Tuesday, January 21, 2025

ఉపాధి పధకంలో మార్పుల లక్ష్యం ఏమిటి?

  • గ్రామీణ కార్మికుల కడుపుకొట్టే కేంద్ర ప్రభుత్వ మార్పులు
  • పని దినాలు తగ్గిస్తూ వారికి వేరే పని తగిలి రావడం లేదంటూ ఆర్థిక మంత్రి ముక్తాయింపు
  • విజయవాడలో నిరసనగా 17న సిట్ ఇన్ ధర్నా
  • పీఎస్ అజయ్ కుమార్

విజయవాడ ధర్నాచౌక్ లో 17 ఏప్రిల్ 2023 సోమవారంనాడు ఉపాధి హామీ పధకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను నిరసిస్తూ గ్రామీణ కార్మికులు ఒక రోజు ‘సిట్ ఇన్ ధర్న’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీరేంద్ర గుప్త, MLA, బీహార్ శాసన సభ, సీపీఐ (ఎంల్) లిబరేషన్, అపూర్వన్ , జాతీయ కో ఆర్డినేటర్, నరేగా (NREGS) సంఘర్ష్ మంచ్, న్యూ ధిల్లి, బీ. చక్రధర్, లిబ్టెక్ ఇండియా, ఏగుపాటి  అర్జున రావు, రాష్ట్ర కార్యదర్శి. AIARLA, కామ్రేడ్ నైనాలశెట్టి మూర్తి, రాష్ట్ర కార్యదర్శి. CPI ML లిబరేషన్, ఇతర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నేతలు పాల్గోoటున్నారు.

ఈ నేపధ్యంలో ఉపాధి హామీ పధకం గూర్చి, అందులో కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న మార్పులు, వాటి ప్రభావాలను గూర్చి తెలుసుకోవడం ఈ వ్యాసం ఉద్దేశం.

ఉపాధి పధకం అసలు  ఉద్దేశం

గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తూ భౌతిక శ్రమ చేయడానికి సిద్ధపడే ఎవరైనా ఉపాధి హామీ పధకంలో నమోదు చేసుకొని జాబ్ కార్డు పొందవచ్చును. గ్రామంలో జీవించడం, వయోజనులై వుండటం మినహా మరేవిధమైన అర్హత / అనర్హత లేదు. ఒక ఆర్దిక సంవత్సరంలో (365 రోజులు) ఒక కుటుంబం 100 రోజులకు మించకుండా పని పొందవచ్చును. పని దినానికి,  కేంద్ర ప్రభుత్వం  ఈ పధకం కోసమని ప్రకటించే వేతనం  పొందవచ్చును. ఈ ఏడాది, అనగా  2023-2024 ఆర్దిక సంవత్సరంలో ఒక పని దినానికి 272 రుపాయలు  వేతనంగా మన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర నిర్ణయించిoది. దీని ప్రకారం చూస్తే ఒక గ్రామీణ కుటుంబం, ఒక ఏడాదిలో, 100 రోజులు పని చేస్తే వారికీ 27,200 (100 రోజులు X Rs 272) రూపాయలు రావాలి.

గ్రామీణ వ్యసాయ కార్మిక కుటుంబాలకు ఈ మొత్తం (రూపాయలు27200/-) చాల అవసరమైనదే కాగలదు. ముఖ్యంగా వ్యవసాయ కార్మిక కుటుంబాలకు,  దళిత, ఆదివాసీ, వంటి మహిళలు, మహిళా రైతు కుటుంబాలకు  ఇది కేవలం ఆర్దిక వనరుగానే కాదు వారి సాంఘిక స్వేచ్చను కొంత మేరకైన విస్తృతపరిచె సాధనం కూడా. అయితే, ఇవి కాగితం మీద కనిపించే లెక్కలు. ఉపాధి పధకంలో ఒక గ్రామీణ కార్మికుడు / కార్మికురాలు చేసిన పని పరిమాణo లెక్కించి వేతనం ఇస్తారు. అంతేగానే ప్రభుత్వ అధికారులకు మల్లె పని గంటలు (టైం వెజ్)లను బట్టికాదు.

అంటే, ఈ ఏడాది ఒక పని దినానికి 272 రూపాయలు నిర్ణయించారు గనుకు పనిలోకి వచ్చిన కార్మికునికి ఆ వేతనం ఇచ్చేయరు. అది గరిష్ట పరిమితి మాత్రమె. అంటే ఒక కార్మికుడు చేసిన పనిని కొలతలు వేసి లెక్కకడితే అది 200 రూపాయలే వచ్చిందనుకోండి అప్పుడు ఆ వేతనమే ఇస్తారు. అదే ఆ పని 400 రూపాయలదైనా  అప్పుడు పురా 272 రూపాయలు మాత్రేమే ఇస్తారు గాని రూ. 400 ఇవ్వరు.

మునుపటి ఏడాది, అనగా 2001-2022లో  కేంద్ర ప్రకటించిన వేతనం ఒక పని దినానికి 245 రూపాయలు. కాని కార్మికులకు లభించిన సగటు దిన వేతనం 228 రూపాయలు. అదే ఏడాది కార్మికులకు కల్పించిన సగటు పని దినాలు 51 రోజులు. అంటే ఒక కుటుంబానికి 11,628 రూపాయలు (51 రోజులు X  228 రూపాయలు) మాత్రమే వచ్చిందని అర్ధం.

 పధకంలో మార్పుల లక్ష్యం ఏమిటి

ఉపాధి హామీ పధకంలో గ్రామీణ కార్మికులకు వందకు వంద రోజుల పని, ప్రతి పని దినానికి పూర్తి ప్రకటిత వేతనం అందడం ఏ ప్రభుత్వానికైనా లక్ష్యంగా వుండాలి. మొత్తం వ్యవస్థలు, ప్రోగ్రాం డిజైన (నిర్మాణం) ఆ కోణంలో సాగాలి. కాని 2021 నవంబర్, డిసెంబర్ నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రోగ్రాం డిజైన్ లో చేస్తున్న మార్పులు ఈ లక్ష్యంవైపు లేవు.

సరికదా, ఉపాధి పధకంలోకి రాకుండా కార్మికులను నిరుత్సాహపర్చడo, వారి పని దినాలను కత్తిరించడం, సాధ్యమైనంత వరకు వారి చేతికి అందే  వేతనాన్ని తగ్గించడం, మొత్తంగా నిధులు ఖర్చుగాకుండా మిగిలబెట్టుకోవడం లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ మార్పులకు కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద తీసుకు వస్తున్న వత్తిడి.

పని హక్కుపాక్షిక గుర్తింపు ఉపాధి హామీ 

మన రాజ్యంగo ప్రాధమిక హక్కుల జాబితాలో “పని హక్కు” (రైట్ టు వర్కు) లేదు. ఆర్టికల్ 21 ద్వారా జీవిoచే హక్కు మాత్రం వుంది. మనకు ప్రాణ భయం వుంటే ప్రభుత్వాన్ని ఆశ్రయించ వచ్చును. కాని పని దొరకదనే భయం వుంటే ప్రభుత్వానికి సంబంధం లేదు.

ఈ వైరుధ్యాన్ని ఎoతోకొంత తొలగించడానికి చేసిన ప్రయత్నమే ఉపాధి హామీ పధకం/చట్టం. కరువు కాలoలో పనులు కల్పించి  వేతనాలు ఇవ్వడం, పని చేస్తే ఆహరం ఇవ్వడం మనకు కొత్తవేమి కాదు. ఉపాధి హామీ పధకం ప్రత్యేకత ఏమిటoటే వందరోజుల పరిమితికి పని హక్కును గుర్చించడం,  ఆ హక్కుకు చట్టబద్దత ఇవ్వడం దీని ప్రత్యేకత. ఈ హక్కును అది రెండు రూపాలలో నిలబెడుతున్నది.

వంద రోజులు పని ఒక హక్కు

  1. గ్రామీణ కార్మికులు పనికావాలని  అడిగిన 15 రోజులలో పని ఇవ్వలేకపొతే నిరుద్యోగ భ్రుతి చెల్లిoచాలి.

2. పని చేసిన 15 రోజులలో వేతనాలు ఇచ్చితీరాలి – అలా ఇవ్వలేకపొతే ఆలస్యానికి పరి హరిహరం చెల్లిoచాలి.

3. స్త్రీ – పురుషుల వేతనాలలో వివక్షత చూపరాదు.

4. పని ప్రదేశంలో సౌకర్యాలకు బాద్యత వహిoచాలి.

5. పధకం మాలులో కార్మికల సమక్షంలో “సాంఘిక తనిఖి (సోషల్ ఆడిట్)” చేయాలి. అది  కార్మికుల చట్టబద్దమైన హక్కు – ప్రభుత్వం బాద్యత.

ఇవి చట్టంలో వున్న ముఖ్యమైన అంశాలు. పధకం  నిర్మాణంలో చేసే ఏ మార్పులైనా ఈ హక్కులను బలపరిచేవిగా వుండాలే గాని వాటిని నిర్వీర్యం చేసే విధంగా వుండరాదు.

సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉపాధి పధకం డిజైన్  ప్రత్యేకతలు

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రధాని మన్ మోహన్ సింగ్ ఈ పధకాన్న ప్రారంభించారు. అప్పటి నుండి పధకం అమలులో సమైక్య ఆంధ్రప్రదేశ్, ఆ తదుపరి విభజిత రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ప్రథమ స్థానంలో వున్నాయి. అందుకు రెండు కారణాలు. తమ తమ రాష్ట్రాలలో పధకం అమలుకు “ప్రోగ్రాంను” డిజైన్ చేసుకొనే వెసులుబాటును అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర చట్టంకు ఇచ్చిన నియమాలలోని రాజీలేసి సూత్రాలకు లోబడి రాష్ట్రాలు తమ సొంత ప్రోగ్రాంను డిజైన్ చేసుకోవచ్చును.

 మిగిలిన రాష్ట్రాలతో  పోల్చి చూసినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉపాధి ప్రోగ్రాం డిజైన్ విష్టమైనది. దీనికి ప్రధాన కారకులైన ముగ్గురు అధికారులు, వారి ‘కంట్రీబ్యూషన్’ గూర్చి చెప్పాలి. గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్రీ కొప్పుల రాజు, ఆ తరువాత వచ్చిన రెడ్డి సుబ్రమణ్యం. వారి ఇరువురు వద్ద డైరెక్టర్ గా పని చేసి తరువాత IAS అయిన మురళి దీనిని రూపొందించి, ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు.

నిజానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధి ప్రోగ్రాం డిజైన్ లోని మేలిమి అంశాలను తీసుకొని దానిని  దేశానికి ఒక నమూనాగా గుర్తిస్తూ, అందుకు ఏర్పాట్లు జరుగుతుండగా 2014లో మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది.

సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉపాధి కార్యక్రమం డిజైన్ లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ విధంగా వున్నాయి. ఉపాధి హమీ పధకంలో వేతనం చేసిన పనిని బట్టేగానే, హాజరు సమయాన్ని బట్టి ఇవ్వరని ముందు చెప్పుకున్నాం.  కార్మికులు తమలో  తాము మాట్లాడుకొని ఉదయాన్నే పనికిపోయి పని పూర్తి చేసుకొని తిరిగి వేరే పనికి వెళ్ళే వెసులుబాటు వుండేది.

ఇంటి వద్ద పాడి గేదెలు, పశుపోషణ పనులు చేసుకునే పేద వర్గాల మహిళలకు ఇది చాల సౌకర్యంగా వుoడేది. జనవరిలో  వేసవి నెమ్మదిగా మొదలై మే నెలకు తారస్తాయికి చేరుకొని, జూన్ మధ్యకు తగ్గేది. జనవరి నుండి వేసవి తాపానికి నేలలు గట్టిపడటం మొదలౌతుంది. కనుక వేసవి భత్యం పేరున చేయవలసిన యూనిట్ పనిలో 20 నుండి 30 శాతం తగ్గింపు ఇచ్చేవారు. అంటే, యూనిట్ వంద (100) అనుకుంటే 70 యూనిట్లు చేసినా 100గా లేక్కిస్తారన్నమాట.

చాల ముఖ్యమైన, ఒక సృజనాత్మక పరికల్పన “శ్రమ శక్తి సంఘాల” నిర్మాణం. నిజానికి దేశానికే ఇది ఒక నమూనా కావాలి. మహిళల స్వయంశక్తి సంఘాల (SHG) మోడల్ ని తీసుకొని 15 నుండి 20 మందితో ఒక శ్రమ శక్తి సంఘం (SSS) తమకు నచ్చిన పేరుతొ పెట్టుకోవచ్చును. వారే ఒక సభ్యులను ఎన్నుకుంటారు. 20 మంది, అంటే 4 నుండి 5 జాబ్ కార్డు కుటుంబాలు, ఒక శ్రమ శక్తి సంఘం అవుతాయి.

ఆ శ్రమ శక్తి సంఘం పేరుతోనే మస్టర్ జనరేట్ అవుతుంది. అందుచేత భారీ ఎత్తున  దొంగ మస్టర్లకు అవకాశం లేదు. ఒక గ్రూపుకు పని ఇస్తారు గనుక, గ్రూపు సంఖ్య చిన్నది గనుక దానిని పర్యవేక్షించడం చాల సులువు. పని టాస్క్ తీసుకొని ఆ గ్రూపు తమలో తాము మాట్లాడుకొని పని పూర్తి చేసుకొని వెళ్లిపోయేవారు.

ఒక వారoలో చేసిన పనికి వేతనం ఇచ్చే సమయంలో ప్రతి కార్మికునికి ఒక “పే స్లిప్” ఇచ్చేవారు. అందులో పని పేరు, గుర్తింపు సంఖ్య, పని చేసిన తేదిలు, వేతనం వివరాలు వుండేవి. దీని వలన  కార్మికుల వద్ద ఒక రికార్డు వుండేది.

మరో రెండు అంశాలు ప్రస్తావించుకొని ఇప్పుడు వస్తున్న కొత్త మార్పులు గూర్చి చెప్పుకుందాం. పని చేసేటప్పుడు వట్టి చేతులతో చేయరు కదా. తట్ట, గునపం, పార వంటి సాధనాలు ఉపయోగిస్తారు. అందుకోసం తట్టకు 3 రుపాయలు, గునపానికి 5 రూపాయలు, పారకు 3 రూపాయలు, రెండు లీటర్ల నీరు పట్టుకు వెళ్ళడానికి వేసవి కాలంలో 5 రూపాయలు, ఇతర సమయాలలో 2-50 రూపాయలు వేతనంలో కలిపి ఇచ్చేవారు.

ఈ వివరాలన్నీ ఆ “పే స్లిప్” లో ఉండేవి. 100 రోజులు పనికి రోజుకు రూ. 272ల చొప్పున లెక్కకడితే రూ. 27,200లు అవుతుందని పైన మనం చెప్పుకున్నాం. 100 రోజులు అన్నది ఒక మనిషికి కాదు ఒక కుటుంబానికి. ఒక కుటుంబoలో ఇద్దరు వుండి వారు పనికి వస్తే 50 రోజుల (నెల ఇరవై రోజుల)కే వారి 100 రోజులు అయిపోతాయి. అప్పుడు వారు పనికి రావచ్చునా? రాకూడదు. ఇక్కడే మన ఒక రాష్ట్రం కొత్తదారి తీసుకుంది.

ఉదాహరణకు ఒక కుటుంబానికి 100 రోజులు అయిపోయాయి. కాని వారికి 27,200 రూపాయలు పూర్తిగా పడలేదు. 17,200 వందలే అంది మరో 10 వేలు వుండిపోయాయి. అందుచేత వారిని (మార్చి 31 వరకు) పని చేసుకోనిచ్చేవారు. దీనివలన కార్మికులకు కొంత వెసులుబాటు వుండేది. ఒక గ్రూపుకు పని మొదలైన తరువాత ఏదైనా కారణం వలన పనికి రాపోతే ఆ కార్మికుని పని దినాలు అలానే వుండేవి, తగ్గిపోయేవికాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉపాధి ప్రోగ్రాం డిజైన్  మరో ప్రత్యేకత ఏమిటంటే, మొత్తం ప్రోగ్రాంను (రాగాస్ అనే) ఒక  సాఫ్ట్ వేర్ ద్వారా నిర్వహించడం.

ఒక గ్రామ పంచాయితీలో నమోదైన జాబ్ కార్డులు (జాబ్ కార్డుల వారిగా సమాచారం), వాటిని బట్టి లేబర్ బడ్జేట్ కు అనుగునంగా పనుల గుర్తించి, వాటికీ అంచనాలు తయారు చేసి పెట్టుకోవడం, పనులు చేసిన తరువాత మస్టర్ లను అప్ లోడ్ చేయడం, చేసిన పనులను కొలతలు వేసి వాటిని అప్ లోడ్ చేయడం, ఈ రెండు కలిపి (అనగా అప్ లోడ్ చేసిన మస్టర్లు + అప్ లోడ్ చేసిన కొలతలతో) పే ఆర్డర్స్ జనరేట్ చేయడం, (పే స్లిప్ తో ) కార్మికులకు వేతనాల పంపిణి జరిగేది. దీనిని అంతటిని సాఫ్ట్ వేర్ ద్వారా నిరహించేవారు.

అంతేగాక ఈ మొత్తం సమాచారం అందరికి అందుబాటులో ఉంచారు. ఇంటర్ నెట్ కనెక్షన్ వున్న వారు ఎవరైనా ఒక జాబ్ కార్డు, ఒక శ్ర్రమ శక్తి సంఘం చేసిన పని, పే ఆర్డర్స్ మొత్తం సమాచారo, సమాచార హక్కు చట్టం(RTI)తో పని లేకుండా, తెలుసుకోవచ్చు. ఒక గ్రామ పంచాయితీలో దళిత బహుజనులు, ఆదివాసీలు ఎందరికి ఎన్ని పని దినాలు లభించాయో  తెలుసుకోవాలంటే మీరు EGS – AP వెబ్ సైట్ కు వెళ్తేచాలు.

ఈ సమాచారం ‘రియల్ టైం’ లో అందుబాటులో వుండటoతో జాతీయ, అంతర్జాతీయ పరిశోధకులు, పరిశోధక విద్యార్దులు, ఇతర రాష్ట్రాల అధికారులు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉపాధి ప్రోగ్రాం అధ్యయనానికి వారస కట్టేవారు.

సమాచారం అందుబాటులో వుండటం వలన, మా వంటి సమాజిక కార్యకర్తలు తమ ప్రాంతాల సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకొని గ్రామాలలో ఆడిట్ చేసేవారు. అంతేగాక సమాచారం ఆధారంగం ఉపాధి హమి పధకం అమలు తీరుపై  తమ అభిప్రాయాలను, విమర్శ, సూచనలు ప్రభుత్వం ముందు వుంచగలిగేవారు.

అవసరం అయితే న్యాయ స్థానాలను ఆశ్రయించగలిగేవారు. ఈ వ్యాస రచయిత కీలకమైన  మూడు కేసులను హై కోర్టులో వేసి వున్నారు. కనీస వేతనాల చట్టం -1948 ద్వారా ప్రకటిత వేతనాలకు EGS లోని నోటిపైడ్ వేతనాలకు మధ్య వున్న తేడాను చూపిస్తూ హై కోర్టులో వేసిన కేసు, అందులో కోర్టు ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలను ఒక కుదుపు కుదిపాయి.

బాలగోపాల్, తర్వాత ప్రశాంత భూషణ్

ఇందులో స్వర్గియ్య కె. బాలగోపాల్ వాదనలు వినిపిస్తే, ఆయన అకాలమరణం, ఈ కేసుకు వున్న అఖిల భారత స్వభావం గుర్తించి ప్రశాంత భూషణ్ హాజరై వాదనలు వినిపించారు. ఈ వాజ్యానికి కావలసిన సమాచారాన్ని EGS AP వెబ్ సైట్ నుండే తీసుకోవడం జరిగింది.

అటు ఒక పటిష్ఠమైన, గ్రామీణ కార్మిక అనుకూల నిర్మాణ వ్యవస్థ, సిబ్బంది కృషి  ఫలితం ఏమిటంటే,  ఉపాధి హామీ పధకం అములులో మన రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందoజలో వుండటం. ఒక ఉదాహరణ చూద్దాం, 2020-2021లో దేశం మొత్తం మీద 1.11 లక్షల కోట్లు ఈ పధకం కింద వ్యయం జరిగితే అందులో 15,500 కోట్లు అంటే 14 % మన రెండు తెలుగు రాష్ట్రాలలో  జరిగింది.

అయితే, పధకం అమలులో అసలు లోపాలు లేవనిగాని, వాటిని తొలగించడానికి మార్పులు చేయకూడదనీ కాదు. మార్పుల స్వభావం , లక్ష్యం ఏమిటన్నదే  ప్రశ్న. ఒక ఉదాహరణ చూద్దాం. గ్రామీణ కార్మికులకు వారి గ్రామంలోనే పని కల్పించి వలసలను తగ్గించడం చట్టం లక్ష్యం. అందుచేత బౌతిక శ్రమతో చేసే పనులకు ప్రాధాన్యత, కాంట్రాక్టర్లు, యంత్రాలు లేకుండా పనులను గుర్తించాలి. ఇందు కోసం, ఒక ఉపాధి పనిలో కార్మిక వేతనాల బిల్లు ఎట్టి పరిస్థితిలోనూ 60 శాతంకు తగ్గకూడదు. సామగ్రి (మేటిరియల్) వ్యయం 40 శాతం మించకూడదు. ఇది చట్టం పెట్టిన పరిమితి. కార్మికులకు ఉపాధి కల్పనకు ఒక పనిని రూపొందిస్తే దానిని ఉపాధి చట్టం ఒక ‘ప్రాజెక్టు’ అంటున్నది.

ఒక ప్రాజెక్టులో సామగ్రి (మేటిరియల్) వ్యయం 40 % శాతం మించరాదు. అది కూడా గరిష్ఠ పరిమితి సుమా! సామగ్రి వ్యయం ఎంత పెరిగితే ఆ నాడు అధికారంలో వున్న పార్టి వారి దిగువ, మధ్యమ స్థాయి నాయకులు ‘భోంచేయడానికి’ అంతగా వీలౌతుంది. అందుచేత ఈ ‘ప్రాజెక్టు’ అనే నిర్వచనాన్ని తమకు అనుకూలంగా మార్చేయడo మొదలు పెట్టారు.

ఒక పని(వర్కు)ని ఒక ప్రాజెక్టుగా గాక జిల్లా, మండలo, పంచాయితీలు ఇలా తమకు అనుకూలంగా యూనిట్ ను లెక్కగట్టి కొన్ని పనులను 80 నుండి 90 % సామగ్రి (మేటిరియల్) వ్యయంతో రూపొందిచడం మొదలు పెట్టారు. దీనిని సవాల్ చేస్తూ ఈ వ్యాస రచయితా కొoదరు ఉపాధి కార్మికలతో కలసి హై కోర్టులో కేసు దాఖలు చేసారు.

మోడీ సర్కార్ గ్రామీణ కార్మిక వ్యతిరేక మార్పులు

2014 నుండి ప్రస్తుత బిజెపి సర్కార్ నడుస్తోంది. ప్రధాన మంత్రి హోదాలో పార్లమెంట్ లో చేసిన మొదటి ప్రసంగంలో ఉపాధి పధకాన్ని గోతులు తవ్వి వాటిని కప్పే కార్యక్రమంగా “ప్రస్తుతించారు” మన ప్రధాని. అలాంటి అభిప్రాయం వున్న ఏ ప్రభుత్వమైనా దానిని రద్దు చేస్తుంది. కాని కాంగ్రెస్ పార్టి వైప్యల్యానికి ఒక గుర్తుగా “మాత్రేమే” దీనిని కొనసాగిస్తానని ఆయన అన్నాడు. ఈ పధకం కొనసాగడం వెనుక వారి లక్ష్యం అదన్న మాట.

ఉపాధి బడ్జెట్ ను కేంద్రం విడుదల చేసి దానిని తమ పరిస్తితులకు అనుగుణoగా వ్యయం చేసుకునే వెసులుబాటును మాన్మోహన్ సింగ్ కేంద్ర సర్కార్ రాష్ట్రాలకు  ఇచ్చిందని ముందు చెప్పుకున్నాం. ఇందుకు కారణం లేకపోలేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పథకంలానే పైకి కనిపించినా ఇందులో రాష్ట్రాల ఆర్దిక బాద్యత కూడా వుంది.

ఉపాధి హామీ చట్టం ప్రకారం 1. కార్మికులకు ఇచ్చే వేతనాల నగదు 2. జీతభత్యాల నగదు  పూర్తిగాను 3. సామగ్రి (మేటిరియల్) వ్యయంలో 75 శాతo కేంద్రం భరిస్తుంది. ఇక 1) 15 రోజులలో పని ఇవ్వలేకపోతే కార్మికులకు ఇవ్వవలాసిన నిరుద్యోగ భ్రుతి 2) 15 రోజులలో వేతనం ఇవ్వకపోతే చెల్లించవలసిన ఆలస్యానికి పరిహారం 3. సామగ్రి వ్యయంలో 25 శాతం నగదు రాష్ట్రాలు భరించాలి. అందుచేత రాష్ట్రాల ఆర్దిక బాద్యత కూడా ఈ పథకంలో వుంది.

మోడీ సర్కార్ చేసిన మొదటి మార్పు ఏమిటంటే, కార్మికులకు వేతనాలు చెల్లింపులో అవినీతి జరుగుతుందనే పేరుతొ మొత్తం లేబర్ బడ్జెట్ వ్యయాన్ని రాష్ట్రాల నుండి తప్పించేసింది. ఎవరు ఎంత పని చేసారు, వారికి ఎంత చెల్లించాలనే సమాచారాన్ని రాష్ట్రం పంపిస్తే కేంద్రం  నుండి నేరుగా కార్మికల ఎకౌంట్ కు పంపించడం మొదలు పెట్టింది.

అంటే, లేబర్ బడ్జెట్ విడుదల తన వద్ద పెట్టుకుంది. అయితే  నిధులు సర్దుబాటు కాలేదనే పేరుతొ 15 రోజుల దాటినా కార్మికులకు కేంద్రం వేతనాలు ఇవ్వకపొతే, ఆ ‘ఆలస్యానికి పరిహారం’ చట్టం ప్రకారం ఇప్పుడు ఎవరు చెల్లించాలి ? కేంద్రమా లేక రాష్ట్రమా ? పోనీ, చట్టంలో మార్పు చేసి ఈ బాధ్యతను రాష్ట్రాల నుండి తీసేసి తన మీద వేసుకుందా కేంద్రం? లేదు.

చేసిన పనికి, వెచ్చించిన సమయానికి వేతనాలు రాకపోవడం కార్మికుల అనుభవంలోకి రావడం మొదలైయింది. “వడ్డించే వాడు మన వాడైతే కడబంతిని కూర్చున్న” ఫర్వాలేదు అన్నట్లుగా తమ పార్టి అధికారంలో వున్న రాష్ట్రాలకు, తాము     అధికారంలేని రాష్ట్రాలకు నిధుల విడుదలలో వివక్షను కేంద్రం చూపుతుoదనే ఆరోపణలు లేకపోలేదు.

కేంద్ర ప్రభుత్వం ఒక ‘సాఫ్ట్ వేర్’ తయారు చేసుకుంది. రాష్ట్రాలు తమతమ స్వంత  ‘సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం’ నుండి దీనికి బదిలీ కావాలని వత్తిడి చేయడం మొదలుపెట్టింది. పైకి మాటల ఎన్ని చెప్పినా, విధానాల వద్దకు వచ్చేసరికి ఉభయు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు  ఎలా చేతులెత్తి ఆమోదం చెపుతున్నది మనం చూస్తూనే వున్నాము.

గత 2021 నవంబర్, డిసెoబర్ నుండి ఈ మార్పు ప్రక్రియ మొదలయ్యింది. ఆంద్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డిసెంబర్ 26, 2021 ఇచ్చన ఉత్తర్వులలో తమ

గ్రామీణి కార్మికుల రోజువారీ సమస్యలు

‘రాగాస్’ సాఫ్ట్ వేర్ నుండి కేంద్రవారి NIC సాఫ్ట్ వేర్ కు మారినట్లు చెప్పుకుంది. ఇందులో సాంకేతిక సమస్యలు, అంశాలను ప్రక్కన పెడితే, గ్రామీణ కార్మికలకు అప్పుడే అనుభవంలోకి వస్తున్న  రోజువారి సమస్యలు ఏమిటో చూద్దాం.

ఒక పని దినంలో కార్మికులు ఉదయం 11 తరువాత, మధ్యాన్నం 2 తరువాత పని ప్రదేశంలో వున్నట్లు రెండు సార్లు ఫోటోలు తీసి అప్ లోడ్ చేయాలి. ఈ ఫోటోలు జియోటేగింగ్ (GPS- గ్లోబల్ పోజిషనింగ్ సిస్టంతో) ముడిపడి వుంటాయి. అంటే ఫోటో తీసే ప్రదేశంలో తేడా రాకూడదు. కేసరపూడి అడివమ్మ అనే ఆదివాసీ మహిళ ఈ వ్యాస రచయితతో మాట్లాడుతూ, “తమ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో వున్న పని ప్రదేశానికి  తెల్లవారు ఝమునే వెళ్లి తమ పని పూర్తి చేసినా రెండవ ఫోటో కోసం అక్కడే వుండాలని లేకపోతె మస్టరు పడదని అంటున్నారు’’ అని బెబుతూ తాము ఎలా బతకాలంటూ వాపోయింది.

చేసిన పనిని లెక్కించి దానికే నగదు చెల్లిస్తున్నప్పుడు రెండు పూట్ల పని ప్రదేశంలో ఉండవలసిన అవసరం ఏమిటి? ఒక రోజు ఉపాధి పనిలోకి రాదలచుకుంటే మరో పనికి వెల్లడానికి అవకాశం లేకుండా చేయడమే ఇందులోని పరమార్దం. ఉపాధి పనికి వెళ్తే వేతనం ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుంది? లెక్క వేసుకుని, ఉపాధి పని మానేసి  వుంటే మరో పనికి పోవడం లేదంటే ఇంటి వద్ద గొడ్డూగోదా చూసుకోవడo మేలనే నిర్ణయానికి గ్రామీణ కార్మికులు ఇప్పుడు వస్తున్నారు.

పదిహేను నుండి ఇరవై మందిగల శ్రమ శక్తి సంఘం రద్దు చేసి దాని స్తానంలో 40 మందితో పెద్ద గ్రూపును పెట్టారు. అదివరకు వున్న మేట్ (సంచాలకుడు/సంచాలకురాలు) ను తీసేసి ఇప్పుడు ‘వర్కు సైట్ సూపరవైజర్’ అని పేరు పెట్టారు. అతను / ఆమెకు  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వుండాలి. 20 మంది గ్రూపుకు సరిపడే పనుల స్థానే ఇప్పుడు 40 మంది గ్రూపుకు పని చూపించాలి. సోమవారం గ్రూపుకు పని ఇవ్వాలంటే లక్ష్మివారం పనికి ‘డిమాండ్’ జనరేట్ చేయాలి.

సోమవారం పని మొదలయ్యింది. 40 మందికి ఆరోజు మస్టరు నమోదైయింది. మంగళవారం నుండి శుక్రవారం మధ్యలో నలుగురు కార్మికులు పనికి రాలేదని అనుకుందాం. కాని వారు పనికి వచ్చినట్లుగానే భావించి వారి 100 రోజుల నుండి ఆ ప్రాప్తికి పని దినాలు తీసేస్తారు. అదే సమయంలో వారు పని చేయలేదు గనుక వేతనం వుండదు. ఇది ఏ న్యాయసూత్రాల కిందకు వస్తుందో ఏలినవారే చెప్పాలి.

ఒక కుటుంబానికి 100 రోజులకు రావలసిన వేతనం రాకుండానే 100 రోజులు పని అయిపోయినా వారి పని దినాల నగదు మిగిలి వుంది గనుక ఆర్థిక సoవత్సరం

ఆఖరి వరకు పని చేసుకోనిచ్చేవారని ముందు మనం చెప్పుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆ సౌలభ్యం లేదు.

జనవరి నుండి జూన్ మధ్యలో వేసవి భత్యం పేరుతొ ఇప్పటి వరకు ఇచ్చిన 20 నుండి 30 శాతం పని తగ్గింపు ఇక లేదు. తాము నేషనల్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ రూరల్ డెవలప్మేంట్ (NIRD) వారితో వేసవికి ముందు, దాని తరువాత కాలాలకు ‘వర్కు మోషన్ స్టడీ’ చేయిoచామని దాని ప్రకారం ఇక “వేసవి భత్యం’ అవసరం లేదని 26 డిసెంబర్ 2021న ఇచ్చిన సర్క్యులర్ లో గ్రామీణాభివృద్ధి శాఖవారు చెప్పుకున్నారు. ఆ స్టడీ వివరాలను వారు ప్రజలముందు ఉంచలేదు.

పనిలో కార్మికులు ఉపయోగించె తట్ట, పార, పలుగు, మంచినీళ్ళకు ఇస్తున్ననగదు తీసేశారు. కేంద్రం ఒత్తిడితో రెండు తెలుగు రాష్ట్రాలు తీసుకు వచ్చిన ఈ మార్పుల స్వభావాన్ని రెండు రకాలుగా గుర్తించవచ్చును. మొదటిది , 1. ఉపాధి పధకంలో కార్మికులు హాజరును ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా నిరుత్సాహపర్చడం, తగ్గించడం 2. వేతనాల బిల్లులో ఖర్చు తగ్గించడం. రెండవది, ఇక పూర్తిగా కేంద్ర చేతిలో పధకం అమలును పెట్టడం. ఒక రోజు పని దినాన్ని గ్రామీణ కార్మికులకు ఎలా అందిoచాలి, ఒక రూపాయి వారి చేతికి ఎలా పంపాలనే లక్ష్యం నుండి పని దినాలను ఎలా తగ్గించాలి, ఒక రూపాయి ఎలా మిగిలబెట్టాలనేది నేటి లక్ష్యంగా కనిపిస్తున్నది. ఉపాధి బడ్జెట్ లో కోతలు, సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడo 2014 నుండి మొదలైనాయి, వాటికి  తోడుగా ముందు చెప్పుకున్న మార్పుల ప్రభావం మనకి క్షేత్రస్తాయిలో కనిపిస్తున్నది. 2020-2021 లో తెలంగాణాలో కార్మికుల వేతనాల కింది 4643 కోట్లు ఖర్చు అయితే 2021-2022లో రూ. 4087 కోట్లు ఖర్చు మాత్రమే అయ్యింది.

పొమ్మనకుండా పొగబెట్టడం

వీటి మధ్య తేడా 556 కోట్లు అంటే 12 శాతం తగ్గుదల. ఆ తగ్గుదల ఎప్పుడoటే,  2020-2021 కంటే 2021-2022 నోటిపైడ్ వేతనాలు 3.3 శాతం పెరిగినప్పుడు. ఇది దేనికి సంకేతం? ఉపాధి పనికి కార్మికులు దూరం జరుగుతున్నారు. ఇది వేరే రంగాలలో ఉపాధి కల్పన వలన జరగటం లేదు. మరో వైపున ఆర్దిక మంత్రి ఈ మధ్య మాట్లాడుతూ, ఇతర ఉపాధి మార్గాలు పెరగడం వలనే కార్మికులు “ఉపాధి హమి పధకం” పనిలోకి రావడం తగ్గిందని ఘనంగా చెప్పుకున్నారు. కాని ఈ తగ్గుదల  “పొమ్మని అనకుండా పొగ పెట్టడం వలన”  జరుగుతున్నది. మోడీ సర్కార్ తీసుకువస్తున్న ఈ మార్పులు వలన లేబర్ డిమాండ్ 10 శాతం పడిపోయే ప్రమాదం వుందని ఒక అంచనా. “పని హక్కు” రాజ్యాంగo ప్రాథమిక హక్కుగా గుర్తించే వరకు గ్రామీణ కార్మికులు పోరాడవలసి వుంది, ఈ లోగా చట్టం ఇచ్చిన 100 రోజుల పాక్షిక హక్కును నిలబెట్టుకోవాలి.

ఏపీ గ్రామీణ కార్మికుల ప్రతిపాదిత డిమాండ్స్

  • మోడీ BJP సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పధకంలో తీసుకువస్తున్న గ్రామీణ కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిoచoడి.
  • 15 నుండి 20 మందితో కూడిని శ్రమ శక్తి సంఘాలను కొనసాగించాలి
  • పని అడిగిన ప్రతి గామీణ కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి
  • పనికి హాజరు కాలేదనే పేరుతొ పని దినాలను తగ్గించే కార్మిక  వ్యతిరేక విధానాన్ని రద్దు చేయాలి
  • పని ప్రదేశంలో సౌకర్యాలు, పని సాధనాలకు నగదు చెల్లించాలి
  • పని పూర్తీ చేసిన 15 రోజులలో వేతనాలు చెల్లించాలి. లేని ఎడల నష్టపరిహారంతో కలిపి వేతనాలు ఇవ్వాలి.
  • పధకం అమలులో ఫెడరల్ సూత్రాలను పాటించాలి, కేంద్ర కర్ర పెత్తనం నశించాలి
  • కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతుల వ్యవసాయ పనులకు ఉపాధి పనులను అనుసంధానం చేయాలి
  • కనీస వేతనం చట్టం అనుసరించి ఉపాధి హామీ పధకంలో వేతనాలు ఇవ్వాలి
  • కేంద్ర ప్రకటించిన ఉపాధి వేతనం 257 రూపాయలను 400కు పెంచాలి
  • “పని హక్కును” రాజ్యంగ  ప్రాథమిక హక్కుగా గుర్తించాలి.

PS అజయ్ కుమార్ MSW (LLB), జాతీయ కార్యదర్శి, అఖిల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం (AIARLA)

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles