండి ఉపన్యసించడం, మరికొందరు వేదిక ముందుండి వినడం ఉండదు. ఏదో ఒక మైదానంలో అందరూ నేల మీద కూర్చుంటారు. ఎక్కడివారు అక్కడే నిలబడి మాట్లాడుతుంటారు. అందరూ సమానమనే భావన – బాధ్యత అందరిదీ అనే భావన – అక్కడ ఉన్నవారందరిలో కలుగుతుంది. స్వయం సైనిక్ దళ్ సభ్యులు ఆకుపచ్చ దుస్తులు ధరిస్తారు. ట్రాఫిక్, రవాణా, వైద్య రంగాలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉంటారు. సామాన్య పౌరులకు ఏ ఇబ్బదీ కలగకుండా అదే రోజు ఒక ‘మహార్యాలీ’ కూడా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి వచ్చే వారికోసం 800ల బస్సులు, 5 వేల కార్లు ఏర్పాటు చేసుకున్నారు. గాంధీనగర్ విధాన సభ ముందున్న అంబేడ్కర్ విగ్రహం దగ్గర 22 ప్రతిజ్ఞలు చేశారు. ఆ ర్యాలీ ఉద్దేశమేమంటే – సామాన్య పౌరుల్లో చేతనత్వాన్ని కలిగించడం. బుద్ధమార్గంలోకి రావాలనుకునేవారికి, ఒక ఉత్తేజాన్ని కలిగించడం. ఏ నిర్ణయమూ తీసుకోలేక కొట్టుమిట్టాడుతున్నవారికి, ఒక ఉత్తేజాన్ని కలిగించడం. దిశానిర్దేశం చేయడం.

గాంధీనగర్ లో బౌద్ధం స్వీకరించే సమయంలో స్వయం సైన్య దళ్ వలంటీర్లు-ఆకుపచ్చని సైన్యం

ప్రతిసంవత్సరం అంబేడ్కర్ జయంతి రోజున ఇలాంటి దీక్షలు దిల్లీ, కోల్ కత్తా, బెంగళూరు, భోపాల్, ముంబాయి, హైదరాబాద్, లక్నో వంటి పెద్దపెద్ద నగరాలలో జరపాలని స్వయం సైనిక దళ్ పథకాలు వేసుకుంది. రాబోయే కాలంలో బుద్ధదీక్ష కార్యక్రమాలు దేశంలో ఇంకా పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మోసం, దగా నిత్యకృత్యాలై జీవితాలు దుర్భరమై పోతున్న  ఈ రోజుల్లో … కేవలం బౌద్ధమే నైతిక మార్గం చూపగలదని, ప్రజల మానసిక ఆరోగ్యం కాపాడగలదని, మానవ జాతిని రక్షించగలదనీ మానవ ప్రేమికులంతా భావిస్తున్నారు. మానవవాదులంతా ఆశిస్తున్నారు. ఈదేశ ప్రజలు మానవీయ విలువల పరిరక్షణ కోరుకుంటున్నారని – ఈ సంఘటన చెప్పకనే – బలంగా చెపుతోంది!! ఇంకా రుజువేం కావాలీ?

(శుక్రవారం, 05 మే 2023 బుద్ధపూర్ణిమ)

Also read: హేతుబద్ధత కొరవడిన దేశాల్లో భారత్ ఫస్ట్!

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles