Saturday, November 23, 2024

బహుజనహిత మేధావి గెయిల్ ఒమ్వెడ్ అస్తమయం

కులవ్యవస్థపై అధ్యయనాలు చేసి అణగారిన వర్గాల అభివృద్దికి జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ గెయిల్ ఒమ్వెడ్ మహారాష్ట్రలోని కాసేగావ్ లో బుధవారం (25 ఆగస్టు 2021) కన్నుమూశారు. 81 సంవత్సరాల రచయిత్రి, బహుజన బాంధవి, సామాజిక కార్యకర్తగా పేరుతెచ్చుకున్న ఒమ్వెడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అమెరికాలోని మినియాపోలిస్ లో జన్మించిన గెయిల్ 1970 దశకంలో భారత దేశానికి మాత్రమే ప్రత్యేకమైన సమస్య కులవ్యవస్థను అధ్యయనం చేయడానికీ, మహాత్మాఫూలే చేసిన కృషిపై పరిశోధన చేయడానికీ ఇండియా వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. మార్క్సిస్ట్ మేధావి భరత్ పటంకర్ ను వివాహం చేసుకున్నారు.

మహాత్మాఫూలేపై పరిశోధన

పూలే మహారాష్ట్రలో నిర్వహించిన బహుజన ఉద్యమంపైన 1973లో పీహెచ్ డీ పూర్తి చేశారు. పూలే సత్యశోధక్ సమాజం గురించి విరివిగా ప్రచారం లభించడానికి ఆమె పరిశోధనా, అధ్యయనమే ప్రధాన కారణం. పుణె యూనివర్శిటీలో సామాజికశాస్త్రాల విభాగంలో పూలే-అంబేడ్కర్ పీఠాధిపతిగా చాలా సంవత్సరాలు పని చేశారు. ఐక్యరాజ్య సమితి సహా అనేక అంతర్జాతీయ సంస్థలకు సలహాదారుగా పనిచేశారు. కోపెన్ హెగెన్ లో ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏసియన్ స్టడీస్’  లో ప్రొఫెసర్ గా పని చేశారు. దిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో కూడా బోధించేవారు. ఎఫ్ఏఓ, యూఎన్ డీపీ, నోవిబ్ వంటి అంతర్జాతీయ సంస్థలకు సలహాదారుగా పని చేశారు. ఒడిశాలోని నిస్వాస్ (NISWASS)లో అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ గా పని చేశారు. అమ్వెట్-పటంకర్ దంపతులు 1980లలో శ్రామిక్ ముక్తి దళ్ ను ఏర్పాటు చేశారు. 1983లో ఆమె భారత పౌరసత్వం కూడా స్వీకరించారు.

గెయిల్ ఓమ్వెట్ , భరత్ పటంకర్

దళితుల, బహుజనుల జీవితాలపై అధ్యయనం

దళితుల, ఓబీసీల, ఆదివాసీల జీవితాలపైనా, వారి స్థితిగతులపైనా ఆమ్వెట్ విస్తృతంగా అధ్యయనం చేశారు. రాశారు. ‘దళిత్స్ అండ్ డెమాక్రాటిక్ రివల్యూషన్’ అనేది ఆమె రాసిన ముఖ్యమైన గ్రంథం. అణగారిన వర్గాల జీవన స్థితిగతులపైనా, వారి ప్రగతి కోసం జరుగుతున్న కృషిపైనా అధ్యయనం చేసేవారికి ఈ పుస్తకం దారి దీపం వంటిది. కులవ్యవస్థనూ, అంటరానితనాన్నీ రూపుమాపడానికి ఆమె కృషి చేశారు. అనేక ప్రజాఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఓబీసీ, దళిత్, ఆదివాసీ ఉద్యమాలకు స్ఫూర్తిదాతగా, నాయకురాలిగా ఆమె నిలిచారు. నాలుగు దశాబ్దాలుగా ఆమె చేసిన కృషి ఎందరినో దళిత జనోద్ధరణ కృషివైపు ఆకర్షించింది. ఆమెను సామాజికశాస్త్రవేత్తగా అందరూ గౌరవిస్తారు.

కొయినా నిర్వాసితులకోసం ఉద్యమం

కొయినా డ్యాం నిర్మాణంలో ఇళ్ళు, స్థలాలూ కోల్పోయి నిర్వాసితులైనవారి తరఫున ఆమె ఉద్యమించారు. ‘‘డాక్టర్ గెయిల్ గామ్వెట్ పరిశోధకురాలిగా సామాజిక ఉద్యమాలలో, సాధుపుంగవుల సాహిత్యం, ఆచారవ్యవహారాల అధ్యయనంలో, మహిళల, అణగారినవర్గాల హక్కులకోసం పోరాడటంలో ముందుపీటీలో ఉండేవారు. ఆమెను సమాజంలో భాగమైపోయిన ఒక మేధావిగా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు,’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతాపసందేశంలో అన్నారు. అమెరికాలో కాలేజీ విద్యార్థినిగా ఉన్న రోజుల్లో వియాత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలలో చురుకుగా పాల్గొన్నారు. పూలే జీవితాన్నీ, కృషినీ అధ్యయనం చేయడానికి ఇండియాకి వచ్చిన గెయిల్ ఇక్కడే స్ధిరపడిపోయి ఈ సమాజంలో భాగమైపోయారు. పశ్చిమభారతంలో బ్రాహ్మణేతర ఉద్యమం గురించి కూడా ఆమె అధ్యయనం చేశారు.

గెయిల్ ఆమ్వెట్ 25 పుస్తకాలకు పైగా రచించారు. ‘ఇన్ కొలోనియల్ సొసైటీ-నాన్ బ్రాహ్మిన్ మూవ్ మెంట్ ఇన్ వెస్ట్రన్ ఇండియా,’ ‘సీకింగ్ బేగంపురా,’ ‘బుద్ధిజం ఇన్ ఇండియా,’ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్,మహాత్మాఫూలే, దళిత్ అండ్ ద డెమాక్రాటిక్ రివల్యూషన్,‘ అండర్ స్టాండింగ్ కాస్ట్, ‘వుయ్ విల్ స్మాష్ ప్రిజన్,’  ‘న్యూసోషల్ మూవ్ మెంట్ ఇన్ ఇండియా’ తదితర పుస్తకాలు రచించారు.

బంగారు లక్ష్మణ్ కు బహిరంగ లేఖ

ఆమె రుగ్వేదంపైన తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ 2000 సంవత్సరంలో నాటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కు బహిరంగ లేఖ రాశారు. దాన్ని ‘ద హిందూ’ పత్రిక ప్రచురించింది. బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించడం, కులతత్వాన్ని విమర్శించడం, కులవ్యవస్థను ప్రవేశపెట్టి, పెంచి, పోషించింది బ్రాహ్మణవాదమేనని దుయ్యపట్టడం ఆమె రచనలలో కనిపించే ప్రధాన ధోరణలు. కులవ్యవస్థను నిర్మూలించలేని పక్షంలో కనీసం కులాలమధ్య సంఘీభావం సాధించేందుకు ప్రయత్నించాలన్నది ఆమె అభిప్రాయం. అమెరికాను జాత్యహంకార దేశంగా అభివర్ణించారు. అయితే, అమెరికాలో జాత్యహంకార వ్యతిరేక చట్టాలూ, నల్లవారికి అనుకూలంగా చేసిన శాసనాలూ ఇండియాలో దళితులకు అనుకూలంగా చేసిన శాసనాల కంటే పటిష్టమైనవనీ, వాటిని అమలు చేసే విషయంలో కూడా అమెరికా న్యాయవ్యవస్థకు చిత్తశుద్ధి ఎక్కువనీ ఆమె అనేవారు.

ఆమె విస్తృతంగా రచనలు చేశారు. అనేక కీలకమైన, సున్నితమైన అంశాలపైన వ్యాఖ్యానించారు. కనుక ఆమెను తప్పుపట్టేవారు కూడా ఉన్నారు. ఆమె బహుజనవాదంలో నిజాయితీ లేదనీ, ఆమె విపణి ఆధారిత ఆర్థిక విధానాలకు (మార్కెట్ ఎకానమీ) అనుకూలమనీ వాదించేవారు కూడా ఉన్నారు. కానీ ఆమె నిజాయితీనీ, భారత దేశం పట్ల ఆమెకు గల ప్రేమాభిమానాలనీ, భారత ప్రజల పట్ల ఆమెకు గల ఆదరభావాన్ని కాదనలేము. ఆమె కాసేగావ్ లో అత్తగారు ఇందుమతి పటంకర్, ఆమె బంధువులతో కలసి జీవించారు. కూతురు, అల్లుడూ, మనమరాలూ అమెరికాలో నివసిస్తున్నారు. ఆమె మరణం దళిత, బహుజనులకు తీరని లోటు. భారత సమాజానికి పూడ్చలేని కొరత. కుల వ్యతిరేక భావజాలంలో కొత్త కోణాలను ఆమెె పరిచయం చేశారని గెయిల్ ఒమ్వెట్ కు నివాళి అర్పిస్లూ రాసిన వ్యాసంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అధ్యక్షుడు మల్లెపల్లి అక్ష్మయ్య అన్నారు. గెయిల్ ఒమ్వెట్,ఎలీనార్ జెల్లియట్ (19262016) ఇద్దరూ భారత సమాజాన్ని, కులవ్యతిరేక ఉద్యమాన్ని అవగాహన చేసుకొని ఉద్యమాలను బలపరిచారని ఆయన గుర్తు చేశారు.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles