- అంబేడ్కర్-గాంధీ-పటేల్ గ్రంథంలో ఆవిష్కరణ
- అంబేడ్కర్ ని ఒంటరిని చేయడానికి గాంధీ, పటేల్ ప్రయత్నం
- సాటి దళిత ప్రతినిధులే కాంగ్రెస్ కి తొత్తులుగా వ్యవహరించిన వైనం
- ప్రజాస్వామ్య వ్యవస్థనీ, చట్టబద్ధమైన పాలననూ, గొప్ప రాజ్యాంగాన్నీ ప్రసాదించిన దార్శనికుడు అంబేడ్కర్
రాజశేఖర్ వుండ్రు (ఐ ఎ ఎస్) రచించిన Ambedkar, Gandhi and Patel-The Making of India’s Electoral System ఈమధ్య నేను చదివిన ఒక మంచి పుస్తకం. ప్రముఖ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తిగారు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. గాంధీ-అంబేడ్కర్ ఘర్షణను నేను ఇప్పటివరకూ గాంధీ వైపునుంచి అర్థం చేసుకున్నాను. ఈ పుస్తకం అంబేడ్కర్ వైపు నుంచి అర్థం చేసుకునే అవకాశమిచ్చింది. చట్టసభల్లో రిజర్వేషన్ కు సంబంధించిన గత వందేళ్ల చరిత్రనూ సవివరంగా పునర్దర్శించి ఒక పుస్తకమే రాయాలని, ఈ పుస్తకం చదవగానే అనిపించింది. నిజం చెప్పాలంటే మనం ఎదుర్కొంటున్న అసలు సమస్య అల్లా చరిత్రలోకి మనం వెళ్లకపోవడమే. చరిత్రను చిన్నచూపు చూడడమే. చరిత్రమీద ఆసక్తి లేని జాతికి అబద్ధం, అతర్కం, అహేతుకత, అశాస్త్రీయత..ఇవే చారిత్రకవారసత్వంగా అందుతాయి. ఇప్పుడు వీటిని మరింత విశ్వరూపంలో చూస్తున్నాం.
ముఖ్యమైన 14 అంశాలు
రాజశేఖర్ వుండ్రు ఈ పుస్తకంలో పొందుపరచిన నూరేళ్ళ రిజర్వేషన్ల(చట్టసభలలో)చరిత్రలో చాలా ఆసక్తికరమైన మలుపులు, మరుగుపడిన విశేషాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైనవి మాత్రమే క్లుప్తంగా:
1. ముస్లింలకు 1909నుంచి చట్టసభల్లో రిజర్వేషన్, సపరేట్ ఎలక్టొరేట్ ఉన్నాయి. 1916 లో కాంగ్రెస్ నాయకుడు తిలక్, ముస్లింలీగ్ నాయకుడు జిన్నా అంతకన్నా మెరుగైన, కీలకమైన ఒప్పందం చేసుకున్నారు. అదే లక్నో ఒప్పందంగా ప్రసిద్ధి కెక్కింది. అంతకుముందు సంవత్సరమే భారత్ కు తిరిగివచ్చిన గాంధీకి ఈ ఒప్పందంలో జోక్యం లేదు. ఆయన దీనిని వ్యతిరేకించలేదు.
2. 1919లో అంబేడ్కర్ .మొదటిసారి సౌత్ బరో కమిషన్ ముందు హాజరై దళితులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం, పౌరహక్కులు కోరాడు. అంతేకాదు, మొదటిసారి వయోజన వోటు హక్కు కోరాడు. అప్పటికి బ్రిటన్, అమెరికాలలో కూడా అందరికీ వోటు హక్కు లేదు.
3. 1920 ఎన్నికలలో చట్టసభలలో అన్నివర్గాల ప్రాతినిధ్యానికి మొదటిసారి అవకాశం ఏర్పడింది. అయితే గాంధీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని చేపట్టడంతో కాంగ్రెస్ ఆ ఎన్నికలలో పాల్గొనలేదు. మరిన్ని ఎన్నికల సంస్కరణలను సిఫార్సు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన సైమన్ కమిషన్ ను కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. జిన్నా, అంబేడ్కర్ కమిషన్ కు సహకరించారు. కాంగ్రెస్ అంబేడ్కర్ ను బ్రిటిష్ ‘తొత్తు’గా, ‘దేశద్రోహి’గా చిత్రించింది.
4. కొత్త రాజ్యాంగ రచనకు 1928లో కాంగ్రెస్ నియమించిన మోతీలాల్ నెహ్రూ కమిటీ చర్చలకు అందరినీ పిలిచింది కానీ దళిత ప్రతినిధులను పిలవలేదు. సపరేట్ ఎలెక్టొరేట్, లేదా నామినేషన్ ద్వారా దళితులకు ప్రాతినిధ్యమివ్వచ్చునని చర్చలలో అంది కానీ, రిపోర్ట్ లో అది సాధ్యం కాదని అంది.
5. 1930లో సైమన్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. మైనారిటీలకు సపరేట్ ఎలెక్టొరేట్ ను కొనసాగించాలని అది చెప్పింది. దళితులను మొదటిసారి అది ఒక ప్రత్యేక రాజకీయ గ్రూపుగా గుర్తించింది.
6. భారత భవిష్య రాజ్యాంగపు రూపురేఖలు నిర్ణయించడానికి 1930లో లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 1930-32 మధ్య మూడు విడతలుగా ఇవి జరిగాయి. మూడింటిలోనూ అంబేడ్కర్ పాల్గొన్నాడు. గాంధీ రెండవ సమ్మేళనంలో పాల్గొన్నాడు. మొదటివిడత సమ్మేళనంలో అంబేడ్కర్ దళితుల స్థితిగతులను బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తేవడంలో విజయం సాధించాడు. దళితనేతగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు.
7. అంతవరకూ దళితులకు తానే ఏకైక ప్రతినిధిని అనుకున్న గాంధీ ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తూవచ్చాడు. రెండో సమ్మేళనంలో పాల్గొనడానికి ఆయన నిర్ణయించుకున్న తర్వాత మొదటిసారి 1931 ఆగస్టులో ఆయన అంబేడ్కర్ తో మాట్లాడాడు. అంతవరకూ అంబేడ్కర్ దళితుల తరపున పోరాడుతున్న ఒక ప్రగతిశీల బ్రాహ్మణుడని గాంధీ అనుకున్నాడు. ఆయన దళితుడన్న సంగతి అప్పుడప్పుడే ఆయనకు తెలిసింది. హిందువులనుంచి దళితులను వేరు చేయడానికి నేను ఒప్పుకోనని ఆయన అంబేడ్కర్ కు ఖండితంగా చెప్పాడు. ఈ విధంగా ఇద్దరి మధ్యా ఘర్షణ మొదలైంది.
8. మొదటి రౌండ్ టేబుల్ సమ్మేళనం చట్టసభల్లో మైనారిటీల(ముస్లింలు, భారతీయ క్రైస్తవులు, సిక్కులు, దళితులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు) ప్రత్యేక ప్రాతినిధ్యానికి అంగీకారం తెలిపింది. రెండో రౌండ్ లో పాల్గొన్న గాంధీ హిందూ-ముస్లిం-సిక్కులకు తప్ప ఇంకెవరికీ స్పెషల్ ట్రీట్ మెంట్ ఇవ్వడానికి ఒప్పుకోనని తెగేసి చెప్పాడు. ముస్లింలకు, సిక్కులకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించడాన్ని ఆయన necessary evil గా వర్ణించాడు.
9. దళితులను కూడా మైనారిటీలుగానే గుర్తించారు. ఇతర మైనారిటీలకు, దళితులకు మధ్య చీలిక తేవడానికి కూడా గాంధీ ప్రయత్నించారు. దళితులకు మీరు మద్దతు విరమిస్తే కాంగ్రెస్ మీ డిమాండ్లను ఒప్పుకుంటుందన్నారు. కానీ మిగతా మైనారిటీలు ప్రధానంగా దళితుల పక్షాన నిలబడ్డారు. దాంతో గాంధీ ఓటమి చెందాడు.
10, చివరికి అందరూ కలసి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ మధ్యవర్తిత్వ నిర్ణయానికి ఆమోదిస్తామని చెబుతూ గాంధీతో సహా సంతకాలు చేశారు.
11. 1932లో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డ్ గా ప్రసిద్ధమైన అవార్డును ప్రకటించింది. అంబేడ్కర్ కోరుకున్నట్టు దళితులకు సపరేట్ ఎలక్టొరేట్ ను, రెండు వోట్లను(ఒకటి సపరేట్ ఎలెక్టొరేట్ కింద, ఇంకొకటి జనరల్ నియోజకవర్గం కింద)అందులో పొందుపరచింది. మిగిలిన మైనారిటీలకు కూడా సపరేట్ ఎలెక్టొరేట్ ను అంగీకరించింది. అప్పటికి పుణె లోని ఎరవాడ జైలులో ఉన్న గాంధీ ఈ అవార్డును వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించాడు. ప్రధాని నిర్ణయానికి వదిలిపెట్టడానికి తనుకూడా అంగీకరించి సంతకం చేసిన సంగతిని గాంధీ పట్టించుకోలేదు. దాంతో దేశమంతా ఉద్రిక్తమైంది. రాజీ పడవలసిందిగా అంబేడ్కర్ పై ఒత్తిడి పెరిగింది. ఆయన గాంధీ ప్రాణాలు కాపాడడం కోసం రాజీ పడక తప్పలేదు. తేజ్ బహదూర్ సప్రూ సూచించిన ప్రైమరీ ఎలక్షన్, సెకండరీ ఎలెక్షన్ తో కూడిన రాజీ ఫార్ములాను కొన్ని మార్పులతో ఆమోదించారు. ప్రైమరీ ఎలక్షన్ విషయంలో 10 ఏళ్ల తర్వాత, రిజర్వుడు సీట్ల విషయంలో 15ఏళ్ల తర్వాత కొనసాగింపునకు సంబంధించి దళితులమధ్య రెఫరెండం జరపాలన్నది అంబేడ్కర్ మరో సూచన, అయిదేళ్లు చాలని గాంధీ అన్నాడు. అది మరోసారి ప్రతిష్టంభనకు దారితీసింది, అప్పుడు రాజగోపాలాచారి జోక్యం చేసుకుని రెఫరెండంను భవిష్యత్తుకు వాయిదా వేయడానికి ఒప్పించడంతో ప్రతిష్టంభన తొలగింది.
12. ఇదంతా జరుగుతున్నప్పుడు నెహ్రూ డెహ్రాడూన్ జైల్లో ఉన్నాడు. ఏమైనా ఆయన దళితుల అంశాల మీద ఎన్నడూ ఆసక్తి చూపించలేదు. ఈ విషయంలో అంబేడ్కర్ కూడా ఆయనను విమర్శించాడు.
13. ఇదంతా జరుగుతున్నప్పుడు పటేల్ గాంధీకి అదే జైలులో అతి సన్నిహితంగా ఉన్నా చర్చల్లో పాల్గొనలేదు.
14. గాంధీ హత్య తర్వాత కూడా నెహ్రూ మౌనం కొనసాగింది. పటేల్ ఇలాంటి వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మైనారిటీల సలహా సంఘం వంటి కీలకసంఘాలకు ఆయన నాయకత్వస్థానంలో ఉన్నాడు. హడావుడిగా కుదిరిన పుణె ఒప్పందం కన్నా మరింత మెరుగైన ఒప్పందానికి అంబేడ్కర్ చేసిన ప్రతి ప్రయత్నాన్ని పటేల్ నీరుగార్చాడు. దాంతోపాటు దేశవిభజన వాతావరణంలో సమూలమైన మార్పు తెచ్చింది. మైనారిటీల ప్రత్యేక ప్రాతినిధ్యాన్నే కాదు, దళితుల ప్రాతినిధ్యాన్ని కూడా రద్దు చేసే ఆలోచన పటేల్ చేశాడు. ఇప్పుడు షెడ్యూల్డ్ కులాలు అంటూ ఏవీ లేవు, అస్పృశ్యత రద్దయిపోయింది, అందరం ఒకటే నన్న వాదాన్ని ముందుకు తెచ్చాడు. హెచ్. జె. ఖాండేకర్ వంటి ఎస్సీ సభ్యులు కూడా ఆయనకు వంతపాడారు. రాజ్యాంగసభలోని 30మంది ఎస్సీ సభ్యులలో ఒక్కరూ అంబేడ్కర్ కు మద్దతు ఇవ్వకపోవడంతో ఆయన ఏకాకి అయ్యాడు. మాకు ప్రత్యేకప్రాతినిధ్యం వద్దని మైనారిటీల నోటితోనే అనిపించడానికి పటేల్ ప్రయత్నించాడు. చివరికి ముస్లింలు సహా ఇతర మైనారిటీల ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని, అప్పుడున్న ద్విసభ్య నియోజకవర్గాలను రద్దు చేశారు.
అయితే, చరిత్ర ఇలా గతం గురించి మాత్రమే చెప్పదు, వర్తమానం గురించి, భవిష్యత్తుగురించి కూడా చెబుతుంది. అదెలాగో చెప్పుకునేముందు మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. మొదటగా…
గాంధీ
జాతివివక్షను, లేదా కులవివక్షను అనుభవించి దానికి వ్యతిరేకంగా పోరాడిన, పోరాడుతున్న అనుభవం అప్పటి అగ్రనాయకులలో గాంధీ, అంబేడ్కర్ లకే ఉంది. గాంధీకి తన దక్షిణాఫ్రికా అనుభవం దృష్ట్యా అస్పృశ్యతా నిర్మూలన విషయంలో మిగతా కాంగ్రెస్ నాయకులతో పోల్చితే ఎక్కువ నిజాయితీ ఉంటుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో, తనే అతి పెద్ద దళితనేతగా భావించుకుంటున్న దశలో తనకు పోటీగా అంబేడ్కర్ ముందుకురావడాన్ని గాంధీ జీర్ణించుకోలేకపోయాడనీ, అంబేడ్కర్ తో నువ్వా-నేనా అన్న ఘర్షణకు అదే ప్రధానకారణమనీ అనిపిస్తుంది. ఆయనలో అంబేడ్కర్ పట్ల ఆగ్రహం అంచులు దాటి ఆయన స్థాయిని కూడా దిగజార్చిందనీ అనిపిస్తుంది. ఈ ఘర్షణవివరాలను చూసినప్పుడు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించే అహింసావాదిగా గాంధీ కనబడడు. తనకు వ్యతిరేకంగా పుస్తకం రాసినందుకు వైస్రాయి కౌన్సిల్ నుంచి అంబేడ్కర్ ను తొలగించమని వైస్రాయికి ఆయన ఉత్తరం కూడా రాశాడు.
శ్రుతిమించిన ఆదర్శవాదం
దళితులకు సపరేట్ ఎలక్టొరేట్ ను కల్పిస్తే హిందువులకు, వారికి మధ్య చీలికవచ్చి, హిందూసమాజం బలహీనపడుతుందని ఆయన నిజంగానే ఆందోళన చెంది ఉండవచ్చు. ఇంకోపక్క, ఆయన పటేల్ తో మాట్లాడుతూ, “అస్పృశ్యుల గూండాలూ, ముస్లిం గూండాలూ కలసి హిందువులను చంపేస్తారని నేను భయపడుతున్నా”నని కూడా అంటాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించేదేమిటంటే, అస్పృశ్యతా నిర్మూలనకు తను చేస్తున్న ప్రయత్నం అద్భుతంగా ఫలిస్తోందని, సవర్ణ హిందువులలో పరివర్తన వస్తోందని ఆయన భావించడం! తన కృషి వల్ల అతిత్వరలోనే అస్పృశ్యతా నిర్మూలన జరిగి అగ్రవర్ణాలు, దళితులు ఎంతో సామరస్యంగా జీవించే ఒక ఆదర్శస్థితిని ఆయన ఊహించుకోవడం! రిజర్వేషన్ల పొడిగింపునకు సంబంధించి పదేళ్ళ తర్వాత రెఫరెండం జరపాలన్న అంబేడ్కర్ ప్రతిపాదనను తోసిపుచ్చుతూ, అయిదేళ్లే చాలు, సవర్ణ హిందువుల్లో పరివర్తన వచ్చేస్తుందని గాంధీ అంటాడు. ఈవిధంగా క్షేత్రవాస్తవికతను, ఆచరణదృష్టినీ కూడా కప్పివేసేంతగా ఆయనలో ఆదర్శభావన శ్రుతిమించిపోవడం కనిపిస్తుంది.
సర్దార్ పటేల్
దళితులకు సపరేట్ ఎలక్టొరేట్ ను వ్యతిరేకించడంలో, అంబేడ్కర్ తో పోరాడడంలో గాంధీకి పటేల్ అచ్చమైన పొడిగింపు(extension)మాత్రమే. ఆయన అంబేడ్కర్ ప్రతిపాదనలను అడుగడుగునా అడ్డుకోవడంలో, త్రోసిపుచ్చడంలో వాటి మంచి చెడులు కాక, గాంధీ అంతటివాడితో ఘర్షణకు దిగుతాడా అన్న కోపమే ఆయనపై ఎక్కువ పనిచేసినట్టు స్పష్టంగా అనిపిస్తుంది. గాంధీలానే ఆయన కూడా అస్పృశ్యతను రద్దు చేశాము కనుక, అది పూర్తిగా నిర్మూలనమైపోయిన ఆదర్శస్థితిని ఊహించుకుని మైనారిటీల రిజర్వేషన్ తోపాటు దళితుల రిజర్వేషన్ కూడా రద్దు చేసే ఆలోచన చేశాడు. జనం మధ్య పని చేసిన అంత అనుభవం ఉండి కూడా గాంధీ, పటేల్ లలో ఇలా ఆదర్శవాదం శ్రుతిమించడాన్ని చూస్తే, వెనకటికి ఒకావిడ తను ఆరేసిన మడిబట్టను ఏ దొంగ ఎత్తుకెడతాడులే అనుకున్న ముచ్చట గుర్తొస్తుంది. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం చేసేశాము కనుకా, లేదా ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం (ఎన్టీఆర్ హయాంలో) చేసేశాము కనుక దేశంలో ఇక ప్రజాస్వామ్యధర్మం నాలుగుపాదాలతో నడుస్తుందని భావిస్తే ఎలా ఉంటుందో ఇదీ అలాగే ఉంటుంది.
నెహ్రూ
ఇంతకుముందు చెప్పుకున్నట్టు ‘స్వాప్నికు’డైన నెహ్రూ ఆ సమయంలో జైలులో ఉన్నా, ఆ తర్వాత కూడా వాస్తవికతలోకి రాకుండా ఏ స్వప్నవీధుల్లోనో సంచరిస్తున్నట్టే అనిపిస్తుంది. Mahatma Gandhi not around for Congress, all the decisions were made by Sardar Patel on the Minority and Scheduled Castes issues, and Nehru was reduced to spectator. పైగా 1949 మే 26న రాజ్యాంగసభలో మాట్లాడుతూ మత మైనారిటీలకు రిజర్వేషన్ రద్దు చేసినందుకు, దళితుల రిజర్వేషన్ ను పదేళ్ళకు పరిమితం చేసినందుకు నెహ్రూ హర్షం వ్యక్తం చేశాడు.
అంబేడ్కర్
మిగతా అగ్రనాయకులతో పోల్చితే అంబేడ్కర్ ఒక్కడే కులవ్యవస్థాబాధితుడు. గాంధీ సహా అనేకమంది అగ్రనాయకులు అలాంటి బాధితుని అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా(మోతీలాల్ నెహ్రూ కమిటీ ఆయనను చర్చలకు పిలవలేదు), ఆయనను విశ్వాసంలోకి తీసుకోకుండా ఎంతసేపూ ఆయనతో ఘర్షణకు దిగడం, ఆయన ప్రతిపాదనలను తోసిపుచ్చడానికే ప్రాధాన్యం ఇవ్వడం. ఆయనను చిన్నబుచ్చడం, చివరికి ఆయనను ఏకాకిని చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాదు, పటేల్ వంటివారు ఆయనను నిర్వీర్యుణ్ణి చేయడంలో ఒక వికృతానందాన్ని పొందుతూవచ్చారన్న భావన కలుగుతుంది. అంబేడ్కర్ ను టార్గెట్ చేయడంలో ఇప్పటికీ కొంతమందిలో అలాంటి వికృతానందాన్నే చూస్తూ ఉంటాం.
ప్రజాస్వామ్య చాంపియన్ అంబేడ్కర్ ఒక్కరే
దళితులకు రిజర్వేషన్ విషయంలోనే కాదు, సార్వత్రిక వయోజన వోటు హక్కు విషయంలోనూ, చివరికి వోటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని వాదించడంలోనూ ఛాంపియన్ అంబేడ్కరే. వోటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించేవిషయంలోనూ పటేల్ ఆయనను వ్యతిరేకించాడు. ఏ కోణంలో చూసినా ప్రజాస్వామికవిధివిధానాలపట్ల అవగాహనలో, పరిజ్ఞానంలో, ముందు చూపులో అంబేడ్కర్ మిగతా అందరు నాయకుల కన్నా చాలా ముందంజలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మిగతానాయకులూ, వారికి వంతపాడే సాటి ఎస్సీ నాయకులూ కలసి ఏకాకిని చేసిన తీరు ఎంతో విషాదం నింపుతుంది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడం, రాజ్యాంగరచనలో ముఖ్యపాత్రధారిని చేయడం ద్వారా ఆయన ప్రతిభను గుర్తించినప్పటికీ ఇలా జరగడం విచిత్రమే. అమలులో ఉన్న విధానంలో దళితుల ప్రయోజనాలకు పూర్తిగా అంకితమయ్యే ప్రతినిధులు ఎన్నిక కావడం లేదని, ఎన్నికవుతున్నవారు అగ్రవర్ణాల నాయకులకు, లేదా పార్టీకి మాత్రమే విధేయులుగా ఉంటూ, దళితుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారనీ, ఈ విధానాన్ని మార్చాలని ఆయన చివరివరకూ సూచిస్తూవచ్చాడు. ఈ మేరకు అప్పటికి జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ పుస్తకాలు రాశాడు. లోపాలను ఎత్తిచూపాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఒక దశలో అంబేడ్కర్ రాజ్యాంగసభను కూడా కొన్ని రోజులపాటు బహిష్కరించాడు. అప్పటికి రాజ్యాంగరచన పూర్తికాలేదు కనుక, ఆయన సాయం లేనిదే అది జరగదు కనుక పటేల్ వంటి నాయకులు కొంతమేరకు ఆయనతో రాజీ పడ్డారని Ambedkar, Gandhi and Patel: The Making of India’s Electoral System రచయిత అంటాడు.
1951 అక్టోబర్ 27న అంబేడ్కర్ జలంధర్ లో దళితులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా అంటాడు: “మీకు పదేళ్లే రిజర్వేషన్లు ఉంటాయని గుర్తుంచుకోండి. అస్పృశ్యత శాశ్వతంగా అంతరించేవరకూ రిజర్వేషన్ ఉండాలని నేను ఆశించాను కానీ, పటేల్ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. పటేల్ ను పక్కన పెట్టండి, రాజ్యాంగసభలోని 30మంది ‘హరిజన’ సభ్యులకు కూడా నా ప్రతిపాదనను సమర్థించే ధైర్యం లేకపోయింది. ఈ కాంగ్రెస్ తొత్తులు అంతకన్నా ఏం చేయగలరు, పటేల్ పంథాకు దాసోహం అవడం తప్ప”.
అంబేడ్కర్ పై అసత్య ప్రచారం
“అస్పృశ్యత శాశ్వతంగా అంతరించేవరకూ రిజర్వేషన్లు ఉండాలని తాను కోరుకున్నట్టు” ఒక పక్క అంబేడ్కర్ చెబుతుంటే, అంబేడ్కర్ రిజర్వేషన్లు పదేళ్లే ఉండాలని కోరుకున్నాడన్న అబద్ధం ఎలా ప్రచారంలోకి వచ్చిందో ఆశ్చర్యం. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, అంబేడ్కర్ కు సమకాలికుడైన ఆర్ ఎస్ ఎస్ నాయకుడు గోల్వాల్కర్ సైతం అలా అనడం! ఆయన “పాంచజన్యం” అనే తన రచనలో ఇలా అంటాడు: “కులమే కారణంగా, సాంఘికంగా కానీ, రాజకీయంగా కానీ, ఏ విధమైన అనర్హతతో ఎవడు, ఎప్పుడు బాధపడుతున్నప్పటికీ దానిని తప్పక పూర్తిగా నిర్మూలించాలి. ఇందుకు వేరు ఆలోచన పనికిరాదు. డాక్టరు అంబేడ్కర్ షెడ్యూలు కులాలవారికి ప్రత్యేకసౌకర్యాలను, 1950లో మన ప్రజాస్వామ్యం రూపొందిన నాటినుండీ పది ఏళ్లవరకు మాత్రమే ఉండాలని భావించాడు. కానీ అది ఇంకా కొనసాగింపబడుతూనే ఉంది.”(పేజీ 521)
రిజర్వేషన్ ను పదేళ్ళకు పరిమితం చేసింది రాజ్యాంగమే కానీ అంబేడ్కర్ కాదు. వాస్తవంగా పదేళ్ళ తర్వాత అంబేడ్కర్ జరగాలని కోరుకున్నది, వాటి కొనసాగింపు విషయంలో దళితుల మధ్య రెఫరెండం. గాంధీకి, ఆయనకు ఘర్షణకు దారితీసిన వాటిలో అది కూడా ఒకటి. రాజాజీ మధ్యవర్తిత్వంలో రెఫరెండం ను భవిష్యత్తుకు వాయిదా వేశారని చెప్పుకున్నాం. ఆ తర్వాత అది సోదిలోకి వచ్చినట్టు లేదు.
రాజీప్రతిపాదనలో రెఫరెండం స్థానంలో పెట్టిన ఒక క్లాజు ఇలా ఉంటుంది: ‘…system of representation of depressed classes by reserved seats in the provincial and central legislatures shall continue until determined by mutual agreement between both the communities concerned in the settlement.” ఇక్కడ రెండు కమ్యూనిటీలు అంటే, సవర్ణ హిందువులు, దళితులు.
చరిత్రకన్నా ఆసక్తినీ, ఆశ్చర్యాన్నీ కలిగించేది మరొకటి ఉండదు. ఒకటి చూడండి. చట్టసభల్లో రిజర్వేషన్ కావాలన్న డిమాండ్ మొట్టమొదట వచ్చింది ముస్లింల నుంచి. కాంగ్రెస్, ముస్లింలీగుల ఒప్పందం జరిగింది ముస్లింల విషయంలోనే. ముస్లింలకు, సిక్కులకు ప్రత్యేకప్రాతినిధ్యాన్ని ఒప్పుకుంటాను కానీ, ‘హరిజను’లకు ఒప్పుకొనేది లేదంటూ గాంధీ తన పంతం నెగ్గించుకోడానికి ఆమరణనిరశనకు పూనుకున్నాడు. కానీ వర్తమానానికి వస్తే, ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్ లభించలేదు. గాంధీ ఇష్టానికి విరుద్ధంగా దళితులకు లభించింది. ఈ విషయంలో గాంధీది పూర్తి వైఫల్యం.
రిజర్వేషన్ల విషయంలో పార్టీలకు అతీతమైన అవిచ్ఛిన్నత
చరిత్ర కోణం నుంచి చూస్తే, రిజర్వేషన్ల విషయంలో ఆశ్చర్యకరంగా పార్టీలకు అతీతమైన ఒక చారిత్రక అవిచ్చిన్నత కనిపిస్తుంది. మచ్చుకు చెప్పాలంటే గాంధీ-పటేల్-గోల్వాల్కర్-నేటి మోహన్ భాగవత్ లు ఒకే శిబిరంలోకి వస్తారు. దళితులకు ప్రత్యేకప్రాతినిధ్యం ఇస్తే హిందూ సమాజంలో చీలిక వస్తుందని గాంధీ, గోల్వాల్కర్ లేదా ఆయన భావజాలానికి చెందినవారు భావించారు. పదేళ్లను మించి రిజర్వేషన్ కొనసాగడాన్ని గోల్వాల్కర్ వ్యతిరేకించాడు. రిజర్వేషన్ పై చర్చ జరగాలని మోహన్ భాగవత్ అనడం తెలిసినదే.
దళితుల విషయంలో సాంప్రదాయికవర్గాలలో ఒక పేట్రనైజింగ్ వైఖరి కనిపిస్తుంది. ఉదాహరణకు, మిగతావాళ్ళకి దేవాలయంలోకి వెళ్ళి పూజలు పునస్కారాలు చేస్తే కానీ రాని పుణ్యం, దళితులకు ధ్వజస్తంభం చూస్తేనే వస్తుందని సాంప్రదాయిక కుటుంబాలలో పెద్దలు అంటుంటారు. దళితులకు న్యాయం చేయడానికి మా అంతటివాళ్లం ఉన్నాం కదా, వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం దేనికని కులాల నిచ్చెనపై పై మెట్టు మీద ఉన్న గాంధీ వంటివారు అనుకుంటారు. ఇది వ్యక్తివాదధోరణి. సరే, ఈరోజు మనం ఉన్నాం, రేపటి సంగతి ఏమిటనే ఆలోచన వీరికి రాదు. నా అంతటి నీతిమంతుడు, నిజాయితీపరుడు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పూ జరగదన్న ఇలాంటి వైయక్తిక ధోరణి పాలకులలో ఉన్నప్పుడు కళ్ళముందు నరమేధం జరుగుతున్నా వారినోట ఒక ఖండనవాక్యం వెలువడదు. ఈ వ్యక్తివాదప్రకోపం వ్యవస్థలు భ్రష్టుపట్టిపోవడానికి కూడా అవకాశమిస్తుంది. ఇందుకు కాలవసినన్ని ఉదాహరణలు పైపైనే దొరుకుతాయి, లోతుల్లోకి వెళ్లనవసరంలేదు.
అంబేడ్కర్ కీ, ఇతర నాయకులకూ అదే తేడా
గాంధీసహా మిగతావారికీ, అంబేడ్కర్ కీ ఇక్కడే తేడా ఉంది. అంబేడ్కర్ కులవ్యవస్థాబాధితుడు. పేట్రనైజింగ్ ధోరణిలోని డొల్లతనం ఆయన లాంటివాళ్లకు బాగా అర్థమవుతుంది. అందులో ఏమీ చేయకుండా తప్పించుకునే సందులు ఉంటాయి. అందుకే అంబేడ్కర్ తక్షణ ప్రయోజనాలను కోరుకోవడమే కాదు, వాటిని రాజ్యాంగబద్ధం, చట్టబద్ధం చేయాలని తపించాడు. ఆవిధంగా ఒక దళితుడైన ఆయన ఈ దేశానికి ఒక ప్రజాస్వామికమైన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను పరిచయం చేశాడు. వ్యవస్థల ప్రాధాన్యాన్ని దేశం దృష్టికి తెచ్చాడు. బ్రిటిష్ పాలనను పక్కన పెడితే, అంతకుముందు మనదేశంలో సార్వజనికమైన సమానత్వంతో కూడిన చట్టబద్ధవ్యవస్థ లేదు.
దళితుల విషయంలో గాంధీ అప్రజాస్వామ్యవాది
గాంధీ తనను గొప్ప ప్రజాస్వామికవాదిగా చెప్పుకున్నాడు. కానీ దళితుల రిజర్వేషన్ విషయంలో ఆయన ప్రజాస్వామికవాదిగా వ్యవహరించలేదు. ఆయనకు భిన్నంగా అంబేడ్కర్ సాటి దళిత నాయకుల అభిప్రాయాలకు విలువనివ్వడంలో, అవసరమైనప్పుడు మెట్టుదిగడంలో ప్రజాస్వామికస్ఫూర్తిని కనబరిచినట్టు కనిపిస్తుంది.
ప్రజాస్వామ్యం పనితీరును కూడా మిగతా నాయకులతో పోల్చితే అంబేడ్కర్ ఒక్కడే బాగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు, కులం, మతం ముఖ్యమైన గుర్తింపులు. కులతత్వం, మతతత్వం తప్పు కానీ; ఒక గుర్తింపుగా కులాన్ని, మతాన్ని చెరిపివేయలేము. ప్రజాస్వామ్యంలో రకరకాల గుర్తింపుల ప్రాతిపదిక మీద జనం ఒత్తిడిబృందాలుగా ఏర్పడతారు. ఆ స్పృహ ఉంది కనుకే అంబేడ్కర్ కమ్యూనల్ అవార్డును స్వాగతించాడు. గాంధీలో ఆ స్పృహ లోపించింది కనుకే వ్యతిరేకించాడు.
దళితులకు ప్రత్యేకప్రాతినిధ్యం విషయంలో అంబేడ్కర్ పట్టుబట్టి ఉండకపోతే ఏం జరిగి ఉండేదో తెలుసుకోవడం వర్తమాన అనుభవం నుంచి ఆసక్తికరంగా ఉంటుంది.
బాగా తగ్గిపోతున్న ముస్లింల ప్రాతినిధ్యం
అంతవరకు ముస్లింలు, సిక్కుల వంటి మతమైనారిటీలకు ప్రాత్యేకప్రాతినిధ్యం ఉండాలనే అభిప్రాయం ఉండగా, దేశవిభజన తర్వాత పటేల్ పూనికతో దానిని పక్కన పెట్టినట్టు చెప్పుకున్నాం. దేశవిభజన తర్వాత ఈ దేశంలో ఉండిపోయిన ముస్లింలకు ప్రత్యేకప్రాతినిధ్యం అవసరంలేదని ఏ హేతుబద్ధత మీద అనుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే, బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలనుంచి చట్టసభల్లో, మంత్రివర్గాలలో ముస్లిం ప్రాతినిధ్యం బాగా తగ్గిపోవడం, అసలే లోపించడం చూస్తున్నాం. వారి ప్రయోజనాలను పరిరక్షిస్తున్నప్పుడు ప్రాతినిధ్యం లేకపోతేనేం అనే వాదన కూడా వింటున్నాం. అంటే గాంధీ అనుసరించిన పేట్రనైజింగ్ ధోరణి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉందన్నమాట. గుజరాత్ లోని ముస్లిం లలో ఒక వర్గం ఈ పేట్రనైజింగ్ వైఖరితో సమాధానపడి మా విద్యా, ఉద్యోగాలు,వ్యాపారాలకు సహకరిస్తున్నప్పుడు మాకు ప్రాతినిధ్యం లేకపోతేనేమి అనడం చూస్తున్నాం. ఒక వర్గానికి ఇలా చట్టసభల్లో, మంత్రివర్గాల్లో ప్రాతినిధ్యం లేకపోవడమంటే ఏమిటి? వారు రెండో తరగతి పౌరులుగా మారడమే! సమాజంలో రాజకీయవర్ణవ్యవస్థ ఏర్పడడమే.
అంబేడ్కర్ పట్టుపట్టకపోతే దళితులకు రిజర్వేషన్లు ఉండేవి కావు
ఇప్పుడు దళితుల విషయానికి వద్దాము. దళితులకు ప్రత్యేక ప్రాతినిధ్యం కోసం అంబేడ్కర్ పట్టుబట్టి ఉండకపోతే ముస్లింల అనుభవమే వారికి కూడా ఎదురై ఉండేది. వారు కూడా పేట్రనైజింగ్ ధోరణితో సమాధానపడి ఉండేవారు. క్రమంగా రెండవ తరగతి పౌరులుగా మారి ఉండేవారు. దీనిని బట్టి అంబేడ్కర్ ముందుచూపును దార్శనికతను అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు గతాన్ని ఒకసారి గుర్తుచేసుకుని భవిష్యత్తుకు వెడదాం. పటేల్ ముస్లిం, సిక్కు తదితర మైనారిటీల రిజర్వేషన్ తో పాటు దళితుల రిజర్వేషన్ ను కూడా రద్దు చేసే ఆలోచన చేసినట్టు చెప్పుకున్నాం. అంతేకాదు, ఆ మాట ఆ వర్గాలవారితోనే అనిపించి వారి వేలితో వారి కన్నే పొడుచుకునేలా చూశాడు. హెచ్. జె. ఖండేకర్ లాంటి దళితసభ్యులే కాదు, క్రైస్తవుడైన డా. హెచ్. సి. ముఖర్జీ, ముస్లిం అయిన తాజాముల్ హుస్సేన్ కూడా చట్టసభల్లో తమకు ప్రత్యేకప్రాతినిధ్యం అక్కర్లేదన్నారు. ఇప్పుడు కూడా మెల్ల మెల్లగా అదే జరుగుతున్నట్టు గుజరాత్ ముస్లింలలోని ఒక వర్గం ద్వారా అర్థమవుతోంది.
దళితులు ఐక్యంగా పనిచేసిన దాఖలా లేదు
భవిష్యత్తుకు వెడితే దళితుల నుంచి అదే మాట అనిపించబోరని చెప్పలేము. దానికి రకరకాల రూపాలలో శ్రుతి జరుగుతూ ఉండడం చూస్తున్నాం. నిజానికి దళితులకు చట్టసభల్లో రిజర్వేషన్ ఉన్నంతమాత్రాన వారు స్వతంత్రంగా గొంతు విప్పి తమ ప్రయోజనాల పరిరక్షణకు ఐక్యంగా కృషి చేసినట్టు గత 70 ఏళ్ల అనుభవం చెప్పడంలేదు. పార్టీ ఏదైనా వారు అనుచరులుగానే ఉన్నారు తప్ప స్వయం నాయకులుగా ఎదిగింది లేదు(కాన్షీ రామ్, మాయావతిలను మినహాయిస్తే). కాంగ్రెస్ నాయకులకు దళితసభ్యులు ఎలా నోరూవాయీ లేని విధేయులుగా మారారో అంబేడ్కర్ ఆనాడే ఎత్తి చూపించాడు. అందుకే దళితులకు ప్రత్యేక ఎలక్టొరేట్ కోసం చివరి వరకు పోరాడుతూనే ఉన్నాడు. అదే ఆయన ముందుచూపు. గాంధీతో సహా మరే నాయకునిలోనూ కనిపించని దార్శనికత. దళితుల విషయంలో గాంధీ వెళ్లినంత దూరంతో కూడా సనాతనవాదులు సమాధానపడలేకపోయారు. సనాతనవాదులు దళితులపట్ల తమవైఖరిని అయిదేళ్లలో మార్చుకోకపోతే వాళ్ళ కోటల్ని డైనమైట్లతో పేల్చివేస్తానని అంబేడ్కర్ తో గాంధీ అన్నాడు. కానీ చివరికి ఎవరు ఎవరిని ‘పేల్చి’వేశారో తెలిసినదే.
(ఈ వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయతవి)